Severe drought
-
ఆకలి కేకలు.. దయనీయ స్థితిలో ఉత్తర కొరియా
పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా తయారైంది ఉత్తర కొరియా పరిస్థితి. అధ్యక్షుడు కిమ్ వరుస క్షిపణి పరీక్షలతో దాయాది దక్షిణ కొరియాకు, దాని మద్దతుదారు అమెరికాకు సవాళ్లు విసురుతుంటే దేశం మాత్రం కనీవినీ ఎరుగని కరువు కోరల్లో చిక్కి అల్లాడుతోంది. తిండికి లేక జనం అలమటిస్తున్నారు. తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగకుంటే 1990ల్లో దేశం చవిచూసిన 20 లక్షల పై చిలుకు ఆకలి చావుల రికార్డు చెరిగిపోయేందుకు ఎంతోకాలం పట్టదంటూ ఆందోళన వ్యక్తమవుతోంది...! అటు కాలం కనికరించడం లేదు. తీవ్ర వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో గతేడాది పంట దిగుబడులు కుదేలయ్యాయి. ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతో ఇంతో ఆదుకుంటూ వచ్చిన ప్రజా పంపిణీ వ్యవస్థ చేతులెత్తేసింది. ఇంతకాలం మార్కెట్లో దొరుకుతూ వచ్చిన చైనా తిండి గింజలు, నిత్యావసరాలు కరోనా కట్టడి దెబ్బకు మూడేళ్లుగా అసలే అందుబాటులో లేకుండా పోయాయి. దాంతో ఉత్తర కొరియా అక్షరాలా ఆకలి కేకలు పెడుతోంది. జనాభాలో అధిక శాతం రోజుకు ఒక్క పూట కూడా తిండికి లేక అలమటిస్తున్నారు. నియంతృత్వపు ఇనుప తెరలు దాటుకుని ఏ విషయమూ బయటికి రాదు గనుక అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. కానీ ఇప్పటికే లక్షలాది మంది కరువు బారిన పడ్డట్టు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరువు మరణాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతున్నట్టు చె బుతున్నాయి. అస్తవ్యస్త పాలనకు మారుపేరైన కిమ్ ప్రభుత్వమే ఇందుకు ప్రధాన దోషిగా కనిపిస్తోంది. కారణాలెన్నో... ► కొరియా కరువుకు చాలా కారణాలున్నాయి. కరోనా దెబ్బకు ఆహార కొరత తీవ్రతరమైంది. ► ప్రభుత్వం తీవ్ర ఆంక్షలను విధించి అత్యంత కఠినంగా అమలు చేయడం, సరిహద్దులను పూర్తిగా మూసేయడంతో సమస్య మరింత పెరిగింది. 2.5 కోట్ల జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి కనీసం 55 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. కాగా వార్షిక సగటు ఉత్పత్తి 45 లక్షల టన్నులే. మిగతా 10 శాతం లోటు చాలావరకు చైనాతో సాగే అనధికారిక వర్తకం ద్వారా పూడేది. తిండి గింజలు, నిత్యావసరాలతో పాటు పలు ఇతర చైనా సరుకులు 2020 దాకా దేశంలోకి భారీగా వచ్చేవి. ముఖ్యంగా గ్రామీణుల అవసరాలు చాలావరకు వీటిద్వారానే తీరేవి. కానీ మూడేళ్లుగా ఆంక్షల దెబ్బకు ఈ వర్తకం దాదాపుగా పడకేసింది. ఇది సగటు కొరియన్లకు చావుదెబ్బగా మారింది. దీనికి తోడు గతేడాది తిండి గింజల ఉత్పత్తి 35 లక్షల టన్నులకు మించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ► ప్రభుత్వం వద్ద భారీగా ఆహార నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే చైనా నుంచి భారీగా బియ్యం, గోధుమ పిండి తదితరాలను దిగుమతి చేసుకుంది కూడా. కానీ ‘ముందుజాగ్రత్త’ చర్యల్లో భాగంగా వాటిని కావాలనే దాచి ఉంచిందని పరిశీలకులు చెబుతున్నారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రజల్లో చాలామందికి కొనుగోలు శక్తి క్షీణించడంతో వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. కిలో బియ్యం ధర ఏకంగా 220 రూపాయలకు ఎగబాకిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ► వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చి దేశాన్ని స్వయంసమృద్ధంగా మార్చుకుంటామంటూ తాజాగా జరిగిన 4 రోజుల వర్కర్స్ పార్టీ సమావేశాల్లో కిమ్ గంభీరంగా ఉపన్యాసమిచ్చారు. అది ఏ మేరకు వాస్తవ రూపు దాలుస్తుందన్న దానిపైనే కొరియన్ల భవితవ్యం ఆధారపడుతుంది. తీవ్ర అసమానతలు ► ఉత్తర కొరియా ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల జాబితాలో ఉంది. ప్రజల తలసరి ఆదాయం కేవలం రూ.1.3 లక్షలు! ► దేశంలో సామాజిక అసమానతలు చాలా ఎక్కువ. ► అత్యధికులకు, ముఖ్యంగా గ్రామీణులకు అన్నం, కాయగూరలే ప్రధానాహారం. ► మాంసాహారం, పండ్లు వారికి అందని ద్రాక్షే. ► పట్టణాల్లో పరిస్థితి కాస్త మెరుగు. రాజధాని ప్యాంగ్యాంగ్లో స్థోమత ఉంటే అన్నిరకాల ఆహారమూ దొరుకుతుంది. ► దేశంలో ప్రైవేట్‌లో ఆహారం, ఆహార ధాన్యాల అమ్మకం నిషిద్ధం. కానీ కొన్నేళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. దాంతో ప్రైవేట్ క్రయ విక్రయాలను ప్రభుత్వం చూసీ చూడనట్టు పోతోంది. నిధులన్నీ సైన్యానికే! ► ఉత్తర కొరియా 12 లక్షల మందితో కూడిన ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైన్యాన్ని పోషిస్తోంది. ► ఏటా జీడీపీలో ఏకంగా నాలుగో వంతు సైన్యంపైనే వెచ్చిస్తోంది. ► 2022లోనైతే దేశ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 70 ఖండాంతర, క్రూయిజ్ క్షిపణులను పరీక్షించింది! ► తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇటీవలే భారీ సంఖ్యలో ఖండాంతర క్షిపణులు తదితరాలతో నెల రోజుల క్రితమే అతి పెద్ద సైనిక పరేడ్‌ను నిర్వహించింది! ► ఇలా వనరులన్నీ రక్షణ రంగానికే మళ్లుతుండటంతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం దక్కకుండా పోతోంది. ► కిమ్ అణు పరీక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విధించిన ఆంక్షలతో పరిస్థితి మరింత విషమించింది. ► కేవలం గతేడాది క్షిపణి పరీక్షలకు వెచ్చించిన నిధులతో దేశ జనాభా మొత్తానికీ ఏడాది పాటు చాలినన్ని తిండి గింజలు అందించవచ్చని అంచనా. ఆ కరువుకు 20 లక్షల మంది బలి! 1990ల్లో ఉత్తర కొరియా చవిచూసిన భయానక కరువు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పకుంటారు. ‘ఆర్డియస్ మార్చ్’గా పిలిచే ఈ కరువుకు అస్తవ్యస్త పాలన, సోవియట్ నుంచి సాయం ఆగిపోవడంతో పాటు 1995లో వచ్చిన భారీ వరదలు తక్షణ కారణంగా మారాయి. వాటి దెబ్బకు దేశంలో వరి పంట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో వంతుకు పైగా పొలాలు రోజల తరబడి అడుగుల లోతు నీటిలో మునిగిపోయాయి! జనమంతా పనీపాటా వదిలేసి కేవలం తిండి గింజల కోసం రోజుల తరబడి పొలాల వెంబడి తిరుగుతూ అలమటించిన దృశ్యాలు అప్పట్లో అందరినీ కలచివేశాయి. కనీవినీ ఎరగని ఆ కరువుకు రెండు కోట్ల జనాభాలో పదో వంతుకు పైగా, అంటే 20 లక్షల మందికి పైగా బలైనట్టు చెబుతారు. అంతేగాక ఏకంగా 62 శాతం మందికి పైగా చిన్నారులు పౌష్ఠికాహార లోపానికి గురై శాశ్వత ఆరోగ్య తదితర సమస్యల బారిన పడ్డారు. రెండు మూడేళ్ల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చినా చిన్నారులు మాత్రం కోలుకోలేకపోయారు. నేటికీ ఉత్తర కొరియాలో 22 శాతం మంది బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు అంచనా! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖరీఫ్ సాగులో రైతులు బిజీ
సదాశివపేట రూరల్:రెండేళ్లుగా వర్షాలు లేక తీవ్ర కరువుతో సతమతమైన రైతులు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవటంతో మండలంలోని రైతులు ఖరీఫ్ సాగులో బిజీగా ఉన్నారు. పొలాలు, పత్తి చేలల్లో గుంటుక, పిచికారీ, కలుపుతీత పనుల్లో నిమగ్నమయ్యారు. ఖరీఫ్ మొదలై రెండు మాసాలు గడుస్తున్న నేపథ్యంలో పంటల సంరక్షణ చర్యల్లో భాగంగా రైతులు పంటలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కుగాను మండలంలోని రైతాంగం పత్తిని ఎక్కువగా సాగు చేస్తుండగా మిగతా పంటలను మోస్తరుగానే సాగు చేస్తున్నారు. మండలంలో వరి 220 హెక్టార్లు, పత్తి 8900 హెక్టార్లు, మొక్కజొన్న 350, పెసర 380, కంది 800, సోయాబీన్ 450, మినుము 290, ఇతర పంటలు 1500 హెక్టార్లలో సాగు చేశారు. మొత్తం కలిపి మండలంలో 12890 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. మన తెలంగాణ మన వ్యవసాయం సదస్సులో వ్యవసాయ అధికారులు రైతులకు పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు సాగు చేసుకోవాలని సూచించినా రైతుల్లో మార్పు కనిపించలేదు. వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నం.. ఖరీఫ్ వరుసగా వర్షాలు కురస్తుండటంతో రైతులు పంటల సాగు, సస్యరక్షణచర్యల్లో బిజీగా ఉన్నారు. పత్తి, మొక్కజొన్న, కంది పంట చేనులు కలుపుతీతకు వచ్చాయి. దీంతో రైతులు కూలీలతో కలుపు పనులు చేయిస్తున్నారు. కలుపు పనుల కారణంగా గ్రామాల్లో కూలీలకు డిమాండ్ పెరిగింది. కొందరు రైతులు పక్క గ్రామాల్లోని కూలీలను అదనంగా డబ్బుల చెల్లించి మరీ వ్యవసాయ పనులు చేయించుకుంటున్నారు. మొదట పత్తి విత్తనాలు విత్తే సమయంలో కూలీ ఒక్కక్కరికి రూ.250 వరకు చెల్లించారు. ఇప్పుడు కలుపుతీత పనులకు సైతం రైతులు అంతేమొత్తం కూలీలకు చెల్లించాల్సివస్తోంది. కొందరు రైతులు కలుపు తీయిస్తుంటే మరికొంత మంది పొలంలో గుంటుక తొలుతున్నారు. చేలల్లో కలుపు పూర్తయిన రైతులు పంటకు యూరియా, డీఏపీ లాంటి ఎరువులను చల్లే పనిలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటి వరకు మండలంలో 40 శాతం వరినాట్ల పనులు పూర్తి కాగా ఇంకా 60 శాతం నాట్లు వేయాల్సి ఉంది. ఇంతవరకు వరినాట్లు వేయని రైతులు ఈనెల మూడో వారంవరకు నాట్లు వేసుకోవచ్చు. నాటు వేసుకోవటం ఆలస్యమైతే వరి పంట దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి. రైతులు త్వరగా వరి నాట్లు వేసుకోవాలి. -మూడో వారం వరకు నాట్లు వేసుకోవచ్చు బాబూనాయక్, ఏఓ -
నీటి నిరక్షరాస్యతే కరువుకు మూలం!
‘జల గాంధీ’ అయ్యప్ప మెసగితో ప్రత్యేక ఇంటర్వ్యూ - కరువుకు మూల కారణం వర్షాలు కురవక పోవడం కాదు.. ‘నీటి నిరక్షరాస్యతే’ అసలు సమస్య - పొలాల్లో లోతు కందకాలు, పట్టా బండింగ్తో స్వల్ప ఖర్చుతోనే వాన నీటి సంరక్షణ.. సీజనల్ పంటలకు నీటి భరోసా - చెక్ డ్యామ్‌లు వృథా.. నదులు/ వాగులలో భూగర్భ చెక్ డ్యామ్‌లతో సాగు, తాగునీటి భద్రత - స్నానం చేసిన నీటిని, రోడ్డుపైన కురిసే వాన నీటిని కూడా నేలకు తాపితే.. పట్టణాలు, నగరాల్లో పుష్కలంగా భూగర్భ జలాలు - వాన నీటిలో 30 శాతాన్ని భూమిలోకి ఇంకింపజేస్తే నీటి దారిద్య్రం పరార్! అయ్యప్ప మెసగి! వన్ మాన్ వాటర్ ఆర్మీ!! ఆయన వయసు 59 ఏళ్లు. 30 ఏళ్లుగా వాన నీటి సంరక్షణ తపస్సు చేస్తున్నారు. కరువు ప్రాంతమైన ఉత్తర కర్ణాటకలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అయ్యప్ప మెసగి.. దక్షిణాదిలో జల సంరక్షణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచారు. ఎల్ అండ్ టిలో మెకానికల్ ఇంజినీరుగా 23 ఏళ్లు పనిచేసిన అయ్యప్ప.. 2002లో నెలకు రూ. 32 వేల జీతంతో కూడిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి.. వాన నీటి సంరక్షణోద్యమంలోకి దూకారు. నలుగురు పిల్లలు, భార్య మాట కాదని కుటుంబ ప్రయోజనం కన్నా సామాజిక ప్రయోజనమే మిన్నగా భావించిన సాహసి ఆయన. వాన నీటి సంరక్షణ ప్రాధాన్యత గురించి, సంరక్షణ పద్ధతుల గురించి రైతులకు, ప్రజలకు కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక బాధలు, అవమానాలు, కష్టనష్టాలు ఎదురైనా వెనుదిరగలేదు. బాల్యంలో తమ కుటుంబం సాగు నీటికి, తాగునీటికి పడిన కష్టాలు అయ్యప్పలో రగిలించిన కసి ఆయనను అసాధారణ శక్తిగా రూపుదిద్దింది. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన ఊతంతో ఆర్థికంగా నిలదొక్కుకొని.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణపై అనితరసాధ్యమైన వినూత్న పద్ధతులను ఆవిష్కరించారు. ఈ విజయాలే ఆయనను ‘జల గాంధీ’గా మలిచాయి. రైతులను, ప్రజలను అష్టకష్టాల పాలుచేస్తూ జాతి మూలుగను నిలువునా పీల్చేస్తున్నది కరువు రక్కసేనని సాధారణంగా అనుకుంటూ ఉంటాం. కానీ, ఆయన మాత్రం.. వర్షపు నీటి సంరక్షణపై నిర్లక్ష్యం, భావదారిద్య్రమే సాగునీటి, తాగునీటి కష్టాలకు మూల కారణమని తేల్చేస్తున్నారు. వాన కురవకా కాదు.. నీరు లేకా కాదు.. నీటి సంరక్షణకు సంబంధించిన భావ దారిద్య్రమే అసలు సమస్య అని అయ్యప్ప స్పష్టం చేస్తున్నారు. అకుంఠిత దీక్షతో ఆయన చేస్తున్న విశిష్ట కృషికి గుర్తింపుగా తొలుత వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే అశోక ఫెలోషిప్ లభించింది. జమ్నాలాల్ బజాజ్ జాతీయ పురస్కారం వంటి అవార్డులతోపాటు ఐఐటి అహ్మదాబాద్ ‘డాక్టర్ ఆఫ్ డ్రై బోర్‌వెల్స్’, ‘జల గాంధీ’ వంటి బిరుదులు పొందిన కారణ జన్ముడు అయ్యప్ప మసగితో ‘సాగుబడి’ డెస్క్ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు సంభాషించారు. కొన్ని ముఖ్యాంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం.. తీవ్ర కరువు పరిస్థితుల వల్ల సాగు నీటికి, తాగు నీటికి కూడా సమాజం అల్లాడుతోంది. దీనికి మూల కారణం నీటి నిరక్షరాస్యతే అని మీరంటున్నారు.. అంటే ఏమిటి? అయ్యప్ప మసగి : వర్షాల తీరులో అనిశ్చితి పెరిగింది. వాతావరణ మార్పుల వల్ల వర్షానికి వర్షానికి మధ్య గ్యాప్ రావడం లేదా కుండపోతగా కురవడం సాధారణమై పోయింది. అయితే, గతంలో కన్నా ఎక్కువ వర్షం కురుస్తున్నప్పటికీ ఆ నీటిని మనం జాగ్రత్త చేసుకోవడం లేదు. అయితే, పూర్వం మన పొలాల్లో నీటి కుంటలుండేవి. పూడ్చేశాం. గ్రామ చెరువుల్లోకి నీరు చేరనంతగా నిర్లక్ష్యం చేశాం, ఆక్రమించేశాం. నీటిని పొలంలో గానీ, ఇళ్ల దగ్గర గానీ భూమిలోకి ఇంకే మార్గాలన్నీ మూసేశాం. కురిసిన వానలో 3 శాతం నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతోంది. మిగతా నీరు వాగులు, నదుల్లోకి వదిలేస్తున్నాం. నదులపై ఆనకట్టలు, లిఫ్ట్‌లు పెట్టి పొలాలకు, తాగడానికి వెనక్కి తెచ్చుకుంటున్నాం. సరస్సులన్నిటినీ మురుగునీటి కుంటలుగా మార్చేశాం. ఎంత వర్షం కురిసినా రెండు నెలల్లో తాగడానికి నీరు లేని పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అభివృద్ధి పేరుతో నీటి ఎద్దడిని మనమే సృష్టించుకుంటున్నాం. వాన, నీరు సమస్య కాదు.. మన ఆలోచనా ధోరణిలోనే సమస్య ఉంది. ఒక ఏడాది కురిసే వానలో కనీసం 30 శాతాన్ని సంరక్షించుకుంటే.. ఆ తర్వాత మూడేళ్లు నీటికి కరువుండదు. వాన నీటి సంరక్షణేకరువుకు అసలైన, శాశ్వతమైన పరిష్కారం. ఇందుకోసం నీటి నిరక్షరాస్యతపై 30 ఏళ్లుగా ఒంటరి యుద్ధం చేస్తున్నా. 2020 నాటికి దేశం మొత్తాన్నీ నీటి సమృద్ధ దేశంగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నా. సమాజం కళ్లు తెరచి అందుకోవాలి. వాన నీటి సంరక్షణ ఎన్ని పద్ధతుల్లో చేయాలి? ఎక్కడెక్కడ చేయాలి? అయ్యప్ప మసగి : నేలతల్లి అతిపెద్ద వాటర్ ట్యాంక్. కానీ, అదేపనిగా తోడేయడం, ఇంకకుండా చేయడం వల్ల భూగర్భం ఖాళీ అయ్యింది. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే.. ఎక్కడ కురిసినా, ఎంత కురిసినా, ఎలా కురిసినా ఒడిసిపట్టుకొని, శుద్ధిచేసి, భూమిలోకి పంపాలి. పొలాల్లో, రోడ్ల మీద, గృహ సముదాయాల్లో, పారిశ్రామిక సంస్థల స్థలాల్లో.. నీరు నేల మీద పడే ప్రతి చోటా ఉద్యమ స్ఫూర్తితో నీటిని భూమికి తాపాలి. కందకాలు, కుంటలు, సోక్ పిట్లు, బోర్వెల్ రిచార్జ్ పిట్లు నిర్మించి సాధ్యమైనంత ఎక్కువ నీటిని భూమికి తాపించాలి. డాబా ఇళ్ల పైన కురిసే నీటిని పట్టుకొని, ఫిల్టర్ చేసి తాగునీటిగా వాడాలి. ముప్పయ్యేళ్లుగా మేం తాగుతున్నాం. స్నానం చేసిన నీటిని కూడా కాలువలోకి వదలకుండా.. ఇంటి దగ్గరే భూమిలోకి ఇంకింపజేయాలి. గజం భూమి వృథా కాకుండా ఈ పనిచేయొచ్చు. భూమిపైన నిర్మించే వాటర్షెడ్ల కన్నా.. నదులు, వాగుల్లో ఇసుక కింద వాటర్ షెడ్లు నిర్మించడం నేను కనుగొన్న గొప్ప ప్రభావశీలమైన నీటి సంరక్షణ పద్ధతి (వివరాల కోసం ప్రత్యేక బాక్స్‌లు చూడండి). ఇటువంటి 150 వరకు ప్రత్యేక పద్ధతులను రూపొందించి, పరీక్షించి సత్ఫలితాలు పొందాను. ఉద్యోగం మానేసి ఉద్యమం ప్రారంభించడానికి స్ఫూర్తి కలిగించిందేమిటి? అయ్యప్ప మసగి : పెద్దయి, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఉద్యోగం మానేసి నీటి సమస్యకు పరిష్కారం కనుగొనాలని చిన్నప్పుడే అనుకున్నా. కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఎంఎల్లో కొంతకాలం, తర్వాత 23 ఏళ్లు ఎల్ అండ్ టిలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేశా. కర్ణాటకలో ఒక ఔషధ కంపెనీ వ్యర్థ జలాలను పొలాల్లో ఎండిపోయిన బోర్లలో పోయడం వల్ల రెండు కిలోమీటర్ల దూరంలో భూగర్భ జలాలు పనికిరాకుండా పోయాయి. ఆ రైతుల నీటి బాధలు చూడలేక 2002లో భార్యకు కూడా చెప్పకుండా రూ. 32 వేల నెల జీతం వచ్చే ఉద్యోగం మానేశా. రూ. 5 వేలకు నీటి సంరక్షణ కోసం ఒక స్వచ్ఛంద సంస్థలో చేరా. నా భార్య మిషన్‌పై దుస్తులు కుట్టి సంపాదించిన డబ్బుతో నలుగురు పిల్లలనూ పోషించింది. ఆమె సహాయ నిరాకరణతో ఎన్నో అవమానాలను, కష్టనష్టాలు ఎదురైనా నేను పట్టు విడవ లేదు. వట్టిపోయిన బోరుకు తిరిగి జలకళ తెప్పించినప్పుడు పత్రికలు తొలిసారి నా గురించి పొగుడుతూ రాశాయి. కానీ, నా భార్య మాత్రం ‘ఆయన వట్టి పనికిమాలిన వాడ’ని విలేకరులతో చెప్పింది. ఆ వార్త అచ్చయిన రోజునే అశోక ఫౌండేషన్ నాకు నెలకు రూ. 32 వేలతో మూడేళ్ల ఫెలోషిప్ ప్రకటించింది. అశోక తర్వాత దేశ్‌పాండే ఫౌండేషన్, ఆక్స్‌ఫామ్ ఇండియా తదితర సంస్థలు వెన్నుదన్నుగా నిలిచాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. మొదట్లో పిచ్చివాడినన్న వారే ఫలితాలు చూసిన తర్వాత ‘జల గాంధీ’గా కీర్తిస్తున్నారు. మీ సంస్థల ద్వారా ఎన్ని రాష్ట్రాల్లో సేవలందిస్తున్నారు..? అయ్యప్ప మసగి : 2005 సెప్టెంబర్ 5న వాటర్ లిటరసీ ఫౌండేషన్‌ను నెలకొల్పా. 2008లో రెయిన్ వాటర్ కాన్సెప్ట్స్ ఇండి ప్రై. లి.ను ప్రారంభించా. నీటి సంరక్షణపై ఇప్పటి వరకు 5,368 సదస్సులు నిర్వహించా. చిన్న, సన్నకారు రైతులకు ఉచిత సలహాలు ఇస్తున్నాం. 10 వేల హెక్టార్ల పొలాల్లో వాన నీటి సంరక్షణ పనులు చేయించా. 300 అపార్ట్మెంట్లు, 31 గేటెడ్ కమ్యూనిటీలు, 171 పరిశ్రమలు, 168 పాఠశాలలకు సేవలందించాం. మా సంస్థల తరఫున 21 ప్రాజెక్టుల్లో 20 మంది సిబ్బంది, 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర నిర్వహించిన వి. ప్రకాశ్‌తో కలసి పనిచేస్తున్నాను. పొలాల్లో వాన నీటి సంరక్షణపై నమూనా క్షేత్రాలు ఎక్కడున్నాయి? అయ్యప్ప మసగి : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం సుబ్బరావుపేట సమీపంలో మిత్రులతో కలసి 84 ఎకరాల్లో నమూనా సేంద్రియ క్షేత్రాన్ని నిర్మించాం. 37 వరుసల కందకాలు తవ్వి కట్టలు (కంపార్ట్మెంట్ బండింగ్) పోశాం. 3 చెరువులు తవ్వాం. 25 వేల (మీ. వెడల్పు, మీ. లోతున) చిన్న గోతులు తవ్వాం.. ఇవన్నీ చేయడానికి ఎకరానికి రూ.లక్షా 10 వేలు ఖర్చయింది. 300 మిల్లీ మీటర్ల వర్షపాతం ఉండే అనంతపురం జిల్లాలోనే రెండో ఏడాదికే మా పొలంలో నీటికి దిగుల్లేని పరిస్థితి వచ్చింది. చెరువుల్లో నీరుంది. బోర్లలో ఐదడుగుల్లో నీరుంది. 84 ఎకరాలకు ఒకే బోరు నీరందిస్తోంది. చిత్రావతి నదిలోనూ నీరు పారుతోంది. వరుసగా కొన్ని ఏళ్లు వాన పడకపోయినా మా పంటలకు నీటి దిగులుండదు. 60 శాతం స్థలంలో చెట్లు (ఎర్రచందనం, శ్రీగంధం, సిల్వర్ ఓక్స్, మలబారు వేప, నేరేడు, జామ వంటి చెట్లు), వరుసల మధ్య భూమిలో సీజనల్ ఆహార పంటలు సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నాం. ఈ పద్ధతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు చాలా అనువైనది. మా స్వగ్రామం కర్ణాటకలోని టుమ్కూర్ జిల్లా హొలవనల్లి. అక్కడ మరో మూడున్నర ఎకరాల్లో నమూనా వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించాం. పొలంలో చేసిన పనులతోపాటు.. పొలం పక్కనే ఉన్న వాగులో ప్రత్యేక పద్ధతిలో ఇసుక అడుగున చెక్‌డామ్‌లు నిర్మించాం. ఆ ప్రాంతంలో బోర్లు, బావుల్లో జలకళ నిండింది. భూమిపైన చెక్‌డ్యామ్‌ల వల్ల కలిగే ప్రయోజనం కన్నా నదీ గర్భంలో ఇసుక అడుగున చెక్ డ్యామ్‌లు నిర్మించడం వల్ల వెయ్యి రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మా అనుభవంలో తేలింది. ఇప్పటికి 200 మంది వాటర్ వారియర్స్(నీటి సేనానుల)కు శిక్షణ ఇచ్చాను. పట్టా బండింగ్, కందకాల ద్వారా తక్కువ ఖర్చుతోనే రైతులు నీటిని సంరక్షించుకోవచ్చు. ఈ పద్ధతులు వేగంగా వ్యాప్తి చెందాలంటే దాతలు, ప్రభుత్వం స్పందించాలి. - ఫొటోలు: ఎ. సతీష్, శ్రీధర్ (అయ్యప్ప మసగి కృషిపై ఇతర వివరాలకు www.waterliteracy.tk చూడవచ్చు) నీటి సంరక్షణపై ఉచిత సలహాలు.. యువతకు శిక్షణ.. జల గాంధీగా పేరుగాంచిన అయ్యప్ప మసగి రూపొందించిన పద్ధతుల్లో రైతులకు, గృహయజమానులకు ఉచితంగా ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నాం. 91773 82777 నంబరులో సంప్రదించవచ్చు. కనీసం 8వ తరగతి పాసైన యువతకు జల సేనానులుగా 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. భోజన, వసతి సదుపాయాలు ఎవరికి వారే చూసుకోవాలి. ఆసక్తిగల వారు ‘తెలంగాణ జల సంరక్షణ వేదిక (తేజస్వి), ఫ్లాట్ నం: 403, ఇంటి నం. 8-3-960, సిరి ఎన్క్లేవ్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ - 500073, తెలంగాణ’ అడ్రస్‌లో సంప్రదించవచ్చు. - వి. ప్రకాశ్ (90009 50400), చైర్మన్, తెలంగాణ జల సంరక్షణ వేదిక. savewater2021@gmail.com -
కరువులోనూ పర్యటించరా?: తమ్మినేని
తిప్పర్తి: తీవ్ర కరువు పరిస్థితుల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన కరువు పర్యటనలో భాగంగా సోమవారం నల్లల్లొండ జిల్లా తిప్పర్తి మండలం మాడ్గులపల్లి, ఇందుగుల గ్రామాలలో ఎండిన బత్తాయి తోటలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులు వారి కుటుంబాల మేలు కోసమే పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. -
పాతాళానికి భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావం, విచ్చలవిడిగా తోడేయడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్నాయి. జనవరితో పోలిస్తే మార్చి నాటికి అంటే రెండు నెలల్లోనే ఏకంగా 1.13 మీటర్ల అదనపు లోతుల్లోకి వెళ్లిపోయాయి. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా సగటున 13.75 మీటర్ల లోతులో జలం లభించగా.. మార్చిలో అది 14.88 మీటర్లకు పడిపోయింది. అలాగే గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ మార్చిలో 2.61 మీటర్ల అదనపు లోతులోకి భూగర్భ జలాలు అడుగంటాయని భూగర్భ జల శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాది మార్చిలో 12.27 మీటర్ల లోతులో నీరు లభ్యం కాగా... ఈ మార్చిలో 14.88 మీటర్ల లోతులోకి అడుగంటాయి. గత ఏడాది మేతో పోల్చినా ఈ ఏడాది మార్చి నెలలోనే అధికంగా జలాలు పడిపోవడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. వేసవికాలం ఇంకా నెలన్నరకు పైగా ఉండడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో అధ్వానం రాష్ట్రంలో మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భూగర్భ జలాలు మరింతగా అడుగంటా యి. మెదక్ జిల్లాలో గతేడాది 18.39 మీటర్ల లోతులో జలాలు లభ్యం కాగా... ఈ ఏడాది మార్చిలో 24.34 మీటర్ల లోతు కు పడిపోయాయి. అంటే ఏకంగా 5.95 మీటర్లు లోపలికి వెళ్లిపోయాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో గతేడాది మార్చిలో 14.29మీటర్ల లోతులో నీరుండగా... ఈ మార్చిలో 5.31 మీటర్లు అదనంగా 19.60 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. దీంతో తాగునీటికి కూడా కటకట ఏర్పడింది. -
ప్రకృతి సేద్య క్రాంతి!
♦ తీవ్ర కరువులోనూ మెట్టపొలంలో చక్కని పంట దిగుబడులు ♦ ఎకరానికి పది వేల కొబ్బరి కాయల దిగుబడి ♦ బ్రకోలి తదితర సంప్రదాయేతర పంటల సాగులోనూ అద్భుత ఫలితాలు ♦ కూరగాయల ద్వారా ఎకరానికి రూ. 80 వేలకు పైగా నికరాదాయం ఇరైవె ఏళ్లుగా గుప్పెడు రసాయనిక ఎరువు గానీ, చెంచాడు పురుగుమందు గానీ వేయని కొబ్బరి తోట ఎంత అద్భుతంగా ఉంటుంది? ఆఖరికి చుక్క కలుపు మందు కూడా చల్లకుండా, ట్రాక్టర్‌తో ఒక్కసారీ దున్నకుండా ఉంటే ఆ నేల ఎంత సజీవంగా, ఎంత సారవంతంగా ఉంటుంది? అటువంటి తోటలో కొబ్బరి గెలల సోయగం ఎంత కన్నుల పండువగా ఉంటుంది? చెట్ల మధ్య ఖాళీ స్థలాలను కాడెద్దుల అరకతో దున్ని అంతరపంటలుగా కూరగాయలు పండిస్తే ఆ పచ్చని పంటల దిగుబడి ఎంత అద్భుతంగా ఉంటుంది? అంతేకాదు.. వాన నీటిని భూమికి కడుపునిండా తాపితే.. ఎన్నడూ లేనంత కరువు ముంచుకొచ్చి గ్రామంలో బోర్లు, పంటలు నిలువునా ఎండిపోయినా.. వందడుగుల్లోతు బోర్లే మూడించుల నీళ్లు పోయకుండా ఉంటాయా? కొబ్బరితోపాటు చలి ప్రాంతపు పంటలైన కాలీఫ్లవర్, బ్రకోలి పూలు కరువు కాలపు మండుటెండల్లోనూ విరగపండకుండా ఉంటాయా?.. ఇదంతా అందమైన ఊహ కాదు. కళ్లెదుటున్న వాస్తవం. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో క్రాంతికుమార్‌రెడ్డి అనే ప్రకృతి వ్యవసాయదారుడు నిర్మించుకున్న పచ్చని సేద్య సౌధం ఇది.. పంట మొక్కలకు రసాయనిక ఎరువులు గుప్పించడం కాదు.. భూమికి బలిమినివ్వటమే ప్రకృతి సేద్యపు మూల సూత్రం. ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ కొబ్బరి తోటలో బ్రకోలి, కాలీఫ్లవర్, బంగాళదుంప, బీట్ రూట్ వంటి సంప్రదాయేతర కూరగాయ పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తూ.. అబ్బురపరిచే దిగుబడులు పొందుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు డా. కనమతరెడ్డి క్రాంతికుమార్ రెడ్డి. రైతు కుటుంబంలో జన్మించి సుస్థిర వ్యవసాయంపై పి.హెచ్.డి. పట్టా పొందిన ఆయన ప్రకృతి సేద్యాన్నే వృత్తిగా స్వీకరించారు. చింతలపూడి మండలం ప్రగడవరంలోని తమ 35 ఎకరాల్లో పామాయిల్, కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. 30 ఎకరాల్లో పామాయిల్ తోట ఉంది. ఐదెకరాల కొబ్బరి తోటలో కోకోను అంతర పంటగా సాగు చేస్తున్నారు. కొబ్బరి తోటకు 15 ఏళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడలేదు. భాస్కర్ సావే వంటి ప్రకృతి సేద్య నిపుణుల బోధనలకు ఆనాడే ప్రభావితుడైన ఆయన తన తోటలో ట్రాక్టర్‌తో ఎన్నడూ దుక్కి చేయలేదు. కలుపును సమస్యగా భావించలేదు. కలుపు మందులు చల్లలేదు. 8 ఏళ్ల క్రితమే జీవామృతంతో పసుపు పండించి ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించారు. కొబ్బరి చెట్ల మధ్య ఖాళీల్లో (సుమారు ఎకరం విస్తీర్ణం) ఈ ఏడాది 15 రకాల కూరగాయ పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నారు. అంతరపంటలకు అందించిన నీరు, జీవామృతం తప్ప.. కొబ్బరి తోట కోసం అదనంగా ఖర్చేమీ లేదు. అయినా, కొబ్బరి దిగుబడి రికార్డు స్థాయిలో ఉంది. 130 కొబ్బరి చెట్ల ద్వారా 25 వేల కొబ్బరి కాయల దిగుబడి వచ్చింది. బ్రకోలి, కాలీఫ్లవర్, బంగాళదుంప, బీట్ రూట్ వంటి పంటలను ఈ ప్రాంతంలో మొదటిసారిగా పండిస్తున్నారు. టమాటొ, క్యాబేజి, బెండ, చేమదుంప, పచ్చి మిర్చి, వంగ, దోస, క్యాప్సికం, సొర కాయ, నేతి బీర, అల్లం, పుదీన, ఉల్లితో పాటు ఆకుకూరలు సైతం పండిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులతోపాటు రసాయనిక కలుపు మందులూ చెంచాడు కూడా వాడకుండా పూర్తిస్థాయిలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో చక్కని దిగుబడులు పొందుతూ తోటి రైతుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండడం విశేషం. విజయవాడలోని ప్రత్యేక ప్రకృతి వ్యవసాయోత్పత్తుల దుకాణాలకు విక్రయిస్తున్నారు. అనూహ్యంగా బ్రకోలి దిగుబడి.. పది సెంట్ల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన 800 బ్రకోలి మొక్కలు చక్కని దిగుబడినిచ్చాయి. బ్రకోలిని సాధారణంగా పాలిహౌస్‌లలో, షేడ్నెట్ల కింద రెయిజ్డ్బెడ్లపై ఇన్లైన్ డ్రిప్‌తో అతి జాగ్రత్తగా సాగు చేస్తుంటారు. అయితే, ఆరు బయట పొలంలో సాగు చేస్తే అనూహ్యంగా చక్కని దిగుబడినివ్వడం తనకు అమిత ఆశ్చర్యాన్ని కలిగించిందని, కొన్ని బ్రకోలి పూలు 400 గ్రా. బరువు తూగాయని డా. క్రాంతికుమార్‌రెడ్డి తెలిపారు. బ్రకోలి మొక్క నుంచి పూవును కోసిన తర్వాత.. పక్క కొమ్మలకు మళ్లీ పూలు వస్తుండడం తనను మరింత ఆశ్చర్యపరుస్తోందన్నారు. వీటికి విజయవాడ సూపర్మార్కెట్లలో కిలో రూ. 200 వరకు ధర పలుకుతుందన్నారు. ఎకరం విస్తీర్ణంలో వేసిన కూరగాయల ద్వారా రూ. 80 వేల నుంచి లక్ష వరకు నికరాదాయం రావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. రసాయనిక వ్యవసాయంతో పోల్చితే తమకు అయిన ఖర్చు సగమేనని, ఇందులో కూలీల ఖర్చే అధికమన్నారు. పూర్తి సేంద్రియం కాబట్టే మంచి దిగుబడి..! కాగా, క్రాంతికుమార్ రెడ్డి తోటలో బ్రకోలి పంట దిగుబడి అద్భుతంగా వచ్చిందని ఉద్యాన అధికారి సంతోష్ (94410 59624) తెలిపారు. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసినందునే పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటిన వాతావరణంలోనూ నాణ్యమైన పంట వచ్చిందన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడితే ఇది అసాధ్యమన్నారు. వచ్చే సీజన్లో మరింత విస్తారంగా బ్రకోలి సేంద్రియ సాగు చేయిస్తామన్నారు. వెల్లుల్లి రసం+ వేపనూనె +గోమూత్రం పిచికారీ ప్రతి 10 రోజులకోసారి బోరు నీటి ద్వారా, పిచికారీ ద్వారా పంటలకు జీవామృతాన్ని అందిస్తున్నారు. దేశీ ఆవుల ఎరువు, గొర్రెలు, మేకల ఎరువుతోపాటు పంటలకు జీవామృతాన్ని అందిస్తున్నారు. 100 గ్రా. వెల్లుల్లి పాయలను మెత్తగా నూరి వడకట్టిన రసాన్ని.. 10 లీ. నీటిలో కలిపి పిచికారీ చేసి కాలీఫ్లవర్‌ను ఆశించే బూజు, లద్దె పురుగులను నివారిస్తున్నారు. పిచికారీ చేసేటప్పుడు దీనికి 100 గ్రా. వేపనూనెతోపాటు అర లీ. గోమూత్రాన్ని కలుపుతున్నారు. వేపనూనె వికర్షకంగా పనిచేయటం వల్ల కీటకాలు మొక్కలను ఆశించవు. గో మూత్రం వల్ల మొక్కలకు పోషకాలు అందుతాయి అంటారు క్రాంతికుమార్‌రెడ్డి. వాననీటి సంరక్షణతో సాగునీటి భద్రత పొలం మధ్యలో నుంచి ప్రవహిస్తున్న వాగులో మూడు చోట్ల కొండరాళ్లతో రెండేళ్ల క్రితం చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. గత ఏడాది చెక్ డ్యామ్‌ల మీదుగా వాన నీరు ప్రవహించింది. ఈ ఏడాది వర్షాలు బాగా తగ్గిపోవడంతో వాన నీరంతా చెక్‌డ్యామ్‌ల వద్దే భూమిలోకి ఇంకింది. తీవ్ర కరువు పరిస్థితుల వల్ల గ్రామ పరిసర ప్రాంత పొలాల్లో బోర్లు, మొక్కజొన్న తదితర పంటలు ఇప్పటికే నిలువునా ఎండిపోయాయి. అయినా.. క్రాంతికుమార్‌రెడ్డి తోటలోని బోర్లు (వీటి లోతు వందడుగులే) ఇప్పటికీ మూడించుల నీటిని పోస్తున్నాయి. ప్రకృతి సేద్య పద్ధతితోపాటు వాననీటి సంరక్షణలోనూ ఆయన ఆదర్శంగా నిలవడం ప్రశంసనీయం. తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించే రైతులు, ఉద్యోగస్తుల్లో కొందరు ప్రకృతి పద్ధతుల్లో కూరగాయ పంటల సాగుకు సిద్ధమవుతుండటం చాలా సంతోషం కలిగిస్తోందని క్రాంతికుమార్‌రెడ్డి సంబరపడుతున్నారు. - ఎస్.కె. అమీర్ పాషా, చింతలపూడి, ప.గో.జిల్లా భూమిని బాగు చేసుకుంటే ఏ పంటైనా పండుతుంది! ఉద్యాన తోటలతో పాటు చలిప్రాంతాల్లో పాలీహౌసుల్లో పండించే బ్రకోలి, కాలీఫ్లవర్ వంటి అరుదైన కూరగాయ పంటలను సైతం.. ప.గో. జిల్లా మెట్ట ప్రాంతంలో ఆరుబయట పొలాల్లోనూ పండించడం సాధ్యమేనని చాటి చెప్పడమే నా అభిమతం. చాలా ఏళ్లుగా ప్రకృతి సేద్య పద్ధతిని అమలు చేస్తుండడంతో సారవంతంగా మారిన మా పొలంలో మట్టి.. సేంద్రియ ఎరువును తలపిస్తున్నది. అందువల్లే కొబ్బరితోపాటు బ్రకోలి, కాలీఫ్లవర్ వంటి పంటలు ఆశ్చర్యకరమైన దిగుబడులిస్తున్నాయి. చింతలపూడి ఉద్యాన అధికారి సంతోష్ ప్రోత్సాహంతోనే బ్రకోలి ప్రయోగాత్మకంగా సాగు చేశా. వాననీటి సంరక్షణకు వాగులో చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో కరువును జయించడం సాధ్యమైంది. - డా. కనమతరెడ్డి క్రాంతికుమార్‌రెడ్డి (77020 84702), ప్రకృతి వ్యవసాయదారుడు, ప్రగడవరం, చింతలపూడి మం., ప.గో. జిల్లా 3 రోజులకో పిచికారీ.. నాగలి సాళ్లు తోలి (సాళ్ల మధ్య 2.5 అడుగులు, మొక్కల మధ్య 1.5 అడుగులు) నెల రోజుల బ్రకోలి మొక్కలు నాటారు. రెండు నెలల్లో 4 సార్లు జీవామృతం బోరు నీటి ద్వారా ఇచ్చారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రంతోపాటు వెల్లుల్లి+ వేపనూనె + ఆవు మూత్రం మిశ్రమం మాత్రమే వాడి పురుగులను అదుపుచేశారు. 3 రోజులకోసారి ఏదో ఒక ఇప్పటికి 15 సార్లు పిచికారీ చేశారు. బ్రహ్మజెముడుతో విద్యుత్ వెలుగులు! ఎడారి మొక్క బ్రహ్మజెముడు నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన ఘనతను మెక్సికో దక్కించుకుంది. నోపాలిమెక్స్ అనే కంపెనీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. బ్రహ్మజెముడు గుజ్జును ఉత్ప్రేరకాలు ఉన్న తొట్టెలో కలుపుతారు. దీని నుంచి ఉత్పత్తయిన మీథేన్‌ను మండించటం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. గ్రిడ్ ద్వారా అందించే విద్యుత్‌లో సగం ధరకే ఇది లభ్యం కావడం విశేషం. ప్రస్తుతం 300 గృహాలకు ఈ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. మరో 8 టన్నుల జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసి జిటాక్యూరో పట్టణంలోని వాహనాలకు రోజూ సరఫరా చేస్తున్నారు. నగరంలోని వాహనాలకు దీని వాడకం వల్ల గాసోలిన్ వినియోగాన్ని 40 శాతం వరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. దశాబ్దం క్రితం నొపాలిమెక్స్ కంపెనీ మొక్కజొన్న, బ్రహ్మజెముడు చిప్స్ తయారు చేసేది. ఆ కంపెనీ విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు గల అవకాశాలను పరిశీలించే క్రమంలో బ్రహ్మజెముడు నుంచి జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయాలనే ఆలోచన వారికి తట్టింది. 2024 నాటికల్లా మొత్తం విద్యుత్‌లో 35 శాతాన్ని ఈ పద్ధతిలోనే ఉత్పత్తి చేయాలని మెక్సికో ప్రభుత్వం భావిస్తోంది. కరువు ప్రభావిత ప్రాంతాలకు ఈ పంట సాగు ఉపయోగకరంగా ఉంటుంది. జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ఇతర పంటలకు అనువుకాని ప్రాంతాల్లో బ్రహ్మజెముడును సాగు చేయవచ్చు. మెక్సికోలోని ఎడారి ప్రాంతాల్లోనూ బ్రహ్మజెముడు వనాలు విసృ్తతంగా ఉన్నాయి. అక్కడ మామూలు పంటల సాగు సాధ్యం కాదు. ఇటువంటి ఎడారి ప్రాంతాల్లో బ్రహ్మజెముడును సాగు చేస్తే.. ఇప్పుడు జీవ ఇంధన పంటలను సాగు చేసుకునే భూముల్లో ఆహార పంటలు పండించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పుల్లడిగుంటలో 28న రైతు సదస్సు గుంటూరుకు 12 కిలోమీటర్ల దూరంలోని పుల్లడిగుంట గ్రామంలో ఈ నెల 28న (ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వైద్యం, జీవవైవిధ్యం తదితర అంశాలపై రైతునేస్తం ఫౌండేషన్ తదితర సంస్థలతో కలసి రైతులు, ప్రకృతి జీవన శైలి ప్రేమికుల కోసం సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకృతి ఫౌండేషన్ (మదనపల్లి) అధ్యక్షుడు ఎం. సి. వి. ప్రసాద్ తెలిపారు. అనుభవజ్ఞులైన ప్రకృతి వ్యవసాయదారులు, శాస్త్రవేత్తలతోపాటు ప్రకృతి వైద్యుడు డా. కుదరవల్లి విశ్వేశ్వరరావు తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : 094401 68816, 94905 59999 -
మామిడిపై ‘ఆకు తేళ్లు’ అవుట్!
* ఆకు జల్లెడ గూడు పురుగు నుంచి మామిడి తోటలకు విముక్తి * తొలిసారి అంతర్ధానమైన ఆకు జల్లెడ గూడు పురుగు * పముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డా. ఎం. సుగుణాకర్‌రెడ్డి వెల్లడి ఈసారి ఖరీఫ్ పంటలను చావు దెబ్బ తీసిన తీవ్ర కరువు.. మామిడి తోటలకు ఒక రకంగా మేలు చేసిందా? తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మామిడి తోటలకు ఆకు జల్లెడ గూడు పురుగు (Orthaga exvinacea : Leaf Skeletoniser and webber) ఆశిస్తూ, 10-15 శాతం మేరకు దిగుబడి నష్టాన్ని కలిగిస్తున్నది. అయితే, ఈ ఏడాది ఈ పురుగు ఉన్నట్టుండి అడ్రస్ లేకుండా పోయిందని విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డా. మహాకళ సుగుణాకర్ రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. మామిడి తోటలపై గత ముప్పయ్యేళ్లుగా తిష్టవేసి నష్టపరుస్తున్న ఈ పురుగు ఈ ఏడాది అనూహ్యంగా నాశనమైందని ఆయన తెలిపారు. ఆకు జల్లెడ గూడు పురుగు లార్వా ఆకుల ఈనెల మధ్యనున్న కణజాలాన్ని పూర్తిగా తినేసి, ఆకుల్ని జల్లెడలాగా చేసి ఈనెలను దగ్గరకు చేర్చి గూడును ఏర్పరచుకుంటుంది. ఇది ఆశించిన చెట్టు ఆకులు బాగా రాలిపోతాయి. ఈ పురుగు పూత దశలో పూలను, పూ మొగ్గలను ఆరగించి.. తర్వాత పూగుత్తుల్ని గూడుగా ఏర్పరుస్తుంది. క్వినాల్ఫాస్ తదితర మందులను పంట కాలంలో 3-4 సార్లు ట్రాక్టరుకు అమర్చిన స్ప్రేయర్ ద్వారా హైజెట్ నాజిల్‌తో పిచికారీ చేయాలి. అయినా, పూర్తిగా పోకుండా 10-15 శాతం వరకు పంట నష్టం కలిగిస్తుంటుంది. పూత దశలో ఈ పురుగులు సోకితే దిగుబడి మరింత నష్టం కలుగుతుంది. దీన్ని రైతులు ‘ఆకు తేళ్లు’ అని పిలుస్తుంటారని, తమ మామిడి తోటల్లోనూ ఇది ముప్పయ్యేళ్లుగా ఉందని, ఈ ఏడాది ఆశ్చర్యకరంగా పోయిందని డా. సుగుణాకర్‌రెడ్డి తెలిపారు. నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఈ పురుగు పోయిందని రైతులు తనతో చెప్పారన్నారు. ‘ఆకు తేళ్లు’ పూర్తిగా పోవడానికి గల కారణాలను శోధించాలని డా. సుగుణాకర్‌రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయానికి విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్ల నాటి ‘ఆకు తేళ్ల’ సిల్కు వస్త్రం! 1997లో తమ మామిడి తోటను పూర్తిగా ఆకు జల్లెడ గూడు పురుగు పూర్తిగా జల్లెడ పట్టేసిందని డా. సుగుణాకర్‌రెడ్డి తెలిపారు. అప్పుడు చెట్ల మీద ఒక్క ఆకూ మిగల్లేదని, వరుసగా రెండేళ్ల పాటు మామిడి దిగుబడిని పూర్తిగా నష్టపోయామన్నారు. ఈ పురుగు చెట్టు మీద నుంచి నేల మీదకు పాకుతూ దిగుతుంది. ఆ క్రమంలో పురుగు వదిలే సన్నని సిల్కుదారం చెట్టు కొమ్మలపై సున్నపు పూత మాదిరిగా కనిపించిందని, ఆ సిల్క్ పోగులన్నీ కలిసి ఒక పల్చని వస్త్రంలా ఏర్పడిందన్నారు. ఆ వస్త్రాన్ని డా. సుగుణాకర్‌రెడ్డి జాగ్రత్తగా సేకరించి, అప్పట్లోనే (1997-98) ఉద్యాన నిపుణుల దృష్టికి తీసుకెళ్లారు. ఆకు తేళ్ల బెడద అంత ఎక్కువగా ఉంటుందన్న విషయం అంతకు పూర్వం తెలియదని డా. సుగుణాకర్‌రెడ్డి (94416 77401) తెలిపారు. బత్తాయి, ఆరెంజ్ తోటల్లో ప్రకృతి సేద్యంపై అధ్యయన యాత్ర తక్కువ నీటితో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా బత్తాయి, నారింజ తోటలను సాగు చేయాలనుకునే తెలుగు రైతుల కోసం అక్టోబర్ 8-11 తేదీల్లో అధ్యయన యాత్రతో కూడిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామభారతి ప్రధాన కార్యదర్శి పి. కరుణాకర్ గౌడ్ తెలిపారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ స్వయంగా వెంట ఉండి మహారాష్ట్రలోని కాటోల్ జిల్లాలో ఈ పద్ధతిలో సాగయ్యే బత్తాయి, నాగపూర్ నారింజ తోటలను అక్టోబర్ 8,9 తేదీల్లో చూపిస్తారు. ఈ తోటలను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడంపై నాగపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని కాటోల్ పట్టణంలో 10,11 తేదీల్లో పాలేకర్ రైతులకు శిక్షణ ఇస్తారు. ఈ నాలుగు రోజులకు రవాణా వసతి, భోజన ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరు రూ. 1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన రైతులు కాటోల్కు చెందిన మనోజ్ జనాన్లాల్ (098225 15913) లేదా హేమంత్ చౌహాన్ (075886 90688)ను లేదా హైదరాబాద్‌లోని కరుణాకర్ గౌడ్ (94404 17995)ను సంప్రదించి పేరు నమోదు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతుల్లో శాశ్వత వ్యవసాయం (పర్మాకల్చర్) ఒకటి. శాశ్వత వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న వారు అనేక దేశాల్లో విస్తరించి ఉన్నారు. శాశ్వత వ్యవసాయంపై అంతర్జాతీయ మహాసభ (సెప్టెంబర్ 7-17) లండన్‌లో జరుగుతున్నది. తదుపరి అంతర్జాతీయ మహాసభను 2017లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా పర్మాకల్చర్ అంతర్జాతీయ సంఘం నేతలు ప్రకటించారు. తెలంగాణకు చెందిన పర్మాకల్చర్ నిపుణులు కొప్పుల నరసన్న, పద్మ దంపతులు హైదరాబాద్ మహాసభ (నవంబర్ 15-23, 2017) నిర్వహణ బాధ్యతను లండన్ సభలో స్వీకరించారు. అంతర్జాతీయ మహాసభకు ముందే వచ్చే ఫిబ్రవరి 5-7 మధ్య పర్మాకల్చర్ జాతీయ మహాసభను నిర్వహించనున్నామని నరసన్న తెలిపారు. భారతీయ శాశ్వత వ్యవసాయ విభాగానికి తెలుగునాట డా. వెంకట్ తదితరులు పునాదులు వేసి 30 ఏళ్లవుతున్నది. ఈ పూర్వరంగంలో పర్మాకల్చర్ జాతీయ, అంతర్జాతీయ మహాసభలకు హైదరాబాద్ వేదిక కానుండడం విశేషం. వివరాలకు.. permacultureindia.org వెబ్సైట్ చూడొచ్చు. -
కరువు నిజమే..
కడప సెవెన్ రోడ్స్ : వైఎస్ఆర్ జిల్లాలో తీవ్ర కరువు నెలకొందని, పరిస్థితిని కేంద్రానికి నివేదిస్తామని బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర కరువు పరిశీలక బృంద సభ్యులు తెలిపారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ డెరైక్టర్ వందనా సింగాల్, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖకు చెందిన వాటర్ క్వాలిటీ స్పెషలిస్టు డాక్టర్ బ్రజేష్ శ్రీ వాత్సవ, నీతి అయోగ్ సీనియర్ రీసెర్చి ఆఫీసర్ డాక్టర్ రామానంద్‌లతో కూడిన కేంద్ర కరువు పరిశీలక బృందం బుధవారం సాయంత్రం కడప నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకుంది. జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సభ్యులు తిలకించారు. ఖరీఫ్, రబీ మొత్తం కలిపి ఈ ఏడాది సాధారణం కంటే 52.5 శాతం వర్షపాతం తగ్గిందని కలెక్టర్ కేవీ రమణ వారికి వివరించారు. సాధారణ సాగు విస్తీర్ణం కూడా బాగా పడిపోయిందని చెప్పారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు, పత్తి, కంది, వరి, శనగ దిగుబడులు దారుణంగా పడిపోయాయని తెలిపారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉందని చెప్పారు. పలు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా, మరికొన్ని చోట్ల వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకోవడం ద్వారా ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. ఉపాధి పనులను చేపట్టడం ద్వారా వలసలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కరువు బృందం వెంట ఉన్నారు. కాగా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య.. జిల్లాలో నెలకొన్న కరువు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై కేంద్ర బృందానికి వినతిపత్రం సమర్పించారు. ఇక్కడి కరువు తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తమ బాధ్యత అని కరువు పరిశీలక బృందం సభ్యులు స్పష్టం చేశారు. అనంతరం వారు రామాపురం, లక్కిరెడ్డి పల్లె మండలాల్లో పర్యటించారు. సహాయక చర్యలు చేపట్టాలి : సీపీఐ జిల్లా అంతటా కరువు నెలకొన్నందున యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య, నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ, ఆ పార్టీ అనుబంధ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.రామసుబ్బారెడ్డి, జి.చంద్రలు కోరారు. గ్రామాల్లో కొత్త బోర్లు వేయడంతోపాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. రిజర్వాయర్లు, చెరువుల ద్వారా నీరందించాలన్నారు. ఖరీఫ్ మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లో గ్రామీణ ఉపాధి హామి పనులు చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలన్నారు. జిల్లాకు సరిపడ పశుగ్రాసాన్ని ఉచితంగా అందించి ఆదుకోవాలని కోరారు. రైతులు, వృద్ధులకు కరువు భత్యాన్ని చెల్లించాలని, 35 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. అన్ని రకాల వ్యవసాయ రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. నిబంధనలతో సంబంధం లేకుండా మామిడి, బొప్పాయి, అరటి, చీని, సపోట, జామ, దానిమ్మ తదితర పండ్ల తోటలకు వంద శాతం పంటల బీమా చెల్లించాలన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రాతిపదికన కరువు నిధులను దళితవాడల్లోనే ఖర్చు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చంద్రశేఖర్, సుబ్బరాయుడు, శివ, గంగా సురేష్ పాల్గొన్నారు. -
నీళ్లివ్వండి బాబూ..
కరువు దరువు తీవ్ర వర్షాభావంతో అడుగంటిన భూగర్భ జలాలు గుక్కెడు మంచి నీళ్లకోసం ఇక్కట్లు పనులు లేక వలసలు కబేళాలకు తరలుతున్న మూగజీవాలు మొర ఆలకించాలని ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల వేడుకోలు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో సేద్యం పడకేసింది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావులు ఒట్టిపోతున్నాయి. జిల్లాలో కొన్నిచోట్ల పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఉపాధి పనుల్లేక కూలీలు పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. ఎన్నడూ లేని విపత్కర పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ముఖ్యంగా పడమటి మండలాల్లో పశుగ్రాసం కొరతతో అన్నదాతలు కంట తడి పెడుతూ వాటిని పోషించలేక కబేళాలకు తరలిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి పరిస్థితులు కళ్లముందే కన్పిస్తున్నా ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లావాసి అయినప్పటికీ కనీసం ప్రజల గొంతు తడపడంలో కూడా చొరవ చూపలేదనే అభిప్రాయం జిల్లా ప్రజల్లో వ్యక్తమౌతోంది. సాక్షాత్తు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే రైతాంగం కుప్పకూలి పనులు లేక వలస పోతున్నా కనీసం ధైర్యం చెప్పి పనులు కల్పించిన దాఖలాలు కూడా లేవు. జిల్లాలో వేసవికి ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే ముందుకాలంలో మరింత గడ్డు పరిస్థితులు తప్పవని జిల్లా ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గురువారం నీరు-చెట్టు కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రికి కనీసం తాగునీరు, ఉపాధి పనులు కల్పించాలని వేడుకుంటున్నారు. గుక్కెడు మంచి నీళ్లకోసం.. జిల్లాలో ఇప్పటికే దాదాపు 2000లకు పైగా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు మూడు రోజులకు కూడా నీటి ట్యాంకరు వెళ్లకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో కుటుంబానికి బిందె నీటితోనే గడపాల్సిన గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. పడమటి మండలాల్లో మంచినీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో 216 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో 1,000 నుంచి 1,200 అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్కనీరు రాక రైతులు విలవిలలాడుతున్నారు. పనులు లేక.. జిల్లాలో వ్యవసాయ బోర్లలో నీరు అడుగంటడంతో పనులు లేక కుటుంబాలు కుటుంబాలే గ్రామాలను వదలి పనుల కోసం వలసలు వెళుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే చిన్నపిల్లలు, ముసలి వాళ్లే దర్శనమిస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఇప్పటికే 2.2 లక్షల మంది వలస వెళ్లినట్లు సమాచారం. ఇందులో కుప్పం నియోజకవర్గం నుంచే 45 వేల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. చెరువుల్లో పూడికతీత పనులను సైతం యంత్రాలతో చేయిస్తుండడంతో ఇంకా ఈ వలసల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మూగజీవాల రోదన జిల్లాలో పశువులకు మేత దొరక్క అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్ గడ్డి 7 వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నా దొరకడం లేదు. తాగునీటితో పాటు గడ్డి లేకపోవడంతో పడమటి మండలాల్లో పశువుల ఆకలి బాధను చూడలేక సంతలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వాటిని కబేళాలకు తెగనమ్ముకుంటున్నారు. దీంతో అన్నదాత కుదేలు కావడంతో పాటు పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. -
ముంచుకొస్తున్న ముప్పు
కడప ఎడ్యుకేషన్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో మంచినీటి ఎద్దడి రోజురోజుకు ముంచుకొస్తోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 80 అడుగుల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. దీనికి తోడు ఈ ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కరువు తాండవం చేయనుంది. సాధారణ వర్ష పాతం 644 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకూ 322.7 మిల్లీ మీటర్లు వర్షం మాత్రమే కురిసింది. సాధారణం కంటే 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రాయచోటి, సుండుపల్లి, గాలివీడు, పులివెందుల, లింగాల మండలాల్లో చాలా మేర పంటలు ఎండుముఖం పట్టాయి. అక్కడ జనం మంచి నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకులతో మంచి నీరు సరఫరా : జనవరిలోనే పరిస్థితి ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని రాయచోటి, రాజంపేట, కోడూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలలోని పలు గ్రామాలకు ట్యాంకుల ద్వారా ఆర్డ బ్ల్యూఎస్ అధికారులు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలో 16 గ్రామాలకు 19 ట్రిప్పులతో 32 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. అలాగే లక్కిరెడ్డిపల్లె మండలంలో 11 గ్రామాలకు 13 ట్రిప్పులతో 11 ప్రైవేటు బోర్లను, రామాపురం మండలంలో 12 గ్రామాలకు 23 ట్రిప్పులతో 7 ప్రైవేటు బోర్లను, రాయచోటి మండలంలో 21 గ్రామాలకు 24 ట్రిప్పులతో 18 ప్రైవేటు బోర్లను, సంబేపల్లి మండలంలో 6 గ్రామాలకు 8 ట్రిప్పులతో 8 ప్రైవేటు బోర్లను, చిన్నమండెం మండలంలో 17 గ్రామాలకు 16 ట్రిప్పులతో 4 ప్రైవేటు బోర్లను ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే రాజంపేట మండలంలో 69 గ్రామాలకు 134 ట్రిప్పులతో, 21 ప్రైవేటు బోర్లతో, కోడూరు మండలంలో 17 గ్రామాలకు 33 ట్రిప్పులను, కమలాపురం మండలంలో 8 గ్రామాలకు 16 ట్రిప్పులతోపాటు 4 ప్రైవేటు బోర్లతో, పులివెందుల మండలంలో 12 గ్రామాలకు 58 ట్రిప్పులతోపాటు 5 ప్రైవేటు బోర్లతో మంచినీటిని సరఫరా చేస్తున్నారు. రూ.14 కోట్ల 40 లక్షలతో ప్రణాళిక సిద్ధం: జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణ కోసం రూ.14కోట్ల 40 లక్షలతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నివేదికలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 4031 గ్రామాలకు గాను 608 గ్రామాలకు మంచినీటిని ట్యాంకుల ద్వారా సరఫరా చేసేందుకు రూ.10 కోట్ల 41 లక్షలతో, 605 గ్రామాల్లో 605 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకునేందుకు రూ.కోటి 81 లక్షలతో, 255 బోర్లలో పూడికను తీసేందుకు రూ.కోటి రెండు లక్షలను, ప్రస్తుతం ఉన్న 127 బోర్లను మరింత లోతుగా వేసేందుకు రూ.కోటి 14 లక్షలతో నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ నిధులను ప్రభుత్వం త్వరితగతిన విడుదల చేస్తే మంచినీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అడుగంటిన భూగర్భ జలాల వివరాలు మండలం లోతులో ఉన్న నీరు పులివెందుల 95 మీటర్లు వీరపునాయునిపల్లె 80 మీటర్లు చిట్వేలి 73 మీటర్లు లింగాల 70 మీటర్లు అట్లూరు 65 మీటర్లు పెండ్లిమర్రి 62 మీటర్లు కలసపాడు 60 మీటర్లు చింతకొమ్మదిన్నె 50 మీటర్లు కోడూరు 47 మీటర్లు -
కరువు తీరా వాన..
అల్పపీడన ద్రోణితో జిల్లాలో భారీ వర్షాలు ►పశ్చిమంలో నిండిన చెరువులు, కుంటలు ►తూర్పు ప్రాంతంలోనూ మోస్తరు వర్షం ►వరదెత్తిన కాగ్నా, మూసీ నదులు ►పొంగిపొర్లిన లఖ్నాపూర్ ప్రాజెక్టు ►తెగిన రోడ్లు, జలదిగ్బంధంలో పలు గ్రామాలు ► పరిగి డివిజన్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు 1 పరిగి మండలంలోని లఖ్నాపూర్ ప్రాజెక్టు అలుగు పొంగిపొర్లి ప్రవహించడంతో తరలివచ్చిన ప్రజలు 2 చేవెళ్ల డివిజన్ పరిధిలోని అమ్డాపూర్ సమీపంలో నీటమునిగిన చామంతి తోట 3 పరిగి మండలం నజీరాబాద్ తండాలో వరదలో కొట్టుకుపోయిన పత్తిపంటను చూపిస్తూ రోదిస్తున్న గిరిజన మహిళ సాక్షి, రంగారెడ్డి జిల్లా: తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లాను తాజా అల్పపీడనద్రోణి ఆదుకుంది. చినుకుల జాడలేక వాడిపోతున్న పంటలకు భారీ ఊరటనిచ్చింది. ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ ప్రాంతంలో కురుస్తున్న వానల ప్రభావంతో ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగుపారుతున్నాయి. మరోవైపు తూర్పువైపు సైతం ఆశాజనకంగా కురుస్తున్న వర్షాలతో రైతాంగం ఆనందంలో మునిగింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలతో రవాణావ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పశ్చిమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో జనావాసాల మధ్య వరదనీరు చేరడంతో స్థానికంగా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. శంషాబాద్ మండలం కే.బీ.దొడ్డి గ్రామంలోకి వరదనీరు చేరడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లి గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండ్రోజులుగా ఈ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. సెల్ఫోన్లు సైతం మూగబోవడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎడతెరపి లేకుండా.. వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి జిల్లాలోని నదులు వరదెత్తాయి. దీంతో వరద ప్రవాహ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు జలాలతో కళకళలాడుతున్నాయి. యాలాల మండలం అన్నాసాగర్ ఊర చెరువు, అచ్యుతాపూర్ పెద్ద చెరువు, కమాల్‌పూర్‌లోని షేక్‌పుర చెరువులకు గండి పడడంతో నీరంతా పొలాల్లోకి చేరింది. భారీ వర్షాల కారణంగా కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది. మూసీ, ఈసీ వాగులు సైతం రోడ్లెక్కి ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ స్తంభించిందింది. జిల్లాలో పెద్దప్రాజెక్టులైన కోట్‌పల్లి ప్రాజెక్టుకు వరదనీరు జోరందుకుంది. మరోవైపు పరిగి ప్రాంతంలో సాగునీటికి కీలకమైన లఖ్నాపూర్ ప్రాజెక్టు అలుగు ప్రవహిస్తోంది. మూసీ, ఈసీ వాగుల ప్రవాహం అధికమై జంట జలాశయాలకు పరుగులు పెడుతోంది. కాగ్నా వరద ప్రభావంతో తాండూరు-మహబూబ్‌నగర్ మార్గం పూర్తిగా దెబ్బతింది. దీంతో కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. కంది-షాద్‌నగర్, చేవెళ్ల-శంకర్పల్లి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా పరిగి డివిజన్లో 12 సెంటీమీటర్లు, సరూర్‌నగర్ డివిజన్లో 2.17, రాజేంద్రనగర్ డివిజన్లో 1.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. నీట మునిగిన పొలాలు.. వర్షాల ధాటికి వాన నీరంతా వరదై ప్రవహిస్తోంది. మరోవైపు చెరువులకు గండ్లు పడడం..ప్రాజెక్టులు పొంగి పొర్లడంతో పలు గ్రామాల్లో వేల హెక్టార్లలో పంటలు జలమయమయ్యాయి. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్ల తోటలు, కూరగాయల పంటలు నీటమునిగాయి. కరువుతో అల్లాడుతూ వానలు కురవాలని కోరుకుంటున్న రైతులను.. తాజా వానలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వానల వల్ల మెట్టపంటలకు పెద్దగా ముప్పు లేనప్పటికీ.. కూరగాయల పంటలు మాత్రం కొంతమేర దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే తరహాలో మరో మూడు రోజులు వరుసగా వర్షాలు కురిస్తే అన్నిరకాల పంటలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు విజయ్‌కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. సోమవారానికి వర్షం తెరిపిస్తే కొన్ని పంటలకు మేలు జరిగే అవకాశం ఉందన్నారు. -
కరువు జిల్లాగా ప్రకటించాలి
ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి ►ఆత్మస్థైర్యం కోసం అవగాహన సదస్సులు నిర్వహించాలి ►వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ డిమాండ్ వర్గల్: జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొన్నందునా కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ డిమాండ్ చేశారు. మరోవైపు రైతుల ఆత్మహత్యలకు గత నాలుగేళ్ల కాంగ్రెస్ పాలనే కారణమని మండిపడ్డారు. శుక్రవారం వర్గల్ మండలం మైలారం గ్రామంలో బలవన్మరణానికి పాల్పడిన రైతు బాలాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. రైతు మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుగౌడ్ విలేకరులతో మాట్లాడారు. రైతులకు భరోసా కల్పించేందుకు, బలవన్మరణాలకు అడ్డుకట్టవేసేందుకు సీఎం కేసీఆర్ తక్షణం కార్యాచరణ చేపట్టాలన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, ఆంక్షలతో నిమిత్తం లేకుండా రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వానల్లు లేక, కరెంట్ రాక, పంటలకు నీరందక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును రాజుగా చూడాలని తపించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రుణమాఫీ, ఉచిత కరెంట్‌తో అండగా నిలిచారని, ఆయన రైతు బాంధవునిగా చెరగని ముద్రవేశారన్నారు. ప్రస్తుత దయనీయ పరిస్థితిలో ఉన్న రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి ఆత్మస్థైర్యం కల్పించాలన్నారు. రైతులు మనోనిబ్బరంతో ఉండాలని, మీ పిల్లలకు, కుటుంబాలకు పెద్ద దిక్కులేకుండా బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. రైతు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ సంగారెడ్డి నేత సుధాకర్ గౌడ్, జగదీశ్వర్ రావు, ఆందోలు నాయకుడు సంజీవరావు, సిద్దిపేట నేత జగదీశ్వర్ గుప్త, మెదక్ నేత అల్లారం క్రీస్తుదాసు, స్థానిక నేతలు ఎల్లంగౌడ్ ఉన్నారు. -
నెలన్నర ఆలస్యంగా ఖరీఫ్ సాగు
•అక్టోబర్ వరకు వర్షాలు కురిస్తేనే పంటలు చేతికి •వరుణుడిపైనే భారం వేసిన రైతులు దౌల్తాబాద్: మండలంలో వర్షాధారంగా సాగు నెలన్నర ఆలస్యంగా మొదలైంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో వర్షాలు పడి పత్తి, మొక్కజొన్న తదితర విత్తనాలను వేస్తారు. కానీ ఈసారి తీవ్ర వర్షాభావం కారణంగా సకాలంలో విత్తనాలు పడలేదు. జూలై మూడవ వారంలో మాత్రమే కురిసిన కొద్దిపాటి వర్షాలకు రైతులు విత్తనాలు వేశారు. జూలై నెలలో సాధారణ వర్షపాతం 234 మిల్లీమీటర్లు కాగా మూడు వారాలు ముగి సినా కేవలం 55 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అదికూడా మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పడింది. ఈ వర్షాలకు వేసిన పత్తి, మొక్కజొన్న విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. రెండుమూడేళ్ళుగా సకాలంలో వేసిన పంటలు కాతపూత దశలో వర్షాభావం కారణంగా కొంతవరకు దెబ్బతిన్నాయి. ప్రస్థుతం నెలన్నర ఆలస్యంగా వేసిన విత్తనాలు మొలిచి పంటపండాలంటే కాతపూత దశలో వర్షాలు కురువాల్సిందే. కనీసం అక్టోబర్ నెలాఖరు వరకు వర్షాలు పడితేనే ఈ పంటలు గట్టెక్కుతాయి. అయినప్పటికీ రైతులు వరుణు దేవునిపై భారం వేసి విత్తనాలు వేస్తున్నారు. ఇప్పటికే కొందరు రైతులు సరిగ్గా మొలకెత్తకపోవడంతో రెండు మూడు సార్లు విత్తనాలు వేశారు. దీంతో పెట్టుబడి వ్యయం తడిసి మోపెడవుతున్నది. ఇక ముందైనా సరైన వర్షాలు కురవకపోతే రైతులు తీవ్ర అప్పుల ఊబిలోకి కూరుకుపోయే ప్రమాదం పొంచివున్నది.