SP Ravi Prakash
-
జూదం ఆడితే చర్యలు తప్పవన్న ఎస్పీ రవిప్రకాశ్
-
కౌంటింగ్‌కు కట్టుదిట్ట భద్రత
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు టౌన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాతీర్పును ప్రతీ ఒక్కరూ శిరస్సా వహించాల్సిందే. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ఏవో రెండు, మూడు ఘటనలు మినహా మొత్తంగా ప్రశాంతంగా నిర్వహించాం. ఇక ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పగడ్బందీగా చేపడతాం. కేంద్రాల వద్ద మూడంచెల భద్రత పెట్టాం. కౌంటింగ్‌కు పటిష్ట చర్యలు చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు వ్యవస్థను సిద్ధం చేశాం. ఎన్నికల కమిషన్ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తూ కౌంటింగ్‌ను సక్రమంగా నిర్వహించటమే మా ముందున్న ప్రధాన లక్ష్యం అని ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా కాసేపు ముచ్చటించారు. ప్రశ్న: జిల్లాలో ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ? ఎస్పీ : జిల్లాలో 15 అసెంబ్లీ, ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపునకు ఏలూరు, భీమవరంలో నాలుగు కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఏలూరులో సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల, భీమవరంలో విష్ణు విద్యా సంస్థలు, సీతా పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. భీమవరంలో 7, ఏలూరులో 8 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుంది. ప్రశ్న: సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు చర్యలు? ఎస్పీ : జిల్లా వ్యాప్తంగా 96 సమస్యాత్మక గ్రామాలను ఇప్పటికే గుర్తించాం. ఓట్ల లెక్కింపు అనంతరం గత ఎన్నికల్లోనూ చాలా చోట్ల గొడవలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. అందుకే సమస్యాత్మక గ్రామాల్లో ముందుస్తుగానే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఏలూరు, దెందులూరు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుస్తు భద్రతా చర్యలు చేపడుతున్నాం. ప్రశ్న: కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనలు ఏమిటి ? ఎస్పీ : ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎవ్వరూ సెల్‌ఫోన్ తీసుకురాకుండా చర్యలు చేపట్టాం. కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళే కానిస్టేబుల్ నుంచి జిల్లా అధికారి వరకూ ఎవరూ సెల్‌ఫోన్స్ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. ఎన్నికల అబ్జర్వర్లు మాత్రమే సెల్‌ఫోన్ కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఇక సెల్ఫోన్లకు టోకెన్ సిస్టంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే విషయమై పరిశీలిస్తున్నాం. పోలీసు అధికారులు నిర్దేశించిన ట్రాఫిక్ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. ప్రశ్న: కౌంటింగ్ ఏజెంట్లలో క్రిమినల్స్ ఏవరైనా ఉన్నారా ? ఎస్పీ : జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారుల నుంచి కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను తీసుకుని వారిపై ఎమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా అని పరిశీలించాం. ఒక నియోజకవర్గంలో రౌడీషీటర్ ఉన్నట్లు గుర్తించి వెంటనే అధికారులకు నివేదించాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి జిల్లాలో 7 వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం. వీరిలో 26 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశాం. ఇటువంటి వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాం. ప్రశ్న: ఏ విధమైన భద్రతా చర్యలు చేపట్టారు ? ఎస్పీ : ఏలూరు కౌంటింగ్ కేంద్రాల వద్ద జిల్లా అదనపు ఎస్పీ ఈశ్వరరావు, నరసాపురం కేంద్రాల వద్ద ఏఆర్ ఏఎస్పీ మహేష్‌కుమార్‌ను ప్రత్యేకంగా నియమించాం. జిల్లా వ్యాప్తంగా 67మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లతో పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. ఇక పోలీస్ సబ్‌డివిజన్ అధికారులతో ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా గొడవలు జరిగితే వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్ళి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు నిర్ణయించాం. ఇక జిల్లాలో 3,500మంది పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు, ఒక కంపెనీ ఏపీఎస్పీ బలగాలనూ మోహరించేందుకు చర్యలు చేపట్టాం. ప్రశ్న: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత చర్యలు ? ఎస్పీ : జిల్లాలో ఏలూరు, భీమవరం ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తాం. దీనికోసం మెటల్ డిటెక్టర్లు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశాం. ఎన్నికల కమిషన్ మంజూరు చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారు మాత్రమే తనిఖీలు అనంతరం లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం లోపల సైతం ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు మాత్రమే మఫ్టీలో పోలీసు అధికారులను భద్రత కోసం నియమించేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రశ్న: వాహనాలు పార్కింగ్‌కు ఏవిధమైన చర్యలు తీసుకున్నారు ? ఎస్పీ : ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. అధికారులకు ఒక ప్రాంతంలోనూ, వీఐపీలు, సీని యర్ అధికారులు, ఆర్ఓలకు ప్రత్యేకంగానూ, ఏజెంట్లు, ఇతర వ్యక్తులకు మరోచోట వాహన పార్కింగ్‌కు స్థలాలను నిర్ణయించాం. ఏలూరులో రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ట్రాఫిక్ డీఎస్పీ అధికారితో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. భీమవరంలో విష్ణు కళాశాల వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ట్రాఫిక్ మళ్ళింపుకు చర్యలు తీసుకున్నాం. ప్రశ్న: యువత, విద్యార్థులకు మీరిచ్చే సందేశం ? ఎస్పీ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిఒక్కరూ ప్రజా తీర్పును గౌరవించాలి. అభ్యర్థుల ఓటమి, గెలుపులపై యువత, విద్యార్థులు, అభిమానులు సంయమనం పాటించాల్సి ఉంది. అనవసరంగా గొడవలు, కొట్లాటలకు దిగటం ద్వారా భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఇప్పటికే సూచనలు చేయటం జరిగింది. వారంతా నిబంధనలకు అనుగుణంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక కౌంటింగ్ పూర్తి అయిన మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. గెలిచిన అభ్యర్థులు సైతం నిబంధనల మేరకు విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు తీసుకుని మాత్రమే ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. -
ఆయుధాలు డిపాజిట్ చేయాలి
జంగారెడ్డిగూడెం: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం సర్కిల్లోని పలు పోలీస్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా తీసుకుంటున్న చర్యలపై పోలీస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి 1,700 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల తాయిలాలు, నగదు, మద్యం పంపిణీపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో రీపోలింగ్ జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆయన పేర్కొన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, పికెట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో 4, జిల్లా సరిహద్దులో 7 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి నుంచి నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయుధాలు వెంటనే డిపాజిట్ చేయండి జిల్లాలో లైసెన్స్డు, లైసెన్స్ లేని ఆయుధాలను ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని ఎస్పీ రవిప్రకాష్ ఆదేశించారు. ఇప్పటికే చాలా ఆయుధాలు డిపాజిట్ చేశారన్నారు. పిట్టలు కొట్టే వారు కూడా వారి ఆయుధాలను విధిగా డిపాజిట్ చేయాలన్నారు. ఒకవేళ డిపాజిట్ చేయకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండటం నేరమని, దీనిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 70 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో సాయుధ బలగాలతో ప్రత్యేక బందోబస్తుతో పాటు కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ లేని 15 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఈ కేంద్రాల పరిధిలోని శాటిలైట్ ఫోన్లు వినియోగిస్తామన్నారు. జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచామని, తెలంగాణ కమిటీ కింద పనిచేస్తున్న శబరి ఏరియా కమిటీ తమ కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. అలాగే గుత్తుకోయలు సంచరించే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పర్యటించి అవగాహన కలిగించనున్నట్లు చెప్పారు. -
నేర నియంత్రణకు నిరంతర నిఘా
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : పశ్చిమలో నేరాలను నియంత్రించేందుకు పోలీసు వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేయాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. ఏలూరు పోలీసు ప్రధాన కేంద్ర కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో చోటుచేసుకున్న గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసులను సర్కిల్ వారీగా ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇటీవల పెరిగిన ఆస్తి సంబంధిత నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల పరిష్కారానికి ఏలూరు, నరసాపురం డివిజన్లలో ప్రత్యేక పార్ట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు, పేకాట, గుండాటలు నిర్వహించకుండా హైకోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో గంజాయి, గోవుల అక్రమ రవాణా, పేకాట, క్రికెట్ బెట్టింగులపై నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ కే.ఈశ్వరరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, నరసాపురం డీఎస్పీ ప్రభాకరబాబు, పోలవరం డీఎస్పీ రవికుమార్, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ పైడేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీలు నున్న మురళీకృష్ట, ఏ.శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ టీ.సత్యనారాయణ, ఎస్బీ సీఐ ఎస్.కొండలరావు, డీసీఆర్బీ సీఐ జీవీ కృష్ణారావు, డీసీఆర్బీ ఎస్ఐలు రిజ్వాన్, రామకృష్ణ, పోలీసు న్యాయ సలహాదారు కే.గోపాలకృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ప్రతిభావంతులకు పురస్కారాలు జిల్లాలో పోలీసు శాఖలో పనిచేస్తోన్న పోలీసు సిబ్బంది తమ విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరి చిన పోలీసులకు నగదు పురస్కారం తోపాటు, ప్రశంసాపత్రాలను ఎస్పీ ఎం.రవిప్రకాష్ అందజేశారు. పోలవరం సబ్‌డివిజన్ పరి ధిలో కుక్కునూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఎటువంటి ఆధారాలులేకి కేసును ఛేదించి ముగ్గురు ముద్దాయిలను ఆరెస్టు చేసిన సీఐ డీ.భగవాన్ ప్రసాద్, ఎస్సై మధు వెంకటరాజు, వేలేరుపాడు ఏఎస్సై వై.శ్రీని వాసరావు, హెచ్‌సీ జీ.అక్రమ్, పీవీఎస్ ప్రవీణ్‌కుమార్, పీసీ జీ.శేఖర్, ఎం.శ్రీనివాస్, పీ.రాజేష్, కే. ప్రసాద్‌బాబు, బీ.సత్యనారా యణ పురస్కారం అందుకున్నారు. జంగారెడ్డిగూడెం ఎస్బీ హెచ్‌సీ ఎన్.నాగేశ్వరరావు సమాచారం మేరకు దాడులు నిర్వహించి కొయ్యలగూడెంలోని ఓ ఇంటిలో రూ.1.50లక్షల విలువైన గుట్కా, ఖైనీ నిల్వలను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో సీఐ కే.బాలరాజు, ఎస్సై ఎం.సూర్యభగవాన్, హెచ్‌సీ డీవీ రమణ, పీసీ సీహెచ్ఎంవీ గణేష్ పురస్కారం అందుకున్నారు. -
నేరాల నిరోధంలో విద్యార్థులూ భాగం కావాలి
ఏలూరు టౌన్: జిల్లా వ్యాప్తంగా పోలీస్స్టేషన్ల పరిధిలో పాఠశాల విద్యార్థులకు సమాజంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి విద్యార్థులనూ భాగస్వాములను చేయాలని ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ పథకంపైనా విద్యార్థులకు శిక్షణలు ఇవ్వాలని తెలిపారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించి దర్యాప్తును పూర్తిచేసి పరిష్కరించాలని ఆదేశించారు. దర్యాప్తు దశలోని కేసులు వెంటనే పరిష్కరించి కక్షిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు రాత్రివేళల్లో వాహనచోదకులకు వాష్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేసి పోలీస్స్టేషన్ల పరిధిలో నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది, రిసెప్షనిస్టులు మర్యాదగా నడుచుకోవాలని చెప్పారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డయల్ 100కు వచ్చే సమాచారంపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, నేర ఘటనా సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు అక్కడకు వెళ్ళి పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. జిల్లాలో ఎవరైనా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ చెప్పారు. క్రికెట్ బెట్టింగ్‌లు, పేకాట, కోడిపందేలు వంటివి నిర్వహిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమీక్షలో ఏఆర్ డీఎస్పీ వీఎస్ వాసన్, జిల్లాలోని డీఎస్పీలు కె.ఈశ్వరరావు, సీహెచ్ మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు, పైడేశ్వరరావు, నున్న మురళీకృష్ణ, శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఎస్బీ డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ సీహెచ్ కొండలరావు, డీసీఆర్బీ సీఐ జీవీ కృష్ణారావు, డీసీఆర్బీ ఎస్ఐలు భగవాన్ ప్రసాద్, రిజ్వాన్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు హాజరయ్యారు. -
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : జిల్లాలోని పోలీస్ శాఖలో పనిస్తున్న అధికారులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా మసలుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ సూచించారు. ఏలూరు పోలీస్ సబ్‌డివిజన్ కార్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఏలూరు సబ్‌డివిజన్ పరిధిలో పోలీసుల పనితీరు, గ్రేవ్ కేసులు, ప్రజలతో సత్సంబంధాలు వంటి అంశాలను తెలుసుకోవడంతోపాటు రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ రేప్, ఫోక్సో కేసుల విషయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు వ్యక్తిగతంగా కోర్టు క్యాలెండర్‌ను తయారుచేసుకుని పర్యవేక్షించాలన్నారు. ఫోక్సో కేసుల నమోదు విషయంలో వయసు ధ్రువీకరణ పత్రాలను ఆధారంగా తీసుకోవాలని తెలిపారు. చట్టాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు కార్యాచరణ జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలుచేస్తామని ఎస్పీ చెప్పారు. జిల్లాలోని ఆయా ముఖ్యపట్టణాలతోపాటు, జాతీయ రహదారులపై సీసీ కెమేరాలను ఆరు నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఏలూరు నగరంలో మరో నెల రోజుల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లాలో బాణసంచా అనధికారికంగా తయారుచేసే వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుగుండు సామగ్రి అక్రమంగా నిల్వ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పనితీరుపై సంతృప్తి ఏలూరు సబ్‌డివిజన్‌లో పోలీస్ అధికారుల పనితీరుపై ఎస్పీ రవిప్రకాష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలోని పలుస్టేషన్ల పరిధిలో గ్రేవ్ కేసులు అధికంగా ఉన్నాయని, రికవరీ కూడా జరుగుతుందని, పనితీరు ఇంకా మెరుగుపడాలని ఎస్పీ చెప్పారు. ఇంకా 30 శాతం కేసులు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. సబ్‌డివిజన్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్లు కొత్తగా వచ్చారని, అధికారులు పరిస్థితులపై అవగాహన తెచ్చుకుని మెరుగైన పనితీరు కనబరచాలన్నారు. సీపీఓల నియామకాల్లో జాగ్రత్తలు పాటించాలని, సమాజంలో మంచి నడవడిక కలిగిన వ్యక్తులనే నియమించాలని, ప్రస్తుతం 90 శాతం బాగా పనిచేస్తున్నారని తెలిపారు. పనితీరు ఆధారంగా సీపీఓలను ఏడాదికి ఒకసారి మార్పు చేయాల్సి ఉందని సూచించారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేయటం వల్ల కేసులు పక్కదారి పట్టే అవకాశాలు తగ్గుతాయని ఎస్పీ చెప్పారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు ఏలూరు జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ నేరాల నియంత్రణ, కేసుల నమోదు విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ రవిప్రకాష్ సూచించారు. ఏలూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, జూన్ నాటికి కొత్తగా పోలీస్ సిబ్బంది వస్తున్నారని, వారిని నియమిస్తామని తెలిపారు. ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు, ఏలూరు వన్‌టౌన్ సీఐ అడపా నాగమురళీ, టూటౌన్ సీఐ జి.మధుబాబు, త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ కె.వెంకటేశ్వరరావు, భీమడోలు సీఐ వెంకటేశ్వర నాయక్, ఎస్సైలు కె.రామారావు, ఎన్ఆర్ కిషోర్‌బాబు, ఎ.పైడిబాబు, నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ ఉండదు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నాన్న స్ఫూర్తితో సివిల్స్‌కు ప్రయత్నించాను. మా నాన్నగారు ఫ్యాక్షన్ పడగవిప్పిన సమయంలో రాయలసీమలో పోలీసు అధికారిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన పనితీరు, ఫ్యాక్షన్‌ను అణగదొక్కడానికి ఆయన తీసుకుంటున్న చర్యలు నన్ను పోలీసు కావడానికి ప్రేరేపించాయి. డిగ్రీ చదువుతున్నప్పుడే సివిల్స్‌కు వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నాను. మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేశాను. అక్కడ యువతను మావోయిజం వైపు నుంచి మళ్లించేందుకు వారికి ఉపాధి కల్పించే దిశగా తీసుకున్న చర్యలు విజయవంతం కావడం నాకు ఇప్పటికీ గుర్తుండిపోయే అంశం. నేడు యువత సోషల్‌మీడియా ఉచ్చులో పడి చెడిపోతోంది. సోషల్‌మీడియాలో ఉన్న మంచిని స్వీకరించవచ్చు గాని నేరం ఎలా చేయాలో మీడియాలో చూసి నేర్చుకుని ఆ వైపుగా యువత వెళ్లడం బాధ కలిగిస్తోంది. సోషల్ మీడియాలో వెయ్యి మంది స్నేహితులు ఉండటం కన్నా బయట మంచి స్నేహితులు నలుగురైదుగురు ఉంటే యువత తమ భవితను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటుందని అభిప్రాయపడుతున్న పశ్చిమగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎం.రవిప్రకాష్ సాక్షి ప్రతిని«ధితో పంచుకున్న అంతరంగం ఆయన మాటల్లోనే. కుటుంబ నేపథ్యం : తండ్రి రామచంద్రయ్య రిటైర్డ్ అదనపు ఎస్పీ, తల్లి సరోజనమ్మ, భార్య సుకన్య, కుమారుడు సూర్య చదువు : డిగ్రీ బీఎస్సీ (పీసీజెడ్) తిరుపతిలో, ఎంఎస్సీ మైక్రో బయోలజీ. డిగ్రీ చదివేనాటి నుంచే సివిల్ సర్వీస్ పట్ల ఆసక్తి, హైదరాబాద్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు శిక్షణ తీసుకున్నాను. వ్యక్తిగతం: సొంత జిల్లా చిత్తూరు. చదువు అంతా కడప, అనంతపురం, చిత్తూరులోనే సాగింది. నాన్న రామచంద్రయ్య పోలీస్ అధికారిగా పనిచేయటంతో పోలీస్ అవ్వాలనే కోరిక ఉండేది. చేస్తే పోలీస్ అధికారిగానే పనిచేయాలనే లక్ష్యం ఉండేది. అప్పట్లో రాయలసీమలో ఫ్యాక్షన్ అధికంగా ఉండేది. తండ్రి సిన్సియర్ ఆఫీసర్‌గా చేయటంతో అదేస్థాయిలో తానూ చేయాలనే బలమైన కాంక్ష ఉండేది. కెరీర్ : ఎక్కువగా మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న తెలంగాణలోనే చేశాను. సిరిసిల్ల, పెద్దపల్లి, తాడిపత్రిలో డీఎస్పీగా పనిచేశా. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు ప్రభావం తీవ్రస్థాయిలో ఉండేది. చాలా ఆపరేషన్స్‌లో పాల్గొన్నా. మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేసి మంచి ఫలితాలు సాధించా. అచీవ్మెంట్స్: కఠిన సేవా పతకం 2005లోనూ, ముఖ్యమంత్రి శౌర్యపతకం 2009లోనూ ప్రభుత్వం అందించింది. ఇవికాకుండా అనేక మెడల్స్ అందుకున్నాను. హాబీలు: షటిల్ బ్యాడ్మింటన్, బుక్ రీడింగ్, స్మిమ్మింగ్ అంటే బాగా ఇష్టం. పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టటంతో భారత చట్టాలు, జడ్జిమెంట్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి పుస్తకాలను చదవటం అలవాటయింది. ఇక చార్లెస్ డికిన్స్ రాసిన డేవిడ్ కాపర్ఫీల్డ్, డిటెక్టివ్ పుస్తకం షెర్లాక్ హŸమ్స్ అంటే చాలా మక్కువ. ‘మావూరికి రండి’ : సిరిసిల్లలో పనిచేసే రోజులు బాగా సంతృప్తి నిచ్చాయి. యువత మావోయిస్టు భావజాలానికి ప్రభావితులు కాకుండా కట్టడి చేయటం గుర్తుండిపోతుంది. ప్రధానంగా ‘మావూరికి రండి’ కార్యక్రమం అద్భుతమైంది. సిరిసిల్లలో పనిచేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు భయపడే రోజులవి. గ్రామస్తులే ఉద్యోగులకు రక్షణ వలయంగా ఉండేవారు. ఇళ్లు సైతం అద్దెలు లేకుండా గ్రామస్తులే ఏర్పాటు చేసేవారు. వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు, ఉపాధ్యాయులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు ఇలా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేసేలా చేయటం మంచి అచీవ్‌మెంట్‌గా మిగిలిపోయింది. ఫీల్ గుడ్: మారుమూల గ్రామాల్లోని యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి సెక్యూరిటీ గార్డులుగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు ఇప్పించాం. 5వేల మంది యువతకు సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి కల్పించటం సంతృప్తినిచ్చింది. గుంటూరులో పనిచేసే కాలంలో గిరిజన తండాలోని యువతకు ఉద్యోగ సాధనకు శిక్షణ ఇప్పించా. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో 100మందికి చోటు కల్పించటం మర్చిపోలేను. చింతూరు, రంపచోడవరంలో జనమైత్రిలో భాగంగా యువతకు ఉపాధి, ఉద్యోగ శిక్షణలు ఇవ్వటం. భగవంతుడి సేవ: తూర్పుగోదావరి జిల్లాలో మూడేళ్లు పనిచేశా. గోదావరి పుష్కరాల్లో పనిచేశాను. భద్రాచలం నుంచి సఖినేటిపల్లి, అంతర్వేది వరకూ ఉన్న 500 ఘాట్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం (రాజమండ్రి నా పరిధిలోకి రాదు). పుష్కరాల్లో పనిచేయటం, భగవంతుని సేవగా భావించాను. కలచివేసింది: మహబూబ్‌నగర్‌లో పనిచేసే రోజుల్లో మావోయిస్టులు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను చంపటం తీవ్రంగా బాధించింది. కోర్టు సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన నిరాయుధులైన కానిస్టేబుళ్లను కిరాతకంగా హతమార్చటం కలచివేసింది. అదేస్థాయిలో విజయవాడ పడమటలో ఒక మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేయటం సమాజంలో నైతిక విలువలు దిగజారిపోయాయి అనేం దుకు నిదర్శనంగా ఉన్నాయి. యువతకు సందేశం: సమాజంలో రోజురోజుకూ మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో యువత, విద్యార్థులు పెడదారి పట్టటం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగేందుకు యువత తమ శక్తిని వినియోగించాలి. నేడు అధికంగా క్రిమినల్ కేసుల్లో యువత ఉంటోంది. హత్యలు, అత్యాచారాలు, జూదం, ట్రాప్‌లు వంటివాటిలో ఉండడం మానుకోవాలి. క్రిమినల్ కేసులు నమోదైతే భవిష్యత్తు నా«శనం అవుతుంది. -
గరగపర్రులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడూరు మండలం గరగపర్రులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ గురువారం ఛలో గరగపర్రుకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ అమలుచేశారు. గ్రామంలోకి వెళ్లే అన్ని మార్గాలలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి,పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్తింపు కార్డు లేనివారిని గ్రామంలోకి అనుమతించడం లేదు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉందన్నారు. ఇప్పుడిప్పుడే గరగపర్రులో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, అనుమతి లేనిదే విద్యార్థులు రాకూడదన్నారు. మరోవైపు ఛలో గరగపర్రు కార్యాక్రమాన్ని ఏయూ విద్యార్థి జేఏసీ వాయిదా వేసింది. ఈ నెల 19న ఛలో గరగపర్రు చేపట్టనున్నట్లు ఏయూ విద్యార్థి జేఏసీ నేత ఆరేటి మహేష్ తెలిపారు. -
అసత్య వార్తలు పోస్ట్ చేస్తే చర్యలు
జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరిక రాజమహేంద్రవరం క్రైం : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షకు సంబంధించి సోషల్ మీడియాలో అసత్య వార్తలు, ఫొటోలు హల్చల్ చేస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, టెలిగ్రామ్ మెసేజ్స్ తదితర సోషల్ మీడియాలో అసత్య వార్తలు వస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ప్రజలు భయాందోళనలకు గురై, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. ఇవి సైబర్ నేరాల్లోకి వస్తాయని, వాటిపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వంద శాతం అసత్య ప్రచారాలే ఉంటున్నాయని తెలిపారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలు వాస్తవమని ప్రజలు గ్రహించాలని వివరించారు. దీక్ష చేపట్టాక పురుగు మందు తాగుతానని, ఆత్మహత్య ప్రేరణకు యత్నించడంతో.. ముద్రగడను కాపాడే చర్యల్లో భాగంగా ఆయనను అరెస్టు చేసి, ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. తొలి రోజున ఆస్పత్రికి తీసుకువచ్చిన పది నిమిషాల్లో ఆయన కడుపులో ఏమైనా పురుగు మందు ఉంటే శుభ్రం చేసేందుకు ప్రయత్నించిన వీడియో క్లిప్పింగ్‌ను సోషల్ మీడియా తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. కాపు జేఏసీ ఛలో రాజమహేంద్రవరానికి పిలుపునిచ్చిన సందర్భంగా దానిని అడ్డుకుంటామని చెప్పారు. ఇప్పటికే సెక్షన్ 30, 144 అమలులో ఉన్నాయని, సభలు, సమావేశాలకు అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా ముద్రగడ దీక్ష నేపథ్యంలో 160 మందిని అదుపులోకి తీసుకున్నామని, 60 మందిని గృహ నిర్బంధంలో ఉంచామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. -
ముద్రగడపై లీగల్‌గా ప్రొసీడ్ అవుతాం: ఎస్పీ
కిర్లంపూడి: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. కిర్లంపూడిలో గురువారం ఆయన మాట్లాడుతూ...ముద్రగడ ఆంక్షలు ఉల్లంఘించారన్నారు. ఆయనపై 32 యాక్ట్ ప్రకారం రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అమలాపురంలో సెక్షన్ 202/216తో పాటు కిర్లంపూడిలో మరో కేసు నమోదు చేశామని..ఆయన అరెస్టుకు సహకరించడం లేదని ఎస్సీ చెప్పారు. సీఐడీ అధికారులు ముద్రగడతో మాట్లాడతారని చెప్పారు. జిల్లాలో ఎక్కడా దీక్షలు, ధర్నాలు చేయడానికి వీల్లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ముద్రగడ గురువారం ఉదయం తన నివాసంలో సతీమణితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని పురుగు మందు డబ్బా చేతపట్టుకుని హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. -
మావోల డంప్‌పై విలేకరుల సమావేశం
తూర్పుగోదావరి (కాకినాడ) : పోలీసులను టార్గెట్ చేసేందుకే మావోలు పేలుడు పదార్ధాలను దాచిపెట్టి ఉంటారని తూర్పుగోదావరి ఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు. స్పెషల్ పార్టీ పోలీసులు స్వాధీనం చేసుకున్నమావోస్టుల డంప్‌పై గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మావోయిస్టుల కదలికలపై అందిన సమాచారంతో జిల్లాకు చెందిన రెండు ఏఎన్ఎస్ పార్టీలను రామవరం మండలంలోని గోర్లోడు, తిరుచారు గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు దించిన సంగతి విదితమే. ఈ కూంబింగ్‌లో భారీగా మావోల డంప్ బయట పడింది. డంప్‌లో 8 రాకెట్ లాంచర్లు, 5 సింగిల్ బ్యారల్ గన్లు, రెండు పిస్తోళ్లు, 15 కేజీల జిలిటిన్ స్టిక్స్, 5 ప్యాకెట్ల పొటాషియం నైట్రేట్, మూడు డబ్బాల అమ్మోనియంతో పాటు పేలుడు పదార్ధాలలో వినియోగించే పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 28న జరిగిన కూంబింగ్‌లో ఇవన్నీ దొరికాయి. -
అవినాష్ కేసులో మావాళ్లపై చర్యలు: ఎస్పీ
కాకినాడ(రాజమండ్రి): ఘరాన మోసాగాడు పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్ర డీజీపీ ఎదుట లొంగిపోలేదని.. మీడియాను తప్పుదోవ పట్టించాడని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినాష్‌ను వదిలేసిన పెద్దాపురం పోలీసులపై పూర్తిస్థాయిలో విచారణ చేయలేదని దర్యాప్తులో తేలిందని అన్నారు. పెద్దాపురం పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమయం లేకపోవడం వల్ల అవినాష్‌ను పూర్తిస్థాయిలో విచారించలేకపోయామని రవిప్రకాష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలో కూడా అవినాష్ పలు స్కూళ్లపై దందా చేశాడనే అనుమానం కలుగుతోందని చెప్పారు. అవినాష్ నేర చరిత్ర గురించి తెలంగాణ పోలీసులకు కూడా తాము లేఖ రాశామని ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు. కాగా, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్రను శుక్రవారం పోలీసులు కోర్టుకు ముందు హాజరు పరిచారు. దాంతో అవినాషకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
‘ఎస్పీ సార్.. ఆత్మహత్య చేసుకుంటున్నా..’
కాకినాడ క్రైం :తనతో తన స్నేహితులు మాట్లాడడం లేనందున తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ యువతి ఎస్పీ రవిప్రకాష్‌కు ఫోన్ చేయడం కాకినాడలో తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధితురాలి కథనం ఇలా... పెద్దాపురం మండలం దివిలికి చెందిన ఎన్వీఆర్ లక్ష్మి అనే యువతి సర్పవరంలోని కోస్టల్ ఒకేషనల్ కాలేజీలో నర్సింగ్ ద్వితీయ సంవత్సర చదువుతోంది. నాలుగు రోజుల నుంచి తనతో స్నేహితులు మాట్లాడటం లేదని మనస్తాపంతో తాను ఆత్మహత్యచేసుకుంటున్నానని ఎస్పీ రవిప్రకాష్‌కు ఆమె ఫోన్ చేసింది. దీనిపై ఎస్పీ రవిప్రకాష్ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆమెతో ఫోన్లో మాట్లాడి ఆమె ఎక్కడ ఉందో కనుక్కునే ప్రయత్నం చేశారు. తాను కాకినాడ రేచర్లపేట రైల్వేగేట్ వద్ద నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె చెప్పింది. దీంతో టూ టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమెను పోలీసులు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతోంది. మరోవైపు ఆమె కాలేజీ ప్రిన్సిపాల్ సాయిబాబాకు కూడా ఫోన్ చేసి, మెసేజ్‌లు పెట్టడంతో వారు కూడా కాకినాడ జీజీహెచ్‌కు చేరుకున్నారు. లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు. కేవలం స్నేహితురాళ్లు మాట్లాడడం లేదనే కారణంగానే ఆమె మనస్తాపం చెందినట్టు వారు తెలిపారు. దీనిపై టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా లక్ష్మి ఆత్మహత్య చేసుకుంటున్నానని నేరుగా ఎస్పీ రవిప్రకాష్‌కు ఫోన్ చేయడంతో కాకినాడలో పోలీసులు హైరానా పడ్డారు. ఎట్టకేలకు ఆమె ఎక్కడ ఉందో తెలియడం, ఆమె పరిస్థితి సక్రమంగానే ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. క్రైం సీఐ అల్లు సత్యనారాయణ, సర్పవరం ఇన్స్పెక్టర్ రత్నరాజు, ఎస్సై సురేష్ చావా తదితరులు జీజీహెచ్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. విషయం తెలుసుకున్న ఆమె స్నేహితులు, సాటి విద్యార్థులు ఆస్పత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు.