ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా విషయంలో ప్రజల్లో రగులుతున్న ఆగ్రహం చంద్రబాబుకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సబ్యులు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. హోదా సంజీవని కాదన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజల్లో మార్పు గమనించి ప్లేటు ఫిరాయించి మళ్లీ హోదా నినాదాన్ని ఎత్తుకున్నా జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలనకంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అతిచెడ్డ అభివృద్ధి నమూనాకు బాబు పాలన గుర్తుగా మిగిలిపోనుందని, పట్టిసీమ మొదలుకొని పోలవరం ప్రాజెక్టు వరకు ముడుపులతో అవినీతి రాజ్యమేలుతోందని, పట్టిసీమలో అవినీతిపై కాగ్ సర్టిఫై చేయడమే దీనికి తార్కాణమని అన్నారు. నాలుగేళ్లు నరేంద్ర మోదీకి, బీజేపీకి పాదసేవ చేసి ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చంద్రబాబు అంటే ఎవరైనా నమ్మవచ్చు కానీ వామపక్షాలు అలా మోసపోవడానికి సిద్ధంగా లేవన్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు అసలు కనిపించడం లేదంటున్న బీవీ రాఘవులు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏమిటీ బాధ, ఇబ్బంది అని ఎప్పుడైనా అనిపించిందా?
మొదట్లో రాజకీయాల్లో లోతుపాతులు తక్కువగా తెలిసేవి. ఆదర్శం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఏమిటి రాజకీయాలు ఇలా ఉన్నాయి అనిపించింది కానీ ఇప్పుడు వాటిని అర్థం చేసుకోగలుగుతున్నాను. మనం చూస్తున్న వాస్తవాలు, వైరుధ్యాలు ఈ సమాజంలో ఉన్నవే. వాటిని ఎలా పెకిలించుకుని పోవడం, సర్దుకునిపోవడం లేక వేరు చేసుకోవడం అనేవి మనం నేర్చుకోవాలి తప్ప మనకు మనం నిరాశా నిస్పహలకు గురికావాల్సిన అవసరం లేదు. నిరాశకు గురయితే పరిష్కారం దొరకదు కదా. మనం ఆ వైరుధ్యాల్లో చురుగ్గా జోక్యం చేసుకోవడం ద్వారా, దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయడం ద్వారా మార్పునకు కారణమవుతాం.
మోదీ, చంద్రబాబు మధ్య ఏం జరిగి ఉందంటారు?
నాలుగేళ్ల పాటు బీజేపీకి, మోదీకి వీరసేవ చేసిన చంద్రబాబు ఇప్పుడు వీరావేశాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్యా ఏమీ జరగలేదు. ప్రజల్లో మార్పు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి ఒక్క ముక్కంటే ముక్క కూడా పడని తర్వాత ప్రజల్లో నాలుగేళ్లుగా పేరుకుపోయిన ఆగ్రహం బద్ధలైపోయింది. నాలుగేళ్లు చంద్రబాబు చూపిన ఆశలిక నెరవేరవని తెలియడంతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఏపీలో ప్రజలు ఎంతగా దహించుకుపోతున్నారంటే, వామపక్షాల బలం ఇప్పుడు తక్కువ. కానీ వామపక్షాలు బంద్‌కు పిలుపునిస్తే జనజీవితం స్తంభించిపోయింది. ఆ ప్రజాగ్రహాన్ని తట్టుకుని నిలబడాలంటే బాబుకు ప్లేట్ ఫిరాయించక తప్పని పరిస్థితి.
ఏపీలో 23 మంది, తెలంగాణలో 25 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేశారు కదా?
ఫిరాయింపు చేసినవాడు తన పదవికి రాజీనామా చేయడం కాదు. ఫిరాయించిన మరుక్షణం వారి పదవులు రద్దయిపోవాలని, అదే పరిష్కారమని తొలినుంచీ మా వాదన.
ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం?
ఈ నాలుగేళ్లూ చంద్రబాబు అధికారంలో లేకుంటే ఏపీ బాగుపడేది. ఈ నాలుగేళ్లూ రాజధాని చుట్టూ తిరిగాడు. కానీ, రాజధానే కనిపించడం లేదు. పరిశ్రమలన్నారు. భాగస్వామ్య సదస్సులన్నారు ఒక్క రూపాయి పెట్టుబడులు వచ్చింది లేదు. లేదూ బీజేపీ మతతత్వాన్ని అడ్డుకునే ప్రయత్నమైనా చేశాడా అంటే ఆ పార్టీకే నాలుగేళ్లు సేవ చేసి దానికి కొమ్ములు తెచ్చేశాడు. బీజేపీకి బలం కల్పించినవాడిగానే మిగిలిపోయాడు.
ప్రత్యేక హోదా వద్దన్న బాబు.. ఇప్పుడెందుకు కావాలంటున్నారు?
ఇప్పుడు ప్రజలు ప్రత్యేక హోదా గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న నేపథ్యంలో వారి ఆగ్రహాన్ని తట్టుకోవాలంటే హోదా జపం చేయాల్సిందే మరి. ప్రజాగ్రహాన్ని తప్పకుండా చవిచూడాల్సి వస్తుంది. దాన్ని తట్టుకోవాలంటే నేను ఎన్డీయే నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాను కదా. విమర్శిస్తున్నాను కదా? అని చెప్పుకోవాలి మరి.
గతంలో చంద్రబాబు ఎనిమిదేళ్ల పాలనకు, ఇప్పటి నాలుగేళ్ల పాలనకు తేడా ఏమిటి?
ఉమ్మడి రాష్ట్రంలోనూ బాబు అభివృద్ధి నమూనా గొప్పగా ఏమీ లేదు. ఇప్పుడయితే అతి చెత్త నమూనాకు ఆయన పాలన గుర్తుగా ఉంది. రాజధాని, నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమల విషయంలోనే కాదు అన్నిటికంటే మించి రాష్ట్ర విభజనలోనూ బాబు నాటకాలాడాడు. అన్యాయంగా విభజన చేశారు అని ఇప్పుడంటున్నాడు. ఆ అన్యాయపు విభజనలో ఈయన పాత్ర లేదా? ఇప్పుడు మొసలి కన్నీళ్లు పెడితే ఏం లాభం?
పోలవరం ప్రాజెక్టుపై మీ అభిప్రాయం?
రాజధాని, ప్రత్యేక హోదా విషయంలో మేం ఆనాడు చెప్పినవి ఏరకంగా ఇప్పుడు వాస్తవం అవుతున్నాయో పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అదే జరుగుతోంది. 900 మెగావాట్ల విద్యుత్తు విషయం పక్కనపెట్టి మీరు ప్రాజెక్టు నిర్మించండి. అప్పుడు ప్రాజెక్టు ఇంత ఎత్తుకు కట్టాల్సిన పని లేదని మేం గతంలోనే చెప్పాం. కేవలం సాగునీటి కోసమే అయితే ఇంత ఎత్తు ప్రాజెక్టు అవసరం లేదు. పైగా ఇంత పెద్ద ప్రాజెక్టు వ్యవహారం కచ్చితంగా ముడుపులతో ముడిపడి ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి బాబు ఎందుకు తీసుకున్నట్లు?
మేమయితే తొందరగా పూర్తి చేస్తాం అని చెప్పి కేంద్రం నుంచి తీసుకున్నాడు. బీజేపీ తన చెప్పుచేతల్లో ఉంటుందని, తమ మధ్య బంధం శాశ్వతంగా ఉంటుందని అనుకుని ఉండవచ్చు. లేకపోతే కేంద్రం కాంట్రాక్టర్లకు ఇస్తే ముడుపులన్నీ వారికే పోతాయి తప్ప నా వాటా ఏమిటి అనుకుని ఉండవచ్చు కూడా. పైగా పోలవరాన్ని 2018లో, 19లో కట్టేస్తామంటున్నారు. భారతదేశంలో ఏ ప్రాజెక్టు కూడా 30 ఏళ్లకు లోపల పూర్తయిన చరిత్ర లేదు. పదిహేనేళ్లకు లోపల ఎస్కలేషన్ పూర్తయిన చరిత్ర లేదు.
పట్టిసీమలో అవినీతి జరిగిందని కాగ్ నివేదించింది. మీ అభిప్రాయం?
ముడుపులకు అధికారిక ముద్ర వేసేశారని ఆనాడే మేం చెప్పాం. కాకపోతే కాగ్ దాన్ని ఇప్పుడు బయటపెట్టిందంతే. ఆ అవినీతిని సర్టిఫై చేసింది. బాబు పాలన అంటేనే అవినీతి. ఇప్పుడు అది ఇంకా ఎక్కువైంది. మరింత స్వేచ్ఛగా దోచుకోవడానికి బాబు అవకాశమిస్తున్నట్లు కనబడుతోంది. ప్రజలే కాదు టీడీపీ వాళ్లు కూడా ఇదే చెబుతున్నారు.
ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతారా?
ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి స్పష్టంగా కనబడుతోంది. అది ఓట్ల రూపంలో మారేకొద్దీ ఇతరత్రా అంశాలు వస్తాయి. పాలించే పార్టీల వద్ద డబ్బుకు కొదవలేదు కాబట్టి డబ్బుతో కొనాలని ప్రయత్నిస్తారు. కులం కార్డు ఉపయోగిస్తారు. అఖిల భారత స్థాయిలో ఒక వాతావరణం తీసుకొచ్చి దానిలో భాగస్వాములమయ్యాం అని చెప్పి అలా ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తారు.
వైఎస్ జగన్‌పై, ఆయన పాదయాత్రపై మీ అభిప్రాయం?
ప్రత్యేక హోదా అంశంపై జనం బాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్ తొలినుంచి హోదాను కోరుకుంటున్నారు. కానీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేం కదా. పాదయాత్ర ఎప్పటికీ మంచిదే. జనంని దగ్గరగా చూస్తారు. వారి సమస్యలు వింటారు. ఆ రకంగా ఎవరు పాదయాత్ర చేసినా మంచిదే. కానీ కేవలం పాదయాత్ర మాత్రమే ఎన్నికల్లో అధికారంలోకి తెస్తుందని ఇప్పుడే చెప్పలేం కదా.
బాబు బీజేపీకి దూరమయ్యారు కాబట్టి మళ్లీ వామపక్షాలతో కలిసే అవకాశముందా?
ఆ అధ్యాయం ముగిసిపోయింది. నాలుగేళ్ల పాటు బీజేపీకి పాదసేవ చేసి ఇవ్వాళ నేను పోరాడుతున్నాను అని చెబితే ఎవరయినా కొంతమంది మోసపోవచ్చు కానీ వామపక్షంగా మేం అలా మోసపోవడానికి సిద్ధంగా లేం.
చంద్రబాబు, కేసీర్‌కి ఈ ఎన్నికల్లో ఎలాంటి అవకాశముంది?
ఏపీ, తెలంగాణల్లో ప్రజాస్వామ్యానికి, ఉద్యమాలకు, ప్రజాభిప్రాయానికి ఏమాత్రం విలువనిచ్చే పాలన జరగడం లేదు. కేసీఆర్ ప్రజాస్వామ్యం విషయంలో కాస్త సర్దుబాటు చేసుకుంటే, మారితే తనకు ప్రయోజనం ఉంటుందేమో కానీ బాబుకు మాత్రం పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు. తెలంగాణ విషయంలో అంత స్పష్టంగా చెప్పలేను కానీ ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు.
(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://bit.ly/2HskLlP / https://bit.ly/2HH54Vj
Comments
Please login to add a commentAdd a comment