- రోడ్డు రవాణా భద్రత బిల్లుకు వ్యతిరేకంగా బంద్
- ఆర్టీసీ, ఆటో సంఘాల మద్దతు
- బస్సులు యథాతథం..
హైదరాబాద్: జాతీయ రోడ్డు భద్రత బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త రవాణా సమ్మె నేపథ్యంలో గురువారం రవాణా వ్యవస్థ స్తంభించనుంది. ముఖ్యంగా సరుకు రవాణా వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోనున్నాయి. ఆర్టీసీకి చెందిన ఎన్‌ఎంయూ మినహా అన్ని యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చాయి. కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని యూనియన్లు పిలుపునిచ్చాయి. వేతన సవరణ చేయకపోవటాన్ని నిరసిస్తూ ఆరో తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. జాతీయ సమ్మెకు సంఘీభావం మాత్రమే తెలపనున్నారు. దీంతో బస్సులు యథావిధిగా తిరిగే అవకాశముంది. బస్సు డిపోల ముందు భోజన విరామ సమయంలో మాత్రమే కార్మికులు నిరసన వ్యక్తం చేస్తారని సమాచారం. ఆటోకార్మిక సంఘాలు సమ్మెకు పూర్తి మద్దతు తెలపడంతో పాటు ఆటోలను రోడ్లపైకి తీసుకురావద్దని డ్రైవర్లను కోరడంతో ఆటోల సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఫలితంగా ఆటోలు పాక్షికంగానే తిరిగే అవకాశముంది.
గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ పాటించాలన్న కార్మిక సంఘాల విజ్ఞప్తి పట్ల లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాల సంఘాలు సానుకూలంగా స్పందించాయి. దీంతో పాలు, మందులు లాంటి అత్యవసర సేవలందించే వాహనాలు మినహా మిగిలిన వాహనాలు నిలిచిపోనున్నాయి. పదిహేనేళ్ల జీవితకాలం పూర్తయిన వాహనాలు వాడొద్దంటూ నియంత్రణలను వ్యతిరేకిస్తున్న సరుకు రవాణా వాహన సంఘాల కోరిక మేరకు ఢిల్లీకి తెలంగాణ నుంచి సరుకు రవాణా వాహనాలు పంపించకూడదని ఇక్కడి సంఘాలు నిర్ణయించుకున్నాయి.
హైదరాబాద్‌లో ఆటోలు బంద్
రోడ్డు రవాణా భద్రత బిల్లుకు వ్యతిరేకంగా నగరంలోని ఆటో కార్మిక సంఘాలు బంద్ పాటించనున్నాయి. గురువారం నగర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో గ్రేటర్ పరిధిలోని 1.30 లక్షల ఆటోల రాకపోకలు నిలిచిపోనున్నాయి. అలాగే అన్ని కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని సుమారు లక్ష సరుకు రవాణా వాహనాలు, లారీలు స్తంభించిపోనున్నాయి. బంద్‌లో భాగంగా ఆర్టీసీ డిపోల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు బంద్‌లో పాల్గొనడం లేదని ప్రైవేటు ఆపరేటర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీంతో ప్రైవేటు బస్సులు యథావిధిగా నడవనున్నాయి.
నేడు జాతీయ రవాణా సమ్మె
Published Thu, Apr 30 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement
Advertisement