న్యూఢిల్లీ: చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణకొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే విమానప్రయాణికులు కచ్చితంగా ముందుగా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలని భారత్ నిబంధన పెట్టింది. జనవరి ఒకటో తేదీ నుంచి దీనిని అమలుచేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గురువారం చెప్పారు.
అక్కడి నుంచి బయల్దేరడానికి ముందే ఎయిర్‌సువిధ పోర్టల్‌లో సంబంధిత రిపోర్ట్‌ను అప్‌లోడ్ చేయాలి. ఆ ఆర్‌టీ–పీసీఆర్ రిపోర్ట్ బయల్దేరడానికి 72 గంటలముందు చేసినదై ఉండాలి. ఒక్కో అంతర్జాతీయ విమానంలోని ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్‌గా ఇక్కడికొచ్చాక టెస్ట్‌చేస్తామని మంత్రి చెప్పారు. కాగా, భారత్‌లో గత 24 గంటల్లో 268 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,552కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు కేవలం 0.11 శాతంగా ఉంది.
చైనా ప్రయాణికులపై అమెరికా సైతం..
72 గంటల్లోపు సిద్ధమైన కరోనా నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అమెరికాలో అడుగుపెట్టాలని చైనా నుంచి రాబోయే అంతర్జాతీయ ప్రయాణికులకు అమెరికా సూచించింది. ఏ దేశ పౌరుడు, వ్యాక్సినేషన్ పూర్తయిందా లేదా అనే వాటితో సంబంధంలేకుండా ప్రతిఒక్కరికీ జనవరి ఐదు నుంచి ఇవే నిబంధనలు వర్తిస్తాయని అమెరికా తెలిపింది. ‘ ఆంక్షలు పెట్టినంతమాత్రాన చైనా నుంచి వైరస్ వ్యాప్తి అమెరికాలోకి ఆగదు. అయితే, చైనాలో కోవిడ్ పరిస్థితిపై మరింత సమాచారం రాబట్టేందుకు, చైనాపై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఇలా చేస్తోంది’ అని జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వ్యాధుల నిపుణుడు డాక్టర్ డేవిడ్ డౌడీ అభిప్రాయపడ్డారు. చైనా నుంచి సమాచారం సంగతి పక్కనబెట్టి సొంతంగా కోవిడ్ కట్టడి వ్యూహాలకు అమెరికా మరింత పదును పెట్టాలని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో వ్యాధుల నిపుణుడు డాక్టర్ స్ట్రాట్ క్యాంపబెల్ హితవుపలికారు.
Comments
Please login to add a commentAdd a comment