న్యూఢిల్లీ: తక్కువ ప్రీమియానికే పేదలను, సామాన్యులను సైతం బీమా కవరేజీ పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో.. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై) ప్రీమియంలు పెరిగాయి. ఆర్థికంగా ఈ ఉత్పత్తులు మనుగడ సాగించేందుకు వీలుగా ప్రీమియం పెంచినట్టు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
పీఎం జేజేబీవై ప్రీమియంను ఒక రోజుకు 1.25కు పెంచారు. అంటే వార్షికంగా ప్రస్తుతమున్న రూ.330 ప్రీమియం రూ.436 అయింది. అంటే 32 శాతం పెరిగినట్టు. ఇక పీఎం ఎస్‌బీవై వార్షిక ప్రీమియం రూ.12 నుంచి రూ.20కు పెరిగింది. ఇది 67 శాతం పెరిగింది. నూతన ప్రీమియం రేట్లు ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
అధిక క్లెయిమ్‌లు..
ఈ పథకాలకు సంబంధించి దీర్ఘకాలంలో నమోదైన క్లెయిమ్‌ల ఆధారంగా ప్రీమియం రేట్ల సవరణ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పీఎం ఎస్‌బీవై అన్నది ప్రమాదంలో మరణించినా లేక పూర్తి వైకల్యం పాలైనా రూ.2 లక్షల పరిహారాన్ని చెల్లిస్తుంది. పాక్షిక వైకల్యం పాలైతే రూ.లక్ష పరిహారాన్ని చెల్లిస్తారు. పీఎం జేజేబీవై కింద పాలసీదారు ఏ కారణంతో మరణించినా రూ.2లక్షల పరిహారం లభిస్తుంది.
పీఎం ఎస్‌బీవై ప్లాన్ ఆరంభం నుంచి 2022 మార్చి 31 వరకు రూ.1,134 కోట్ల ప్రీమియం వసూలైంది. కానీ, పాలసీ దారులకు పరిహారంగా బీమా సంస్థలు చెల్లించిన మొత్తం రూ.2,513 కోట్లుగా ఉంది. వచ్చిన ఆదాయంతో పోలిస్తే రెట్టింపు మొత్తం అవి చెల్లించాయి. ఇక పీఎం జేజేబీవై కింద 2022 మార్చి నాటికి రూ.9,737 కోట్ల ఆదాయం వసూలు కాగా, చెల్లించిన మొత్తం రూ.14,144 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment