Awareness Seminars
-
Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత
పదిహేడు సంవత్సరాల వయసులో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చాలా తక్కువమందికి ఆసక్తి ఉంటుంది. జిందాల్ మాత్రం అలా కాదు. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన పదిహేడు సంవత్సరాల కశ్వీ జిందాల్‌కు ఆర్థిక విషయాలు అంటే బోలెడు ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను ఆర్థికరంగానికి సంబంధించిన అనేకానేక విషయాల గురించి తెలుసుకునేలా, ‘ఇన్వెస్ట్ ది చేంజ్’కు శ్రీకారం చుట్టేలా చేసింది. ఈ స్వచ్ఛందసంస్థ ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలలో డిజిటల్ అక్షరాస్యత పెరిగేలా కృషి చేస్తోంది. రకరకాల ప్రభుత్వ పథకాల గురించి తన బృందంతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది కశ్వీ జిందాల్... ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సకీనా బతుకుదెరువు కోసం దిల్లీకి వచ్చిన కశ్వీ జిందాల్ ఇంట్లో చిన్నాచితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఒకసారి రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడిందామె. ఇక అప్పటి నుంచి ఆమెకు భయం పట్టుకుంది. ‘ఒకవేళ నాకు ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి?’ ఆ భయంలో ఆమెకు సరిగ్గా నిద్రపట్టేది కాదు. అలాంటి రోజుల్లో ఒకరోజు ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరైంది. ఆ సమావేశంలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన గురించి తెలుసుకుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైనా, చనిపోయినా రక్షణగా నిలిచే పథకం ఇది. సంవత్సరానికి ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకున్న సకీనా ‘ఇప్పుడు నిశ్చింతగా ఉంది’ అంటుంది. ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకోవడానికి ముందు సకీనాకు బ్యాంకు ఎకౌంట్ లేదు. దీంతో కశ్వీ బృందం సకీనాకు బ్యాంక్ ఎకౌంట్ రిజిస్టర్ చేయించింది. తండ్రి ఫైనాన్షియల్ రంగంలో పనిచేస్తుండడంతో జిందాల్‌కు ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించిన విషయాలు ఆసక్తిగా తెలుసుకునేది. తండ్రి విసుక్కోకుండా ఓపిగ్గా చెప్పేవాడు. దీంతో జిందాల్‌కు ఎకనామిక్స్ అనేది ఫేవరెట్ సబ్జెక్ట్ అయింది. ఫైనాన్స్ రంగంలోనే తన కెరీర్ ఏర్పాటు చేసుకోవాలనే భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తమ అపార్ట్మెంట్లో హౌస్‌కీపింగ్ పనిచేసే వ్యక్తి మరణించాడు. అతడి వయసు 31 సంవత్సరాలు మాత్రమే. అతడి మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఆ సమయంలో ఆ అపార్ట్మెంట్లో పనిచేసే ఇతర వర్కర్లతో మాట్లాడుతున్నప్పుడు వారికి ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఏమీ తెలియదు అని అర్థం అయింది. ఈ నేపథ్యంలో జిందాల్ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన...మొదలైన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఆ తరువాత స్వచ్ఛంద సంస్థ ‘ఇన్వెస్ట్ ది ఛేంజ్’ ప్రారంభించింది. తొలిరోజు నుంచి ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ నిర్వహించిన అవగాహన సదస్సులకు అద్భుత స్పందన లభించింది. ఆ సదస్సుల తరువాత ‘ఫలానా స్కీమ్‌లో చేరుతాము’ అంటూ ఫోన్లు వెల్లువెత్తేవి. వారు స్కీమ్‌లో చేరేలా ఆన్లైన్ అప్లయింగ్, ఫామ్–ఫిల్లింగ్ వరకు జిందాల్ బృందం ప్రతి పని దగ్గరుండి చూసుకునేది. ఏదైనా అప్లికేషన్ ఆమోదం పొందకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించేది. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’లో పదిహేనుమంది వాలంటీర్లు ఉన్నారు. ‘రోటరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ భాగస్వామ్యంతో ప్రాథమిక ఆర్థిక విషయాలు, ప్రభుత్వ పథకాల గురించి ఎన్నో ప్రాంతాలలో ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది జిందాల్. ‘ఇన్వెస్ట్ ది చేంజ్’ఎంతోమందిని ప్రభావితం చేసింది. మార్పు తీసుకు వచ్చింది. ఆఫీస్ బాయ్‌గా పనిచేసే ప్రకా‹ష్ మండల్... కోవిడ్ కల్లోలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. అతడికి ఉపయోగపడే గవర్నమెంట్ పాలసీల గురించి తెలియజేసి సహాయపడింది జిందాల్ బృందం. ‘ఎన్నో స్కీమ్‌లు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నాకు నచ్చాయి. దీనికి కారణం సంవత్సరానికి చాలా తక్కువ మొత్తం కడితే సరిపోతుంది. స్కీమ్‌లో చేరాలనుకున్నప్పుడు ఫామ్స్ నింపడం, ఇతరత్రా విషయాలలో ఇబ్బంది పడ్డాను. ఇలాంటి సమయంలో జిందాల్ బృందం నాకు సహకరించింది’ అంటున్నాడు ప్రకాష్. భవిష్యత్‌లో ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలనుకుంటుంది జిందాల్. ‘ఆర్థిక అక్షరాస్యత అనేది మనల్ని స్వతంత్రులను చేస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ప్రభుత్వ పథకాలతో పాటు పొదుపు మార్గాల గురించి కూడా తెలియజేస్తున్నాం’ అంటుది కశ్వీ జిందాల్. వారి నమ్మకమే మన బలం గొప్ప లక్ష్యాలతో ముందుకు వచ్చినప్పటికీ ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం అనేది అతి పెద్ద సవాలు. వారి నమ్మకాన్ని గెలుచుకుంటే సగం విజయాన్ని సాధించినట్లే. వ్యక్తిగత విషయాలు కూడా మనతో పంచుకుంటారు. నా వయసు అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ చిన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది... అంటూ నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే నా ఉపన్యాసాల ద్వారా వారిని ఆకట్టుకొని వారికి నా పట్ల నమ్మకం కుదిరేలా చేసేదాన్ని. – కశ్వీ జిందాల్, ఇన్వెస్ట్ ది చేంజ్–ఫౌండర్ -
పర్యావరణం.. పక్షికి పండగ దూరం చేయవద్దు!
ఆమె రాగానే అప్పటివరకు గోలగోలగా ఉన్న హాలు సద్దుమణిగింది. ‘అందరూ వచ్చినట్లే కదా!’ అని ఆత్మీయంగా అడిగింది సీమ. ‘ఏమిటో మేడమ్ సెలవ రోజుల్లో ఈ క్లాసు...’ అని ఆవులించాడు ఒక కాలేజి విద్యార్థి. కొన్ని నవ్వులు వినిపించాయి. ‘ఇవి చూడండి’ అంటూ ఆమె కొన్ని చిత్రాలు చూపించింది. నీలాకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్న చిత్రాలు, ఆబాలగోపాలం ఆనందంతో పతంగులు ఎగరేస్తున్న చిత్రాలు, ‘కీంచ్...కాట్’ అంటూ వేరేవాళ్ల గాలిపటాలను ఆకాశంలో కట్ చేస్తున్న చిత్రాలు, తెగిపడిన గాలిపటాల వెంట అరుపులతో పరుగులు తీస్తున్న పిల్లలు... ఇలా ఎన్నో ఉన్నాయి. ‘ఈ చిత్రాలు కూడా చూడండి’ అంటూ మరికొన్ని చిత్రాలు చూపించింది. రెక్కలు తెగిన పక్షుల చిత్రాలు. మెడ తెగి నేలరాలి బాధతో కొట్టుకుంటున్న పక్షుల చిత్రాలు. కరెంటు తీగలకు, చెట్ల కొమ్మలకు అల్లుకున్న దారాల్లో చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోతున్న పక్షుల చిత్రాలు... హృదయాన్ని మెలిపెట్టే చిత్రాలు ఇవి. ‘సంతోషం ముఖ్యమే కాని, మన సంతోషం పక్షుల చావుకు కారణం కావద్దు కదా!’ అన్నది సీమ. కొద్దిసేపు ఆ హాల్లో నిశ్శబ్దం. ‘గాలిపటాలు ఎగిరేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మన చేతివేళ్లు కోసుకుపోతాయి. ఆ కాస్త దానికే తల్లడిల్లిపోయి హాస్పిటల్‌కు పరుగెత్తుతాం. కాని పక్షులు మాత్రం మన గాలిపటాల వల్ల తీవ్రగాయాలపాలై చనిపోతున్నాయి. మనం హాస్పిటల్‌కు పరుగెత్తినట్లు అవి పరుగెత్తలేవు కదా!’ అని సీమ అన్నప్పుడు ఎంతటి హృదయాలైనా కరిగిపోవాల్సిందే. నవీ ముంబైకి చెందిన సీమా టాంక్ జంతు ప్రేమికురాలు. పండగరోజుల్లో గాలిపటాలు పక్షుల పాలిట మృత్యుపాశాలుగా మారకుండా ఉండడానికి ఆమె అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటుంది. మొదట్లో ఈ సదస్సుకు రావడానికి ఇష్టపడని వారు కూడా ఆ తర్వాత నిజం గ్రహించి మార్పు దిశగా పయనించడం ఆమెకు సంతోషం ఇస్తోంది. సీమ మాటలతో ప్రభావితమైనవారు ‘పక్షులకు పండగ దూరం చేయవద్దు ప్లీజ్’ ‘మన సంతోషానికి పక్షులు మూల్యం చెల్లించుకోవాలా?’ ‘ఆకాశంలో గాలిపటం ఎగరేసేముందు, అదే ఆకాశంలో ఎగురుతున్న పక్షి వైపు కూడా చూడు’... లాంటి పోస్ట్‌లు సామాజికవేదికల్లో పెడుతుంటారు. సీమలాంటి వ్యక్తులే కాదు ‘ప్లాంట్స్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ’లాంటి సంస్థలు కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఫేస్బుక్ వేదికగా హెల్ప్‌లైన్ నంబర్స్, రెస్క్యూ టిప్స్ షేర్ చేస్తున్నాయి. ‘సేవ్ బర్డ్స్’ అనేది యానిమల్ లవర్స్, యాక్టివిస్ట్‌ల నినాదం మాత్రమే కాదు, అది అందరి కనీస బాధ్యత అనే ఎరుక మనకు కలిగితే చాలు... పండగ సంతోషం మనతోపాటు పక్షులకూ దక్కుతుంది. -
నేరాల నిరోధంలో విద్యార్థులూ భాగం కావాలి
ఏలూరు టౌన్: జిల్లా వ్యాప్తంగా పోలీస్స్టేషన్ల పరిధిలో పాఠశాల విద్యార్థులకు సమాజంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి విద్యార్థులనూ భాగస్వాములను చేయాలని ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ పథకంపైనా విద్యార్థులకు శిక్షణలు ఇవ్వాలని తెలిపారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించి దర్యాప్తును పూర్తిచేసి పరిష్కరించాలని ఆదేశించారు. దర్యాప్తు దశలోని కేసులు వెంటనే పరిష్కరించి కక్షిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు రాత్రివేళల్లో వాహనచోదకులకు వాష్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేసి పోలీస్స్టేషన్ల పరిధిలో నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది, రిసెప్షనిస్టులు మర్యాదగా నడుచుకోవాలని చెప్పారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డయల్ 100కు వచ్చే సమాచారంపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, నేర ఘటనా సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు అక్కడకు వెళ్ళి పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. జిల్లాలో ఎవరైనా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ చెప్పారు. క్రికెట్ బెట్టింగ్‌లు, పేకాట, కోడిపందేలు వంటివి నిర్వహిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమీక్షలో ఏఆర్ డీఎస్పీ వీఎస్ వాసన్, జిల్లాలోని డీఎస్పీలు కె.ఈశ్వరరావు, సీహెచ్ మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు, పైడేశ్వరరావు, నున్న మురళీకృష్ణ, శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఎస్బీ డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ సీహెచ్ కొండలరావు, డీసీఆర్బీ సీఐ జీవీ కృష్ణారావు, డీసీఆర్బీ ఎస్ఐలు భగవాన్ ప్రసాద్, రిజ్వాన్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు హాజరయ్యారు. -
అందని బిల్లులు
- మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల బిల్లుల చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం - ఆందోళనలో లబ్ధిదారులు - పట్టించుకోని పాలకులు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడం లేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రకటించాయి. పలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. పలువురు అధికారులు గ్రామాలను దత్తత తీసుకొని ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం పనులను యుద్ధప్రాతిపదికన చేయించారు. నిర్మాణం పనులను పూర్తి చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. - శివ్వంపేట మండల కేంద్రమైన శివ్వంపేటతో పాటు పలు గ్రామాలకు 5,600 ఇంకుడుగుంతలు మంజూరయ్యాయి. 4 వేల ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టారు. వీటిలో 3 వేల వాటికి బిల్లులు చెల్లించారు. వెయ్యి ఇంకుడుగుంతలకు నెలలు గడుస్తున్నా బిల్లులు అందడం లేదు. ఒక్కో ఇంకుడుగుంతకు రూ.4,100 చెల్లించాల్సి ఉంది. నిర్మాణం పూర్తి చేసిన వాటికి ఒక్క రూపాయీ చెల్లించకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. శివ్వంపేట, గూడూర్, చెన్నాపూర్, పెద్దగొట్టిముక్ల, కొంతాన్‌పల్లి, చెండి తదితర గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకొని నెలలు గడుస్తోంది. ఒక్కో నిర్మాణానికి రూ.12 వేల చొప్పున చెల్లించాల్సి ఉంది. అప్పులు చేసి మరీ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసినా ఐహెచ్హెచ్ఎల్, ఈజీఎస్ ద్వారా నిధులు చెల్లించడం లేదు. బిల్లులు మంజూరు చేయాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఐదు నెలలవుతోంది ఇంకుడుగుంత నిర్మించుకొని ఐదునెలలవుతోంది. బిల్లు చెల్లింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు చెప్పినా పట్టించుకోవడం లేదు. - సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి, చెన్నాపూర్ అప్పులు చేసి నిర్మించాం అప్పులు చేసి మరుగుదొడ్డి, ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టినా బిల్లులు చెల్లించడం లేదు. అధికారులు ఆరునెలల క్రితం వివరాలను నమోదు చేసుకున్నా బిల్లులు మాత్రం ఇవ్వడం లేదు - ఆకు మల్లయ్య బిల్లులు చెల్లించాలి మరుగుదొడ్డి, ఇంకుడుగుంత నిర్మించుకొని నెలలు గడుస్తున్నా బిల్లులు ఇవ్వడం లేదు. నిర్మించుకున్న వాటికి డబ్బులు చెల్లించాలని రోజూ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. - నీరుడి ఎల్లం -
కందకాలపై అవగాహన సదస్సులు
మార్కాపురం: ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ టీవీ, ఏపీ-తెలంగాణ ఇంజినీర్ల సంఘం ఆధ్వర్యంలో కందకాలతో నీటి సంరక్షణపై రైతు అవగాహన సదస్సులు మంగళవారం నిర్వహించనున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలంలో అనుములవీడు గ్రామంలోని కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు, మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో సాయంత్రం 4 గంటలకు అవగాహన సదస్సులు జరుగుతాయి. ఈ సదస్సుల్లో ‘సాక్షి’ సాగుబడి డెస్క్ ఇన్చార్జి పి.రాంబాబు, ఇంజినీర్ల సంఘం కార్యదర్శులు, విశ్రాంత చీఫ్ ఇంజినీర్లు, డ్వామా, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొని రైతులకు నీటి సంరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తారు. ఈ సదస్సులకు రైతులందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు. -
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
ప్రమాదమని తెలిసినా పట్టించుకోకుండా ఇద్దరు వెళ్లాల్సిన బైక్‌పై నలుగురు, ఐదుగురు ప్రయాణిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి రయ్యిన జారుకుంటున్నారు. ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా వారిలో మార్పు కనిపించడం లేదు. 44వ నెంబరు జాతీయ రహదారి సుచిత్ర నుంచి కొంపల్లికి వెళ్లే దారిలో, నర్సాపూర్ రాష్ట్ర రహదారి జీడిమెట్లలో ‘సాక్షి’ కెమెరాకు ఈ దృశ్యాలు చిక్కాయి. -ఫొటోలు: దశరథ్ రజువా -
రండి బాబూ.. రండి!
కబ్జాదారులకు బంపర్ ఆఫర్ స్థలాల క్రమబద్ధీకరణకు అధికారుల దండోరా మైకులు, కరపత్రాల ద్వారా జోరుగా ప్రచారం విస్తృతంగా అవగాహన సదస్సులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఆక్రమణదారులకు ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరిచింది. భూముల క్రమబద్ధీకరణకు సాదరస్వాగతం పలుకుతోంది. ఆలసించిన ఆశాభంగం.. అంటూ బస్తీల్లో మైకులు, కరపత్రాలతో హోరెత్తిస్తోంది. స్థలాల క్రమబద్ధీకరణతో ఖజానా నింపుకోవాలని ఆశపడుతున్న సర్కారు.. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లకు పట్టాలివ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కబ్జాదారులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్న రెవెన్యూ యంత్రాంగం.. ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసుకోవాలని హితబోధ చేస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటే సరేసరి లేకపోతే స్థలాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 6,202 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన యంత్రాంగం.. వీటి క్రమబద్ధీకరణ ద్వారా భారీగా నిధులు సమకూరుతాయని అంచనా వేసింది. దీంతో క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వం కూడా దీనిపై గంపెడాశ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కబ్జాదారులకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమైంది. భవిష్యత్తులో ఆక్రమణలు తావివ్వకుండా వీలైనంతమేరకు స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో.. కాలనీలు, బస్తీల్లో విస్తృతంగా దండోరా వేయిస్తోంది. ఖరారుకాని మార్గదర్శకాలు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడి ఐదు రోజులైనా.. ఇప్పటివరకు ప్రభుత్వం మార్గదర్శకాలు వెలువరించకపోవడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జీఓ విడుదల చేసిననాటి నుంచి 20 రోజుల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన సర్కారు.. ఇంకా గైడ్‌లైన్స్ ఖరారు, దరఖాస్తు ఫారాాలు ఇవ్వకపోవడంపై పెదవి విరుస్తున్నారు. మార్గదర్శకాల విడుదలలో జాప్యం జరిగినందున.. దరఖాస్తుల సమర్పణకు గడువును పొడగించే అవకాశముందనే ప్రచారమూ జరుగుతోంది. వేలానికి వేళాయే.. నగర శివార్లలోని ప్రధాన ప్రాంతాల్లోని 213 స్థలాలను వేలం వేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అత్యంత విలువైన 930 ఎకరాలు అమ్మడం ద్వారా రూ.3వేల కోట్ల ఆదాయం పొందవచ్చని అంచనా వేసింది. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూముల విక్రయం మాట దేవుడెరు గు.. కనీస అవసరాలకు కూడా భూమి దొరకని పరిస్థితి తలెత్తుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజోపయోగ అవసరాలకు కేటాయించిన పిమ్మట వేలం వేసే భూముల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. ఈ క్రమంలో కసరత్తు ప్రారంభించిన రెవెన్యూ యంత్రాంగానికి దిమ్మతిరిగింది. పలు సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వం వద్ద దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం, అంగన్వాడీ స్కూళ్లు, శ్మశానవాటికలు, కమ్యూనిటీ హాళ్లకు స్థలాలు నిర్దేశిస్తే వేలానికి మిగిలేది 30 నుంచి 40 శాతమేనని ప్రాథమికంగా తేలింది. కొన్ని మండలాల్లో అయితే అమ్మకానికి ప్రభుత్వ స్థలాల్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు నిర్దేశించిన ఫార్మెట్ ప్రకారం తహసీల్దార్ల నుంచి జిల్లా యంత్రాంగం వివరాలను సేకరిస్తోంది. గచ్చిబౌలికి కలెక్టరేట్ కలెక్టరేట్‌ను గ చ్చిబౌలికి తరలించాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 25,26లోని 20ఎకరాలను కలెక్టరేట్ సముదాయ నిర్మాణానికి వినియోగించునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో వికారాబాద్ ప్రత్యేక జిల్లా కానున్నందున.. ఇది అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని భావిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న ఈ స్థలంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం కూడా ఉంది. ప్రతిపాదిత కలెక్టరేట్ స్థలాన్ని సోమవారం జాయింట్ కలెక్టర్ -1 చంపాలాల్ కూడా పరిశీలించారు. ఇదిలావుండగా, రాజేంద్రనగర్ మండలం అపార్డ్‌కు సమీపంలోని సర్వే నం 259లోని భూమిని కూడా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, ఈ భూమిని హెచ్ఎండీఏకు కేటాయించినందున.. గచ్చిబౌలి వైపు మొగ్గు చూపుతున్నారు. -
కరువు జిల్లాగా ప్రకటించాలి
ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి ►ఆత్మస్థైర్యం కోసం అవగాహన సదస్సులు నిర్వహించాలి ►వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ డిమాండ్ వర్గల్: జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొన్నందునా కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ డిమాండ్ చేశారు. మరోవైపు రైతుల ఆత్మహత్యలకు గత నాలుగేళ్ల కాంగ్రెస్ పాలనే కారణమని మండిపడ్డారు. శుక్రవారం వర్గల్ మండలం మైలారం గ్రామంలో బలవన్మరణానికి పాల్పడిన రైతు బాలాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. రైతు మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుగౌడ్ విలేకరులతో మాట్లాడారు. రైతులకు భరోసా కల్పించేందుకు, బలవన్మరణాలకు అడ్డుకట్టవేసేందుకు సీఎం కేసీఆర్ తక్షణం కార్యాచరణ చేపట్టాలన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, ఆంక్షలతో నిమిత్తం లేకుండా రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వానల్లు లేక, కరెంట్ రాక, పంటలకు నీరందక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును రాజుగా చూడాలని తపించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రుణమాఫీ, ఉచిత కరెంట్‌తో అండగా నిలిచారని, ఆయన రైతు బాంధవునిగా చెరగని ముద్రవేశారన్నారు. ప్రస్తుత దయనీయ పరిస్థితిలో ఉన్న రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి ఆత్మస్థైర్యం కల్పించాలన్నారు. రైతులు మనోనిబ్బరంతో ఉండాలని, మీ పిల్లలకు, కుటుంబాలకు పెద్ద దిక్కులేకుండా బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. రైతు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ సంగారెడ్డి నేత సుధాకర్ గౌడ్, జగదీశ్వర్ రావు, ఆందోలు నాయకుడు సంజీవరావు, సిద్దిపేట నేత జగదీశ్వర్ గుప్త, మెదక్ నేత అల్లారం క్రీస్తుదాసు, స్థానిక నేతలు ఎల్లంగౌడ్ ఉన్నారు.