పాతాళానికి భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావం, విచ్చలవిడిగా తోడేయడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్నాయి. జనవరితో పోలిస్తే మార్చి నాటికి అంటే రెండు నెలల్లోనే ఏకంగా 1.13 మీటర్ల అదనపు లోతుల్లోకి వెళ్లిపోయాయి. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా సగటున 13.75 మీటర్ల లోతులో జలం లభించగా.. మార్చిలో అది 14.88 మీటర్లకు పడిపోయింది.
అలాగే గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ మార్చిలో 2.61 మీటర్ల అదనపు లోతులోకి భూగర్భ జలాలు అడుగంటాయని భూగర్భ జల శాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాది మార్చిలో 12.27 మీటర్ల లోతులో నీరు లభ్యం కాగా... ఈ మార్చిలో 14.88 మీటర్ల లోతులోకి అడుగంటాయి. గత ఏడాది మేతో పోల్చినా ఈ ఏడాది మార్చి నెలలోనే అధికంగా జలాలు పడిపోవడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. వేసవికాలం ఇంకా నెలన్నరకు పైగా ఉండడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.
మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో అధ్వానం
రాష్ట్రంలో మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భూగర్భ జలాలు మరింతగా అడుగంటా యి. మెదక్ జిల్లాలో గతేడాది 18.39 మీటర్ల లోతులో జలాలు లభ్యం కాగా... ఈ ఏడాది మార్చిలో 24.34 మీటర్ల లోతు కు పడిపోయాయి. అంటే ఏకంగా 5.95 మీటర్లు లోపలికి వెళ్లిపోయాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో గతేడాది మార్చిలో 14.29మీటర్ల లోతులో నీరుండగా... ఈ మార్చిలో 5.31 మీటర్లు అదనంగా 19.60 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. దీంతో తాగునీటికి కూడా కటకట ఏర్పడింది.