అవినాష్ కేసులో మావాళ్లపై చర్యలు: ఎస్పీ
కాకినాడ(రాజమండ్రి): ఘరాన మోసాగాడు పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్ర డీజీపీ ఎదుట లొంగిపోలేదని.. మీడియాను తప్పుదోవ పట్టించాడని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినాష్ను వదిలేసిన పెద్దాపురం పోలీసులపై పూర్తిస్థాయిలో విచారణ చేయలేదని దర్యాప్తులో తేలిందని అన్నారు. పెద్దాపురం పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సమయం లేకపోవడం వల్ల అవినాష్ను పూర్తిస్థాయిలో విచారించలేకపోయామని రవిప్రకాష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలో కూడా అవినాష్ పలు స్కూళ్లపై దందా చేశాడనే అనుమానం కలుగుతోందని చెప్పారు. అవినాష్ నేర చరిత్ర గురించి తెలంగాణ పోలీసులకు కూడా తాము లేఖ రాశామని ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు.
కాగా, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్రను శుక్రవారం పోలీసులు కోర్టుకు ముందు హాజరు పరిచారు. దాంతో అవినాషకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.