నాగార్జునసాగర్ ద్వారా బనకచర్ల హెడ్ రెగ్యులేటరీకి నీటి తరలింపు
అందుకోసం రూ.80వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రణాళిక
జలవనరుల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: గోదావరి వరద జలాలను బనకచర్ల హెడ్‌రెగ్యులేటరీకి తరలించడం ద్వారా ఏపీని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసం దాదాపు రూ.80వేల కోట్లతో రూపొందించిన ప్రాజెక్టును రాష్ట్ర ఆర్థిక పరిస్థితివల్ల చేపట్టే అవకాశంలేనందున కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తామన్నారు.
ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏటా సముద్రంలో వృథాగా కలుస్తున్న దాదాపు 3వేల టీఎంసీల్లో 280 టీఎంసీలను తరలించడం ద్వారా అటు కృష్ణా డెల్టాకు ఇటు రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలిగిస్తామన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి తరలించి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తీసుకెళ్తామన్నారు.
200 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి అక్కడ నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటరీకి తరలిస్తామని చంద్రబాబు చెప్పారు. అందుకోసం బొల్లాపల్లి నుంచి బనకచర్లకు 31 కి.మీ. సొరంగం నిర్మించి నీటిని తరలిస్తామన్నారు. బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ నుంచి తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, నిప్పుల వాగుకు నీళ్లు వెళ్తాయన్నారు. అక్కడ నుంచి సోమశిల, కండలేరుకు నీటిని తరలిస్తామన్నారు. తద్వారా జలహారం కింద రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నీటి అవసరాలను తీరుస్తామన్నారు.
ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందించడంతోపాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్‌కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment