జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ ఎం.రవిప్రకాష్, డీఎస్పీ మురళీకృష్ణ
జంగారెడ్డిగూడెం: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం సర్కిల్‌లోని పలు పోలీస్ స్టేషన్‌లను ఆయన పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా తీసుకుంటున్న చర్యలపై పోలీస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి 1,700 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల తాయిలాలు, నగదు, మద్యం పంపిణీపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో రీపోలింగ్ జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆయన పేర్కొన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, పికెట్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో 4, జిల్లా సరిహద్దులో 7 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి నుంచి నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఆయుధాలు వెంటనే డిపాజిట్ చేయండి
జిల్లాలో లైసెన్స్‌డు, లైసెన్స్ లేని ఆయుధాలను ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని ఎస్పీ రవిప్రకాష్ ఆదేశించారు. ఇప్పటికే చాలా ఆయుధాలు డిపాజిట్ చేశారన్నారు. పిట్టలు కొట్టే వారు కూడా వారి ఆయుధాలను విధిగా డిపాజిట్ చేయాలన్నారు. ఒకవేళ డిపాజిట్ చేయకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండటం నేరమని, దీనిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా
జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 70 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో సాయుధ బలగాలతో ప్రత్యేక బందోబస్తుతో పాటు కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ లేని 15 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఈ కేంద్రాల పరిధిలోని శాటిలైట్ ఫోన్‌లు వినియోగిస్తామన్నారు. జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచామని, తెలంగాణ కమిటీ కింద పనిచేస్తున్న శబరి ఏరియా కమిటీ తమ కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. అలాగే గుత్తుకోయలు సంచరించే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పర్యటించి అవగాహన కలిగించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment