అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే సిలబస్ మేలు
♦ ఇంటర్ విద్యపై కోర్ కామన్
♦ కరిక్యులమ్ క మిటీ అంగీకారం
♦ వివిధ విద్యాబోర్డుల ప్రతినిధుల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ (ప్లస్‌టూ) విద్యావ్యవస్థకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన సిలబస్ ఉండటమే మేలని కోర్ కామన్ కరిక్యులమ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏర్పాటు చేసిన కమిటీ శనివారం హైదరాబాద్‌లోని ఇంటర్మీడియెట్ బోర్డులో సమావేశమైంది. తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యాబోర్డుల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇంటర్ విద్యావిధానంలో ప్రస్తుతం వస్తున్న ఆధునిక పోకడలపై చర్చించిన కమిటీ సభ్యులు, ముఖ్యమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేశారు. వివిధ రాష్ట్రాల్లో పలు రకాల సిలబస్‌లు అమల్లో ఉన్నందున కొన్ని రాష్ట్రాల విద్యార్థులు.. అఖిల భారత స్థాయిలో నిర్వహించే ఐఐటీ, జేఈఈ, ఏఐఈఈఈ.. తదితర ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించలేకపోతున్నారని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇంటర్ సిలబస్‌లో 70 శాతం ఏకీకృత సిలబస్ ఉండాలని, ఆయా రాష్ట్రాల్లో అవసరాలు, పరిస్థితుల ఆధారంగా 30 శాతం సిలబస్‌ను మార్చుకునే వెసులుబాటు ఉండాలని చెప్పింది.
సైన్స్ సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్‌బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ రూపొందించిన నివేదిక కాపీలను కమిటీ సభ్యులకు అందజేశారు. నివేదికలోని అంశాలపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నివేదికను కేంద్రం ఆమోదం కోసం పంపాలని సూచించింది. సమావేశంలో జమ్ము కశ్మీర్ పాఠశాల విద్యామండలి చైర్మన్ జహూర్ అహ్మద్, మహారాష్ట్ర మాధ్యమిక, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కృష్ణకుమార్ పాటిల్, నాగాలాండ్ పాఠశాల విద్యామండలి చైర్మన్ అసనో సెకోజ్, ఐసీఎస్‌ఈ పరిశోధక విభాగం డిప్యూటీ హెడ్ షిల్పిగుప్త, ఎన్‌సీఈఆర్‌టీ లోని ఆర్‌ఎంఎస్‌ఏ విభాగాధిపతి రంజన్ అరోరా, సీబీఎస్‌ఈ అదనపు డెరైక్టర్ సుగంధ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.