తల్లడిల్లుతున్న పేగుబంధం..
కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసిన రోడ్డు ప్రమాదం
గాయపడిన కుమారుడి చికిత్స కోసం రూ.22 లక్షలు ఖర్చు
వడదెబ్బతో ఈ నెల 6న తండ్రి మృతి
భారమంతా నెట్టుకొస్తున్న తల్లి
దాతల చేయూత కోసం ఎదురుచూపులు
ఖమ్మం: రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబాన్ని ఓ ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసింది. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అచేతన స్థితికి చేరగా.. కుటుంబానికి పెద్ద దిక్కయిన తండ్రి వడదెబ్బతో మృతిచెందాడు. మరో కొడుకు ఉపాధి లేక చిన్న చిన్న పనులు చేస్తున్నా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తల్లిపై పడటంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే రోడ్డుప్రమాదంలో గాయపడిన కుమారుడికి చికిత్స కోసం రూ.22 లక్షల మేర అప్పు చేసిన ఆ కుటుంబం తండ్రి మృతితో మరింత కష్టంలో పడిపోయింది.
రోడ్డు ప్రమాదంలో గాయపడి..
ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ కొత్తూరు గ్రామానికి చెందిన వల్లెపు నరసింహారావు, నళిని దంపతులకు ఇద్దరు కొడుకులు. వీరిలో వల్లెపు అవినాష్ గతేడాది నవంబర్ 8న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. అవినాష్‌ను చికిత్స కోసం హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులకు తిప్పారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు బంధువులు, తెలిసిన వారి వద్ద రూ.22 లక్షల వరకు అప్పులు చేసి అతని చికిత్సకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన వైద్యానికి రోజుకు రూ.10 వేలు ఖర్చు అవుతోంది.
వడదెబ్బతో తండ్రి..
ఇదే పరిస్థితితో ఇబ్బందులు పడుతుండగా.. యజమాని నరసింహారావు కూడా మరణించాడు. ఎండల్లో పనిచేయడంతో వడదెబ్బకు గురై ఈ నెల 6న మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఒక పక్క కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండగా.. ఇలా భర్త అర్ధాంతరంగా ముగియడంతో ఆమె గుండె పగిలింది. ఇక మరో కొడుకు అభిలాష్ హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అది ఖర్చుల వరకు కూడా సరిపోవడం లేదని నళిని వాపోయింది. ప్రస్తుతం నళిని కూలీ పనులకు వెళ్తూ నెట్టుకొస్తోంది. తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు 79896 32983 నంబర్‌లో సంప్రదించాలని బంధువులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment