Union Health Minister
-
ఆకస్మిక గుండెపోటు మరణాలపై సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రం
ఢిల్లీ: కోవిడ్ తర్వాత పెరిగిన గుండెపోటు కేసులపై కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. యువతలో గుండె ఆగిపోవడం వల్ల ఆకస్మిక మరణాలు నమోదయ్యాయని, కారణాన్ని నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ పార్లమెంటులో శుక్రవారం తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత పెరుగుతున్న కార్డియాక్ అరెస్ట్ కేసులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మూడు వేర్వేరు అధ్యయనాలను నిర్వహిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. ఇండియాలోని 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల పెద్దవారిలో ఆకస్మిక మరణాలకు సంబంధించిన కారకాలపై అధ్యయనం దాదాపు 40 ఆసుపత్రులు, పరిశోధన కేంద్రాలలో కొనసాగుతోందన్న ఆయన.. భారత్‌లో 2022లో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల జనాభాలో గుండెపోటు సంఘటనలపై కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావాన్ని గుర్తించడానికి దాదాపు 30 కొవిడ్ క్లినికల్ రిజిస్ట్రీ ఆసుపత్రులలో మరో మల్టీసెంట్రిక్ హాస్పిటల్ అధ్యయనం జరుగుతోందన్నారు. చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి? కార్డియోవాస్కులర్ వ్యాధి ఎన్పీ-ఎన్సీడీలో అంతర్భాగమని, ఇందులో మౌలిక సదుపాయాలను బలోపేతం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య ప్రమోషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ కింద 30 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయస్సు గల ప్రజల్లో జనాభా ఆధారిత స్క్రీనింగ్, ముందస్తు రోగ నిర్ధారణ, నిర్వహణ, తగిన స్థాయి ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి రెఫరల్ ఉన్నాయని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. చదవండి: గుజరాత్ హైకోర్టు నుంచి చిత్రవిచిత్రాలు చూస్తున్నాం! ఎన్పీ-ఎన్సీడీ కింద 724 జిల్లా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్‌లు, 210 డిస్ట్రిక్ట్ కార్డియాక్ కేర్ యూనిట్లు, 326 డిస్ట్రిక్ట్ డే కేర్ సెంటర్లు, 6,110 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధి రోగులు మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ వంటి కేంద్రీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆసుపత్రులతో సహా హెల్త్‌కేర్ డెలివరీ సిస్టమ్‌లోని వివిధ ఆరోగ్య సదుపాయాలలో చికిత్స పొందుతున్నారని మన్సూక్ మాండవీయ వివరించారు. -
కేరళ వైద్యురాలిపై దాడి: కేంద్ర ఆరోగ్యమంత్రికి వైద్యుల సంఘం లేఖ
కేరళలో ఓ యవ వైద్యురాలు చికిత్స చేస్తుండగా.. పేషెంట్ దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కేరళ రాష్ట్రంలోని వ్యైద్యులు, ఆరోగ్యకార్యకర్తల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే వైద్యుల సంఘం ఫెడరేషన్ ఆప్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్ఓఆర్డీఏ) ఈ ఘటనపై సత్వరమే చర్యలు తీసుకోవడమే గాక ఆరోగ్య సంరక్షణాధికారుల భద్రతను కూడా పర్యవేక్షించాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ విషయమై గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాసింది. లేఖలో ఆ సంఘటనను డ్యూటీలో ఉండగా జరిగిన క్రూరమైన హింసాత్మక చర్యగా పేర్కొనడమే గాక తక్షణమే చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. అలాగే బాధితురాలిని పోగొట్టుకున్న కుటుంబానికి తగిన మొత్తంలో నష్ట పరిహారాన్ని, ఆమె కుటుంబానికి ఉచిత ఆరోగ్య సదుపాయం అందించాలని లేఖలో పేర్కొంది వైద్యుల సంఘం. ఈ క్రమంలో సదరు వైద్యుల సంఘం ఎఫ్ఓఆర్డీఏతో సంబంధం ఉన్న అన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోసీయేషన్(ఆర్డీఏ)లను సదరు వైద్యురాలి మృతికి సంతాపాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే బాధితురాలి మృతికి సంతాపంగా నల్ల రిబ్బన్లు, క్యాండిలైట్స్తో మార్చ్ నిర్వహించి..ఆమె కోసం కొద్దిసేపు మౌనం పాటించాలని కోరింది. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించడమే గాక సదరు వైద్యురాలి మృతికి సంతాపం తెలిపారు కూడా. పైగా సత్వరమే ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని హామీ కూడా ఇచ్చారు. కాగా, కేరళలోని కొల్లాం జిల్లా కొట్టారక్క ప్రాంతలో పోలీసులు బుధవారం ఆస్పత్రికి తీసుకువచ్చిన సందీప్ అనే సస్పెన్షన్‌కు గురయ్యిన ఉపాధ్యాయుడి దాడిలోనే సదరు వైద్యురాలి మృతి చెందింది. కుటుంబ సభ్యులతో గొడవపడి గాయడిన అతడిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకురావడంతోనే ఈ దారుణం చోటు చేసుకుంది. (చదవండి: కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పేషెంట్..) -
157 నర్సింగ్ కాలేజీలు
న్యూఢిల్లీ: ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలలకు అనుబంధంగా రూ.1,570 కోట్ల వ్యయంతో నూతనంగా 157 నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సంబంధిత కేబినెట్ భేటీ నిర్ణయాలను ఆ తర్వాత మీడియాకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఢిల్లీలో చెప్పారు. ‘కొత్త కాలేజీల రాకతో ఏటా దాదాపు 15,700 కొత్త నర్సింగ్ గ్రాడ్యుయేట్ సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతీ కాలేజీలు 100 బీఎస్సీ(నర్సింగ్) సీట్లు ఉంటాయి. మొత్తం 157కుగాను యూపీలో 27, రాజస్థాన్‌లో 23, మధ్యప్రదేశ్‌లో 14, తమిళనాడు, పశ్చిమబెంగాల్లో చెరో 11 , కర్ణాటకలో నాలుగు కాలేజీలు నెలకొల్పుతాం’ అని మాండవీయ చెప్పారు. బ్రిటన్‌లో 26 వేల మంది, అమెరికాలో 16వేల మంది, ఆస్ట్రేలియాలో 12వేల మంది, గల్ఫ్ దేశాల్లో 20వేల మంది భారతీయ నర్సులు సేవలందిస్తున్నారు. -
5 ఏళ్లు.. 50 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: వైద్య రంగంలో ఉపయోగించే పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే తయారీకి ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ 2023కి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. వైద్య పరికరాల రంగం వచ్చే అయిదేళ్లలో 50 బిలియన్ డాలర్ల స్థాయికి (దాదాపు రూ. 4.1 లక్షల కోట్లు) చేరేందుకు ఇది తోడ్పడనుంది. భారత్‌లో వైద్య పరికరాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటంతో వీటిని దేశీయంగానే ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియాకు తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దిగుమతులు కూడా ఉంటాయని, అయితే సాధ్యమైనంత మేరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా దేశీయంగానే ఉత్పత్తిని పెంచుకోవడమే కొత్త విధానం లక్ష్యమని వివరించారు. ఆరు వ్యూహాలు..: నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీలో ఆరు వ్యూహాలను నిర్దేశించుకున్నారు. నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరించడం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన.. అభివృద్ధి.. ఆవిష్కరణలకు తోడ్పాటు అందించడం, పరిశ్రమలోకి పెట్టుబడులను ఆకర్షించడం, మానవ వనరుల అభివృద్ధి, మన పరిశ్రమకు బ్రాండింగ్ సాధించడం .. అవగాహన కల్పించడం వంటివి ఈ వ్యూహాల్లో ఉన్నాయి. ఇటు భారత్, అటు ప్రపంచ హెల్త్‌కేర్ అవసరాలను తీర్చే దిశగా దేశీయంగా వైద్య పరికరాల రంగం స్వయం సమృద్ధి సాధించేలా, ఒడుదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటూ పటిష్టమైన పరిశ్రమగా ఎదిగేలా అవసరమైన మద్దతు కల్పించి, దిశా నిర్దేశం చేసేందుకు ఈ పాలసీ ఉపయోగపడనుంది. ప్రధానంగా పేషంట్లను దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను తయారు చేస్తూ వైద్య పరికరాల రంగం వేగవంతంగా వృద్ధి చెందేలా ఊతమివ్వాలని ఇందులో నిర్దేశించుకున్నారు. 11 బిలియన్ డాలర్ల పరిశ్రమ.. దేశీయంగా వైద్య పరికరాల మార్కెట్ 2020లో 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 90,000 కోట్లు) స్థాయిలో ఉందని అంచనా. అంతర్జాతీయంగా మెడికల్ డివైజ్‌ల మార్కెట్లో మన వాటా దాదాపు 1.5% వైద్య పరికరాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం ఇప్పటికే ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్‌లో 4 మెడికల్ డివైజ్ పార్క్‌ల ఏర్పాటు కోసం తోడ్పాటు అందిస్తోంది. ఈ స్కీము కింద ఇప్పటివరకు రూ. 1,206 కోట్ల విలువ చేసే పెట్టుబడులతో 26 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. 37 ఉత్పత్తులను తయారు చేసే 14 ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు వివరించింది. వీటిలో లీనియర్ యాక్సిలరేటర్, ఎంఆర్ఐ స్కాన్, సీటీ–స్కాన్, మామోగ్రామ్, సీ–ఆర్మ్, ఎంఆర్ఐ కాయిల్స్, అధునాతన ఎక్స్–రే ట్యూబ్స్ మొదలైనవి ఉత్పత్తి చేస్తున్నారు. -
కరోనాతో జాగ్రత్త: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా వ్యవహరించాలని, కోవిడ్–19 మేనేజ్మెంట్ కోసం సన్నద్ధం కావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఎక్కడ అధికంగా వ్యాప్తిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు గుర్తించాలని చెప్పారు. ఎమర్జెన్సీ హాట్స్పాట్లలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని కోరారు. కోవిడ్–19 వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రజా చైతన్యం ద్వారానే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలి గతంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేశాయని, చక్కని ఫలితాలు సాధించాయని మాండవీయ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సమన్వయంతో పనిచేయాలన్నారు. పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరోగ్య శాఖ సన్నద్ధతపై ఈ నెల 8, 9న జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులకు పిలుపునిచ్చారు. 10, 11న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాక్‌డ్రిల్స్ నిర్వహించాలన్నారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా వైరస్ నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని వివరించారు. టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేట్‌తోపాటు కోవిడ్–19 నియంత్రణ చర్యల పటిష్ట అమలుతో సత్ఫలితాలు లభిస్తాయని వెల్లడించారు. అర్హులైన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. కోవిడ్–19 బాధితులకు ఆసుపత్రుల్లో సరిపడా పడకలు సిద్ధంగా ఉండేలా, ఔషధాలు లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు. 6 వేల మార్కు దాటిన కోవిడ్ కేసులు దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 203 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,050 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసులు 28,303కు చేరుకున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. మొత్తం కేసులు 4.47 కోట్లకు చేరాయి. దీంతోపాటు, మరో 14 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాలు 5,30,943కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేట్ 3.39%కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06%గా ఉంది. ప్రతి 10 లక్షల జనాభాకు 100 టెస్టులు ఎక్స్‌బీబీ.1.5తోపాటు బీక్యూ.1, బీఏ.2.75, సీహెచ్.1.1, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీఎఫ్, ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని వెల్లడించింది. ఇతర వేరియంట్ల ప్రభావం బాగా తగ్గిందని పేర్కొంది. ఎక్స్‌బీబీ.1.16 అనే వేరియంట్ వ్యాప్తి ఫిబ్రవరిలో 21.6 శాతం ఉండగా, మార్చిలో 35.8 శాతానికి చేరిందని వివరించింది. అయితే, వైరస్ వ్యాప్తి పెరిగినప్పటికీ ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు పెద్దగా నమోదు కాలేదని స్పష్టం చేసింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు నిత్యం సగటున 100 కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హరియాణాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు పేర్కొంది. -
తగినన్ని ఔషధ నిల్వలు సిద్ధం చేయండి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెద్దసంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో మనదేశంలోనూ అందరూ అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం చెప్పారు. కరోనా నియంత్రణకు అవసరమైన ఔషధాలతోపాటు అన్ని రకాల ఔషధ నిల్వలను సిద్ధం చేయాలని ఫార్మా కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తగినన్ని నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిటైల్ స్థాయి వరకు ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కోవిడ్–19 మేనేజ్మెంట్ డ్రగ్స్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై మంత్రి గురువారం ఫార్మా కంపెనీల ప్రతినిధుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలో మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఫార్మా కంపెనీలు అందించిన సేవలను మన్సుఖ్ మాండవీయ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫార్మా కంపెనీల కృషి వల్లే మన దేశానికి అవసరమైన ఔషధాలను, కరోనా టీకాలను ఉత్పత్తి చేసుకోవడంతోపాటు 150 దేశాలకు సైతం ఎగుమతి చేయగలిగామని కొనియాడారు. ధరలు పెంచకుండా, నాణ్యత తగ్గించకుండా ఈ ఘనత సాధించామని హర్షం వ్యక్తం చేశారు. -
చైనా నుంచి వస్తే నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి
న్యూఢిల్లీ: చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణకొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే విమానప్రయాణికులు కచ్చితంగా ముందుగా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలని భారత్ నిబంధన పెట్టింది. జనవరి ఒకటో తేదీ నుంచి దీనిని అమలుచేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం చెప్పారు. అక్కడి నుంచి బయల్దేరడానికి ముందే ఎయిర్‌సువిధ పోర్టల్‌లో సంబంధిత రిపోర్ట్‌ను అప్లోడ్ చేయాలి. ఆ ఆర్టీ–పీసీఆర్ రిపోర్ట్ బయల్దేరడానికి 72 గంటలముందు చేసినదై ఉండాలి. ఒక్కో అంతర్జాతీయ విమానంలోని ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్‌గా ఇక్కడికొచ్చాక టెస్ట్చేస్తామని మంత్రి చెప్పారు. కాగా, భారత్‌లో గత 24 గంటల్లో 268 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,552కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు కేవలం 0.11 శాతంగా ఉంది. చైనా ప్రయాణికులపై అమెరికా సైతం.. 72 గంటల్లోపు సిద్ధమైన కరోనా నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అమెరికాలో అడుగుపెట్టాలని చైనా నుంచి రాబోయే అంతర్జాతీయ ప్రయాణికులకు అమెరికా సూచించింది. ఏ దేశ పౌరుడు, వ్యాక్సినేషన్ పూర్తయిందా లేదా అనే వాటితో సంబంధంలేకుండా ప్రతిఒక్కరికీ జనవరి ఐదు నుంచి ఇవే నిబంధనలు వర్తిస్తాయని అమెరికా తెలిపింది. ‘ ఆంక్షలు పెట్టినంతమాత్రాన చైనా నుంచి వైరస్ వ్యాప్తి అమెరికాలోకి ఆగదు. అయితే, చైనాలో కోవిడ్ పరిస్థితిపై మరింత సమాచారం రాబట్టేందుకు, చైనాపై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఇలా చేస్తోంది’ అని జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వ్యాధుల నిపుణుడు డాక్టర్ డేవిడ్ డౌడీ అభిప్రాయపడ్డారు. చైనా నుంచి సమాచారం సంగతి పక్కనబెట్టి సొంతంగా కోవిడ్ కట్టడి వ్యూహాలకు అమెరికా మరింత పదును పెట్టాలని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో వ్యాధుల నిపుణుడు డాక్టర్ స్ట్రాట్ క్యాంపబెల్ హితవుపలికారు. -
కరోనాపై ఉమ్మడి పోరాటం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అర్హులైన వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోసు ఇవ్వాలని, మహమ్మారి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ మన దేశంలోకి అడుగుపెట్టే అవకాశాలను తగ్గించడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రకటించారు. విదేశీ ప్రయాణికుల నుంచి విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ మొదలైందని తెలిపారు. ‘‘మన శత్రువు(కరోనా) కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. మనం ఇకపై మరింత పట్టుదల, అంకితభావంతో శత్రువుపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం పెంచాలి ప్రపంచమంతటా రోజువారీగా సగటున 5.87 లక్షల కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని, మన దేశంలో మాత్రం సగటున 153 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తి, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాబోయే పండుగలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేయాలని చెప్పారు. బూస్టర్ డోసుతోపాటు కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని విన్నవించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తల విషయంలో ప్రజల్లో చైతన్యం పెంచాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. ఏమరుపాటు వద్దు కొత్త వేరియంట్లను గుర్తించడానికి పాజిటివ్ కేసుల జినోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు‡’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు. కరోనా అనే విపత్తు ఇంకా ముగిసిపోలేదు కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై, జీవనంపై ప్రభావం చూపిస్తూనే ఉందని గుర్తుచేశారు. గత కొద్దిరోజులుగా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతుందోన్నారు. చైనా, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ మనదేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. అయినప్పటికీ ఏమరుపాటు తగదని స్పష్టం చేశారు. 24 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు టెస్ట్‌లు విదేశాల నుంచి వచ్చేవారికి ఈ నెల 24వ తేదీ నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారికి ర్యాండమ్ కరోనా వైరస్ టెస్టు నిర్వహించాలంటూ పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి విమానంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల్లో కొందరి నుంచి ఎయిర్‌పోర్టులోనే నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరెవరికి టెస్టులు చేయాలన్నది వారు ప్రయాణించిన విమానయాన సంస్థ నిర్ణయిస్తుంది. ఎంపీలంతా మాస్కులు ధరించాలి: స్పీకర్ కరోనా వ్యాప్తిపై మళ్లీ భయాందోళనలు మొదలైన నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో çసభ్యులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం సూచించారు. లోక్‌సభ ప్రవేశద్వారాల వద్ద మాస్కులు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎంపీలందరూ వాటిని ధరించి, సభలో అడుగపెట్టాలని కోరారు. గురువారం పార్లమెంట్లో చాలామంది ఎంపీలు మాస్కులు ధరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పార్లమెంట్ సిబ్బందిని లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు పాటించాలన్న స్పీకర్ బిర్లా సూచనను పలువురు ఎంపీలు స్వాగతించారు. -
Covid Alert: కరోనా ముప్పు ముగియలేదు.. మళ్లీ మాస్కులేద్దాం
న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మహమ్మారి వ్యాప్తి, తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం సీనియర్ అధికారులు, ఆరోగ్య నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయంగా బీఎఫ్ 7 సబ్ వేరి యంట్ వ్యాప్తి గురించి వివరించారు. కరోనా ముప్పు ఇంకా ముగిసిపోలేదని, ప్రజలంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, అర్హులైనవారంతా కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు కచ్చితంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనావిషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. కోవిడ్–19 వ్యాప్తిని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పారు. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారిపై నిఘాను బలోపేతం చేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినా ఎదుర్కొందాం చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, ఫలితంగా అక్కడి ప్రభుత్వాలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని మన్సుఖ్ మాండవీయ గుర్తుచేశారు. మన దేశంలో పండుగ సీజన్ రాబోతున్న దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలన్నారు. కోవిడ్–19లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినా సమర్థవంతంగా నియంత్రించేలా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాజిటివ్ కేసుల నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ చేయడం ద్వారా కొత్త వేరియంట్లను గుర్తించవచ్చని వివరించారు. ఇందుకు ఇండియన్ సార్క్–కోవ్–2 జినోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) నెట్‌వర్క్‌ను ఉపయోగించాలని చెప్పారు. ఇన్సాకాగ్కు చెందిన జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పాజిటివ్ కేసుల నమూనాలను రోజువారీగా పంపించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. కోవిడ్–19 నియంత్రణ కోసం ఈ ఏడాది జూన్‌లో జారీ చేసిన ‘ఆపరేషనల్ గైడ్‌లైన్స్’ను ప్రభావవంతంగా అమలు చేయాలన్నారు. ఆందోళన అవసరం లేదు: వీకే పాల్ దేశంలో అర్హులైన వారిలో ఇప్పటిదాకా కేవలం 27–28 శాతం మంది కరోనా టీకా బూస్టర్ డోసు తీసుకున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మిగిలినవారు వీలైనంత త్వరగా బూస్టర్ తీసుకోవాలని చెప్పారు. అలాగే జనం గుమికూడేచోట మాస్కు ధరించాలన్నారు. ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాల నియమ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు. దేశంలో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా కొత్త కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 84% కేసులు ఈ 5 రాష్ట్రాల్లోనే బయటపడ్డాయని పేర్కొన్నారు. దేశంలో నమోదవుతున్న కేసులన్నీ తక్కువ తీవ్రత కలిగినవేనని స్పష్టం చేశారు. కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ వచ్చేవారం మరోసారి సమీక్ష నిర్వహించనుంది. చదవండి: ఢిల్లీలో రేపు అత్యవసర కరోనా సమీక్ష సమావేశం -
ఎంబీబీఎస్ సీట్లు 87% పెరిగాయ్
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 87%, పీజీ మెడికల్ సీట్లు 105% పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. గురువారం ఆయన పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. దేశంలో యువతకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం 2014 తర్వాత పలు చర్యలు చేపట్టిందన్నారు. ఫలితంగా, 2014లో 387 మెడికల్ కాలేజీలుండగా, 2022 కల్లా వాటి సంఖ్య 648కి పెరిగిందన్నారు. 2014 తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 96%, ప్రైవేట్ కళాశాలల సంఖ్య 42% పెరిగిందని చెప్పారు.ప్రస్తుతం దేశంలో 355 ప్రభుత్వ, 293 ప్రైవేట్ వైద్య కళాశాలలున్నాయని తెలిపారు. అదేవిధంగా, 2014లో ఎంబీబీఎస్ కాలేజీల్లో 51,348 సీట్లుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 96,077కు చేరిందన్నారు. 2014లో 31,185 పీజీ మెడికల్ సీట్లుండగా, 2022కు వచ్చే సరికి అవి 63,842కు పెరిగినట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను 10వేలకు పెంచాలనే లక్ష్యంతో 16 రాష్ట్రాల్లోని 58 కాలేజీలకు గాను 3,877 ఎంబీబీఎస్ సీట్ల పెంపుదలకు ఆమోదం తెలిపామన్నారు. ఇదే విధంగా, 21 రాష్ట్రాల్లోని 72 మెడికల్ కాలేజీల్లో మొదటి దశలో 4,058 పీజీ సీట్ల పెంపునకు అనుమతించినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన(పీఎంఎస్ఎస్వై) ద్వారా 22 కొత్త ఎయిమ్స్ ఏర్పాటుకు, 75 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆధునీకరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. -
మంకీపాక్స్ కొత్తదేం కాదు!: పార్లమెంట్లో ఆరోగ్యమంత్రి
న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా కేరళలో మరో కేసు వెలుగు చూడడంతో.. మొత్తం ఏడుకి చేరుకుంది మంకీపాక్స్ బాధితుల సంఖ్య. ఇందులో ఐదు కేరళ, రెండు కేసులు ఢిల్లీలో వెలుగు చూశాయి. చాలా ప్రాంతాల్లో అనుమానిత లక్షణాలతో పరీక్షలకు శాంపిల్స్‌ను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలో.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవియా.. మంకీపాక్స్‌పై రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మంకీపాక్స్ కొత్త వైరస్ ఏం కాదు. భారత్‌కు, ఈ ప్రపంచానికి అది కొత్తేం కాదు. దశాబ్దాల నుంచే ఆఫ్రికాలో ఉంది. కరోనా టైంలో ఎన్నో మంచి పాఠాలు నేర్చుకున్నాం. కాబట్టి, మంకీపాక్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. కేరళలో తొలి కేసు నమోదు అయినప్పుడే ఆరోగ్య శాఖ తరపున ఓ బృందాన్ని అక్కడికి పంపించాం. కేంద్రం తరపున స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా వైరస్‌ను అధ్యయనం చేస్తోంది. కేరళ ప్రభుత్వం ఆ ఫోర్స్‌కు అన్నివిధాల సహకరిస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారాయన. అలాగే.. Monkeypox is not a new disease in India and in the world, since 1970 a lot of cases are being seen from Africa. WHO has paid special attention to this. Monitoring has started in India too: Union Health Minister Mansukh Mandaviya in Rajya Sabha pic.twitter.com/rv9uoW8KMH — ANI (@ANI) August 2, 2022 ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశాం. అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 1970 నుంచే ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది మరో 75 దేశాల్లో వెలుగు చూసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ మీద ప్రత్యేక దృష్టి సారించింది కూడా. వైరస్ బారిన పడ్డ వాళ్లకు ఐసోలేషన్ కోసం రెండు వారాల గడువు రికమండ్ చేసినట్లు పేర్కొన్న ఆయన.. వ్యాక్సిన్ తయారీ అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: అచ్చం చికెన్‌పాక్స్‌లాగే.. మంకీపాక్స్ కూడా! కాకపోతే.. -
పెటెంటెడ్ ఔషధ తయారీకి ప్రోత్సాహం!
న్యూఢిల్లీ: పేటెంట్ హక్కుల పరిధిలో ఉన్న ఔషధాలను దేశీయంగా తయారు చేయడాన్ని కేంద్ర సర్కారు ప్రోత్సహించే ఆలోచనతో ఉంది. ఇందుకు వీలుగా విధానాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఫార్మా, వైద్య పరికరాలపై ఏడో అంతర్జాతీయ సదస్సు ఆరంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సదస్సు ఈ నెల 25 నుంచి 27 వరకు జరగనుంది. జనరిక్ ఔషధ తయారీలో ప్రపంచ కేంద్రంగా భారత్ ఇప్పటికే అవతరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిధిని దాటుకుని మరింత ముందుకు వెళ్లాలని, పేటెంట్ ఔషధాలను కూడా తయారు చేయాలని మంత్రి ఆకాంక్షించారు. ‘‘నేడు భారత్ 3,500కు పైనా ఫార్మా కంపెనీలు, 10,500కు పైన తయారీ యూనిట్లతో అత్యధిక జనరిక్ ఔషథ తయారీ కంపెనీలకు కేంద్రంగా ఉంది. యూఎస్‌లో వినియోగించే ప్రతి నాలుగు ఔషధాల్లో ఒకటి భారత్‌లో తయారు చేసిందే. భారత్‌లో పేటెంటెడ్ ఔషధాల తయారీని ప్రోత్సహించడం ఎలా? దీన్ని ప్రోత్సహించే విధానాన్ని తీసుకురావడంపై ఆలోచన చేస్తున్నాం’’అని మంత్రి వివరించారు. పేటెంటెడ్ ఔషధాల తయారీని ప్రోత్సహించేందుకు పరిశోధన, ఆవిష్కరణలు అవసరమన్నారు. చదవండి: భారత్‌కు మధ్యంతర నిర్మాణాత్మక సమస్యల్లో అవి కూడా: ఐఎంఎఫ్ -
12–14 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ రేపటి నుంచే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కోవిడ్–19 వ్యాక్సినేషన్ బుధవారం నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఈ.లిమిటెడ్ సంస్థ తయారు చేసిన కోర్బివాక్స్ టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. చిన్నారులు క్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుందని పేర్కొన్నారు. 12, 13, 14 ఏళ్ల వయసున్న వారు బుధవారం నుంచి కరోనా టీకా తీసుకోవాలని కోరారు. అలాగే రెండు కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతూ 60 ఏళ్లు దాటిన వారు కూడా బూస్టర్ డోసు వేయించుకోవచ్చని సూచించారు. సైంటిఫిక్ విభాగాలతో చర్చించిన అనంతరం 12, 13, 14 ఏళ్ల వారికి ఈ నెల 16 నుంచి కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. 2008, 2009, 2010లో జన్మించిన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరింది. 12 ఏళ్లు దాటినవారంతా అర్హులేనని వెల్లడించింది. 12–14 ఏళ్ల వయసు విభాగంలో దేశవ్యాప్తంగా 7.11 కోట్ల మంది పిల్లలు ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. బయోలాజికల్ ఈ.లిమిటెడ్ సంస్థ 5 కోట్ల కోర్బివాక్స్ టీకా డోసులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. దేశంలో 14 ఏళ్లు దాటిన వారికి కోవిడ్–19 వ్యాక్సినేషన్‌ను గతంలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. 15–18 ఏళ్ల వారికి ఈ ఏడాది జనవరి 3వ తేదీ నుంచి కరోనా టీకాలు ఇస్తున్నారు. -
జనవరి 12 నుంచి నీట్ పీజీ కౌన్సెలింగ్
న్యూఢిల్లీ: ఈనెల 12 నుంచి నీట్– పీజీ కౌన్సెలింగ్ ఆరంభమవుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. 2021–22 సంవత్సరానికి కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ నెల 7న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌన్సెలింగ్‌లో 27 శాతం ఓబీసీ, 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీం సమర్ధించింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా కౌన్సెలింగ్ చేపట్టేందుకు సిద్ధమైనట్లు మంత్రి తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో నీట్ పీజీ పరీక్ష జరిగింది. అదేనెల్లో ఫలితాలు ప్రకటించారు. సుమారు 45వేల మెడికల్ పీజీ సీట్లను కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్‌ను త్వరగా చేపట్టాలని గతనెల్లో దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. -
మొత్తం 236 ఒమిక్రాన్ కేసుల్లో 104 మంది కోలుకున్నారు: ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌పై పోరాటంలో భాగంగా ఓ మైలురాయిని అధిగమించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. 18 ఏళ్లకు పైబడిన జనాభాలో దాదాపు 60 శాతానికిపైగా జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు ఈరోజు మంత్రి మన్సుఖ్ మాండావియా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దేశంలోని వయోజన జనాభాలో 89 శాతం మంది ఫస్ట్ డోస్ వాక్సిన్ వేయించుకున్నారని ఆయన తెలిపారు. గురువారం ఉదయం 7 గంటల వరకు నమోదుచేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో 70,17,671 డోసుల వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు అందించడం ద్వారా, ఇప్పటివరకు 139.70 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కాగా గడచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 6,960 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. ఐతే, దేశంలో ఇప్పటివరకు 236 ఒమిక్రాన్ కేసులు కూడా వెలుగులోకిరాగా, వీరిలో 104 మంది రోగులు కోలుకున్నారు. ఇంతవరకూ ఒక్క ఒమిక్రాన్ మరణం కూడా సంభవించకపోవడం గమనార్హం. మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తవేరియంట్ ఉధృతి కొనసాగుతోందని ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. చదవండి: నో! నేనొప్పుకోను.. మగవాడిగా ఉండేందుకు హార్మోన్లు తీసుకో! Koo App Accomplishing more new feats! Congratulations India 🇮🇳 Aided by public participation & dedicated efforts of our health workers, over 60% of the eligible population fully vaccinated now 💉 #SabkoVaccineMuftVaccine View attached media content - Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 23 Dec 2021 -
కరోనా టీకా: 49 వేల మందిలో సైడ్ ఎఫెక్ట్స్.. మరణించిన వారు ఎందరంటే
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా నవంబర్ 30నాటికి 127.93 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె మంగళవారం సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్ వల్ల 49వేల మంది దుష్ప్రభావాలకు గురయ్యారని, మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆ బాధితుల శాతం 0.004శాతమేనని ఆమె చెప్పారు. 49వేల మందిలో 47,691మందికి స్వల్ప లక్షణాలుండగా, 163 మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, 1,965 మంది మధ్యస్థంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. టీకా వేసుకున్న తరువాత మరణించిన వారు 946 (0.00008)వత్రమేనని ఆమె తెలిపారు. అందులో 89 మంది మరణానికి కారణాలను అంచనా వేశామని, అయితే వ్యాక్సినే కారణమని నిర్ధారణ కాలేదన్నారు. టీకా తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఎంతకాలముంటాయనే విషయంలో స్పష్టత రాలేదని చెప్పారు. 94 దేశాలకు 7.23కోట్ల డోసుల ఎగుమతి... వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంలో భాగంగా 94దేశాలకు 7.23 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఎగుమతి చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. మొత్తం 150 దేశాలకు కోవిడ్ సంబంధిత మందులను కూడా అందించామన్నారు. 1,509 మందికి పరిహారం ఆరోగ్య రంగంలో పనిచేస్త కోవిడ్ కారణంగా 1,509 మంది చనిపోయారని మంత్రి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.22.12 లక్షల నుంచి రూ.50 లక్షలు అందించినట్టు తెలిపారు. -
బూస్టర్ డోసు, చిన్నారులకు టీకాపై
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్ డోసు తప్పనిసరిగా తీసుకోవాలా? 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఎప్పటినుంచి ఇస్తారు? అనేదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా స్పందించారు. బూస్టర్ డోసు, చిన్నారులకు కరోనా టీకాపై నిపుణుల నుంచి వచ్చే శాస్త్రీయమైన సలహాలు సూచనల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని చెప్పారు. కోవిడ్ మహమ్మారిపై శుక్రవారం లోక్‌సభలో సుదీర్ఘంగా సాగిన చర్చలో మాండవియా మాట్లాడారు. ‘ఎట్–రిస్క్’ దేశాల నుంచి వచ్చిన 16 వేల మంది ప్రయాణికులకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించామని, 16 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని, వారికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా లేదా అనేది అతిత్వరలో తేలుతుందని చెప్పారు. కరోనాను నియంత్రించే విషయంలో ప్రభుత్వం సమర్థంగా పని చేస్తోందని, ప్రతిపక్షాలు మాత్రం అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా టీకాలపై ప్రతిపక్షాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని, దీనివల్ల వ్యాక్సినేషన్‌పై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెలలో అదనంగా 10 కోట్ల డోసులు ఇప్పటిదాకా 85 శాతం మంది లబ్ధిదారులు టీకా మొదటి డోసు తీసుకున్నారని, 50 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని మన్సుఖ్ మాండవియా తెలిపారు. రాష్ట్రాల వద్ద ప్రస్తుతం 22 కోట్ల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని, ఈ నెలలోనే అదనంగా 10 కోట్ల డోసులు అందజేస్తామని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు హర్ ఘర్ దస్తక్(ఇంటింటికీ టీకా) కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. -
అవయవ దానంలో భారత్‌కు మూడో స్థానం
న్యూఢిల్లీ: గ్లోబల్ అబ్జర్వేటరీ ఆన్ డొనేషన్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (GODT)ప్రకారం, అవయవదానంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు 12వ భారతీయ అవయవదాన దినోత్సవాన్ని ఉద్దేశించి ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ... " "జీతే జీ రక్తదాన్, మర్నే కే బాద్ అంగదాన్(ప్రత్యక్ష రక్తదానం, మరణానంతరం అవయవ దానం)" అనేది మన జీవితానికి నినాదంగా ఉండాలి. అంతేకాదు మన సంస్కృతి "శుభ్", "లాభ్" లకు మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది. (చదవండి: కృత్రిమ మొసలి అనుకుని సెల్ఫీకి యత్నం... ఇక అంతే చివరికి) పైగా ఇక్కడ వ్యక్తిగత శ్రేయస్సు అనేది సమాజ శ్రేయస్సుతో మిళతమవుతోంది. అయితే 2010 నుంచి చనిపోయిన దాతలు, వారి కుటుంబాలు సమాజానికి చేసిన సేవలను స్మరించుకోవాడానికే ప్రతి ఏడాది భారతీయ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతేకాదు 2012-13తో పోలిస్తే అవయవదానం రేటు నాలుగు రెట్లు పెరిగింది. ఈ మేరకు దేశంలో సంవత్సరానికి జరిగే అవయవ మార్పిడిల సంఖ్య 2013లో 4990 ఉండగా 2019కి వచ్చేటప్పటికీ ఆ సంఖ్య 12746కి పెరిగింది. అయితే భారత్ ఇప్పుడు యూఎస్ఏ, చైనా తర్వాత స్థానాన్ని ఆక్రమించుకుని ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. ఈ క్రమంలో ప్రజలు తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, దేశంలో మార్పిడికి అందుబాటులో ఉన్న అవయవాల కొరతపై ప్రచారం చేసి, ఇతరులు కూడా అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేయాలి" అని ఆరోగ్య మంత్రి మాండవియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఏడాదిగా షాప్‌కి వస్తున్న ప్రమాదకరమైన పక్షి!) -
డెంగ్యూపై మాండవీయ సమీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీసహా పలు రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న డెంగ్యూ వ్యాధి కట్టడిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆందోళన వ్యక్తంచేశారు. దోమకాటుతో ప్రభలే ఈ వ్యాధి కారణంగా ఢిల్లీలో ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఇప్పటికే 1,530 డెంగ్యూ కేసులు వెలుగుచూశాయి. గత నాలుగేళ్లలో ఢిల్లీలో ఇంత ఎక్కువ కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ రాష్ట్రానికి చెందిన సంబంధిత వైద్య అధికారులతో మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మన్సుఖ్ మాట్లాడారు. కేసులు ఎక్కువ అవుతోన్న రాష్ట్రాలను గుర్తించి, ఆయా రాష్ట్రాలకు సంబంధిత నిపుణులను పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌కు సూచించారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సాయం అందనుందని భరోసా ఇచ్చారు. -
రెండో డోసుకు 11 కోట్ల మంది దూరం
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత నిర్దేశిత గడువులోగా రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. దేశంలో మొదటి డోసు తీసుకున్న వారిలో 11 కోట్ల మంది గడువు తీరిపోయినప్పటికీ ఇంకా రెండో డోసు తీసుకోలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 11 కోట్ల మంది రెండో డోసుకు దూరంగా ఉన్న అంశం బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రతినిధులతో నిర్వహించిన భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అలాంటి వారిని గుర్తించి, టీకాపై అవగాహన కల్పించాలని కేంద్రం సూచించింది. కోవిషీల్డ్ టీకా తీసుకుంటే రెండు డోసుల మధ్య 12 వారాల వ్యవధి ఉండాలి. కోవాగ్జిన్ తీసుకుంటే నాలుగు వారాల వ్యవధి ఉండాలి. నిర్దేశిత గడువు తీరిపోయినా రెండో డోసు వేయించుకోనివారిలో 49 శాతం మంది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, బిహార్‌లో ఉన్నారు. భారత్‌లో కరోనా టీకాకు అర్హులైనవారిలో ఇప్పటిదాకా 76 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారు. 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులైన వారందరికీ మొదట డోసు ఇచ్చారు. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 50 శాతం మంది రెండో డోసు కూడా తీసుకున్నారు. దేశంలో కరోనా టీకాకు అర్హులు 94 కోట్ల మంది ఉండగా, వీరిలో 32 శాతం మందికి రెండు డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. -
భారత్‌లో లైన్ క్లియర్.. జాన్సన్ – జాన్సన్ వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన సింగిల్ డోస్ కోవిడ్–19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ట్వట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో కరోనాపై భారత్ చేస్తున్న పోరాటం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ‘జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కి అనుమతినివ్వడంతో మన దేశంలో వ్యాక్సిన్ల సంఖ్య అయిదుకి చేరుకుంది. కోవిడ్–19పై దేశం చేస్తున్న సమష్టి పోరాటానికి ఈ వ్యాక్సిన్ మరింత ఊతమిస్తుంది’’ అని మాండవీయ ట్వీట్ చేశారు. బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసి పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ , స్వదేశీ వ్యాక్సిన్ భారత్ బయోటెక్‌కి చెందిన కొవాగ్జిన్, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్–వీ అందుబాటులో ఉండగా , ఇటీవల అమెరికాకి చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు ఆ జాబితాలో జాన్సన్ అండ్ జాన్సన్ కూడా చేరింది. శుక్రవారం నాడు జే అండ్ జే కంపెనీ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అదే రోజు డీసీజీఐ అనుమతినిచ్చిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కీలక ముందడుగు: జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా మహమ్మారిని అరికట్టడంలో ఈ వ్యాక్సిన్‌కు అనుమతులివ్వడం కీలక ముందడుగు అని భారత్‌లోని జాన్సన్ అండ్ జాన్సన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 18 ఏళ్లు అంతకంటే పై బడిన వారికి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్‌లో అనుమతులు లభించాయని ఆ కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో జే అండ్ జే కంపెనీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో నిర్వహించడానికి దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. అదే సమయంలో వ్యాక్సిన్‌తో నరాలకు సంబంధించిన దుష్ప్రభావాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆ కంపెనీ వెనక్కి వెళ్లింది. ఆ తర్వాత తమ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు లేవని పలు అధ్యయనాలు తేల్చిన తర్వాత భారత్‌లో విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించి అనుమతులు పొందింది. ఎన్నెన్నో ప్రత్యేకతలు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ చాలా అంశాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. అవేంటో చూద్దాం ► ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉంటే జాన్సన్ అండ్ జాన్సన్ ఒక్క డోసు (0.5ఎంఎల్) తీసుకుంటే సరిపోతుంది. ► ఈ వ్యాక్సిన్ 85% సామర్థ్యంతో పని చేస్తుందని, అత్యంత సురక్షితమైనదని అమెరికా, దక్షిణాఫ్రికాలో జరిగిన పరిశోధనల్లో తేలింది. ► ఫైజర్, మోడెర్నా మాదిరిగా ఈ వ్యాక్సిన్‌కు అత్యంత శీతల వాతావరణంతో పని లేదు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. దీంతో ఈ వ్యాక్సిన్‌ను కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలకు పంపిణీ చేయవచ్చు. ► అమెరికాలోని ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లో వినియోగించే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ టీకాలో వాడలేదు. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా టీకా మాదిరిగా ఇది ఎడెనోవెక్టర్ వ్యాక్సిన్. కరోనా వైరస్ జన్యువుల్లోని స్పైక్ ప్రొటీన్‌ను ఎడెనోవైరస్తో సమ్మేళనం చేసి ఈ టీకాను తయారు చేశారు. ఇది శరీరంలో ప్రవేశించాక రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి స్పైక్ ప్రొటీన్‌పై పోరాడడానికి సిద్ధమవుతుంది. దీంతో శరీరంలో యాంటీబాడీలు వచ్చి చేరుతాయి. ► ఈ వ్యాక్సిన్‌కి సంబంధించిన కీలకమైన ఫార్ములా కరోనా వైరస్ బట్టబయలు కావడానికి పదేళ్లకు ముందే అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. బేత్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్‌కు చెందిన వైరాలజిస్టు డాన్ బరౌచ్, ఆయన బృందం జన్యుపరంగా మార్పులు చేసుకునే రోగకారకాలను మానవ కణజాలంలోకి ప్రవేశ పెట్టడానికి అవసరమైన వెక్టర్ (వాహకం)ను అభివృద్ధి చేస్తున్నారు. ఆ వాహకాన్నే ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌లో వినియోగించారు. వివాదాలేంటి ? ఈ వ్యాక్సిన్ చుట్టూ పలు వివాదాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా ఈ వ్యాక్సిన్ వినియోగం మొదలు పెట్టాక ఏప్రిల్‌లో కొందరిలో రక్తం గడ్డ కట్టే సమస్య తలెత్తింది. వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల్లోనే ఈ దుష్ప్రభావం కనిపించింది. దీంతో కొన్నాళ్లు టీకా పంపిణీని నిలిపి వేశారు. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం విచారించి ఈ వ్యాక్సిన్‌తో జరిగే ప్రయోజనమే అత్యధికమని నిర్ధారించి మళ్లీ పంపిణీని మొదలు పెట్టింది. ఆ తర్వాత అరుదుగా వచ్చే నరాలకు సంబంధించిన వ్యాధి కూడా ఈ టీకా ద్వారా వచ్చే అవకాశం ఉందన్న ప్రమాదఘంటికలు మోగా యి. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజుల తర్వాత శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ దుష్ప్రభావం కూడా చాలా తక్కువ మందిలో ఉండడంతో టీకా తీసుకోవడానికి ఎలాంటి భయాం దోళనలు అక్కర్లేదని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. డెల్టా వేరియంట్‌ను అడ్డుకోగలదా ? ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా డెల్టా వేరియెంట్‌ను జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా అడ్డుకోగలదని దక్షిణాఫ్రికా తాజా సర్వేలో వెల్లడైంది. సిస్నోక్ అనే పేరుతో చేపట్టిన ఈ సర్వేలో డెల్టాతో పాటుగా బీటా వేరియంట్‌పై కూడా ఈ వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తోందని తేలిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్ సోకితే ఆస్పత్రి చేరే అవసరం 71% మందికి రాదని, అదే బీటా వేరియంట్ అయితే 67% మందికి ఇంట్లోనే వ్యాధి నయం అయిపోతుంది. ఇక మరణాల రేటుని 96% తగ్గిస్తుంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రజలెవరూ ఆస్పత్రిపాలయ్యే అవకాశం ఉండదని, ప్రాణం మీదకి రావడం దాదాపుగా అసంభవమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిండా గెయిల్ వెల్లడించారు. -
63 జిల్లాల్లో బ్లడ్ బ్యాంకులు లేవు
న్యూఢిల్లీ: దేశంలో 3,500 లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంకులు ఉండగా, 63 జిల్లాల్లో అసలు బ్లడ్ బ్యాంకులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. జాతీయ రక్త విధానం కింద ప్రతి జిల్లాలో కనీసం ఒక్క బ్లడ్‌బ్యాంక్ అయినా ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉండే బ్లడ్ బ్యాంకులను కలపబోవడం లేదని తెలిపారు. ఎక్కువ పరిమాణంలో రక్తం దొరకే చోటు నుంచి దాన్ని నిల్వ చేసి, తక్కువగా దొరికే స్టోరేజీలకు పంపే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. దేశంలో చాలా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో జిల్లాల విభజన జరుగుతూ పోవడం వల్ల జిల్లాకో బ్లడ్ బ్యాంక్ ఉండటం లేదన్నారు. అలాంటి చోట్లకు పాత బ్లడ్‌బ్యాంకుల నుంచే రక్తం సరఫరా జరగాలన్నారు. -
కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాను వైఎస్సార్సీపీ ఎంపీలు ఢిల్లీలో గురువారం కలిశారు. రాజమండ్రిలో నీట్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 13 వేల మంది నీట్ అభ్యర్థులున్నారు. పరీక్ష కోసం 200-300 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఏపీలో 11 నీట్ సెంటర్లున్నా.. ఉభయగోదావరి జిల్లాలో ఒక్కటి కూడా లేదు. నీట్ పరీక్ష కోసం విజయవాడ, విశాఖ వెళ్లాల్సి వస్తోందని’’ కేంద్రమంత్రికి వైఎస్సార్సీపీ ఎంపీలు వివరించారు. -
ఇకపై ఎప్పుడైనా కరోనా టీకా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ వేళలపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఇకపై రోజులో ఏ సమయంలోనైనా టీకా పొందవచ్చు. టీకా పంపిణీని మరింత వేగవంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధ్దన్ చెప్పారు. ప్రజలు వారి వెసులుబాటును బట్టి అనువైన వేళల్లో టీకా తీసుకోవచ్చని సూచించారు. ప్రజల ఆరోగ్యం, సమయం విలువను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఏ వేళలోనైనా టీకా పంపిణీ చేయవచ్చని వెల్లడించారు. ఆయా ఆసుపత్రుల సామర్థ్యాన్ని బట్టి టీకా పంపిణీ వేళలను నిర్దేశించుకోవాలని సూచించారు. ఈ వేళల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని చెప్పారు. పెరుగుతున్న కొత్త కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో వచ్చిన కొత్త కేసుల్లో 85.95 శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు పేర్కొంది. గత వారంతో పోలిస్తే ఢిల్లీ, హరియాణాల్లోనూ కేసుల పెరుగుదల కనిపించినట్లు తెలిపింది. మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్లో కరోనా నియంత్రణ చర్యల్లో ఆయా రాష్ట్రాల అధికారులకు సహకరించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపినట్లు పేర్కొంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా సంబంధిత మరణాలేవీ సంభవించలేదని స్పష్టం చేసింది. 14,989 కొత్త కేసులు దేశంలో గత 24 గంటల్లో 14,989 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 98 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,57,346 కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,08,12,044 కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 97.06 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,70,126 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 1.53% ఉన్నాయి. మరణాల శాతం 1.41 గా ఉంది. ఇప్పటివరకూ 21,84,03,277 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం 7,85,220 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని చెప్పింది. మరణిస్తున్న వారిలో 70% మందిదీర్ఘకాలిక రోగాలు ఉన్నవారే. -
దేశమంతటా టీకా పండుగ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పండుగ వాతావరణం కనిపించింది. రంగురంగుల పూలు, బెలూన్లతో అందంగా అలంకరించారు. టీకా తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులకు సాదర స్వాగతం పలికారు. కొన్నిచోట్ల ప్రార్థనలు సైతం చేశారు. మిఠాయిలు పంచారు. వ్యాక్సిన్ బాక్సులకు పూలదండ చేసి, హారతి ఇచ్చిన దృశ్యాలు కూడా కనిపించాయి. మనీశ్ కుమార్ ఫస్ట్ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా పారిశుధ్య కార్మికుడు మనీశ్ కుమార్(34) గుర్తింపు పొందాడు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో అతడికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పాల్గొన్నారు. మనీశ్ కుమార్‌కు హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ఇచ్చారు. తాను గత రాత్రి కంటినిండా నిద్రపోయానని, శనివారం ఉదయమే ఎయిమ్స్‌కు చేరుకున్నానని, తోటి పారిశుధ్య కార్మికులతో మాట్లాడానని, ఆ తర్వాత టీకా తీసుకున్నానని మనీశ్ కుమార్ చెప్పాడు. టీకా తీసుకోవడానికి చాలామంది భయపడ్డారని, అందుకే అధికారుల వద్దకు వెళ్లి తానే తొలి టీకా తీసుకుంటానని కోరానని అన్నాడు. భయపడాల్సిన అవసరం లేదని అందరికీ తెలియజేయడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. టీకా తీసుకోవడం పట్ల గర్వంగా ఉందన్నాడు. కరోనా టీకా విషయంలో తన తల్లి, భార్య భయపడ్డారని, వారికి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు. థాంక్యూ మనీశ్ కుమార్ దేశంలో కరోనా టీకా తీసుకున్న మొదటి వ్యక్తి మనీశ్ కుమార్‌కు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కృతజ్ఞతలు తెలిపారు. అతడు తొలి టీకా తీసుకొని కరోనా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బలమైన సందేశం ఇచ్చాడని ప్రశంసించారు. అతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేదానిపై సంబంధం లేకుండా కరోనాపై పోరాటంలో అతడు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఢిల్లీలో పారిశుధ్య కార్మికుడైన మనీశ్ కుమార్ కోవిడ్–19 జోన్లలోనూ నిర్భయంగా విధులు నిర్వర్తించాడు. టీకా తీసుకున్న ప్రముఖులు కరోనా టీకా విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను దూరం చేసేందుకు చాలా మంది ప్రముఖులు తొలిరోజు ఈ టీకా పొందారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా, పశ్చిమ బెంగాల్ మంత్రి నిర్మల్ మజీ తదితరులు కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. తొలిరోజు 1,91,181 మందికి.. దేశవ్యాప్తంగా శనివారం 3,352 సెషన్లలో 1.90 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు తలెత్తి ఆసుపత్రిలో చేరినట్లు ఇప్పటిదాకా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని వెల్లడించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం తొలిరోజు పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నానీ తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 1,91,181 మందికి టీకా మొదటి డోసు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిషీల్డ్ మాత్రమే ఇవ్వగా, 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్ కూడా అందజేశారు.