'గోదావరికి మహా పుష్కరాలు ఉండవు'
కాకినాడ: గోదావరికి మహా పుష్కరాలు ఉండవు... గంగానదికి మాత్రమే 144 ఏళ్లకు మహాకుంభమేళ వస్తుందని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ వెల్లడించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ సాక్షి టీవీతో మాట్లాడారు. పుష్కరాల 12 రోజుల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ గడియాలో స్నానం చేసినా పుణ్యమేనని తెలిపారు. వేప నూనె రాసుకుని స్నానం ఆచరించాలని భక్తులకు సూచించారు.
పుణ్యస్నానం తర్వాత నదిలోకి మట్టి విసరడం పుష్కర సంప్రదాయం కాదని పేర్కొన్నారు. పుష్కరాల పేరుతో బస్సులు, రైళ్లు, విమాన ఛార్జీలు పెంచి ప్రభుత్వం యాత్రికులపై భారం మోపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీపీఠం తరఫున ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, తెలంగాణలోని ధర్మపురిలో గోదావరి స్నానాలకు వచ్చే భక్తులకు ఉచితంగా పుష్కర రైస్ పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి రోజు 35 వేలమందికిపైగా ఈ రైస్ అందజేస్తామని శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ వెల్లడించారు.