భారత్‌లోకి సూపర్‌ వేరియెంట్‌ | India confirms first case of Omicron variant XBB.1. 5 | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి సూపర్‌ వేరియెంట్‌

Published Sun, Jan 1 2023 4:45 AM | Last Updated on Sun, Jan 1 2023 4:45 AM

India confirms first case of Omicron variant XBB.1. 5 - Sakshi

న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులతో దడ పుట్టిస్తున్న బీఎఫ్‌.7 కంటే ప్రమాదకరమైన వేరియెంట్‌ భారత్‌లోకి  ప్రవేశించింది. అమెరికాలో కొత్తగా పుట్టుకొచ్చి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఎక్స్‌బీబీ.1.5 సబ్‌ వేరియెంట్‌ తొలికేసు గుజరాత్‌లో బయటపడింది! దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖలోని జెనోమ్‌ సీక్వెన్సింగ్‌ సంస్థ ఇన్సోకాగ్‌ ధ్రువీకరించింది.

అమెరికాలో 40 శాతానికి పైగా కేసులివే  
అమెరికాలో గత అక్టోబర్‌లో న్యూయార్క్‌లో ఈ వేరియెంట్‌ బయటపడింది. అప్పట్నుంచి కరోనాతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 40% పైగా ఈ వేరియెంట్‌వే. అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్‌బీబీ.1.5ని సూపర్‌ వేరియెంట్‌ అని పిలుస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్లలో ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పుడు పలు దేశాలకు విస్తరిస్తోంది’’  అని మిన్నెసోటా వర్సిటీ అంటువ్యాధి నిపుణుడు మైఖేల్‌ హెచ్చరించా రు. సింగపూర్‌లోనూ ఈ కేసులు బాగా ఉన్నాయి.  

ఏమిటీ ఎక్స్‌బీబీ.1.5?
ఒమిక్రాన్‌లో బీఏ.2 నుంచి ఈ ఎక్స్‌బీబీ.1.5 సబ్‌ వేరియెంట్‌ పుట్టుకొచ్చింది.  బీక్యూ, ఎక్స్‌బీబీ వేరియెంట్ల కాంబినేషన్‌ జన్యు మార్పులకు లోనై ఎక్స్‌బీబీ.1.5 వచ్చింది. ఎక్స్‌బీబీ కంటే 96% వేగంగా విస్తరిస్తోంది.  ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియెంట్లలో దీని విస్తరణ అత్యధికంగా ఉంది. డెల్టా తరహాలో ఇది ప్రాణాంతకం కాకపోయినా ఆస్పత్రిలో చేరాల్సిన కేసులు బాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వేరియెంట్‌తో అమెరికాలో వారంలో కేసులు రెట్టింపయ్యాయని అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ వెల్లడించింది. అమెరికా అంటు వ్యాధి నిపుణుడు ఎరిక్‌ ఫీగెల్‌ డింగ్‌ తన ట్విటర్‌లో ఈ వేరియెంట్‌ గురించి వెల్లడిస్తూ ఆర్‌ వాల్యూ అత్యధికంగా ఉన్న వేరియెంట్‌ ఇదేనని తెలిపారు. ఎక్స్‌ఎక్స్‌బీ కంటే 120% అధికంగా ఈ వేరియెంట్‌ సోకుతోందని తెలిపారు. కరోనా సోకి సహజ ఇమ్యూనిటీ, టీకాల ద్వారా వచ్చే ఇమ్యూనిటీని కూడా ఎదుర్కొని మనుషుల శరీరంలో ఈ వైరస్‌ స్థిరంగా ఉంటోందని వివరించారు.

మనకు ముప్పు ఎంత?
ఎక్స్‌బీబీ.1.5తో మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైరాలజిస్ట్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ప్రబలినప్పుడు దేశ జనాభాలో దాదాపుగా 90శాతం మందికి కరోనా సోకి హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చిందని దాని వల్ల రక్షణ ఉంటుందని ఆమె అంచనా వేస్తున్నారు. అయితే దేశ జనాభాలో బూస్టర్‌ డోసు 27% మంది మాత్రమే తీసుకున్నారని, ప్రజలందరూ మరింత ఇమ్యూనిటీ కోసం టీకా  తీసుకుంటే మంచిదని సూచించారు. కోవిడ్‌ కేసులు పెరిగే విధానాన్ని లెక్కించే ఐఐటీ సూత్ర కోవిడ్‌ మోడల్‌లో భాగస్వామిగా ఉన్న ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ అమెరికాలో మాదిరిగా మన దేశంలో కేసులు నమోదయ్యే అవకాశాల్లేవని వివరించారు. మరోవైపు దేశంలో 24 గంటల్లో 226 కేసులు నమోదు కాగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,653కి చేరుకుంది.

లక్షణాలివే..!
ఎస్‌బీబీ.1.5 సోకితే సాధారణంగా కరోనాకుండే లక్షణాలే ఉంటాయి. జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం, ఒళ్లు నొప్పులు, వాసన కోల్పోవడం వంటివి బయటపడతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement