ఎండిన బోరు బావికి జీవకళ
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు భీమేష్. అనంతపురం జిల్లా పుట్లూరుకు చెందిన రైతు. ఆరు ఎకరాలు పొలం ఉంది. గతంలో 1,250 అడుగులు తవ్విన బోరు బావి ఎండిపోవడంతో పొలం బీడుగా మారింది. 2020 నాటికి పుట్లూరు మండలంలో భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం, వాన నీటిని ఒడిసిపట్టి చెరువులను నింపుతుండటంతో ఎండిన భీమేష్ బోరుబావికి జలకళ వచ్చింది. నాలుగు ఎకరాల్లో బత్తాయి, రెండు ఎకరాల్లో వేరుశెనగ సాగు చేసిన భీమేష్ రెండో పంటగా మొక్కజొన్న సాగుకు సిద్ధమయ్యాడు.
సాక్షి, అమరావతి: పాతాళగంగ పైపైకి వస్తోంది. ఎండిన బోరు బావుల నుంచి జలధారలు ఉబికి వస్తున్నాయి. రాష్ట్రంలో సగటున 5.83 మీటర్లు అంటే కేవలం 19.13 అడుగుల్లోనే నీళ్లు లభ్యమవుతుండటంతో భూగర్భ జల వనరులలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భూగర్భ జలాల సంరక్షణలోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం భారీగా తోడేస్తుండటంతో భూగర్భ జలమట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలపై రాష్ట్రాల భూగర్భ జలవనరుల శాఖలు, కేంద్ర భూగర్భ జలమండలి విభాగం ఈ ఏడాది నిర్వహించిన సంయుక్త సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో 667 మండలాల పరిధిలో 1,669 ఫిజియో మీటర్ల ద్వారా భూగర్భ జలాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధ్యయనం చేశారు.
జలసంరక్షణలో ఏపీ టాప్...
► నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు పడటంతో దేశంలో భూగర్భ జలాలు సగటున 15,453.69 టీఎంసీలు పెరిగాయి. ఇందులో సగటున 14,058.06 టీఎంసీలను సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకోవచ్చు. అయితే 8,445.85 టీఎంసీలు (60.80 శాతం) మాత్రమే వినియోగిస్తున్నారు.
► రాష్ట్రంలో సగటున 741 మిల్లీమీటర్ల వర్షపాతానికిగానూ నైరుతి రుతుపవనాల కాలం ముగిసే నాటికి, అంటే అక్టోబర్ ఆఖరుకు 799.03 మి.మీ. వర్షపాతం కురిసింది. సాధారణ కంటే 7.9 శాతం అధిక వర్షపాతం కురిసింది. రుతుపవనాల కాలం ప్రారంభమయ్యే నాటికి అంటే 2022 మే 30 నాటికి రాష్ట్రంలో సగటున 8.33 మీటర్లలో భూగర్భ జలమట్టాలు ఉండగా రుతుపవనాలు తిరోగమించే అక్టోబర్ 31 నాటికి సగటున 5.83 మీటర్ల లోతులోనే నీళ్లు లభ్యమవుతున్నాయి. సగటున 2.5 మీటర్ల (8.21 అడుగులు) మేర రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగింది.
► రాష్ట్రంలో ఈ ఏడాది భూగర్భ జలమట్టం అత్యధికంగా 5.56 మీటర్ల మేర శ్రీసత్యసాయి జిల్లాలో పెరిగింది. శ్రీకాకుళం జిల్లా రెండో స్థానం (4.82 మీటర్లు), ఏలూరు జిల్లా మూడో స్థానం (4.43 మీటర్లు)లో నిలవగా 0.62 మీటర్లు తగ్గడం ద్వారా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
► భూగర్భ జలాలు 637 మండలాలలో పుష్కలంగా లభ్యమవుతున్నాయి. మరో 19 మండలాల్లో జలమట్టం సమస్యాత్మకంగానూ, ఐదు మండలాల్లో అత్యంత సమస్యాత్మకంగానూ, ఆరు మండలాల్లో ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ ఆరు మండలాల పరిధిలోని 387 గ్రామాల్లో ఎడాపెడా భూగర్భ జలాలను తోడివేయడమే దీనికి కారణం.
► రాష్ట్రంలో భూగర్భ జలాలు 961.61 టీఎంసీల మేర పెరిగాయి. ఇందులో 913.23 టీఎంసీలను వివిధ అవసరాల కోసం వాడుకోవచ్చు. అయితే ఏటా సగటున 15 లక్షల బోరు బావుల ద్వారా సాగు, తాగు నీటి అవసరాల కోసం 263.09 టీఎంసీలు (28.8 శాతం) మాత్రమే వాడుకుంటున్నారు. దేశంలో సగటున 60.8 శాతం మేర భూగర్భ జలాలను వాడుకుంటుండగా, రాష్ట్రంలో 28.8 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భంలో భద్రపరచడం, పొదుపుగా వాడకం ద్వారా నీటి సంరక్షణలో ఏపీ అగ్రగామిగా నిలిచింది.
లభ్యతలో విజయనగరం ప్రథమ స్థానం
రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యతలో విజయనగరం జిల్లా తొలి స్థానంలో నిలవగా, ఏలూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. కేవలం 1.99 మీటర్ల (6.5 అడుగులు)లో విజయనగరం జిల్లాలో భూగర్భ జలాలు లభిస్తున్నాయి. బాపట్ల జిల్లా రెండో స్థానంలో (2.21 మీటర్లు), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మూడో స్థానంలో(2.33 మీటర్లు) నిలిచాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఏలూరు జిల్లాలో భూగర్భ జలమట్టం 17.94 మీటర్లకు (58.85 అడుగులు) దిగజారడం గమనార్హం. తీవ్ర వర్షాభావ ప్రాంతంలోని రాయలసీమ కంటే ఏలూరు జిల్లాలో భూగర్భ జలాల లభ్యత తక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment