Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత | Kashvi Jindal: Seventeen-year-old is helping the underprivileged gain financial literacy | Sakshi
Sakshi News home page

Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత

Published Sat, Dec 23 2023 4:25 AM | Last Updated on Sat, Dec 23 2023 4:25 AM

Kashvi Jindal: Seventeen-year-old is helping the underprivileged gain financial literacy - Sakshi

పదిహేడు సంవత్సరాల వయసులో ఫైనాన్షియల్‌ మ్యాటర్స్‌ గురించి చాలా తక్కువమందికి ఆసక్తి ఉంటుంది. జిందాల్‌ మాత్రం అలా కాదు. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన పదిహేడు సంవత్సరాల కశ్వీ జిందాల్‌కు ఆర్థిక విషయాలు అంటే బోలెడు ఆసక్తి.

ఆ ఆసక్తి ఆమెను ఆర్థికరంగానికి సంబంధించిన అనేకానేక విషయాల గురించి తెలుసుకునేలా, ‘ఇన్వెస్ట్‌ ది చేంజ్‌’కు శ్రీకారం చుట్టేలా చేసింది. ఈ స్వచ్ఛందసంస్థ ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలలో డిజిటల్‌ అక్షరాస్యత పెరిగేలా కృషి చేస్తోంది. రకరకాల ప్రభుత్వ పథకాల గురించి తన బృందంతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది కశ్వీ జిందాల్‌...

ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన సకీనా బతుకుదెరువు కోసం దిల్లీకి వచ్చిన కశ్వీ జిందాల్‌ ఇంట్లో చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఒకసారి రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడిందామె. ఇక అప్పటి నుంచి ఆమెకు భయం పట్టుకుంది. ‘ఒకవేళ నాకు ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి?’

ఆ భయంలో ఆమెకు సరిగ్గా నిద్రపట్టేది కాదు. అలాంటి రోజుల్లో ఒకరోజు ‘ఇన్వెస్ట్‌ ది చేంజ్‌’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరైంది. ఆ సమావేశంలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన గురించి తెలుసుకుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైనా, చనిపోయినా రక్షణగా నిలిచే పథకం ఇది. సంవత్సరానికి ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకున్న సకీనా ‘ఇప్పుడు నిశ్చింతగా ఉంది’ అంటుంది.

ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకోవడానికి ముందు సకీనాకు బ్యాంకు ఎకౌంట్‌ లేదు. దీంతో కశ్వీ బృందం సకీనాకు బ్యాంక్‌ ఎకౌంట్‌ రిజిస్టర్‌ చేయించింది.
తండ్రి ఫైనాన్షియల్‌ రంగంలో పనిచేస్తుండడంతో జిందాల్‌కు ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌కు సంబంధించిన విషయాలు ఆసక్తిగా తెలుసుకునేది. తండ్రి విసుక్కోకుండా ఓపిగ్గా చెప్పేవాడు. దీంతో జిందాల్‌కు ఎకనామిక్స్‌ అనేది ఫేవరెట్‌ సబ్జెక్ట్‌ అయింది. ఫైనాన్స్‌ రంగంలోనే తన కెరీర్‌ ఏర్పాటు చేసుకోవాలనే భవిష్యత్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

తమ అపార్ట్‌మెంట్‌లో హౌస్‌కీపింగ్‌ పనిచేసే వ్యక్తి మరణించాడు. అతడి వయసు 31 సంవత్సరాలు మాత్రమే. అతడి మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఆ సమయంలో ఆ అపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఇతర వర్కర్‌లతో మాట్లాడుతున్నప్పుడు  వారికి ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఏమీ తెలియదు అని అర్థం అయింది.
 ఈ నేపథ్యంలో జిందాల్‌ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన...మొదలైన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఆ తరువాత స్వచ్ఛంద సంస్థ ‘ఇన్వెస్ట్‌ ది ఛేంజ్‌’ ప్రారంభించింది.

తొలిరోజు నుంచి ‘ఇన్వెస్ట్‌ ది చేంజ్‌’ నిర్వహించిన అవగాహన సదస్సులకు అద్భుత స్పందన లభించింది. ఆ సదస్సుల తరువాత ‘ఫలానా స్కీమ్‌లో చేరుతాము’ అంటూ ఫోన్లు వెల్లువెత్తేవి. వారు స్కీమ్‌లో చేరేలా ఆన్‌లైన్‌ అప్లయింగ్, ఫామ్‌–ఫిల్లింగ్‌ వరకు జిందాల్‌ బృందం ప్రతి పని దగ్గరుండి చూసుకునేది. ఏదైనా అప్లికేషన్‌ ఆమోదం పొందకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించేది.

‘ఇన్వెస్ట్‌ ది చేంజ్‌’లో పదిహేనుమంది వాలంటీర్లు ఉన్నారు.
‘రోటరీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌’ భాగస్వామ్యంతో ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఎన్నో ప్రాంతాలలో ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది జిందాల్‌.
‘ఇన్వెస్ట్‌ ది చేంజ్‌’ఎంతోమందిని ప్రభావితం చేసింది. మార్పు తీసుకు వచ్చింది. ఆఫీస్‌ బాయ్‌గా పనిచేసే ప్రకా‹ష్‌ మండల్‌... కోవిడ్‌ కల్లోలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు.
అతడికి ఉపయోగపడే గవర్నమెంట్‌ పాలసీల గురించి తెలియజేసి సహాయపడింది జిందాల్‌ బృందం.

‘ఎన్నో స్కీమ్‌లు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నాకు నచ్చాయి. దీనికి కారణం సంవత్సరానికి చాలా తక్కువ మొత్తం కడితే సరిపోతుంది. స్కీమ్‌లో చేరాలనుకున్నప్పుడు ఫామ్స్‌ నింపడం, ఇతరత్రా విషయాలలో ఇబ్బంది పడ్డాను. ఇలాంటి సమయంలో జిందాల్‌ బృందం నాకు సహకరించింది’ అంటున్నాడు ప్రకాష్‌.

భవిష్యత్‌లో ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలనుకుంటుంది జిందాల్‌.
‘ఆర్థిక అక్షరాస్యత అనేది మనల్ని స్వతంత్రులను  చేస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ప్రభుత్వ పథకాలతో పాటు పొదుపు మార్గాల గురించి కూడా తెలియజేస్తున్నాం’ అంటుది కశ్వీ జిందాల్‌.

వారి నమ్మకమే మన బలం
గొప్ప లక్ష్యాలతో ముందుకు వచ్చినప్పటికీ ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం అనేది అతి పెద్ద సవాలు. వారి నమ్మకాన్ని గెలుచుకుంటే సగం విజయాన్ని సాధించినట్లే. వ్యక్తిగత విషయాలు కూడా మనతో పంచుకుంటారు. నా వయసు అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ చిన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది... అంటూ నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే నా ఉపన్యాసాల ద్వారా వారిని ఆకట్టుకొని వారికి నా పట్ల నమ్మకం కుదిరేలా చేసేదాన్ని.
– కశ్వీ జిందాల్, ఇన్వెస్ట్‌ ది చేంజ్‌–ఫౌండర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement