స్తంభించిన రవాణా
- లారీల నిరవధిక బంద్
- నిలిచిపోయిన వేలాది వాహనాలు
- రేపటి నుంచి ఉద్యమం తీవ్రతరం
- కార్యాచరణ సిద్ధం చేసిన లారీ యజమానుల అసోసియేషన్
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. సరుకు రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దక్షిణాది రాష్ట్రాల ట్రాన్స్‌పోర్టు, లారీ ఓనర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో లారీల యజమానులు నిరవధిక బంద్ చేపట్టారు. దీనివల్ల గురువారం ఒక్క లారీ కూడా రోడ్డెక్కలేదు. ఇది సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలో రైతులు పండించిన కూరగాయలు, ధాన్యాలు, ఇతర వ్యవసాయోత్పత్తులను ముఖ్య నగరాలు, పట్టణాలకు లారీల్లోనే తరలిస్తుంటారు. సమ్మెలో భాగంగా అనంతపురం, హిందూపురంతో పాటు జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాల్లో దాదాపు 10 వేల లారీలు నిలిచిపోయాయి.
ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలు మాత్రమే అరకొరగా రోడ్డుపై కన్పిస్తున్నాయి. ఇవి కూడా గమ్యస్థానాలకు చేరుకునేందుకు శుక్రవారం సాయంత్రం వరకు మాత్రమే గడువిచ్చారు. శనివారం నుంచి జిల్లాలో ఎగుమతి, దిగుమతితో పాటు ప్రయాణించడాన్ని కూడా నిషేధిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో సరుకు రవాణాపై భారీ దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా..లారీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రధాన డిమాండ్లు ఇవీ..
పెంచిన థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను నిలుపుదల చేయాలి. పెంచిన చలానా ఫీజులు సవరించాలి. జరిమానాలను రద్దు చేయాలి. పెట్టుబడి వసూలైన రోడ్లపై టోల్‌ఫీజు రద్దు చేయాలి. 15 ఏళ్లు దాటిన వాహనాలు గుజిరీకి వేయాలన్న ఆలోచన విరమించుకోవాలి. రవాణా వాహనాలకు స్పీడు గవర్నరు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించాలి. డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలి. ఆంధ్ర, తెలంగాణాలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్‌లు జారీ చేయాలి.
రేపటి నుంచి ఉద్యమం తీవ్రతరం - ఈశ్వరరావు, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ లారీల బంద్ చేపట్టాం. శనివారం నుంచి ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించారు. రోడ్లపై తిరుగుతున్న ఇతర రాష్ట్రాల లారీలు నేటిలోపు గమ్యస్థానాలకు చేరుకోవాలి. శనివారం నుంచి జిల్లాలో లోడింగ్, అన్‌లోడింగ్ కూడా చేపట్టం.
భారం తగ్గించాలి - శ్రీనివాసులు, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల లారీ ఓనర్లపై తీవ్ర భారం పడుతోంది. రిజిస్ట్రేషన్, ఇతర పన్నుల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.