పూర్తిగా అడుగంటి వెలవెలబోతున్న జల్లేరు జలాశయం దైన్యం ఇదీ..
సాక్షి, బుట్టాయగూడెం : ఎప్పుడూ జలసిరితో నిండుగా కనిపించే గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం ప్రస్తుతం కళతప్పి రైతులను కలవరానికి గురి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జలాశయం నీటి మట్టం కనీస స్థాయి కన్నా దిగువకు పడిపోయింది. ఫలితంగా జల్లేరుపైనే ఆధారపడిన సుమారు 4,200 ఎకరాల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారనుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జల్లేరు జలాశయం కనీస నీటి మట్టం స్థాయి 216 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 208.4 మీటర్లు మాత్రమే ఉంది. జూన్ మాసంలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత నీటి మట్టం చూస్తే ప్రాజెక్టు కింద భూములకు సాగు నీరు అందే పరిస్థితులు కనపడడం లేదు. జలాశయం ఎప్పుడు నిండుతుందో తెలీని దుస్థితి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పూర్తిగా వర్షాధారం
ఈ జలాశయం పూర్తిగా వర్షాకాలంలో కొండ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రవహించే వరదతోనే నిండుతుంది. వేసవిలోనూ కనిష్టస్థాయికి నీటిమట్టం పడిపోదు. కానీ ఇప్పుడు దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టును నమ్ముకొని దాదాపు 16 వందల మందికిపైగా రైతులు 4,200 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, చెరకు, అపరాలు వంటి పంటలను ఏటా వేస్తుంటారు. రైతులకు కనీసం బోర్లు కూడా లేవు. ప్రాజెక్టు నీరే ఆధారం.
ప్రాజెక్టు శిథిలావస్థకు చేరడంతో అధికారులు పూర్తి స్థాయిలో వర్షాకాలంలో కూడా స్టోరేజ్ చేయలేకపోతున్నారు. అక్టోబర్‌లో రబీ సీజన్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. వేసవికాలం నాటికి నీటి మట్టానికి నీరు ఇంకిపోవడంతో రైతులు కలవరం చెందుతున్నారు. కనీసం ప్రాజెక్టు సమీపంలో ఉన్న పొలాలకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఆధునికీకరణ ఎక్కడ!
గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం శిథిలావస్థకు చేరుకుంది. సుమారు 44 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దీనిని ప్రారంభించారు. జలాశయం ద్వారా 4,500 ఎకరాలకు సాగు అందించాలనేది లక్ష్యం. అయితే నేటికీ పూర్తి స్థాయిలో నీరు అందడంలేదు. మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపడమే తప్ప మంజూరైన దాఖలాలు లేవు. కనీస మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల గట్టు బలహీన పడి అధికారులు పూర్తి స్థాయిలో నీటిని నిల్వచేయలేకపోతున్నారు.
దీంతో ఏటా వేసవినాటికి నీటిమట్టాలు పడిపోతున్నాయి. ఈ సారి పరిస్థితి మరీదారుణంగా ఉంది. కనిష్టస్థాయి కంటే నీటిమట్టం పడిపోయింది. ఖరీఫ్ సీజన్‌కు వర్షాలు విస్తారంగా కురిసి ప్రాజెక్టులో నీరు నిండితేనే ఆయకట్టు పరిధిలోని రైతులకు నీరు అందే పరిస్థితి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment