సీపీఎం నేత సీతారామ్
జంగారెడ్డిగూడెం : పోలవరం ప్రాజెక్టు, జల్లేరు ప్రాజెక్టు నిర్వాసితులకు 1/70 చట్టం, పోడు భూములు ఇవ్వవద్దని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మంతెన సీతారామ్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం స్థానిక సుందరయ్య కార్యాలయంలో ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీతారామ్ మాట్లాడుతూ ఏజెన్సీలోని మూడు మండలాల్లో సుమారు 900 ఎకరాలు 1/70 చట్టం భూములను ప్రభుత్వం గిరిజనేతరుల వద్ద నుంచి కొనుగోలు చేసి ప్రాజెక్టుల నిర్వాసితులకు నష్టపరిహారం అందజేసిందన్నారు.
అయితే 1/70 చట్టం భూములు పూర్తిగా గిరిజనులకు మాత్రమే చెందినవని, అలాంటప్పుడు గిరిజనేతరులకు ఎక్కడివని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టం చేసిన ప్రభుత్వమే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జల్లేరు రిజర్వాయర్‌లో జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లోని ఏడు గిరిజన గ్రామాలకు చెందిన 800 ఎకరాల 1/70 చట్టం భూములు, 1200 ఎకరాల పోడు భూములు ముంపునకు గురవుతున్నాయన్నారు.
1/70 చట్టం భూములు సాగు చేస్తున్న గిరిజనుల పేర్లు అడంగల్‌లో నమోదు చేయకుండా భూములు సాగు చేయని గిరిజనేతరుల పేర్లు నమోదు చేసి నష్టపరిహారం గిరిజనేతరులకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపివేయాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని సీతారామ్ హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.రవి మాట్లాడుతూ నవంబర్ 2న ఏలూరులో, 8న ఐటీడీఏ వద్ద అన్ని గిరిజన సంఘాలతో సమావేశం నిర్వహించి ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి టి.రామకృష్ణ, ఎంసీపీఐ(యు) నాయకుడు పెన్మెత్స అప్పలరాజు, రైతు కూలీ సంఘం నాయకులు జొన్నకూటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
1/70, పోడు భూములు ఇవ్వొద్దు
Published Sat, Oct 24 2015 1:59 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement