కేంద్ర మంత్రులు సహా పలువురు ఎంపీలు పార్లమెంట్‌కు మాస్క్‌లతో వచ్చిన దృశ్యం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు. అర్హులైన వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోసు ఇవ్వాలని, మహమ్మారి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు.
కొత్త వేరియంట్ మన దేశంలోకి అడుగుపెట్టే అవకాశాలను తగ్గించడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రకటించారు. విదేశీ ప్రయాణికుల నుంచి విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ మొదలైందని తెలిపారు. ‘‘మన శత్రువు(కరోనా) కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. మనం ఇకపై మరింత పట్టుదల, అంకితభావంతో శత్రువుపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలి’’ అని పిలుపునిచ్చారు.
ప్రజల్లో చైతన్యం పెంచాలి
ప్రపంచమంతటా రోజువారీగా సగటున 5.87 లక్షల కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని, మన దేశంలో మాత్రం సగటున 153 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తి, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాబోయే పండుగలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేయాలని చెప్పారు. బూస్టర్ డోసుతోపాటు కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని విన్నవించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తల విషయంలో ప్రజల్లో చైతన్యం పెంచాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పారు.
ఏమరుపాటు వద్దు
కొత్త వేరియంట్లను గుర్తించడానికి పాజిటివ్ కేసుల జినోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు‡’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు.
కరోనా అనే విపత్తు ఇంకా ముగిసిపోలేదు కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై, జీవనంపై ప్రభావం చూపిస్తూనే ఉందని గుర్తుచేశారు. గత కొద్దిరోజులుగా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతుందోన్నారు. చైనా, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ మనదేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. అయినప్పటికీ ఏమరుపాటు తగదని స్పష్టం చేశారు.
24 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు టెస్ట్‌లు
విదేశాల నుంచి వచ్చేవారికి ఈ నెల 24వ తేదీ నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారికి ర్యాండమ్ కరోనా వైరస్ టెస్టు నిర్వహించాలంటూ పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి విమానంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల్లో కొందరి నుంచి ఎయిర్‌పోర్టులోనే నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరెవరికి టెస్టులు చేయాలన్నది వారు ప్రయాణించిన విమానయాన సంస్థ నిర్ణయిస్తుంది.
ఎంపీలంతా మాస్కులు ధరించాలి: స్పీకర్
కరోనా వ్యాప్తిపై మళ్లీ భయాందోళనలు మొదలైన నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో çసభ్యులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం సూచించారు. లోక్‌సభ ప్రవేశద్వారాల వద్ద మాస్కులు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎంపీలందరూ వాటిని ధరించి, సభలో అడుగపెట్టాలని కోరారు. గురువారం పార్లమెంట్‌లో చాలామంది ఎంపీలు మాస్కులు ధరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పార్లమెంట్ సిబ్బందిని లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు పాటించాలన్న స్పీకర్ బిర్లా సూచనను పలువురు ఎంపీలు స్వాగతించారు.
Comments
Please login to add a commentAdd a comment