national wide
-
Puthettu Travel Vlog: 12 చక్రాల బండి సాగిపోతోంది
భిన్న జీవనం జెలజ కుటుంబం ఇంట్లో కంటే రోడ్డు మీదే ఎక్కువగా ఉంటుంది. జెలజ ట్రక్ డ్రైవర్. భర్తకు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉంది. తొలత గృహిణిగా ఉన్న జెలజ మెల్లగా డ్రైవింగ్ నేర్చుకుంది. లోడు దించేందుకు కుటుంబంతో బయలుదేరి కొత్త ప్రాంతాల వీడియో చేస్తుంది. ఆమె కేరళ నుంచి కశ్మీర్ వరకూ ట్రక్ తోలింది. కూతురు తల్లితోపాటు డ్రైవింగ్ నేర్చుకుంది. ‘పుతట్టు ట్రావెల్ వ్లోగ్’ పేరుతో ఈ కుటుంబ యానం లక్షల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించింది. ఉదాహరణకు జెలజ జీవితం ఇలా ఉంటుంది. ఆమె కేరళలోని కొట్టాయం నుంచి ప్లైవుడ్ లోడ్ తీసుకుని పూణెలో డెలివరీ చేస్తుంది. కాని ఖాళీ ట్రక్కు వెనక్కు తెస్తే నష్టం. ‘ఉల్లిపాయల లోడు కశ్మీర్లో దింపుతారా’ అని పూణెలో అడుగుతారు. ‘దింపుతాను’ అని బయలుదేరుతుంది. కశ్మీర్ చేరుకుంటుంది. అక్కడ లోడ్ దొరకదు ఒక్కోసారి. ఢిల్లీ, హర్యాణ దాకా వచ్చే లోడ్ దొరుకుతుంది. ఏదో ఒక సరుకు కేరళకు దింపే బుకింగ్ వస్తుంది. ఆ లోడు తీసుకుని కేరళ చేరుకుంటుంది. ‘కేరళలో ప్రతి సంవత్సరం జారీ అవుతున్న డ్రైవింగ్ లైసెన్స్‌లలో 40 శాతం స్త్రీలవి. టూ వీలర్లు కార్లు సరే... బస్సులు కూడా కేరళలో నడుపుతున్నారు స్త్రీలు. కాని ట్రక్కు నడిపే స్త్రీలు చాలా అరుదు. అందుకే జెలజ ను చూసి అందరూ గౌరవిస్తారు’ అంటాడు రతీష్. అతడు జెలజ భర్త. ఆమె లాంగ్ డ్రైవ్‌కి బయలుదేరితే చాలాసార్లు తోడు ఉంటాడు. ఒక్కోసారి పెద్దకూతురు, భార్య డ్రైవ్ చేస్తుంటే వారికి తోడు వస్తాడు. అతను స్వయంగా డ్రైవరు. కాని తన కుటుంబ స్త్రీలు హైవేలను జయిస్తూ ఉంటే సంతోషపడతాడు. గృహిణి నుంచి డ్రైవర్‌గా రతీష్ 2003 వరకూ ఒక సాధారణ ట్రక్ డ్రైవర్. ఆ సంవత్సరం ఆరు లక్షలు లోన్ తీసుకుని ఒక భారత్ బెంజ్ ట్రక్ కొన్నాడు. కలిసొచ్చింది. తన సోదరుడితో కలిసి ఇప్పుడు 27 నేషనల్ పర్మిట్ ట్రక్కులతో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. తరచూ లాంగ్ డ్రైవ్‌కి వెళ్లే రతీష్ని జెలజ ‘నేనూ నీతో రానా కొత్తప్రాంతాలు చూడాలని ఉంది’ అనడిగింది. ‘రావచ్చు. కాని నువ్వు ట్రక్కు నడపడం నేర్చుకుంటే’ అన్నాడు రతీష్. అప్పటికి జెలజ కేవలం గృహిణి. టూ వీలర్ నడపడం కూడా రాదు. ఆమె మొదట టూ వీలర్.. ఆ తర్వాత కారు నడిపి ట్రక్ డ్రైవింగ్ నేర్చుకుంది. భర్తను తోడు తీసుకుని స్వయంగా ట్రక్ నడుపుతూ లోడ్ డెలివరీ చేయడం ్ప్రారంభించింది. వీడియోలు చేస్తూ ‘మాది ఉమ్మడి కుటుంబం. నా మరిది, తోటికోడలు, అత్తగారు.. అందరం కలిసి ఉంటాం. అందుకే నా ఇద్దరు పిల్లలను వదిలి ట్రక్ తీసుకుని బయలుదేరుతాను’ అంటుంది జెలజ. ఆమె పెద్ద కూతురు కూడా ట్రక్ డ్రైవింగ్ నేర్చుకుంది. లోడ్లు దింపే పనిలో భాగంగా పర్యటనలు కూడా ఈ కుటుంబం ట్రక్కు ద్వారా ముగిస్తారు. ‘మేఘాలయా, కోల్కటా, పోర్బందర్... ఇలా ఎన్నో కొత్తప్రాంతాలు చూశాను’ అంటుంది జెలజ.. ఎక్కడకు వెళ్లినా అక్కడి విశేషాలు వీడియోలు చేస్తూ అక్కడి సంస్కృతి, అలవాట్లు తెలియచేస్తూ ఉంటుంది. రోడ్డు పక్కన ట్రక్కు ఆపి వంట చేసుకుని తోటి డ్రైవర్లతో కలిసి తినడం ఆ వీడియోలు కనపడుతుంది. ఒకసారి అత్తగారిని తీసుకుని ఆమె ట్రక్కులోనే లాంగ్ జర్నీ చేసింది. కేరళ నుంచి కశ్మీర్ వరకూ ట్రక్ నడిపి వార్తల్లోకి ఎక్కింది జెలజ . ‘వాష్‌రూమ్‌లు ఒక్కటే ఇబ్బంది. పెట్రోల్ బంకుల్లో ఉన్నవాటిని ఉపయోగిస్తాను. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో పోలీసులు పీక్కు తింటారు మామూళ్ల కోసం. మిగిలిన రాష్ట్రాలు పర్లేదు. ఇక దొంగల భయం ఉంటుంది. కాని హైవేల మీద తిరగ్గా తిరగ్గా ఆ భయం పోయింది’ అంటుంది జెలజ. -
ఏడాదిలో 20 వేలకు పైగా స్కూళ్లు మూసివేత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో 2020–21లో 20 వేలకు పైగా స్కూళ్లు మూతపడ్డాయని కేంద్ర విద్యా శాఖ తాజా నివేదిక వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే టీచర్ల సంఖ్య 1.95% తగ్గిందని తెలిపింది. దేశంలో 44.85% స్కూళ్లకు మాత్రమే కంప్యూటర్ సదుపాయం ఉందని, 34% పాఠశాలల్లో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉందని పాఠశాల విద్యపై యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) నివేదించింది. ► 2020–21లో 15.09 లక్షల స్కూళ్లు ఉంటే 2021–22లో 14.89లక్షలకి తగ్గిపోయాయి. ► 2020–21లో 97 లక్షలున్న టీచర్ల సంఖ్య 2021–22 నాటికి 95 లక్షలకి తగ్గిపోయింది. ► దివ్యాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక టాయిలెట్లు 27%స్కూళ్లలోనే ఉన్నాయి. ► 2020–21లో 25.38 కోట్ల మంది ఉండే విద్యార్థుల సంఖ్య 2021–22 వచ్చేసరికి 25.57 కోట్లకి పెరిగింది. ► ప్రి ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల చేరిక11.5 లక్షలు తగ్గింది. కరోనా ప్రభావంతో చిన్న పిల్లల్ని స్కూళ్లలో చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో వారి సంఖ్య తగ్గింది. -
కేజ్రీవాల్.. జాతీయస్థాయి ప్రచారం
న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్‌లో అధికార పీఠంపై పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కేంద్రంలో సత్తా చాటాలని ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా జనబాహుళ్యంలోకి దూసుకెళ్లనుంది. సుపరిపాలనకు పంచ సూత్రావళిని ప్రకటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ‘మేక్ ఇండియా నంబర్ వన్’ పేరిట జాతీయస్థాయి ప్రచార కార్యక్రమానికి త్రివర్ణ పతాకం ఊపి మరీ శ్రీకారంచుట్టారు. బుధవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియం ఇందుకు వేదికైంది. ‘‘భారత్ ‘అభివృద్ధిచెందిన దేశం’గా అవతరించకుండా చేసి దశాబ్దాలుగా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గా మిగిల్చిన పార్టీలపై ప్రజాస్వామ్యపోరాటంలో గెలుస్తాం. అధికార పగ్గాలు ఇకపై వారికి అప్పజెప్పేదిలేదు’ అంటూ కేజ్రీవాల్ ప్రతిజ్ఞచేశారు. ‘ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రభాగాన నిలుపుదాం. అందుకు మాతోపాటు మీరంతా కలిసిరండి’ అంటూ పౌరులనుద్దేశిస్తూ ప్రసంగించారు. దేశ పురోభివృద్ధికి పాటుపడాలంటే బీజేపీ, కాంగ్రెస్.. మరే పార్టీ వారితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూనే బీజేపీ, కాంగ్రెస్‌లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘75ఏళ్ల చరిత్రలో ఈ పార్టీలు కేవలం తమ , తమ స్నేహితుల ఇళ్లను వేలకోట్ల స్థిర, చరాస్థులతో నింపేశాయి. దేశం ఇంకా వీళ్ల చేతుల్లోనే ఉంటే దేశాభివృద్ధి మరో 75 ఏళ్లు వెనకే ఉండిపోతుంది’ అని ఆరోపించారు. ‘ఈ కార్యక్రమం రాజకీయమైందికాదు. భారతజాతి కోసం చేస్తున్న ఉద్యమం’ అని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి ఐదు సూత్రాలను తప్పక ఆచరణలో పెట్టాలన్నారు. పంచ సూత్రావళి ► ప్రతి చిన్నారికి ఉచిత, నాణ్యమైన విద్య అందించాలి ► పౌరులందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం, ఔషధాలు అందివ్వాలి. ఉచితంగా పరీక్షలు చేసే రోగ నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు. ► యువతకు ఉద్యోగ కల్పన ► మహిళలకు సమాన హక్కులు, సరైన భద్రత ► రైతుల పంటకు సరైన ధర దక్కేలా చూడాలి. వారి పిల్లలు సైతం తమది రైతు కుటుంబమని గర్వపడేలా చేయాలి. లాభాల పంట పండేలా, రైతుగా కొనసాగాలనే ఆకాంక్ష వారిలో పెంచాలి. -
జాతీయ స్థాయి లాక్‌డౌన్‌కు ప్రధాని మోదీపై ఒత్తిడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్న మరణాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో లాక్డౌన్ విధించాలని ప్రధాని మోదీపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అనుకూలంగా లేదని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని సగానికి పైగా జిల్లాల్లో కరోనా నియంత్రణలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా గతేడాది మాదిరిగా జాతీయస్థాయి లాక్డౌన్ విధించడం కారణంగా పేదలకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. అందుకే కొత్త కేసుల పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఆంక్షలతో కూడిన లాక్డౌన్ విధిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో పరిమిత లేదా పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. దీని ప్రభావం కనిపించడం ప్రారంభమైందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు... అక్కడ ఏ విధమైన ఆంక్షలు విధించారో ఓ సారి చూద్దాం. మహారాష్ట్ర: ఏప్రిల్ 5న కర్ఫ్యూ లాంటి లాక్డౌన్, నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిషేదాజ్ఞలు మే 15 వరకు పొడిగించారు. ఢిల్లీ: ఢిల్లీలో లాక్‌డౌన్‌ను 10వ తేదీ వరకు పొడిగించారు. ఏప్రిల్ 19 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్: ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను మే 10 వరకు పొడిగించారు. ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్‌ను మే 15 వరకు పొడిగించారు. సంక్రమణ కొంత స్థాయిలో నియంత్రణలో ఉన్న రాయ్‌పూర్, దుర్గ్ జిల్లాల్లో కాలనీల్లోని కిరాణా దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. అయితే సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. ఆదివారం పూర్తి లాక్డౌన్ ఉంటుంది. బిహార్: పెరుగుతున్న పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని బిహార్ ప్రభుత్వం మే 15 వరకు లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని కార్యాలయాలు, దుకాణాలు, వాణిజ్య, ప్రైవేట్ సంస్థలు మూసివేయాలి. నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉదయం 7 నుండి 11 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఒడిశా: ఒడిశాలో మే 19 వరకు లాక్డౌన్ విధించారు. ఒడిశాలో 15 రోజుల లాక్డౌన్ మే 19 వరకు ఒడిశాలో కొనసాగుతుంది. పంజాబ్: మినీ లాక్డౌన్, వారాంతపు లాక్డౌన్ వంటి చర్యలతో పాటు, విస్తృతమైన ఆంక్షలు ఉన్నాయి. నైట్ కర్ఫ్యూ మే 15 వరకు అమలులో ఉంటుంది. రాజస్థాన్: లాక్డౌన్ ఆంక్షలు మే 17 వరకు అమలులో ఉన్నాయి. గుజరాత్: రాష్ట్రంలోని 29 పట్టణాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు నిషేధించారు. మధ్యప్రదేశ్: కరోనా కర్ఫ్యూ మే 7 వరకు అమలులో ఉంది. అస్సాం: నైట్ కర్ఫ్యూ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది. నైట్ కర్ఫ్యూ మే 7 వరకు అమలులో ఉంటుంది. తమిళనాడు: మే 20 వరకు అన్ని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధంసహా విస్తృతమైన ఆంక్షలు విధించారు. కేరళ: మే 9 వరకు లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు ఉన్నాయి. కర్ణాటక: మే 12 వరకు లాక్డౌన్ కొనసాగుతోంది. జార్ఖండ్: ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు లాక్డౌన్ అమలులో ఉంది. గోవా: నాలుగు రోజుల లాక్డౌన్ సోమవారం ముగిసినప్పటికీ ఉత్తర గోవాలోని కలంగూట్, కాండోలిమ్ వంటి పర్యాటక ప్రదేశాలలో లాక్డౌన్ కొనసాగుతుంది. కోవిడ్ –19 కారణంగా ఆంక్షలు మే 10 వరకు కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్: మే 5వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రెండు వారాల పాటు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించారు. తెలంగాణ: నైట్ కర్ఫ్యూ మే 8 వరకు కొనసాగుతుంది. పుదుచ్చేరి: లాక్డౌన్ మే 10 వరకు పొడిగించారు. నాగాలాండ్: మే 14 వరకు కఠినమైన నిబంధనలతో పాక్షిక లాక్డౌన్ విధించారు. జమ్మూ కశ్మీర్: శ్రీనగర్, బారాముల్లా, బుద్గాం, జమ్మూ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను మే 6 వరకు పొడగించారు. మొత్తం 20 జిల్లాల కార్పొరేషన్ / అర్బన్ లోకల్ బాడీస్ సరిహద్దులో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. -
ఒక్కొక్కరి ద్వారా 406 మందికి కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: భౌతిక దూరం పాటించకపోతే ఒక్కో కోవిడ్ రోగి నెల రోజుల్లో కనీసం 406 మందికి వ్యాధిని అంటిస్తాడని తాజా అధ్యయనం ఒకటి చెబుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కోవిడ్–19 నియంత్రణ చర్యలపై మంగళవారం నాటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక రోగి నుంచి ఎంతమందికి రోగం వ్యాప్తి చెందుతుందనేదాన్ని ఆర్–నాట్‌గా వ్యవహరిస్తారని, కోవిడ్–19 విషయంలో ఆర్–నాట్ 1.5 నుంచి 4.0 మధ్య ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేల్చారని వివరించారు. ఆర్–నాట్ 2.5 మాత్రమే ఉందని అనుకున్నా భౌతిక దూరం పాటించకపోతే ఒక్కో రోగి నెల రోజుల్లో 406 మందికి వ్యాధిని వ్యాపింపజేస్తాడని ఆయన లెక్కకట్టారు. భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించి రోగి కదలికలను 75 శాతం వరకూ నియంత్రించగలిగితే మాత్రం ఒక్కో రోగి నుంచి మరో 2.5 మందికి మాత్రమే వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ కారణంగానే దేశంలో భౌతిక దూరం పాటించడం అత్యవసరమని ఆయన తెలిపారు. దేశంలో మొత్తం 4,789 కేసులు... దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 4,789కు చేరుకుందని, మొత్తం 124 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. సోమవారం రాత్రి నుంచి 24 గంటల్లో దేశవ్యాప్తంగా 508 కొత్త కేసులు బయటపడ్డాయని చెప్పారు. మరణాల సంఖ్య పది అని అన్నారు. మరో 352 మంది చికిత్స తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం లేదా వలస వెళ్లడం జరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,312గా ఉందని చెప్పింది. మొత్తం కేసుల్లో 66 మంది విదేశీయులు.గా తెలిపింది. గత 24 గంటల్లో మరణించిన ఎనిమిది మందిలో నలుగురు మధ్యప్రదేశ్‌కు చెందిన వారు కాగా, ముగ్గురు మహారాష్ట్ర వారని, గుజరాత్, ఒడిశా, పంజాబ్‌ల నుంచి ఒకొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని వివరించారు. కోవిడ్–19 ప్రభావం ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో వ్యాధి నియంత్రణకు చేపడుతున్న చర్యలు అనుకున్న ఫలితాలిస్తున్నాయని వివరించారు. పేషెంట్ల స్థితిని బట్టి చికిత్స అందించేందుకు మూడు రకాలుగా చికిత్స కేంద్రాలను వర్గీకరించామని లవ్ అగర్వాల్ తెలిపారు. వ్యాధి లక్షణాల తీవ్రత ఒక మోస్తరుగా మాత్రమే ఉన్న వారిని కోవిడ్ కేర్ కేంద్రాలకు తరలిస్తామని, హాస్టళ్లు, క్రీడా మైదానాలు, పాఠశాలల వంటి ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను కేర్ సెంటర్లుగా ఉపయోగించుకుంటామని, ఇప్పటివరకూ క్వారంటైన్ కేంద్రాలుగా పనిచేస్తున్న వాటిని కూడా కేర్ సెంటర్లుగా ఉపయోగించుకుంటామని వివరించారు. వ్యాధి లక్షణాలు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆరోగ్య కేంద్రాలకు రోగిని తరలిస్తామని, తీవ్రస్థాయిలో ఉండే కేసులను అత్యవసర సేవలందించే ఆసుపత్రుల్లో ఉంచుతామని ఆయన వివరించారు. -
కరోనాకు 53 మంది బలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకూ 53 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 2,069 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. వైరస్ బారిన పడ్డ వారిలో 155 మందికి నయం కావడం లేదా డిశ్చార్జ్ అయిపోవడం లేదా వలస వెళ్లిపోవడంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్–19 బాధితుల సంఖ్య 1,860గా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ కారణంగా గత 24 గంటల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో మహారాష్ట్రకు చెందిన వారు నలుగురు కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు ముగ్గురని, పంజాబ్ నుంచి ఒక్కరు ఉన్నారని తెలుస్తోంది. కోవిడ్ కారణంగా ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 13 మంది, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో ఆరుగురు చొప్పున, పంజాబ్‌లో నలుగురు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లలో ముగ్గురు చొప్పున, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, కేరళల్లో ఇద్దరు చొప్పున, తమిళనాడు, బిహార్, హిమాచల్ ప్రదేశ్లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బాధితులు ఎక్కువ... కోవిడ్ బారిన పడ్డవారిలో సుమారు 335 మంది మహారాష్ట్రకు చెందిన వారు కాగా, కేరళలో 265 మంది ఉన్నారు. అలాగే తమిళనాడులో మొత్తం 234 మందికి వైరస్ సోకింది. ఢిల్లీలో బాధితుల సంఖ్య 152కు చేరుకోగా, ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఖ్య 113గా ఉంది. కర్ణాటకలో ఇప్పటివరకూ కోవిడ్ బారిన పడ్డవారు 110 మంది ఉన్నారు. రాజస్తాన్‌లో 108 మంది, మధ్యప్రదేశ్‌లో 99 మంది, గుజరాత్లో 82 మంది, జమ్మూ కశ్మీర్లో 62 మంది వైరస్ బారిన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పంజాబ్‌లో 46 కేసులను గుర్తించగా, హరియాణాలోనూ 43 మంది వైరస్ బారిన పడ్డారు. పశ్చిమ బెంగాల్లో 37 మంది, బిహార్‌లో 23 మంది చండీగఢ్‌లో 16 మంది, లడాఖ్‌లో 13 మంది కోవిడ్ బాధితులు ఉండగా, అండమాన్ నికోబార్ దీవుల నుంచి పది మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం తొమ్మిది మందికి వైరస్ సోకింది. ఉత్తరాఖండ్‌లో ఏడుగురు, గోవాలో ఐదుగురు కరోనా బారిన పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఒరిస్సాలోనూ నాలుగు కోవిడ్ కేసులు ఉన్నాయని పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్లలో ముగ్గురు చొప్పున కోవిడ్ బారిన పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా, ఈశాన్యరాష్ట్రాలు అస్సాం, జార్ఖండ్, మిజోరం, మణిపూర్లలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. -
దేశవ్యాప్త విస్తరణ దిశగా ‘ఆప్’
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విస్తరణ బాట పట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని కనీసం కోటి మందికి చేరువ అవ్వాలన్న లక్ష్యంతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. అరవింద్ కేజ్రీవాల్ తాజా మంత్రివర్గంలో సభ్యుడిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్.. ఆప్ రాష్ట్రాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ‘మూడు విషయాలపై పని చేయాలని నిర్ణయించాం. మొదటిది, అన్ని రాష్ట్రాల పార్టీ యూనిట్లు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు రాష్ట్ర నిర్మాణ్ కార్యక్రమం చేపడ్తాయి. ఇందులో పార్టీ వాలంటీర్లు ప్రజలను కలుస్తారు. కనీసం కోటి మందిని కలవాలనేది లక్ష్యం. అలాగే, దేశ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు కలసిరావాలని కోరుతూ పోస్టర్లతో ప్రచారం చేస్తాం. ఇందుకు 9871010101 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోస్టర్లను అంటిస్తాం. ఆ తరువాత, అన్ని రాష్ట్రాల రాజధానులు, ఇతర ప్రధాన నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్మీట్లను నిర్వహిస్తారు. దేశ నిర్మాణంలో భాగంగా ఆప్‌లో చేరాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు’ అని గోపాల్ రాయ్ వివరించారు. రానున్న నెలల్లో అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున జరపాలనుకుంటున్నామన్నారు. తద్వారా, ఆయా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలను పొందాలనుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని, ఏయే రాష్ట్రాల్లో పోటీకి దిగాలనేది పార్టీ నాయకత్వం త్వరలో నిర్ణయిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ‘ఆప్’ను ప్రాంతీయ పార్టీగానే ఎన్నికల సంఘం గుర్తించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ, గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడంతో, జాతీయ స్థాయిలో సత్తా చూపాలన్న ఆ పార్టీ కోరిక నెరవేరలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అదీ పంజాబ్‌లోనే. ఢిల్లీలోని అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది. -
ఒకే దేశం.. ఒకే కార్డు
ఇంతకాలం దివ్యాంగులకు ఇస్తున్న గుర్తింపు కార్డులు జిల్లా వరకే పరిమితం కాగా సమస్యలు ఎదురవుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చిందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థాపర్చంద్ గెహ్లాట్ అన్నారు. ఈ మేరకు దేశమంతటా చెల్లుబాటయ్యేలా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నామని తెలిపారు. ఈ విధానంలోకి వచ్చేందుకు 24 రాష్ట్రాలు ముందుకొచ్చాయని.. ఇందులో తెలంగాణ కూడా ఉందని చెప్పారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాలు పంపిణీ చేసేందుకు మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలోఆయన మాట్లాడారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : దివ్యాంగుల గుర్తింపు కోసం ఇచ్చే గుర్తింపు కార్డు జిల్లా వరకే చెల్లుబాటు అయ్యేవని.. ఈ సమస్యను గుర్తించి దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపుకార్డు అమలుచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గెహ్లాట్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. దివ్యాంగులకు అందజేసే యూనవర్సల్ ఐడెంటిటీ కార్డు అమలుచేయడానికి దేశంలోని 24 రాష్ట్రాల్లో ముందుకు వచ్చాయని, అందులో తెలంగాణ కూడా ఉందన్నారు. ఈ కార్డు ద్వారా దేశంలో ఎక్కడైనా పథకాలను లబ్ధి పొందొచ్చని తెలిపారు. ఐదేళ్ల లోపు ఉన్న చెవిటి, మూగ చిన్నారులకు కాక్లర్ ఇంపాక్ట్ చికిత్స చేయిస్తే భవిష్యత్‌లో వారు మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారని. దీనిని దృష్టిలో ఉంచుకొని చిన్నారులకు కాక్లర్ ఇంపాక్ట్ కోసం రూ.6లక్షల సబ్సిడీని కేంద్రం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 12.50 లక్షల మంది చిన్నారులకు కాక్లర్ ఇంపాక్ట్ చేయించడం జరిగిందన్నారు. అలాగే ఈ నాలుగేళ్లలో దేశ వ్యాప్తంగా దివ్యాంగుల కోసం 7వేల క్యాంప్‌లు నిర్వహించి ఐదు గిన్నిస్‌బుక్ రికార్డులను నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.620 కోట్లతో 11లక్షల మంది దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు పంపిణీ చేసినట్లు వివరించారు. తన శాఖ పరిధిలోని పథకాల అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గెహ్లాట్ వెల్లడించారు. సబ్సిడీపై మోటార్ ట్రై సైకిల్ 80శాతం వైకల్యం ఉండి నిలబడలేని దివ్యాంగులకు మోటార్ ట్రై సైకిల్ అందజేస్తున్నట్లు కేంద్ర మంత్రి గెహ్లాట్ తెలిపారు. వీటికోసం ఎలాంటి లైసెన్స్ ఉండదని, కేవలం బ్యాటరీతో నడుస్తుందన్నారు. ఈ మోటార్ ట్రై సైకిల్ విలువ రూ.37వేలు ఉండగా.. రూ.25వేల సబ్సిడీ కేంద్రం అందజేస్తుందన్నారు. దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి దివ్యాంగులకు మోటార్ ట్రై సైకిల్ అందజేసేలా కృషి చేయాలని కోరారు. మోటార్ ట్రై సైకిల్ లబ్ధిదారులు చిరువ్యాపారాలు చేయడానికి రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి గెహ్లాట్, చిత్రంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు రాజధానికి దీటుగా పాలమూరు అభివృద్ధి : రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మహబూబ్‌నగర్ రూరల్ : హైదరాబాద్‌కు తీసిపోని విధంగా దీటుగా పాలమూరు జిల్లా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రూ.1860 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఎంపీ జితేందర్‌రెడ్డి అధ్యక్షతన జరగగా కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ రోడ్ల విస్తరణ, వెడల్పు, మరమ్మత్తు పనులకు రూ.230 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులకు ఉపరకరణాలు అందజేయడం ఓ బృహత్తర కార్యమని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు పింఛన్లు అందజేస్తుండడం సీఎం కేసీఆర్ మంచి మనస్సుకు నిదర్శనమని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 8 నుంచి 10 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే కాకుండా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. సీఎంకు ఎంతో ఇష్టమైన ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి : రొనాల్డ్‌రోస్, కలెక్టర్ జిల్లాలో దివ్యాంగు ల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. వెనకబడిన పాలమూరు జిల్లా లో దివ్యాంగులకు ఉపకరణాలు అందించే క్యాంపు జరగడం సంతోషించదగ్గ విషయమ ని అన్నారు. స్థానిక ఎంపీ జితేందర్‌రెడ్డి సహకారంతో ఇలాంటి క్యాంపులు మరిన్ని జరగా లని ఆశాభావం వ్యక్తం చేశారు. -
నేటి నుంచి వస్తు సేవల పన్ను అమలు
అనంతపురం : విలువ ఆధారిత పన్ను చట్టం, 2005 (వ్యాట్) స్థానంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం శనివారం నుంచి అమలులోకి రానుంది. వాణిజ్య పన్నుల శాఖ అనంతపురం డివిజన్ పరిధిలోని రిజిష్టర్ డీలర్లకు కొత్త చట్టంపై అవగాహన కల్పించేందుకు, వారి సందేహాలను నివృత్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు : డివిజన్, సర్కిల్ పరిధిలోని జీఎస్టీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో లేదా మెయిల్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. డివిజన్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ ఉప అధినేత టి.శేషాద్రి సెల్ : 9959552441ని సంప్రదించొచ్చు. అనంతపురం సర్కిల్–1 పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత పి.ఎర్రయ్య సెల్ : 80082 77270లో సంప్రదించాలి. అనంతపురం సర్కిల్–2 పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత ఎం. సుధాకర్ సెల్: 99499 92660 లో సంప్రదించాలి. గుంతకల్లు సర్కిల్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత జి.రాజేంద్రప్రసాద్ సెల్ : 99499 92924లో సంప్రదించాలి. తాడిపత్రి సర్కిల్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత ఎస్. సోనియాతార సెల్ : 98858 93710లో సంప్రదించాలి. హిందూపురం సర్కిల్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత డి.నాగేంద్రరెడ్డి సెల్ : 99499 92698లో సంప్రదించాలి. ధర్మవరం సర్కిల్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత జి.వెంకటేశ్వరరెడ్డి సెల్ : 99499 92627లో సంప్రదించాలి. -
దేశమంతటా ఒకే పన్ను విధానం
- జూలై 1 నుంచి అమలు – ‘సాక్షి’ ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన సదస్సు – సందేహాలను నివృత్తి చేసిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి ధర్మవరం : ప్రాంతానికో పన్ను, రాష్ట్రానికో పన్ను, దేశానికో పన్ను ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన ట్యాక్స్‌లు లేకుండా దేశమంతటా ఒక్కటే ట్యాక్స్ అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ(వస్తు సేవా పన్ను) చట్టాన్ని తెస్తోందని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. జీఎస్టీ జులై నుంచి అమలుకానుంది. కేంద్రం, రాష్ట్రాలు వసూలు చేసే పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీ ఒక్కటే ఉంటుంది. దీనిపై అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని ప్రణవ్ ఫంక్షన్ హాల్లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరెడ్డి, ఏసీటీఓలు అమర్నాథ్రెడ్డి, బేబినంద, ఆడిటర్ విజయభాస్కర్‌రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి మల్లికార్జున, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్ను ప్రసాద్, గోల్డ్షాపుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు స్టార్ ఖలీల్ పాల్గొన్నారు. సీటీఓ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి జీఎస్టీ పోర్టల్ ఓపెన్ అవుతుందని ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ధర్మవరం సీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వ్యాపారులు, చేనేత ప్రముఖులు అడిగిన పలు సందేహాలను సీటీఓ నివృత్తి చేశారు. ఆ వివరాలిలా.... ప్రశ్న: బంగారు కొనుగోలు చేసేందుకు పేదలు వస్తారు. వారు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండదు. మేము బంగారు అమ్మితే మాకు ట్యాక్స్ పడుతుంది. ఎలా వ్యాపారం చేయాలి? – గోల్డ్ ప్రసాద్, బంగారు వ్యాపారి, ధర్మవరం సీటీఓ: ప్రతి వస్తువు కొనుగోలు, అమ్మకాలపై జీఎస్టీ ఉంటుంది. వ్యాపారస్తులు, కస్టమర్లు అందరూ జీఎస్టీ పరిధిలోకి రావాలనే ప్రభుత్వం జీఎస్టీ చట్టం తెచ్చింది. ప్రశ్న: జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది. ఎక్కడికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి?– స్టార్ ఖలీల్, బంగారు దుకాణాల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు సీటీఓ: సంబంధిత డాక్యుమెంట్లు, బిల్లులతో సీటీఓ కార్యాలయానికి వస్తే ఉచితంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయిస్తాం. ప్రశ్న: గతంలో ఏదైనా మిషనరీ కొనుగోలు చేస్తే టిన్ నంబర్ అడిగేవారు. ప్రస్తుతం జీఎస్టీతోపాటు టిన్ నంబర్ కూడా అవసరమా? – మల్లికార్జున, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి సీటీఓ: వ్యాపారులు జీఎస్టీలోకి వచ్చిన తర్వాత టిన్ నంబర్ అవసరంలేదు. కేవలం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుంది. ప్రశ్న: రూ.20 లక్షలు దాటితేనే జీఎస్టీ పరిధిలోకి అంటున్నారు. అంతకన్నా తక్కువైతే జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరంలేదా? కొంత మెటీరియల్ డ్యామేజ్ అయింది. జీఎస్టీకి చూపాలా? – లక్ష్మీనారాయణ, పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్, అనంతపురం సీటీఓ: రూ.20 లక్షలు దాటితేనే జీఎస్టీ పరిధిలోకి వస్తారు. వ్యాపారంలో ప్రతి ఏడాది పెరగవచ్చు. తగ్గవచ్చు. అలాంటప్పుడు మీరు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ వ్యాపారానికి మంచిది. జీఎస్టీ పరిధిలో లేకపోతే మీతో వ్యాపారం చేసేందుకు మీ దుకాణానికి పెయింట్స్, హార్డ్‌వేర్ ఇచ్చేందుకు కంపెనీవారు సుముఖత చూపరు. జీఎస్టీ పరిధిలో ఉంటేనే సరుకు ఇస్తారు. ఈ నెల 30వ తేదీకి మీ వద్దవున్న స్టాకు వివరాలన్నీ జీఎస్టీలోకి అప్లోడ్ చేయాల్సిందే. ప్రశ్న: చేనేత మగ్గాలకు ముడిసరుకులు కొన్నప్పుడు జీఎస్టీ వేస్తారు. కొన్నవారు కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తారా? రిజిస్ట్రేషన్ లేనివారి వద్ద కొంటే జీఎస్టీ ఎలా అమలవుతుంది? – గిర్రాజు రవి, చేనేత వ్యాపారుల సంఘం నాయకులు సీటీఓ: చేనేత చీరలకు 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ముడిసరుకులు కొన్నప్పుడు జీఎస్టీ వేస్తారు. కొన్నవారు కూడా చీర తయారైనప్పుడు అమ్మే సమయంలో జీఎస్టీ వర్తిస్తుంది. చేనేత కార్మికులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి రిజిస్ట్రేషన్ లేనివారి వద్దకొంటే చీరలను కొనుగోలు చేసిన వ్యాపారి జీఎస్టీ ట్యాక్స్ కట్టాలి. ప్రశ్న: వంద మగ్గాలుండే వ్యక్తి కూడా జీఎస్టీ పరిధిలో లేకుండా స్థానికంగానే పట్టుచీరలను శిల్క్హౌస్లకు వేసి విక్రయిస్తారు. అప్పుడు ట్యాక్స్ ఎలా ఎవరు చెల్లిస్తారు?– బీరే ఎర్రిస్వామి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్, ధర్మవరం సీటీఓ: చేనేతకు 5 శాతం జీఎస్టీ ట్యాక్స్ ఉంది. వంద మగ్గాలుండే వ్యక్తి వద్ద జీఎస్టీ లేకుండా వ్యాపారి చీరలు కొంటే రివర్స్ ట్యాక్స్ మేనేజ్మెంట్ కింద అమ్మిన వ్యక్తి ట్యాక్స్‌తోపాటు వ్యాపారి ట్యాక్స్ రెండూ కట్టాల్సి ఉంటుంది. ప్రశ్న: ఒక్కో సంవత్సరం వ్యాపారం తగ్గవచ్చు. రూ.20 లక్షలకు తక్కువగా ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టాలంటే వ్యాపారి నష్టపోతాడు. ఎలా? – చందమూరు నారాయణరెడ్డి కౌన్సిలర్ సీటీఓ: ఒక ఏడాది రూ.20 లక్షలకుపైగా వ్యాపారం జరిగితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యాపారికి మరో ఏడాది అంతకన్నా ఎక్కువ వ్యాపారం జరిగితే ఆ సమయంలో ఎంత టర్నోవర్ చేస్తారో వాటికి మాత్రమే ట్యాక్స్ పడుతుంది. -
స్తంభించిన రవాణా
- లారీల నిరవధిక బంద్ - నిలిచిపోయిన వేలాది వాహనాలు - రేపటి నుంచి ఉద్యమం తీవ్రతరం - కార్యాచరణ సిద్ధం చేసిన లారీ యజమానుల అసోసియేషన్ అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. సరుకు రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దక్షిణాది రాష్ట్రాల ట్రాన్స్‌పోర్టు, లారీ ఓనర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో లారీల యజమానులు నిరవధిక బంద్ చేపట్టారు. దీనివల్ల గురువారం ఒక్క లారీ కూడా రోడ్డెక్కలేదు. ఇది సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలో రైతులు పండించిన కూరగాయలు, ధాన్యాలు, ఇతర వ్యవసాయోత్పత్తులను ముఖ్య నగరాలు, పట్టణాలకు లారీల్లోనే తరలిస్తుంటారు. సమ్మెలో భాగంగా అనంతపురం, హిందూపురంతో పాటు జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాల్లో దాదాపు 10 వేల లారీలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలు మాత్రమే అరకొరగా రోడ్డుపై కన్పిస్తున్నాయి. ఇవి కూడా గమ్యస్థానాలకు చేరుకునేందుకు శుక్రవారం సాయంత్రం వరకు మాత్రమే గడువిచ్చారు. శనివారం నుంచి జిల్లాలో ఎగుమతి, దిగుమతితో పాటు ప్రయాణించడాన్ని కూడా నిషేధిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో సరుకు రవాణాపై భారీ దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా..లారీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన డిమాండ్లు ఇవీ.. పెంచిన థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను నిలుపుదల చేయాలి. పెంచిన చలానా ఫీజులు సవరించాలి. జరిమానాలను రద్దు చేయాలి. పెట్టుబడి వసూలైన రోడ్లపై టోల్‌ఫీజు రద్దు చేయాలి. 15 ఏళ్లు దాటిన వాహనాలు గుజిరీకి వేయాలన్న ఆలోచన విరమించుకోవాలి. రవాణా వాహనాలకు స్పీడు గవర్నరు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించాలి. డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలి. ఆంధ్ర, తెలంగాణాలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలి. రేపటి నుంచి ఉద్యమం తీవ్రతరం - ఈశ్వరరావు, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ లారీల బంద్ చేపట్టాం. శనివారం నుంచి ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించారు. రోడ్లపై తిరుగుతున్న ఇతర రాష్ట్రాల లారీలు నేటిలోపు గమ్యస్థానాలకు చేరుకోవాలి. శనివారం నుంచి జిల్లాలో లోడింగ్, అన్లోడింగ్ కూడా చేపట్టం. భారం తగ్గించాలి - శ్రీనివాసులు, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల లారీ ఓనర్లపై తీవ్ర భారం పడుతోంది. రిజిస్ట్రేషన్, ఇతర పన్నుల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. -
అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే సిలబస్ మేలు
♦ ఇంటర్ విద్యపై కోర్ కామన్ ♦ కరిక్యులమ్ క మిటీ అంగీకారం ♦ వివిధ విద్యాబోర్డుల ప్రతినిధుల భేటీ సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ (ప్లస్‌టూ) విద్యావ్యవస్థకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన సిలబస్ ఉండటమే మేలని కోర్ కామన్ కరిక్యులమ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏర్పాటు చేసిన కమిటీ శనివారం హైదరాబాద్‌లోని ఇంటర్మీడియెట్ బోర్డులో సమావేశమైంది. తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యాబోర్డుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యావిధానంలో ప్రస్తుతం వస్తున్న ఆధునిక పోకడలపై చర్చించిన కమిటీ సభ్యులు, ముఖ్యమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేశారు. వివిధ రాష్ట్రాల్లో పలు రకాల సిలబస్‌లు అమల్లో ఉన్నందున కొన్ని రాష్ట్రాల విద్యార్థులు.. అఖిల భారత స్థాయిలో నిర్వహించే ఐఐటీ, జేఈఈ, ఏఐఈఈఈ.. తదితర ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించలేకపోతున్నారని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇంటర్ సిలబస్‌లో 70 శాతం ఏకీకృత సిలబస్ ఉండాలని, ఆయా రాష్ట్రాల్లో అవసరాలు, పరిస్థితుల ఆధారంగా 30 శాతం సిలబస్‌ను మార్చుకునే వెసులుబాటు ఉండాలని చెప్పింది. సైన్స్ సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్‌బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ రూపొందించిన నివేదిక కాపీలను కమిటీ సభ్యులకు అందజేశారు. నివేదికలోని అంశాలపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నివేదికను కేంద్రం ఆమోదం కోసం పంపాలని సూచించింది. సమావేశంలో జమ్ము కశ్మీర్ పాఠశాల విద్యామండలి చైర్మన్ జహూర్ అహ్మద్, మహారాష్ట్ర మాధ్యమిక, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కృష్ణకుమార్ పాటిల్, నాగాలాండ్ పాఠశాల విద్యామండలి చైర్మన్ అసనో సెకోజ్, ఐసీఎస్ఈ పరిశోధక విభాగం డిప్యూటీ హెడ్ షిల్పిగుప్త, ఎన్సీఈఆర్టీ లోని ఆర్‌ఎంఎస్‌ఏ విభాగాధిపతి రంజన్ అరోరా, సీబీఎస్ఈ అదనపు డెరైక్టర్ సుగంధ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
నేడు జాతీయ రవాణా సమ్మె
- రోడ్డు రవాణా భద్రత బిల్లుకు వ్యతిరేకంగా బంద్ - ఆర్టీసీ, ఆటో సంఘాల మద్దతు - బస్సులు యథాతథం.. హైదరాబాద్: జాతీయ రోడ్డు భద్రత బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త రవాణా సమ్మె నేపథ్యంలో గురువారం రవాణా వ్యవస్థ స్తంభించనుంది. ముఖ్యంగా సరుకు రవాణా వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోనున్నాయి. ఆర్టీసీకి చెందిన ఎన్ఎంయూ మినహా అన్ని యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చాయి. కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని యూనియన్లు పిలుపునిచ్చాయి. వేతన సవరణ చేయకపోవటాన్ని నిరసిస్తూ ఆరో తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. జాతీయ సమ్మెకు సంఘీభావం మాత్రమే తెలపనున్నారు. దీంతో బస్సులు యథావిధిగా తిరిగే అవకాశముంది. బస్సు డిపోల ముందు భోజన విరామ సమయంలో మాత్రమే కార్మికులు నిరసన వ్యక్తం చేస్తారని సమాచారం. ఆటోకార్మిక సంఘాలు సమ్మెకు పూర్తి మద్దతు తెలపడంతో పాటు ఆటోలను రోడ్లపైకి తీసుకురావద్దని డ్రైవర్లను కోరడంతో ఆటోల సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఫలితంగా ఆటోలు పాక్షికంగానే తిరిగే అవకాశముంది. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ పాటించాలన్న కార్మిక సంఘాల విజ్ఞప్తి పట్ల లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాల సంఘాలు సానుకూలంగా స్పందించాయి. దీంతో పాలు, మందులు లాంటి అత్యవసర సేవలందించే వాహనాలు మినహా మిగిలిన వాహనాలు నిలిచిపోనున్నాయి. పదిహేనేళ్ల జీవితకాలం పూర్తయిన వాహనాలు వాడొద్దంటూ నియంత్రణలను వ్యతిరేకిస్తున్న సరుకు రవాణా వాహన సంఘాల కోరిక మేరకు ఢిల్లీకి తెలంగాణ నుంచి సరుకు రవాణా వాహనాలు పంపించకూడదని ఇక్కడి సంఘాలు నిర్ణయించుకున్నాయి. హైదరాబాద్‌లో ఆటోలు బంద్ రోడ్డు రవాణా భద్రత బిల్లుకు వ్యతిరేకంగా నగరంలోని ఆటో కార్మిక సంఘాలు బంద్ పాటించనున్నాయి. గురువారం నగర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో గ్రేటర్ పరిధిలోని 1.30 లక్షల ఆటోల రాకపోకలు నిలిచిపోనున్నాయి. అలాగే అన్ని కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని సుమారు లక్ష సరుకు రవాణా వాహనాలు, లారీలు స్తంభించిపోనున్నాయి. బంద్‌లో భాగంగా ఆర్టీసీ డిపోల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు బంద్‌లో పాల్గొనడం లేదని ప్రైవేటు ఆపరేటర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీంతో ప్రైవేటు బస్సులు యథావిధిగా నడవనున్నాయి.