all states
-
మళ్లీ పంజా విసురుతున్న కరోనా
-
కరోనా పెరుగుదల.. కేంద్రం హైఅలర్ట్
సాక్షి, ఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో.. హైఅలర్ట్ ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కరోనా అలర్ట్ జారీ చేసింది. కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేసింది. దేశంలో కేసులు పెరుగుతున్న వేళ.. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎల్లుండి(సోమవారం) రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నుట్లు తెలుస్తోంది. అలాగే.. ఏప్రిల్ 10, 11వ తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో 1,590 తాజా కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. గత 146 రోజుల తర్వాత ఇదే హయ్యెస్ట్ కేసుల సంఖ్య కావడం గమనార్హం. ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 విజృంభణ వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది. అలాగే.. ఆరు కరోనా మరణాలు సంభవించాయని గణాంకాల్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. DG ICMR Dr Rajiv Bahl and Secy, MoHFW Rajesh Bhushan write to all States/UTs on maintaining optimum testing for Covid-19 pic.twitter.com/xS5ycvqYa1 — ANI (@ANI) March 25, 2023 -
కరోనాపై ఉమ్మడి పోరాటం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అర్హులైన వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోసు ఇవ్వాలని, మహమ్మారి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ మన దేశంలోకి అడుగుపెట్టే అవకాశాలను తగ్గించడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రకటించారు. విదేశీ ప్రయాణికుల నుంచి విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ మొదలైందని తెలిపారు. ‘‘మన శత్రువు(కరోనా) కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. మనం ఇకపై మరింత పట్టుదల, అంకితభావంతో శత్రువుపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం పెంచాలి ప్రపంచమంతటా రోజువారీగా సగటున 5.87 లక్షల కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని, మన దేశంలో మాత్రం సగటున 153 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తి, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాబోయే పండుగలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేయాలని చెప్పారు. బూస్టర్ డోసుతోపాటు కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని విన్నవించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తల విషయంలో ప్రజల్లో చైతన్యం పెంచాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. ఏమరుపాటు వద్దు కొత్త వేరియంట్లను గుర్తించడానికి పాజిటివ్ కేసుల జినోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు‡’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు. కరోనా అనే విపత్తు ఇంకా ముగిసిపోలేదు కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై, జీవనంపై ప్రభావం చూపిస్తూనే ఉందని గుర్తుచేశారు. గత కొద్దిరోజులుగా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతుందోన్నారు. చైనా, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ మనదేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. అయినప్పటికీ ఏమరుపాటు తగదని స్పష్టం చేశారు. 24 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు టెస్ట్‌లు విదేశాల నుంచి వచ్చేవారికి ఈ నెల 24వ తేదీ నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారికి ర్యాండమ్ కరోనా వైరస్ టెస్టు నిర్వహించాలంటూ పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి విమానంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల్లో కొందరి నుంచి ఎయిర్‌పోర్టులోనే నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరెవరికి టెస్టులు చేయాలన్నది వారు ప్రయాణించిన విమానయాన సంస్థ నిర్ణయిస్తుంది. ఎంపీలంతా మాస్కులు ధరించాలి: స్పీకర్ కరోనా వ్యాప్తిపై మళ్లీ భయాందోళనలు మొదలైన నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో çసభ్యులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం సూచించారు. లోక్‌సభ ప్రవేశద్వారాల వద్ద మాస్కులు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎంపీలందరూ వాటిని ధరించి, సభలో అడుగపెట్టాలని కోరారు. గురువారం పార్లమెంట్లో చాలామంది ఎంపీలు మాస్కులు ధరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పార్లమెంట్ సిబ్బందిని లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు పాటించాలన్న స్పీకర్ బిర్లా సూచనను పలువురు ఎంపీలు స్వాగతించారు. -
వ్యాక్సినేషన్ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్–19 కట్టడిలో కీలకమైన వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రాల సమన్వయంతో పూర్తిగా కేంద్రమే నిర్వహించాలని, ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే మాట మీద నిలబడదామంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోని పలువురు ముఖ్యమంత్రులకు గురువారం లేఖలు రాశారు. ‘అంతర్జాతీయ టెండర్ల ద్వారా వ్యాక్సిన్ కొనుగోలు చేసి, రాష్ట్రంలో ఉచితంగా వ్యాక్సిన్ అందిద్దామన్నా, దీనికి అనుమతులు కేంద్రమే ఇవ్వాల్సి ఉండటంతో అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిలో వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రమే తీసుకోవాలని అందరం ఏకమై అడుగుదాం’ అని ఆ లేఖల్లో పేర్కొన్నారు. దేశంలోని పలువురు ముఖ్యమంత్రులకు ఆయన రాసిన లేఖల్లో భాగంగా.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రాసిన లేఖ ఇదీ.. శ్రీ పినరయి విజయన్ జీ, మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నా. భయంకరమైన కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సెకండ్ వేవ్ నుంచి భారతదేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్న ప్రాథమిక సంకేతాలు అందుతున్నాయి. అయినా కోవిడ్ కట్టడి చర్యలను అప్పుడే ఆపివేయలేం. మీ రాష్ట్రంలో బలమైన ఆరోగ్య వ్యవస్థతో తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతున్నారని భావిస్తున్నా. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో మన పదునైన ఆయుధం వ్యాక్సిన్ మాత్రమే. ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవిక విషయాలు చూసిన తర్వాత నేను మీకు లేఖ రాస్తున్నా. రాష్ట్రంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలన్న లక్ష్యంలో భాగంగా నేరుగా వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి అంతర్జాతీయ టెండర్లకు వెళ్లాం. జూన్ 3 సాయంత్రం 5 గంటల వరకు బిడ్లు సమర్పించడానికి గడువు ఇచ్చినా ఒక్కరు కూడా బిడ్లు దాఖలు చేయకపోవడం నిరాశ పరిచింది. వ్యాక్సిన్ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రాల చేతిలో ఏమీలేదు. వ్యాక్సిన్ల కొనుగోలు ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల మధ్య అంశంగా మారడం, వ్యాక్సిన్ కొనుగోలుకు ఆమోదం తెలిపే అధికారం కేంద్రం చేతిలో ఉండటం ఈ పరిస్థితికి కారణాలుగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేక సమన్వయ అంశాలతో ముడిపడి ఉంది. కొన్ని రాష్ట్రాలు మాకు తగినంత వ్యాక్సిన్ సరఫరా లేదని భావిస్తున్నాయి. గ్లోబల్ టెండర్లకు వెళుతున్న రాష్ట్రాలకు సరైన స్పందన కూడా రావడం లేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యం అయ్యే కొద్ది ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేను అందరి ముఖ్యమంత్రులను కోరేది ఒక్కటే.. వ్యాక్సినేషన్ బాధ్యతను పూర్తిగా కేంద్రమే చేపట్టాలని ఒకే మాటగా వినిపిద్దాం. ప్రారంభంలో కేంద్రమే వ్యాక్సినేషన్ పూర్తి బాధ్యత తీసుకున్న విషయం మీకు తెలిసిందే. ఆరోగ్య సిబ్బందికి సరైన సమయంలో వ్యాక్సినేషన్ చేయడం మంచి ఫలితాలను ఇచ్చింది. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలి అన్న నిర్ణయంతో సరైన సమయంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయగలిగాం. తద్వారా కరోనా సెంకడ్ వేవ్ ఉధృతిలో కూడా వారు వైరస్‌తో పోరాడగలిగారు. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాలో అనేక అవరోధాలు ఉండగా, వ్యాక్సిన్ కొనుగోళ్లను అధికంగా రాష్ట్రాలే చేపట్టాలనే నిర్ణయం సమంజసం కాదు. వ్యాక్సిన్ డ్రైవ్‌లో ఉన్న సవాళ్లను గత నెలన్నరగా మనం చూస్తున్నాం. దీనివల్ల రాష్ట్రాలు వైద్య సదుపాయాలు పెంచుకోవడానికి నిధులను వినియోగించుకోకుండా, మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ విధంగా అయినా వ్యాక్సిన్ సరఫరాను పెంచుకోవడం తక్షణావసరం. రాష్ట్రాల సహకారంతో నడిచే కేంద్రీకృత, సమన్వయ వ్యవస్థ ఉంటే దేశ ప్రజలకు మంచి ఫలితాలు అందుతాయి. ముఖ్యమంత్రులం అంతా ఒకేమాటపై ఉండి ఈ సంక్షోభాన్ని అధిగమిద్దాం. దీనికి మద్దతు ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చదవండి: 'కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు ఆర్థిక సాయం అందాలి' దేశ చరిత్రలోనే ప్రథమం.. కొత్త చరిత్రకు సీఎం జగన్ శ్రీకారం -
కేసీఆర్ జైత్రయాత్ర!
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ బలోపేతంపై టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దృష్టి పెట్టారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి తమతో కలసి వచ్చే పార్టీలను సమీకరించాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపే రాష్ట్రాల వారీగా పార్టీలతో కలసి పని చేయాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ నెలాఖరులో లేదా జనవరి మొదటి వారంలో ఫెడరల్ ఫ్రంట్ కార్యాచరణ ప్రారంభించనున్నారు. మొదట ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించి ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. అనంతరం వరుసగా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరంగా ఉండే ప్రాంతీయ పార్టీలతో కలసి సమాఖ్య వ్యవస్థ బలోపేతం నినాదంతో ఫెడరల్ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో పర్యటించి పలు ప్రాంతీయ పార్టీల మద్దతు కోరారు. అనంతరం మరిన్ని రాష్ట్రాల్లోని పార్టీలతో సమన్వయం చేసే ఆలోచన చేశారు. లోక్‌సభ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరదని భావించారు. ముందుగా తెలంగాణలో విజయం సాధించి ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావాలని యోచిం చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం.. ప్రజలు టీఆర్ఎస్ను మరోసారి గెలిపించడం జరిగిపోయాయి. భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్ట పెరిగింది. సీఎం హోదాలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించి రాజకీయ సమీకరణ చేసేం దుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండే బిజూ జనతాదళ్ వంటి పార్టీ లను ముందుగా కలుపుకోవాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలకుబాధ్యతలు ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకు కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రచిస్తున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి ఫెడరల్ ఫ్రంట్ తరఫున లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉండేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్యెల్యేలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కో రాష్ట్రానికి ఐదుగురు చొప్పున ఎమ్మెల్యేలతో కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు బాధ్యులుగా ఉండే ఎమ్మెల్యేలు అక్కడి ప్రాం తీయ పార్టీలతో సమన్వయం చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచేలా వ్యూహం రచిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రణాళికలను ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలని చూస్తున్నారు. ఢిల్లీ పర్యటన సీఎం కేసీఆర్ త్వరలోనే ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇదే పర్యటనలో ఫెడరల్ ఫ్రంట్ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలయ్యేలా కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది. తమతో కలసి వచ్చే పార్టీల సమన్వయం కోసం ఢిల్లీలో ప్రత్యేక కార్యాలయాన్ని సిద్ధం చేసే యోచనలో ఉన్నారు. మొత్తంగా ఫెడరల్ ఫ్రంట్ కీలక కార్యాచరణపై ఢిల్లీ వేదికగా కేసీఆర్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
సొమ్ము ఎవరిదో.. సోకూ వారిదే!
- కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రాల బడ్జెట్లో పేర్కొనాల్సిందే - వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే అమలు! - బడ్జెట్ల రూపకల్పనలపై అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ నూతన మార్గదర్శకాలు జారీ సాక్షి, హైదరాబాద్: 'ఫలానా సంక్షేమ పథకానికి ఇంత ఖర్చు చేస్తున్నాం.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ఇన్ని కోట్లు కేటాయించాం..' అంటూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఘనంగా చదివే బడ్జెట్ పద్దులపై ఇక ముందు కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ లలో.. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అందిస్తున్న నిధులను తప్పనిసరిగా విడిగా పేర్కొనాలని చెప్పింది. తద్వారా ఏ పథకానికి ఏ ప్రభుత్వం(కేంద్రం, రాష్ట్రం) ఎంతెంత నిధులిచ్చింది సులువుగా వెల్లడవుతుందని పేర్కొంది. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ స్వరూపంలో మార్పులకు సంబంధించి నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకు మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ చట్టం అమలు కానున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు కీలకంగా మారాయి. ఫలానా పథకానికి ఇన్ని నిధులు కేటాయిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవడం ఇకపై కుదరదని, కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లలో ప్రత్యేకంగా పేర్కొనాల్సి ఉంటుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు నిధులిస్తోంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లకు నిధులు అందజేస్తోంది. విద్య, వైద్య ఆరోగ్యం, సాగునీరు, పౌష్టికాహారం, అంగన్వాడీ కేంద్రాలతోపాటు మరెన్నో కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తోంది. అలాగే ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రాంట్లను ఇస్తోంది. అయితే, ఏపీతోపాటు కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఇస్తున్న నిధులకు మరికొంత సొమ్ము జోడించి ఆయా కార్యక్రమాలకు ఇన్ని నిధులు కేటాయించమంటూ బడ్జెట్లో పేర్కొంటున్నాయి. నిధుల్లో సింహభాగం కేంద్రానివే అయినప్పటికీ క్రెడిట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుండటం గమనార్హం. అందుకే ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నీతి ఆయోగ్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ పద్దులో తప్పనిసరిగా పేర్కొనాలి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలకు ఏ కార్యక్రమానికి ఎన్ని నిధులను కేటాయించాయనే వివరాలను రాష్ట్రాల బడ్జెట్లో పొందుపరచాలని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దీనివల్ల పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులెన్ని, రాష్ట్ర సర్కారు ఇస్తున్న నిధులెన్నో రాష్ట్రాల బడ్జెట్ల ద్వారా తెలిసిపోతుంది. సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అనే వ్యవహారానికి చెక్ పేట్టేందుకే కేంద్రం ఈ మార్పులు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. -
అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే సిలబస్ మేలు
♦ ఇంటర్ విద్యపై కోర్ కామన్ ♦ కరిక్యులమ్ క మిటీ అంగీకారం ♦ వివిధ విద్యాబోర్డుల ప్రతినిధుల భేటీ సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ (ప్లస్‌టూ) విద్యావ్యవస్థకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన సిలబస్ ఉండటమే మేలని కోర్ కామన్ కరిక్యులమ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏర్పాటు చేసిన కమిటీ శనివారం హైదరాబాద్‌లోని ఇంటర్మీడియెట్ బోర్డులో సమావేశమైంది. తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యాబోర్డుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యావిధానంలో ప్రస్తుతం వస్తున్న ఆధునిక పోకడలపై చర్చించిన కమిటీ సభ్యులు, ముఖ్యమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేశారు. వివిధ రాష్ట్రాల్లో పలు రకాల సిలబస్‌లు అమల్లో ఉన్నందున కొన్ని రాష్ట్రాల విద్యార్థులు.. అఖిల భారత స్థాయిలో నిర్వహించే ఐఐటీ, జేఈఈ, ఏఐఈఈఈ.. తదితర ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించలేకపోతున్నారని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇంటర్ సిలబస్‌లో 70 శాతం ఏకీకృత సిలబస్ ఉండాలని, ఆయా రాష్ట్రాల్లో అవసరాలు, పరిస్థితుల ఆధారంగా 30 శాతం సిలబస్‌ను మార్చుకునే వెసులుబాటు ఉండాలని చెప్పింది. సైన్స్ సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్‌బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ రూపొందించిన నివేదిక కాపీలను కమిటీ సభ్యులకు అందజేశారు. నివేదికలోని అంశాలపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నివేదికను కేంద్రం ఆమోదం కోసం పంపాలని సూచించింది. సమావేశంలో జమ్ము కశ్మీర్ పాఠశాల విద్యామండలి చైర్మన్ జహూర్ అహ్మద్, మహారాష్ట్ర మాధ్యమిక, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కృష్ణకుమార్ పాటిల్, నాగాలాండ్ పాఠశాల విద్యామండలి చైర్మన్ అసనో సెకోజ్, ఐసీఎస్ఈ పరిశోధక విభాగం డిప్యూటీ హెడ్ షిల్పిగుప్త, ఎన్సీఈఆర్టీ లోని ఆర్‌ఎంఎస్‌ఏ విభాగాధిపతి రంజన్ అరోరా, సీబీఎస్ఈ అదనపు డెరైక్టర్ సుగంధ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
భద్రత కట్టుదిట్టం చేయండి
న్యూఢిల్లీ: దీపావళి పండగ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీపావళి సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని హెచ్చరించింది.