River Ganga
-
గంగ కంటే కృష్ణ మిన్న
సాక్షి, అమరావతి: దేశంలో అతి పెద్ద, పొడవైన నది గంగ. నీటి లభ్యతలోనూ గంగదే ప్రథమ స్థానం. గంగ నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో 75 శాతం లభ్యత ఆధారంగా 17,940.20 టీఎంసీలు గంగా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో లభిస్తాయి. కానీ..ఆ గంగా బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ(లైవ్) సామర్థ్యం 1,713.58 టీఎంసీలే. కృష్ణాలో ఏటా 75 శాతం లభ్యత ఆధారంగా లభించేది 3,157.29 టీఎంసీలు. కృష్ణా బేసిన్లో 1,783.43 టీఎంసీలు నిల్వ (లైవ్) సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లున్నాయి. వీటిని బట్టి చూస్తే దేశంలో అత్యధిక నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో కృష్ణా బేసిన్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో జలవనరులపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సమగ్రంగా అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇటీవల నివేదికను రూపొందించింది. అందులో ప్రధానాంశాలు ఇవీ..దేశంలో ఉత్తరాన హిమాలయ నది సింధూ నుంచి.. దక్షిణాన ద్వీపకల్ప నది కావేరి వరకూ నదుల్లో ఏటా సగటున 75 శాతం లభ్యత ఆధారంగా 70,391.84 టీఎంసీలు లభిస్తాయి. నీటి లభ్యతలో బ్రహ్మపుత్ర(18,565.53 టీఎంసీలు) మొదటి స్థానంలో ఉండగా.. గంగా(17,940.20 టీఎంసీలు) రెండో స్థానంలోనూ.. గోదావరి(4,145.66 టీఎంసీలు) మూడో స్థానంలో ఉంది. ఇక నీటి లభ్యతలో కృష్ణా (3,157.29 టీఎంసీలు) నాలుగో స్థానంలో నిలిచింది.దేశంలో అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన రిజర్వాయర్లలో నీటి నిల్వ (లైవ్) సామర్థ్యం 10,724.16 టీఎంసీలు. నీటి లభ్యతలో అగ్రస్థానంలో ఉన్న బ్రహ్మపుత్ర..రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో అట్టడుగున నిలిచింది.గోదావరి బేసిన్లో 1,233.75 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉండగా.. పెన్నా బేసిన్లో 178.84 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి. -
పొగతాగడం హానికరం..మరి ఆ నీటి సంగతి..?
సాక్షి, న్యూఢిల్లీ : గంగా నది కాలుష్యంపై గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా స్పందించింది. సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరమైతే కాలుష్య జలాల్లో మునిగితే వచ్చే ప్రతికూల పర్యవసానాలపై ప్రజలను ఎందుకు హెచ్చరించరని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రశ్నించింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి యూపీలోని ఉన్నావ్ వరకూ నదీ జలాలు తాగేందుకు, స్నానం చేసేందుకు ఎంతమాత్రం పనికిరావని ఎన్జీటీ చైర్పర్సన్ ఏకే గోయల్ నేతృత్వంలోని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. కలుషిత గంగా నీరు ఆరోగ్యంపై చూపే దుష్ర్పభావాల గురించి తెలియని ప్రజలు వాటిని తాగడం, స్నానం చేయడం చేస్తున్నారని పేర్కొంది. గంగా జలాలను పవిత్రంగా భావించే ప్రజలు కలుషిత నీటిని సేవించకుండా వారికి అవగాహన కల్పించాల్సి ఉందని గోయల్ అన్నారు. ప్రతి వంద కిలోమీటర్లకు గంగా నదీ జలాలు ప్రజలు సేవించేందుకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది తెలుపుతూ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ (ఎన్ఎంసీజీ)ను ఆదేశించింది. గంగా నదీ జలాలు ఎక్కడెక్కడ తాగేందుకు, స్నానం చేసేందుకు అనువుగా ఉన్నాయో తెలుపుతూ తమ వెబ్సైట్లో రెండు వారాల్లోగా మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ ఎన్ఎంసీజీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని కోరింది. -
గంగానదిపై భారీ వంతెనకు క్లియరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ : అలహాబాద్‌లో గంగా నదిపై రూ 1948 కోట్లతో పది కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలహాబాద్‌లోని ఫపమూ వద్ద రూ 1948 కోట్లతో ఆరు లేన్ల బ్రిడ్జి నిర్మాణానికి సీసీఈఏ ఆమోదం తెలిపిందని రహదారులు, హైవేల మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిసెంబర్ 2021 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో ప్రస్తుత రెండు వరుసల వంతెనపై ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోతాయని ఓ ప్రకటనలో తెలిపింది. అలహాబాద్‌లో జరిగే కుంభమేళా, అర్థ కుంభ్ ఇతర కార్యక్రమాల్లో ట్రాఫిక్ రద్దీని సైతం ఈ ప్రాజెక్టుతో అధిగమించవచ్చని పేర్కొంది. మధ్యప్రదేశ్ నుంచి లక్నో, ఫైజాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు కూడా ఈ బ్రిడ్జి ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కార్మికులకు దాదాపు 9.2 లక్షల పనిదినాలు కల్పించవచ్చని పేర్కొంది. అలహాబాద్ నుంచి ఫరక్కా వరకూ గంగానదిపై 2014 వరకూ కేవలం 13 వంతెనలే ఉండగా, ఇప్పుడు అదనంగా 20 వంతెనల నిర్మాణం చేపట్టామని, వీటిలో 5 వంతెనలను ఇప్పటికే ప్రారంభించగా ఏడు వంతెనలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపింది. -
వారె‘వా’ స్టీవ్...
► అనాథ ఆఖరి కోరిక నెరవేర్చిన ఆసీస్ మాజీ కెప్టెన్ ► అస్థికలు గంగా నదిలో నిమజ్జనం వారణాసి: ఆటగాడిగా మైదానంలో దూకుడుకు మారుపేరుగా నిలిచిన ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ వా అనేక సంవత్సరాలుగా కోల్‌కతాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మానవత్వంలో కూడా చాలా ముందున్నానంటూ నిరూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి తనలోని మంచి మనిషిని బయట పెట్టారు. వ్యక్తిగతంగా ఎలాంటి బంధం, సంబంధం లేకపోయినా తన దేశానికి చెందిన ఒక అనాథ ఆఖరి కోరికను నెరవేర్చారు. ఇటీవలే మరణించిన సిడ్నీకి చెందిన 58 ఏళ్ల షూ షైనర్ (బూట్ పాలిష్ చేసే వ్యక్తి) బ్రియాన్ రుడ్ అస్థికలను అతని కోరిక ప్రకారం స్టీవ్‌వా స్వయంగా గంగానదిలో నిమజ్జనం చేశారు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ భారత్‌లోనే ఉన్న స్టీవ్ అస్థికల నిమజ్జనం కోసం వారణాసికి వెళ్లడం విశేషం. సహచర ఆస్ట్రేలియన్ కోసం తాను చేసిన పని చాలా సంతృప్తినిచ్చినట్లు స్టీవ్ వా వ్యాఖ్యానించారు. ‘బ్రియాన్ అస్థికలు ఇక్కడి నీటిలో కలపడం గౌరవంగా భావిస్తున్నా. అతని జీవితం చాలా కఠినంగా గడిచింది. అతనికి నా అనేవాళ్లు ఎవరూ లేరు. గంగా నదిలో తన అస్థికలు నిమజ్జనం చేయాలనేది అతని చివరి కోరిక. దానిని నెరవేర్చడం సంతృప్తిగా ఉంది’ అని వా వ్యాఖ్యానించారు. అందరికీ అభిమానం: రోడ్డు పక్కన బూట్ పాలిష్ చేసుకునే వ్యక్తి అంటే సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. కానీ బ్రియాన్ రుడ్ చనిపోయిన రోజు ఆస్ట్రేలియా మీడియా మొత్తం దానిని ప్రముఖ వార్తగా ప్రచురించింది. సిడ్నీలో అతను ఉదయం ఒక చోట, సాయంత్రం మరో చోట పాలిష్ చేస్తుంటాడు. మూడు నెలల వయసులో తల్లిదండ్రులకు దూరమైన అతను ఏడేళ్ల వరకు అనాథాశ్రమంలో పెరిగాడు. కొన్నేళ్ల పాటు చిన్నాచితక పనులతో కాలం గడిపిన అతను ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. చివరకు ఒక ఫాదర్ చేరదీయడంతో బతికిపోయి షూ పాలిష్‌నే వృత్తిగా మార్చుకున్నాడు. పనితో పాటు తన మాట, పాటలతో ఆకట్టుకునే అతనంటే సిడ్నీ నగరవాసులందరికీ అభిమానం. అయితే తన పనితో తప్ప ఎప్పుడూ కూడా అయాచితంగా డబ్బులు తీసుకునేందుకు అంగీకరించలేదు. తన చివరి కోరిక కూడా అతను ఆ ఫాదర్‌కే చెప్పాడు. అయితే దానిని ఎలా నెరవేర్చాలోనని ఆయన సంశయ పడుతున్న దశలో స్టీవ్ వాకి ఈ విషయం తెలిసింది. తన కంపెనీ సీఈని అక్కడికి పంపించి అస్థికలను తెప్పించుకున్న స్టీవ్‌వా వాటిని భారత్‌కు తన వెంట తీసుకొచ్చారు. -
వరద ముప్పుతో 15 మంది మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరద దాటికి తట్టుకోలేక ఇప్పటికే 11 మంది మృతిచెందారు. ఒక్క రోజులోనే బుదేల్ఖండ్లోని వందల ఇళ్లు మట్టికొట్టుకుపోయాయి. బాందా జిల్లాలోని కల్వాన్గంజ్ ప్రాంతం, మహోమాల్లో ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గంగా నది, డేంజర్ లెవల్స్‌లో పయనిస్తున్నట్టు వెల్లడించారు. ఉప్పొంగుతున్న వరదలతో కాన్పూరులో ఓ ఇళ్లు కుప్పకూలి, ఇద్దరు పిల్లలతో కలిపి, నలుగురు ప్రాణాలు విడిచారని తెలిపారు. భారీ వరద పోటెత్తడంతో శుక్రవారం రిహంద్ ఆనకట్ట ఐదు గేట్లు తెరిచి వరద దాటిని తగ్గించుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్లలో నీరు సైతం గత 24 గంటల్లో 20 అడుగులు పెరిగినట్టు తెలుస్తోంది. అలహాబాద్‌లో గంగా నది ఉప్పొంగుతుందని, డేంజర్ లెవల్ దాటి పయనిస్తుందని, స్థానిక ప్రాంతాలన్నీ వరదనీటి మయమవుతున్నట్టు ఏఎన్ఐ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వరద ముప్పులో ఇళ్లు కొట్టుకుపోయి 12 ఏళ్ల బాలిక ప్రాణాలు విడించిందని, సితాపుర్లో ఇంటి పైకప్పు కూలి మరో వ్యక్తి మరణించినట్టు అధికారులు తెలిపారు. వరద ముప్పు ప్రాంతాల్లో వెంటనే రెస్క్యూ, రిలీఫ్ చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అధికారులను ఆదేశించారు. వరద బాధిత కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కూడా సీఎం ప్రకటించారు. 2500 హ్యాండ్ పంప్స్‌ను ఏర్పాటుచేసి ప్రజలకు తాగునీటి సౌకర్యాలు అందించాలని ఆదేశించినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
సెల్ఫీ వంకతో.. భార్యను చంపేశాడు!
కట్నం వ్యవహారంలో భార్యతో గొడవపడి.. సెల్ఫీ తీసుకునే వంకతో ఆమెను గంగానదిలోకి తోసేసి చంపేశాడో వ్యక్తి. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. ఆయేషా, ఆఫ్తాబ్లకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. వాళ్లకు 8 నెలల కొడుకు కూడా ఉన్నాడు. ఆమను తరచు అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, తేకపోవడంతో ఆమెను హతమార్చాడని ఆయేషా కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆయేషా సోదరుడు నయీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు మీరట్‌లోని సర్దానా స్టేషన్ పోలీసు అధికారి రాజేష్ వర్మ తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆఫ్తాబ్ నేరుగా తన కొడుకుతో కలిసి స్టేషన్‌కు వెళ్లాడు. ఐదుగురు దుండగులు తమను దోచుకోడానికి ప్రయత్నించారని, ఆయేషా ఎదురు తిరగడంతో ఆమెను గంగానదిలోకి తోసేశారని చెప్పాడు. అయితే పోలీసులు ఆఫ్తాబ్ను ప్రశ్నించినపుడు పొంతనలేని సమాధానాలు చెప్పి, చివరకు దొరికిపోయాడు. ఆమెను గంగా నది దగ్గర వరకు తీసుకెళ్లేందుకు సెల్ఫీని వంకగా తీసుకున్నాడు. ఆఫ్తాబ్తో పాటు అతడి అన్న షెహజాద్ మీద కూడా కేసు పెట్టారు. అతడు ఇంకా పరారీలో ఉన్నాడని వర్మ చెప్పారు. -
గంగానది వెంబడి శుద్ధి ప్లాంట్లు
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణలో గంగానది పరీవాహక ప్రాంతంలో 20 నీటి శుద్ధి(రీసైక్లింగ్) ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. భారీ ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో ఆయన శనివారం ప్రసంగించారు. గంగ పరీవాహ ప్రాంతాల్లో 20 జల శుద్ధి(రీసైక్లింగ్) ప్లాంట్లను నది వెంబడి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 111 నదులను జలమార్గాలుగా మార్చేందుకు పార్లమెంటు ఆమోదం తెలపడం విప్లవాత్మక చర్య అని, దేశంలోని 35 వేల కిలోమీటర్ల జలమార్గాలను వినియోగించుకునేందుకు ఇది దోహదపడుతుందన్నారు. జలమార్గాల అభివృద్ధి వల్ల కాలుష్యం తగ్గుతుందని, రవాణా చార్జీలు తగ్గుతాయని అన్నారు. అదే సమయంలో వ్యర్థాలను సంపదగా మార్చడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి వాడే తారులో ఎనిమిది శాతం మేరకు ప్లాస్టిక్‌ను వినియోగించేందుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. -
గంగానది ప్రక్షాళనకు జర్మనీ సాయం
బెర్లిన్: గంగానది ప్రక్షాళన కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు జర్మనీ ముందుకు వచ్చింది. ఉత్తరాఖండ్ లో ప్రవహిస్తున్న గంగా నదిలో కొంత భాగాన్ని ప్రక్షాళించేందుకు జర్మనీ ఒప్పుకుంది. యూరప్ లోని రైని నదిని క్లీన్ చేసేందుకు ఉపయోగించిన టెక్నాలజీతో గంగానదిని ప్రక్షాళన చేయనుంది. ప్రవాస భారతీయుల విజ్ఞప్తి మేరకు 'క్లీన్ గంగా' మిషన్ లో భాగస్వామి అయ్యేందుకు జర్మనీ అంగీకరించిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ తో సుష్మ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశాన్ని చేర్చారని చెప్పారు. ఇరు దేశాలు ద్వైపాకిక్ష సంబంధాలను సమీక్షించాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యంతో చేపట్టిన 'స్వచ్ఛ విద్యాలయ'లోనూ సాయం అందించేందుకు జర్మనీ ఒప్పుకుందని చెప్పారు. -
'గోదావరికి మహా పుష్కరాలు ఉండవు'
కాకినాడ: గోదావరికి మహా పుష్కరాలు ఉండవు... గంగానదికి మాత్రమే 144 ఏళ్లకు మహాకుంభమేళ వస్తుందని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ వెల్లడించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ సాక్షి టీవీతో మాట్లాడారు. పుష్కరాల 12 రోజుల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ గడియాలో స్నానం చేసినా పుణ్యమేనని తెలిపారు. వేప నూనె రాసుకుని స్నానం ఆచరించాలని భక్తులకు సూచించారు. పుణ్యస్నానం తర్వాత నదిలోకి మట్టి విసరడం పుష్కర సంప్రదాయం కాదని పేర్కొన్నారు. పుష్కరాల పేరుతో బస్సులు, రైళ్లు, విమాన ఛార్జీలు పెంచి ప్రభుత్వం యాత్రికులపై భారం మోపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీపీఠం తరఫున ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, తెలంగాణలోని ధర్మపురిలో గోదావరి స్నానాలకు వచ్చే భక్తులకు ఉచితంగా పుష్కర రైస్ పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి రోజు 35 వేలమందికిపైగా ఈ రైస్ అందజేస్తామని శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ వెల్లడించారు. -
ఇక 'వైఫై' కేవలం రూ.70లకే!
వారణాసి: దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త పొంతలు తొక్కుతోంది. దాంతో సాంకేతికపరంగా ఇంటర్ నెట్ వినియోగం కూడా రానురాను నిత్యఅవసరంగా మారింది. టెలికాం సంస్థలు కూడా అత్యాధునిక ఫీచర్స్ కలిగిన మొబైల్స్ ను వైఫై సౌకర్యంతో మార్కెట్లోకి విడుదల చేస్తుండటంతో వైఫైకు మంచి డిమాండ్ పెరుగుతోంది. తాజాగా వారణాసిలోని పురాతన ఘాట్లైన గంగా నది- శీతల, దాశ్వాష్ మెథ్లను కలుపుతూ వైఫై సౌలభ్యం అందుబాటులోకి రానుంది. వైఫై సేవలు చౌక ధరలకే వినియోగదారులకు అందేలా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారణాసిలో వైఫై ఇంటర్నెట్ సౌకర్యం కేవలం రూ. 70లకే లభ్యం కానుంది. ఈ వైఫై ఇంటర్నెట్ కనెక్టవిటీని టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. దాంతో వారణాసిలో రోజంతా రూ. 70లకే వైఫై సౌకర్యాన్ని వినియోగదారులు పొందవచ్చనని ఆయన పేర్కొన్నారు. కాగా వినియోగదారులు ఈ వైఫై సేవలను మార్కెట్లో ఇలా పొందవచ్చు... మొదటి అరగంట ఉచితంగానూ... ఆ తర్వాత ముఫ్పై నిమిషాలు వాడితే రూ. 20, ఒక గంటకు రూ. 30, రెండు గంటలు వాడితే రూ.50లు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని టెలికాం శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే నెల చివరికల్లా ఇతర ఘాట్లకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో రానున్నట్టు టెలికాం శాఖ పేర్కొంది. -
‘యమున’ను కలుషితం చేయొద్దు
న్యూఢిల్లీ: పవిత్ర గంగానదితో పాటు దాని ఉపనది యమునను కూడా శుభ్రపరిచే దిశగా నరేంద్రమోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, రానున్న పండుగలు ఆయా నదుల్లో కాలుష్యాన్ని మరింత పెంచవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న వినాయక చతుర్ధి ఉత్సవాల సందర్భంగా నగరంలోని నీటి కొలనులను పరిశుభ్రంగా ఉంచాలని నగరవాసులకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ విజ్ఞప్తి చేశారు. నిర్దేశించిన ఘాట్ల వద్ద మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఆయన సూచించారు. ప్రతి ఏడాది ఉత్సవాల అనంతరం వందలాది వినాయక విగ్రహాలను క్షీణించిన యమునా జలాల్లో నిమజ్జనం చేస్తుంటారు. ఇక ఈ విగ్రహాలలో అనేకం విషపూరితమైన ప్లాస్టర్, పెయింట్‌తో తయారైనవి ఉంటాయి. వీటికితోడు ఘాట్ల వద్ద పూలదండలు, ఇతర అలంకరణ సామగ్రిని వదిలివేయడంతో ఆ చుట్టుపక్కల భారీస్థాయిలో చెత్తా చెదారం పోగవుతుంది. నిమజ్జనం సందర్భంగా ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఇటీవలి కాలంలో ప్రతి ఏడాది నిత్యకృత్యమైంది. గత ఏడాది నిమజ్జనం సందర్భంగా యమునా నదిలో మునిగి ఎనిమిది మంది మృతి చెందారు. ‘‘ఇటువంటి ప్రమాదాలను నివరించేందుకు దయచేసి పగటిపూటనే విగ్రహాలను నిమజ్జనం చేయండి. నిర్దేశించిన ఘాట్ల వద్దనే విగ్రహాలను నిమజ్జనం చేయండి’’ అని నజీబ్ జంగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణానికి హాని కలగని రంగులు, మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగించాలని ఆయన కోరారు. పర్యావరణానికి సన్నిహితమైన సామగ్రి, విషపూరితం కాని రంగులతో విగ్రహాలను తయారు చేయాలని ఆయన తయారీదారులకు కూడా విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం సమయంలో పూలు, పూలదండలను ఘాట్ల వద్ద నిర్దేశించిన ప్రదేశాల వద్ద పారవేయాలని నిర్వాహకులను కోరారు. నిమజ్జనానికి నిర్దేశించిన ఘాట్ల వద్ద సైన్ బోర్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ బోర్డులపై ఆ ప్రదేశంలో నదిలోని నీటిమట్టం వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. ‘‘గొప్ప ఉత్సాహంతో నిజమైన స్ఫూర్తితో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుందాం. అదే సమయంలో నగరాన్ని ముఖ్యంగా యమునా నదిని పరిశుభ్రంగా ఉంచుదామని ప్రతిజ్ఞ చేద్దాం’’ అని లెఫ్టినెంట్ గవర్నర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలు ముగిసిన కొద్ది వారాల్లోనే నగరంలో దుర్గా పూజ ప్రారంభమవుతుంది. ఆ విగ్రహాలను కూడా ఉత్సవాల అనంతరం నీటిలోనే నిమజ్జనం చేస్తారు.