jalleru project
-
ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనట్లే!?
సాక్షి, అమరావతి : చింతలపూడి ఎత్తిపోతల నుంచి జల్లేరు రిజర్వాయర్‌ను ప్రభుత్వం తొలగించింది. తొలిదశలో ఎత్తిపోతల, ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులు మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్తగా రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు సాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 25.94 లక్షల మందికి తాగునీరు అందించాలని నిర్దేశించింది. ఈ పనులను 2026, జూన్ నాటికి పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ, జల్లేరు రిజర్వాయర్ నిర్మించకుండా ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమని జలవనరుల శాఖాధికారులు, నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. తెలంగాణలో కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల వంటి పథకాలు పూర్తయిన నేపథ్యంలో గోదావరికి వరద వచ్చే రోజులు తగ్గాయని.. నీటి నిల్వకోసం జల్లేరు రిజర్వాయర్‌ను నిర్మించకపోతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫలాలు రైతులకు అందవని తేల్చిచెబుతున్నారు.మెట్టప్రాంతాలను సుభిక్షం చేసేలా..వాస్తవానికి.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించి, సుభిక్షం చేయాలనే లక్ష్యంతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2008, అక్టోబరు 28న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆయకట్టుకు నీళ్లందించడం కోసం జల్లేరు రిజర్వాయర్ పనులను 8 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 2.80 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సవాల్‌గా మారింది. దీంతో గోదావరి జలాలను ఎత్తిపోసి సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టును స్థిరీకరించేందుకు చింతలపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 2016, సెప్టెంబరు 3న పెంచారు. ఎత్తిపోతల ద్వారా కొత్త, పాత ఆయకట్టు కలిపి 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించాలంటే జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 నుంచి 14 టీఎంసీలకు పెంచాలని ఎస్ఎల్ఎస్సీ (స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) చేసిన ప్రతిపాదనపై 2020, మే 20న గత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు పనులు చేపట్టింది.ఇప్పటికే రూ.4,122.83 కోట్లు వ్యయంఆ తర్వాత.. గోదావరి నుంచి రోజుకు 6,870 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 53.50 టీఎంసీలను ఎత్తిపోసి.. జల్లేరు రిజర్వాయర్‌లో 14 టీఎంసీలను నిల్వచేయడం ద్వారా 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా చింతలపూడి ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం పనులకు 2008 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.4,122.83 కోట్లు వెచ్చించింది. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే తొలిదశ పంప్ హౌస్, ప్రధాన కాలువలో 36 కిమీల వరకూ పనులు పూర్తయ్యాయి. ప్రధాన కాలువలో 36 కిమీ నుంచి 106.25 కిమీ వరకూ పనుల్లో దాదాపు 50 శాతం పూర్తయ్యాయి. జల్లేరు రిజర్వాయర్ సహా ఈ ఎత్తిపోతల పూర్తవ్వాలంటే ఇంకా రూ.5,198 కోట్లు అవసరం. రిజర్వాయర్ పనుల కోసం 6,880 ఎకరాల అటవీ భూమి సేకరించాలి. ఇది సవాల్‌గా మారడంతో జల్లేరు రిజర్వాయర్ పనులను తర్వాత చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, రిజర్వాయర్ నిర్మిస్తేనే 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యమవుతుందని.. రిజర్వాయర్ నిర్మించకపోతే ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమని జలవనరుల శాఖ అధికారులతోపాటు నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తుండటం గమనార్హం. -
‘గుండె ఝల్లే’రు!
సాక్షి, బుట్టాయగూడెం : ఎప్పుడూ జలసిరితో నిండుగా కనిపించే గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం ప్రస్తుతం కళతప్పి రైతులను కలవరానికి గురి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జలాశయం నీటి మట్టం కనీస స్థాయి కన్నా దిగువకు పడిపోయింది. ఫలితంగా జల్లేరుపైనే ఆధారపడిన సుమారు 4,200 ఎకరాల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారనుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్లేరు జలాశయం కనీస నీటి మట్టం స్థాయి 216 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 208.4 మీటర్లు మాత్రమే ఉంది. జూన్ మాసంలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత నీటి మట్టం చూస్తే ప్రాజెక్టు కింద భూములకు సాగు నీరు అందే పరిస్థితులు కనపడడం లేదు. జలాశయం ఎప్పుడు నిండుతుందో తెలీని దుస్థితి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా వర్షాధారం ఈ జలాశయం పూర్తిగా వర్షాకాలంలో కొండ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రవహించే వరదతోనే నిండుతుంది. వేసవిలోనూ కనిష్టస్థాయికి నీటిమట్టం పడిపోదు. కానీ ఇప్పుడు దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టును నమ్ముకొని దాదాపు 16 వందల మందికిపైగా రైతులు 4,200 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, చెరకు, అపరాలు వంటి పంటలను ఏటా వేస్తుంటారు. రైతులకు కనీసం బోర్లు కూడా లేవు. ప్రాజెక్టు నీరే ఆధారం. ప్రాజెక్టు శిథిలావస్థకు చేరడంతో అధికారులు పూర్తి స్థాయిలో వర్షాకాలంలో కూడా స్టోరేజ్ చేయలేకపోతున్నారు. అక్టోబర్‌లో రబీ సీజన్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. వేసవికాలం నాటికి నీటి మట్టానికి నీరు ఇంకిపోవడంతో రైతులు కలవరం చెందుతున్నారు. కనీసం ప్రాజెక్టు సమీపంలో ఉన్న పొలాలకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆధునికీకరణ ఎక్కడ! గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం శిథిలావస్థకు చేరుకుంది. సుమారు 44 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దీనిని ప్రారంభించారు. జలాశయం ద్వారా 4,500 ఎకరాలకు సాగు అందించాలనేది లక్ష్యం. అయితే నేటికీ పూర్తి స్థాయిలో నీరు అందడంలేదు. మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపడమే తప్ప మంజూరైన దాఖలాలు లేవు. కనీస మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల గట్టు బలహీన పడి అధికారులు పూర్తి స్థాయిలో నీటిని నిల్వచేయలేకపోతున్నారు. దీంతో ఏటా వేసవినాటికి నీటిమట్టాలు పడిపోతున్నాయి. ఈ సారి పరిస్థితి మరీదారుణంగా ఉంది. కనిష్టస్థాయి కంటే నీటిమట్టం పడిపోయింది. ఖరీఫ్ సీజన్‌కు వర్షాలు విస్తారంగా కురిసి ప్రాజెక్టులో నీరు నిండితేనే ఆయకట్టు పరిధిలోని రైతులకు నీరు అందే పరిస్థితి ఉంది. -
1/70, పోడు భూములు ఇవ్వొద్దు
సీపీఎం నేత సీతారామ్ జంగారెడ్డిగూడెం : పోలవరం ప్రాజెక్టు, జల్లేరు ప్రాజెక్టు నిర్వాసితులకు 1/70 చట్టం, పోడు భూములు ఇవ్వవద్దని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మంతెన సీతారామ్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం స్థానిక సుందరయ్య కార్యాలయంలో ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీతారామ్ మాట్లాడుతూ ఏజెన్సీలోని మూడు మండలాల్లో సుమారు 900 ఎకరాలు 1/70 చట్టం భూములను ప్రభుత్వం గిరిజనేతరుల వద్ద నుంచి కొనుగోలు చేసి ప్రాజెక్టుల నిర్వాసితులకు నష్టపరిహారం అందజేసిందన్నారు. అయితే 1/70 చట్టం భూములు పూర్తిగా గిరిజనులకు మాత్రమే చెందినవని, అలాంటప్పుడు గిరిజనేతరులకు ఎక్కడివని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టం చేసిన ప్రభుత్వమే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జల్లేరు రిజర్వాయర్‌లో జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లోని ఏడు గిరిజన గ్రామాలకు చెందిన 800 ఎకరాల 1/70 చట్టం భూములు, 1200 ఎకరాల పోడు భూములు ముంపునకు గురవుతున్నాయన్నారు. 1/70 చట్టం భూములు సాగు చేస్తున్న గిరిజనుల పేర్లు అడంగల్‌లో నమోదు చేయకుండా భూములు సాగు చేయని గిరిజనేతరుల పేర్లు నమోదు చేసి నష్టపరిహారం గిరిజనేతరులకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపివేయాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని సీతారామ్ హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.రవి మాట్లాడుతూ నవంబర్ 2న ఏలూరులో, 8న ఐటీడీఏ వద్ద అన్ని గిరిజన సంఘాలతో సమావేశం నిర్వహించి ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి టి.రామకృష్ణ, ఎంసీపీఐ(యు) నాయకుడు పెన్మెత్స అప్పలరాజు, రైతు కూలీ సంఘం నాయకులు జొన్నకూటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.