తొలిదశలో కేవలం ప్రధాన కాలువ, ఎత్తిపోతల పనులే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం
జల్లేరు రిజర్వాయర్ లేకుండా ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమంటున్న అధికారులు
చింతలపూడి ఎత్తిపోతల తొలిదశలో 2 లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులకు దివంగత సీఎం వైఎస్ శ్రీకారం
అప్పట్లో జల్లేరు రిజర్వాయర్‌ను 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయం
ఆ తర్వాత 4.82 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ‘చింతలపూడి’ సామర్థ్యం పెంపు
దీంతో ‘జల్లేరు’ సామర్థ్యాన్నీ 8 నుంచి 14 టీఎంసీలకు పెంచిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : చింతలపూడి ఎత్తిపోతల నుంచి జల్లేరు రిజర్వాయర్‌ను ప్రభుత్వం తొలగించింది. తొలిదశలో ఎత్తిపోతల, ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులు మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్తగా రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు సాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 25.94 లక్షల మందికి తాగునీరు అందించాలని నిర్దేశించింది. ఈ పనులను 2026, జూన్ నాటికి పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కానీ, జల్లేరు రిజర్వాయర్ నిర్మించకుండా ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమని జలవనరుల శాఖాధికారులు, నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. తెలంగాణలో కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల వంటి పథకాలు పూర్తయిన నేపథ్యంలో గోదావరికి వరద వచ్చే రోజులు తగ్గాయని.. నీటి నిల్వకోసం జల్లేరు రిజర్వాయర్‌ను నిర్మించకపోతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫలాలు రైతులకు అందవని తేల్చిచెబుతున్నారు.
మెట్టప్రాంతాలను సుభిక్షం చేసేలా..
వాస్తవానికి.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించి, సుభిక్షం చేయాలనే లక్ష్యంతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2008, అక్టోబరు 28న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆయకట్టుకు నీళ్లందించడం కోసం జల్లేరు రిజర్వాయర్ పనులను 8 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 2.80 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సవాల్‌గా మారింది.
దీంతో గోదావరి జలాలను ఎత్తిపోసి సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టును స్థిరీకరించేందుకు చింతలపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 2016, సెప్టెంబరు 3న పెంచారు. ఎత్తిపోతల ద్వారా కొత్త, పాత ఆయకట్టు కలిపి 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించాలంటే జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 నుంచి 14 టీఎంసీలకు పెంచాలని ఎస్‌ఎల్‌ఎస్‌సీ (స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) చేసిన ప్రతిపాదనపై 2020, మే 20న గత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు పనులు చేపట్టింది.
ఇప్పటికే రూ.4,122.83 కోట్లు వ్యయం
ఆ తర్వాత.. గోదావరి నుంచి రోజుకు 6,870 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 53.50 టీఎంసీలను ఎత్తిపోసి.. జల్లేరు రిజర్వాయర్‌లో 14 టీఎంసీలను నిల్వచేయడం ద్వారా 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా చింతలపూడి ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం పనులకు 2008 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.4,122.83 కోట్లు వెచ్చించింది. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే తొలిదశ పంప్ హౌస్, ప్రధాన కాలువలో 36 కిమీల వరకూ పనులు పూర్తయ్యాయి. ప్రధాన కాలువలో 36 కిమీ నుంచి 106.25 కిమీ వరకూ పనుల్లో దాదాపు 50 శాతం పూర్తయ్యాయి.
జల్లేరు రిజర్వాయర్ సహా ఈ ఎత్తిపోతల పూర్తవ్వాలంటే ఇంకా రూ.5,198 కోట్లు అవసరం. రిజర్వాయర్ పనుల కోసం 6,880 ఎకరాల అటవీ భూమి సేకరించాలి. ఇది సవాల్‌గా మారడంతో జల్లేరు రిజర్వాయర్ పనులను తర్వాత చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, రిజర్వాయర్ నిర్మిస్తేనే 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యమవుతుందని.. రిజర్వాయర్ నిర్మించకపోతే ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమని జలవనరుల శాఖ అధికారులతోపాటు నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment