* ఆకు జల్లెడ గూడు పురుగు నుంచి మామిడి తోటలకు విముక్తి
* తొలిసారి అంతర్ధానమైన ఆకు జల్లెడ గూడు పురుగు
* పముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డా. ఎం. సుగుణాకర్‌రెడ్డి వెల్లడి
ఈసారి ఖరీఫ్ పంటలను చావు దెబ్బ తీసిన తీవ్ర కరువు.. మామిడి తోటలకు ఒక రకంగా మేలు చేసిందా? తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మామిడి తోటలకు ఆకు జల్లెడ గూడు పురుగు (Orthaga exvinacea : Leaf Skeletoniser and webber) ఆశిస్తూ, 10-15 శాతం మేరకు దిగుబడి నష్టాన్ని కలిగిస్తున్నది. అయితే, ఈ ఏడాది ఈ పురుగు ఉన్నట్టుండి అడ్రస్ లేకుండా పోయిందని విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డా. మహాకళ సుగుణాకర్ రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు.
మామిడి తోటలపై గత ముప్పయ్యేళ్లుగా తిష్టవేసి నష్టపరుస్తున్న ఈ పురుగు ఈ ఏడాది అనూహ్యంగా నాశనమైందని ఆయన తెలిపారు. ఆకు జల్లెడ గూడు పురుగు లార్వా ఆకుల ఈనెల మధ్యనున్న కణజాలాన్ని పూర్తిగా తినేసి, ఆకుల్ని జల్లెడలాగా చేసి ఈనెలను దగ్గరకు చేర్చి గూడును ఏర్పరచుకుంటుంది. ఇది ఆశించిన చెట్టు ఆకులు బాగా రాలిపోతాయి. ఈ పురుగు పూత దశలో పూలను, పూ మొగ్గలను ఆరగించి.. తర్వాత పూగుత్తుల్ని గూడుగా ఏర్పరుస్తుంది. క్వినాల్‌ఫాస్ తదితర మందులను పంట కాలంలో 3-4 సార్లు ట్రాక్టరుకు అమర్చిన స్ప్రేయర్ ద్వారా హైజెట్ నాజిల్‌తో పిచికారీ చేయాలి. అయినా, పూర్తిగా పోకుండా 10-15 శాతం వరకు పంట నష్టం కలిగిస్తుంటుంది.
పూత దశలో ఈ పురుగులు సోకితే దిగుబడి మరింత నష్టం కలుగుతుంది. దీన్ని రైతులు ‘ఆకు తేళ్లు’ అని పిలుస్తుంటారని, తమ మామిడి తోటల్లోనూ ఇది ముప్పయ్యేళ్లుగా ఉందని, ఈ ఏడాది ఆశ్చర్యకరంగా పోయిందని డా. సుగుణాకర్‌రెడ్డి తెలిపారు. నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఈ పురుగు పోయిందని రైతులు తనతో చెప్పారన్నారు. ‘ఆకు తేళ్లు’ పూర్తిగా పోవడానికి గల కారణాలను శోధించాలని డా. సుగుణాకర్‌రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయానికి విజ్ఞప్తి చేశారు.
18 ఏళ్ల నాటి ‘ఆకు తేళ్ల’ సిల్కు వస్త్రం!
1997లో తమ మామిడి తోటను పూర్తిగా ఆకు జల్లెడ గూడు పురుగు పూర్తిగా జల్లెడ పట్టేసిందని డా. సుగుణాకర్‌రెడ్డి తెలిపారు. అప్పుడు చెట్ల మీద ఒక్క ఆకూ మిగల్లేదని, వరుసగా రెండేళ్ల పాటు మామిడి దిగుబడిని పూర్తిగా నష్టపోయామన్నారు. ఈ పురుగు చెట్టు మీద నుంచి నేల మీదకు పాకుతూ దిగుతుంది. ఆ క్రమంలో పురుగు వదిలే సన్నని సిల్కుదారం చెట్టు కొమ్మలపై సున్నపు పూత మాదిరిగా కనిపించిందని, ఆ సిల్క్ పోగులన్నీ కలిసి ఒక పల్చని వస్త్రంలా ఏర్పడిందన్నారు.
ఆ వస్త్రాన్ని డా. సుగుణాకర్‌రెడ్డి జాగ్రత్తగా సేకరించి, అప్పట్లోనే (1997-98) ఉద్యాన నిపుణుల దృష్టికి తీసుకెళ్లారు. ఆకు తేళ్ల బెడద అంత ఎక్కువగా ఉంటుందన్న విషయం అంతకు పూర్వం తెలియదని డా. సుగుణాకర్‌రెడ్డి (94416 77401) తెలిపారు.
బత్తాయి, ఆరెంజ్ తోటల్లో ప్రకృతి సేద్యంపై అధ్యయన యాత్ర
తక్కువ నీటితో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా బత్తాయి, నారింజ తోటలను సాగు చేయాలనుకునే తెలుగు రైతుల కోసం అక్టోబర్ 8-11 తేదీల్లో అధ్యయన యాత్రతో కూడిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామభారతి ప్రధాన కార్యదర్శి పి. కరుణాకర్ గౌడ్ తెలిపారు.
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ స్వయంగా వెంట ఉండి మహారాష్ట్రలోని కాటోల్ జిల్లాలో ఈ పద్ధతిలో సాగయ్యే బత్తాయి, నాగపూర్ నారింజ తోటలను అక్టోబర్ 8,9 తేదీల్లో చూపిస్తారు. ఈ తోటలను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడంపై నాగపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని కాటోల్ పట్టణంలో 10,11 తేదీల్లో పాలేకర్ రైతులకు శిక్షణ ఇస్తారు. ఈ నాలుగు రోజులకు రవాణా వసతి, భోజన ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరు రూ. 1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన రైతులు కాటోల్‌కు చెందిన మనోజ్ జనాన్‌లాల్ (098225 15913) లేదా హేమంత్ చౌహాన్ (075886 90688)ను లేదా హైదరాబాద్‌లోని కరుణాకర్ గౌడ్ (94404 17995)ను సంప్రదించి పేరు నమోదు చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ
పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతుల్లో శాశ్వత వ్యవసాయం (పర్మాకల్చర్) ఒకటి. శాశ్వత వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న వారు అనేక దేశాల్లో విస్తరించి ఉన్నారు. శాశ్వత వ్యవసాయంపై అంతర్జాతీయ మహాసభ (సెప్టెంబర్ 7-17) లండన్‌లో జరుగుతున్నది. తదుపరి అంతర్జాతీయ మహాసభను 2017లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా పర్మాకల్చర్ అంతర్జాతీయ సంఘం నేతలు ప్రకటించారు.
తెలంగాణకు చెందిన పర్మాకల్చర్ నిపుణులు కొప్పుల నరసన్న, పద్మ దంపతులు హైదరాబాద్ మహాసభ (నవంబర్ 15-23, 2017) నిర్వహణ బాధ్యతను లండన్ సభలో స్వీకరించారు. అంతర్జాతీయ మహాసభకు ముందే వచ్చే ఫిబ్రవరి 5-7 మధ్య పర్మాకల్చర్ జాతీయ మహాసభను నిర్వహించనున్నామని నరసన్న తెలిపారు. భారతీయ శాశ్వత వ్యవసాయ విభాగానికి తెలుగునాట డా. వెంకట్ తదితరులు పునాదులు వేసి 30 ఏళ్లవుతున్నది. ఈ పూర్వరంగంలో పర్మాకల్చర్ జాతీయ, అంతర్జాతీయ మహాసభలకు హైదరాబాద్ వేదిక కానుండడం విశేషం. వివరాలకు.. permacultureindia.org వెబ్‌సైట్ చూడొచ్చు.
మామిడిపై ‘ఆకు తేళ్లు’ అవుట్!
Published Tue, Sep 15 2015 3:46 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
Advertisement
Advertisement