సాక్షి, అమరావతి: ఖరీఫ్ పంట కాలం దాదాపుగా పూర్తయింది. ఇప్పటికీ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో లభ్యత ఆధారంగా రెండో పంటకూ నీళ్లందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో ధవళేశ్వరం బ్యారేజ్, కొవ్వాడ కాల్వ రిజర్వాయర్ మినహా నీటి నిల్వ చేసే జలాశయాలు లేవు. వాటి సామర్థ్యం కూడా 3.65 టీఎంసీలే.
ఆ రిజర్వాయర్లలో 3.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గోదావరిలో సహజసిద్ధ ప్రవాహం, సీలేరులలో లభ్యత ఆధారంగా గోదావరి డెల్టాలో రెండో పంటకు ప్రభుత్వం నీటిని విడుదల చేయనుంది. కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు పులిచింతల, గాజులదిన్నె, భైరవానితిప్ప ప్రాజెక్టులలో 586.21 టీఎంసీలకుగాను 506.97 టీఎంసీలు (86.48%) నిల్వ ఉన్నాయి.
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారడిన ప్రాజెక్టులతోపాటు కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలు చివరి దశకు చేరుకున్నాయి. శ్రీశైలం, సాగర్‌లలో లభ్యత ఆధారంగా రెండు రాష్ట్రాలకు డిసెంబర్ 6న త్రిసభ్య కమిటీ నీటి పంపకాలు చేయనుంది. పులిచింతలలో 45.77 టీఎంసీలకుగానూ 45.31 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా బేసిన్‌లోని ఆయకట్టుకు రెండో పంటకు కూడా నీరందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పెన్నా ప్రధాన పాయపై అప్పర్ పెన్నార్ నుంచి నెల్లూరు బ్యారేజ్ వరకూ అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. ఈ జలాశయాల నిల్వ సామర్థ్యం 238.75 టీఎంసీలు. ప్రస్తుతం 195.55 టీఎంసీలు ఉన్నాయి. ఈ బేసిన్‌లోని సోమశిల, కండలేరు, పెన్నా డెల్టాలో పంటలకు నీటిని విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఏలేరు, వంశధార, నాగావళి బేసిన్‌లలోనూ..
ఏలేరు, వంశధార, నాగావళి తదితర బేసిన్‌ల పరిధిలోని ప్రాజెక్టుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 154.87 టీఎంసీలు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో 114.36 టీఎంసీలు (73.86 శాతం) ఉన్నాయి. ఏలేరు, వంశధార, తోటపల్లి తదితర ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై ఐఏబీ(నీటిపారుదల సలహా మండలి) సమావేశాలలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment