కరువు జిల్లాగా ప్రకటించాలి
ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి
►ఆత్మస్థైర్యం కోసం అవగాహన సదస్సులు నిర్వహించాలి
►వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ డిమాండ్
వర్గల్: జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొన్నందునా కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ డిమాండ్ చేశారు. మరోవైపు రైతుల ఆత్మహత్యలకు గత నాలుగేళ్ల కాంగ్రెస్ పాలనే కారణమని మండిపడ్డారు. శుక్రవారం వర్గల్ మండలం మైలారం గ్రామంలో బలవన్మరణానికి పాల్పడిన రైతు బాలాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. రైతు మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుగౌడ్ విలేకరులతో మాట్లాడారు.
రైతులకు భరోసా కల్పించేందుకు, బలవన్మరణాలకు అడ్డుకట్టవేసేందుకు సీఎం కేసీఆర్ తక్షణం కార్యాచరణ చేపట్టాలన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, ఆంక్షలతో నిమిత్తం లేకుండా రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వానల్లు లేక, కరెంట్ రాక, పంటలకు నీరందక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును రాజుగా చూడాలని తపించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రుణమాఫీ, ఉచిత కరెంట్‌తో అండగా నిలిచారని, ఆయన రైతు బాంధవునిగా చెరగని ముద్రవేశారన్నారు.
ప్రస్తుత దయనీయ పరిస్థితిలో ఉన్న రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి ఆత్మస్థైర్యం కల్పించాలన్నారు. రైతులు మనోనిబ్బరంతో ఉండాలని, మీ పిల్లలకు, కుటుంబాలకు పెద్ద దిక్కులేకుండా బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. రైతు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ సంగారెడ్డి నేత సుధాకర్ గౌడ్, జగదీశ్వర్ రావు, ఆందోలు నాయకుడు సంజీవరావు, సిద్దిపేట నేత జగదీశ్వర్ గుప్త, మెదక్ నేత అల్లారం క్రీస్తుదాసు, స్థానిక నేతలు ఎల్లంగౌడ్ ఉన్నారు.