భర్త, కుమార్తెతో జెలజ , లాంగ్ ట్రిప్‌లో అత్తగారితో...
భిన్న జీవనం జెలజ కుటుంబం ఇంట్లో కంటే రోడ్డు మీదే ఎక్కువగా ఉంటుంది. జెలజ ట్రక్ డ్రైవర్. భర్తకు ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం ఉంది. తొలత గృహిణిగా ఉన్న జెలజ మెల్లగా డ్రైవింగ్ నేర్చుకుంది. లోడు దించేందుకు కుటుంబంతో బయలుదేరి కొత్త ప్రాంతాల వీడియో చేస్తుంది. ఆమె కేరళ నుంచి కశ్మీర్ వరకూ ట్రక్ తోలింది. కూతురు తల్లితోపాటు డ్రైవింగ్ నేర్చుకుంది. ‘పుతట్టు ట్రావెల్ వ్లోగ్’ పేరుతో ఈ కుటుంబ యానం లక్షల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించింది.
ఉదాహరణకు జెలజ జీవితం ఇలా ఉంటుంది. ఆమె కేరళలోని కొట్టాయం నుంచి ప్లైవుడ్ లోడ్ తీసుకుని పూణెలో డెలివరీ చేస్తుంది. కాని ఖాళీ ట్రక్కు వెనక్కు తెస్తే నష్టం. ‘ఉల్లిపాయల లోడు కశ్మీర్‌లో దింపుతారా’ అని పూణెలో అడుగుతారు. ‘దింపుతాను’ అని బయలుదేరుతుంది. కశ్మీర్ చేరుకుంటుంది. అక్కడ లోడ్ దొరకదు ఒక్కోసారి. ఢిల్లీ, హర్యాణ దాకా వచ్చే లోడ్ దొరుకుతుంది. ఏదో ఒక సరుకు కేరళకు దింపే బుకింగ్ వస్తుంది. ఆ లోడు తీసుకుని కేరళ చేరుకుంటుంది.
‘కేరళలో ప్రతి సంవత్సరం జారీ అవుతున్న డ్రైవింగ్ లైసెన్స్‌లలో 40 శాతం స్త్రీలవి. టూ వీలర్లు కార్లు సరే... బస్సులు కూడా కేరళలో నడుపుతున్నారు స్త్రీలు. కాని ట్రక్కు నడిపే స్త్రీలు చాలా అరుదు. అందుకే జెలజ ను చూసి అందరూ గౌరవిస్తారు’ అంటాడు రతీష్. అతడు జెలజ భర్త. ఆమె లాంగ్ డ్రైవ్‌కి బయలుదేరితే చాలాసార్లు తోడు ఉంటాడు. ఒక్కోసారి పెద్దకూతురు, భార్య డ్రైవ్ చేస్తుంటే వారికి తోడు వస్తాడు. అతను స్వయంగా డ్రైవరు. కాని తన కుటుంబ స్త్రీలు హైవేలను జయిస్తూ ఉంటే సంతోషపడతాడు.
గృహిణి నుంచి డ్రైవర్‌గా
రతీష్ 2003 వరకూ ఒక సాధారణ ట్రక్ డ్రైవర్. ఆ సంవత్సరం ఆరు లక్షలు లోన్ తీసుకుని ఒక భారత్ బెంజ్ ట్రక్ కొన్నాడు. కలిసొచ్చింది. తన సోదరుడితో కలిసి ఇప్పుడు 27
నేషనల్ పర్మిట్ ట్రక్కులతో ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. తరచూ లాంగ్ డ్రైవ్‌కి వెళ్లే రతీష్‌ని జెలజ ‘నేనూ నీతో రానా కొత్తప్రాంతాలు చూడాలని ఉంది’ అనడిగింది. ‘రావచ్చు. కాని నువ్వు ట్రక్కు నడపడం నేర్చుకుంటే’ అన్నాడు రతీష్. అప్పటికి జెలజ కేవలం గృహిణి. టూ వీలర్ నడపడం కూడా రాదు. ఆమె మొదట టూ వీలర్.. ఆ తర్వాత కారు నడిపి ట్రక్ డ్రైవింగ్ నేర్చుకుంది. భర్తను తోడు తీసుకుని స్వయంగా ట్రక్ నడుపుతూ లోడ్ డెలివరీ చేయడం ్ప్రారంభించింది.
వీడియోలు చేస్తూ
‘మాది ఉమ్మడి కుటుంబం. నా మరిది, తోటికోడలు, అత్తగారు.. అందరం కలిసి ఉంటాం. అందుకే నా ఇద్దరు పిల్లలను వదిలి ట్రక్ తీసుకుని బయలుదేరుతాను’ అంటుంది జెలజ. ఆమె పెద్ద కూతురు కూడా ట్రక్ డ్రైవింగ్ నేర్చుకుంది. లోడ్‌లు దింపే పనిలో భాగంగా పర్యటనలు కూడా ఈ కుటుంబం ట్రక్కు ద్వారా ముగిస్తారు. ‘మేఘాలయా, కోల్‌కటా, పోర్‌బందర్... ఇలా ఎన్నో కొత్తప్రాంతాలు చూశాను’ అంటుంది జెలజ.. ఎక్కడకు వెళ్లినా అక్కడి విశేషాలు వీడియోలు చేస్తూ అక్కడి సంస్కృతి, అలవాట్లు తెలియచేస్తూ ఉంటుంది. రోడ్డు పక్కన ట్రక్కు ఆపి వంట చేసుకుని తోటి డ్రైవర్‌లతో కలిసి తినడం ఆ వీడియోలు కనపడుతుంది. ఒకసారి అత్తగారిని తీసుకుని ఆమె ట్రక్కులోనే లాంగ్ జర్నీ చేసింది. కేరళ నుంచి కశ్మీర్ వరకూ ట్రక్ నడిపి వార్తల్లోకి ఎక్కింది జెలజ .
‘వాష్‌రూమ్‌లు ఒక్కటే ఇబ్బంది. పెట్రోల్ బంకుల్లో ఉన్నవాటిని ఉపయోగిస్తాను. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో పోలీసులు పీక్కు తింటారు మామూళ్ల కోసం. మిగిలిన రాష్ట్రాలు పర్లేదు. ఇక దొంగల భయం ఉంటుంది. కాని హైవేల మీద తిరగ్గా తిరగ్గా ఆ భయం పోయింది’ అంటుంది జెలజ.
Comments
Please login to add a commentAdd a comment