అధిక నీటి నిల్వ సామర్థ్యం రిజర్వాయర్లు ఉన్న నదుల్లో అగ్రస్థానంలో కృష్ణ
రెండో స్థానంలో గంగ.. తర్వాతి స్థానాల్లో గోదావరి, నర్మద, సింధూ, మహానది
కేంద్ర జలసంఘం అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో అతి పెద్ద, పొడవైన నది గంగ. నీటి లభ్యతలోనూ గంగదే ప్రథమ స్థానం. గంగ నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో 75 శాతం లభ్యత ఆధారంగా 17,940.20 టీఎంసీలు గంగా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో లభిస్తాయి. కానీ..ఆ గంగా బేసిన్‌లో రిజర్వాయర్ల నీటి నిల్వ(లైవ్) సామర్థ్యం 1,713.58 టీఎంసీలే.
కృష్ణాలో ఏటా 75 శాతం లభ్యత ఆధారంగా లభించేది 3,157.29 టీఎంసీలు. కృష్ణా బేసిన్‌లో 1,783.43 టీఎంసీలు నిల్వ (లైవ్) సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లున్నాయి. వీటిని బట్టి చూస్తే దేశంలో అత్యధిక నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో కృష్ణా బేసిన్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో జలవనరులపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సమగ్రంగా అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇటీవల నివేదికను రూపొందించింది. అందులో ప్రధానాంశాలు ఇవీ..
దేశంలో ఉత్తరాన హిమాలయ నది సింధూ నుంచి.. దక్షిణాన ద్వీపకల్ప నది కావేరి వరకూ నదుల్లో ఏటా సగటున 75 శాతం లభ్యత ఆధారంగా 70,391.84 టీఎంసీలు లభిస్తాయి. నీటి లభ్యతలో బ్రహ్మపుత్ర(18,565.53 టీఎంసీలు) మొదటి స్థానంలో ఉండగా.. గంగా(17,940.20 టీఎంసీలు) రెండో స్థానంలోనూ.. గోదావరి(4,145.66 టీఎంసీలు) మూడో స్థానంలో ఉంది. ఇక నీటి లభ్యతలో కృష్ణా (3,157.29 టీఎంసీలు) నాలుగో స్థానంలో నిలిచింది.
దేశంలో అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన రిజర్వాయర్లలో నీటి నిల్వ (లైవ్) సామర్థ్యం 10,724.16 టీఎంసీలు. నీటి లభ్యతలో అగ్రస్థానంలో ఉన్న బ్రహ్మపుత్ర..రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో అట్టడుగున నిలిచింది.
గోదావరి బేసిన్‌లో 1,233.75 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉండగా.. పెన్నా బేసిన్‌లో 178.84 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment