నేడు జిల్లా బంద్
టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ మద్దతు
నల్లగొండ : ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ శనివారం జిల్లాబంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ మద్దతు ప్రకటించాయి. అదేవిధంగా ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, టీఆర్‌ఎస్ యువజన విభాగాలు సైతం బంద్‌లో పాల్గొనున్నట్లు వేర్వేరు పత్రిక ప్రకటనలు జారీ చేశాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురయ్యే మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆమోదించిన బిల్లును ఉపసంహరించుకోవాలని వివిధ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
శుక్రవారం సాయంత్రం జిల్లా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు నేతృత్వంలో నల్లగొండలో క్లాక్‌టవర్ సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపి కేంద్రం చట్టం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆంధ్ర సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రలోభాలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందన్నారు. మూడు లక్షల మంది గిరిజనుల హక్కులను కాలరాస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు.