నేర సమీక్షకు హాజరైన జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు
ఏలూరు టౌన్: జిల్లా వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్ల పరిధిలో పాఠశాల విద్యార్థులకు సమాజంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి విద్యార్థులనూ భాగస్వాములను చేయాలని ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ పథకంపైనా విద్యార్థులకు శిక్షణలు ఇవ్వాలని తెలిపారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించి దర్యాప్తును పూర్తిచేసి పరిష్కరించాలని ఆదేశించారు. దర్యాప్తు దశలోని కేసులు వెంటనే పరిష్కరించి కక్షిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు రాత్రివేళల్లో వాహనచోదకులకు వాష్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేసి పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది, రిసెప్షనిస్టులు మర్యాదగా నడుచుకోవాలని చెప్పారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డయల్ 100కు వచ్చే సమాచారంపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, నేర ఘటనా సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు అక్కడకు వెళ్ళి పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. జిల్లాలో ఎవరైనా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ చెప్పారు. క్రికెట్ బెట్టింగ్‌లు, పేకాట, కోడిపందేలు వంటివి నిర్వహిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
సమీక్షలో ఏఆర్ డీఎస్పీ వీఎస్ వాసన్, జిల్లాలోని డీఎస్పీలు కె.ఈశ్వరరావు, సీహెచ్ మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు, పైడేశ్వరరావు, నున్న మురళీకృష్ణ, శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఎస్‌బీ డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌బీ సీఐ సీహెచ్ కొండలరావు, డీసీఆర్‌బీ సీఐ జీవీ కృష్ణారావు, డీసీఆర్‌బీ ఎస్‌ఐలు భగవాన్ ప్రసాద్, రిజ్వాన్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment