premium hike
-
చుక్కలు చూపిస్తున్న ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు.. పాలసీదారులను పట్టించుకోవడం లేదా
న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీలపై ప్రీమియం పెరగడం వినియోగదారులకు ఆందోళనకు గురి చేస్తున్నట్టు హన్సా రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ప్రీమియం అందుబాటు ధరలో ఉండడం కీలకమని పాలసీదారులు భావిస్తున్నారు. జీవిత బీమా పాలసీల కొనుగోలు నిర్ణయాలు, ప్రవర్తనపరమైన పక్షపాతం, ఆర్థిక అవరోధాలు, ప్రీమియం ధరల అందుబాటు, కొనుగోలుపై దాని ప్రభావం తదితర అంశాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా 3,300 జీవిత బీమా పాలసీదారులు ఇందులో పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. పాలసీదారులుగా వారి అభిప్రాయాలను సర్వేలో ప్రశ్నల రూపంలో తెలుసుకున్నారు. బీమా కంపెనీని సంప్రదించినప్పుడు స్పందన సరిగ్గా లేకపోవడం వాటిని వీడడానికి ప్రధాన కారణమని 22 శాతం మంది పాలసీదారులు చెపన్పారు. తాము పాలసీ కొనుగోలు చేసిన తర్వాత బ్యాంక్ ఆర్ఎం లేదా ఏజెంట్ తమను కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా కలవాలని ప్రతీ 10 మందిలో 8 మంది పాలసీదారులు కోరుకుంటున్నారు. డిజిటల్ వేదికల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు పాలసీదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలుకు ముందు వెబ్సైట్లను సందర్శించం చేస్తున్నారు. బ్రాండ్‌కు ఉన్న పేరు, డిజిటల్ సేవలు, కస్టమర్ సేవలు కూడా ఆన్లైన్లో పాలసీలు కొనుగోలు చేసే వారు పరిగణనలోకి తీసుకునే కీలక అంశాలని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. -
జీవన్ జ్యోతి, సురక్షా బీమా ప్రీమియం: కేంద్రం షాక్
న్యూఢిల్లీ: తక్కువ ప్రీమియానికే పేదలను, సామాన్యులను సైతం బీమా కవరేజీ పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో.. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) ప్రీమియంలు పెరిగాయి. ఆర్థికంగా ఈ ఉత్పత్తులు మనుగడ సాగించేందుకు వీలుగా ప్రీమియం పెంచినట్టు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. పీఎం జేజేబీవై ప్రీమియంను ఒక రోజుకు 1.25కు పెంచారు. అంటే వార్షికంగా ప్రస్తుతమున్న రూ.330 ప్రీమియం రూ.436 అయింది. అంటే 32 శాతం పెరిగినట్టు. ఇక పీఎం ఎస్బీవై వార్షిక ప్రీమియం రూ.12 నుంచి రూ.20కు పెరిగింది. ఇది 67 శాతం పెరిగింది. నూతన ప్రీమియం రేట్లు ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అధిక క్లెయిమ్‌లు.. ఈ పథకాలకు సంబంధించి దీర్ఘకాలంలో నమోదైన క్లెయిమ్‌ల ఆధారంగా ప్రీమియం రేట్ల సవరణ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పీఎం ఎస్బీవై అన్నది ప్రమాదంలో మరణించినా లేక పూర్తి వైకల్యం పాలైనా రూ.2 లక్షల పరిహారాన్ని చెల్లిస్తుంది. పాక్షిక వైకల్యం పాలైతే రూ.లక్ష పరిహారాన్ని చెల్లిస్తారు. పీఎం జేజేబీవై కింద పాలసీదారు ఏ కారణంతో మరణించినా రూ.2లక్షల పరిహారం లభిస్తుంది. పీఎం ఎస్బీవై ప్లాన్ ఆరంభం నుంచి 2022 మార్చి 31 వరకు రూ.1,134 కోట్ల ప్రీమియం వసూలైంది. కానీ, పాలసీ దారులకు పరిహారంగా బీమా సంస్థలు చెల్లించిన మొత్తం రూ.2,513 కోట్లుగా ఉంది. వచ్చిన ఆదాయంతో పోలిస్తే రెట్టింపు మొత్తం అవి చెల్లించాయి. ఇక పీఎం జేజేబీవై కింద 2022 మార్చి నాటికి రూ.9,737 కోట్ల ఆదాయం వసూలు కాగా, చెల్లించిన మొత్తం రూ.14,144 కోట్లుగా ఉంది. -
థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పైపైకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పెరగనుంది. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సవరించిన ధరల ప్రకారం.. 1,000 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ప్రైవేట్ కార్లకు ప్రీమియం రూ.2,094గా నిర్ణయించారు. 2019–20లో ఇది రూ.2,072 వసూలు చేశారు. 1,500 సీసీ వరకు రూ.3,416 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.3,221 వసూలు చేశారు. 1,500 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉన్న కార్లకు ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890కు వచ్చి చేరింది. 150–350 సీసీ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలకు రూ.1,366, అలాగే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే రూ.2,804 ఉంది. ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు 30 కిలోవాట్ అవర్ లోపు రూ.1,780, అలాగే 30–65 కిలోవాట్ అవర్ సామర్థ్యం ఉంటే రూ.2,904 చెల్లించాలి. ప్రీమియంలో 15 శాతం డిస్కౌంట్ ఉంటుంది. 12–30 వేల కిలోలు మోయగల సామర్థ్యం ఉన్న సరుకు రవాణా వాణిజ్య వాహనాలకు ప్రీమియం రూ.33,414 నుంచి రూ.35,313కి చేరింది. 40 వేలకుపైగా కిలోల సామర్థ్యం గల వాహనాలకు రూ.41,561 నుంచి రూ.44,242కు సవరించారు. సాధారణంగా థర్డ్ పార్టీ రేట్లను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ప్రకటించేది. ఐఆర్‌డీఏఐతో సంప్రదింపుల అనంతరం తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ ధరలను నోటిఫై చేసింది. -
కాలుష్య నగరాల ప్రజలకు మరో సెగ
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రమైన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న పలు నగరాల ప్రజలకు మరో షాక్ తగిలింది. కాలుష్య కాసారంలో మగ్గుతున్న వివిధ నగరాలవాసులు ఆరోగ్య బీమా పొందాలంటే ఇక మీద ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిందే. ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర శ్వాసకోశ వ్యాధులు తీవ్రం కానున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం 5 శాతం అదనంగా చెల్లించాలని బీమా కంపెనీలు చెప్పబోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లోని క్లెయిమ్‌ల డేటా భారీ పెరగడంతో ఇన్సూరెన్స్ కంపెనీలో ఈ వైపుగా ఆలోచిస్తున్నాయి. అంతేకాదు కొత్తగా పాలసీ తీసుకునే వారిని మరిన్ని ఆరోగ్య పరీక్షలను కూడా అడగవచ్చని భావిస్తున్నారు. జోన్ ఆధారిత ధరలను నిర్ణయించడం బావుంటుందని మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ సీఎండీ ఆశిష్ మెహ్రోత్రా అభిప్రాయపడగా, నివాస ప్రాంతాల ఆధారంగా పాలసీని లోడ్ చేయడం సంక్లిష్టంగా ఉంటుందని మరో ఆరోగ్య బీమా సంస్థ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతోపాటు ఢిల్లీ, దాని చుట్లుపక్కల ప్రాంతాల ఆరోగ్య బీమా పాలసీల్లో అధిక స్థాయిలో మోసపూరిత క్లెయిమ్‌లు ఎక్కువగా ఉండటంతో, ధరలను నిర్ణయించడంలో ఇది కూడా కీలకమని బీమా అధికారులు తెలిపారు. కాగా దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో మరోసారి కాలుష్య పొట దట్టంగా ఆవిరించింది. బుధవారం దట్టమైన కాలుష్య పొర నగరాన్ని కమ్మేసింది. కాలుష్య స్థాయిలు ప్రమాద స్థాయికి చేరడంతో నగర మున్సిపాలిటీ విభాగం (ఎన్ఎండీసీ) చెట్లపై నీళ్లను చల్లడం లాంటి ఉపశమన చర్యలను చేపట్టింది. Delhi: New Delhi Municipal Council (NDMC) sprinkles water in the area around Feroz Shah Road to settle the dust, as a pollution control measure. pic.twitter.com/1njTooN6X0 — ANI (@ANI) November 13, 2019 -
స్తంభించిన రవాణా
- లారీల నిరవధిక బంద్ - నిలిచిపోయిన వేలాది వాహనాలు - రేపటి నుంచి ఉద్యమం తీవ్రతరం - కార్యాచరణ సిద్ధం చేసిన లారీ యజమానుల అసోసియేషన్ అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. సరుకు రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దక్షిణాది రాష్ట్రాల ట్రాన్స్‌పోర్టు, లారీ ఓనర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో లారీల యజమానులు నిరవధిక బంద్ చేపట్టారు. దీనివల్ల గురువారం ఒక్క లారీ కూడా రోడ్డెక్కలేదు. ఇది సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలో రైతులు పండించిన కూరగాయలు, ధాన్యాలు, ఇతర వ్యవసాయోత్పత్తులను ముఖ్య నగరాలు, పట్టణాలకు లారీల్లోనే తరలిస్తుంటారు. సమ్మెలో భాగంగా అనంతపురం, హిందూపురంతో పాటు జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాల్లో దాదాపు 10 వేల లారీలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలు మాత్రమే అరకొరగా రోడ్డుపై కన్పిస్తున్నాయి. ఇవి కూడా గమ్యస్థానాలకు చేరుకునేందుకు శుక్రవారం సాయంత్రం వరకు మాత్రమే గడువిచ్చారు. శనివారం నుంచి జిల్లాలో ఎగుమతి, దిగుమతితో పాటు ప్రయాణించడాన్ని కూడా నిషేధిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో సరుకు రవాణాపై భారీ దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా..లారీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన డిమాండ్లు ఇవీ.. పెంచిన థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను నిలుపుదల చేయాలి. పెంచిన చలానా ఫీజులు సవరించాలి. జరిమానాలను రద్దు చేయాలి. పెట్టుబడి వసూలైన రోడ్లపై టోల్‌ఫీజు రద్దు చేయాలి. 15 ఏళ్లు దాటిన వాహనాలు గుజిరీకి వేయాలన్న ఆలోచన విరమించుకోవాలి. రవాణా వాహనాలకు స్పీడు గవర్నరు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించాలి. డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలి. ఆంధ్ర, తెలంగాణాలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలి. రేపటి నుంచి ఉద్యమం తీవ్రతరం - ఈశ్వరరావు, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ లారీల బంద్ చేపట్టాం. శనివారం నుంచి ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించారు. రోడ్లపై తిరుగుతున్న ఇతర రాష్ట్రాల లారీలు నేటిలోపు గమ్యస్థానాలకు చేరుకోవాలి. శనివారం నుంచి జిల్లాలో లోడింగ్, అన్లోడింగ్ కూడా చేపట్టం. భారం తగ్గించాలి - శ్రీనివాసులు, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల లారీ ఓనర్లపై తీవ్ర భారం పడుతోంది. రిజిస్ట్రేషన్, ఇతర పన్నుల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.