న్యూఢిల్లీ: పవిత్ర గంగానదితో పాటు దాని ఉపనది యమునను కూడా శుభ్రపరిచే దిశగా నరేంద్రమోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, రానున్న పండుగలు ఆయా నదుల్లో కాలుష్యాన్ని మరింత పెంచవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న వినాయక చతుర్ధి ఉత్సవాల సందర్భంగా నగరంలోని నీటి కొలనులను పరిశుభ్రంగా ఉంచాలని నగరవాసులకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ విజ్ఞప్తి చేశారు. నిర్దేశించిన ఘాట్‌ల వద్ద మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఆయన సూచించారు. ప్రతి ఏడాది ఉత్సవాల అనంతరం వందలాది వినాయక విగ్రహాలను క్షీణించిన యమునా జలాల్లో నిమజ్జనం చేస్తుంటారు.
ఇక ఈ విగ్రహాలలో అనేకం విషపూరితమైన ప్లాస్టర్, పెయింట్‌తో తయారైనవి ఉంటాయి. వీటికితోడు ఘాట్‌ల వద్ద పూలదండలు, ఇతర అలంకరణ సామగ్రిని వదిలివేయడంతో ఆ చుట్టుపక్కల భారీస్థాయిలో చెత్తా చెదారం పోగవుతుంది. నిమజ్జనం సందర్భంగా ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఇటీవలి కాలంలో ప్రతి ఏడాది నిత్యకృత్యమైంది. గత ఏడాది నిమజ్జనం సందర్భంగా యమునా నదిలో మునిగి ఎనిమిది మంది మృతి చెందారు. ‘‘ఇటువంటి ప్రమాదాలను నివరించేందుకు దయచేసి పగటిపూటనే విగ్రహాలను నిమజ్జనం చేయండి. నిర్దేశించిన ఘాట్‌ల వద్దనే విగ్రహాలను నిమజ్జనం చేయండి’’ అని నజీబ్ జంగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పర్యావరణానికి హాని కలగని రంగులు, మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగించాలని ఆయన కోరారు. పర్యావరణానికి సన్నిహితమైన సామగ్రి, విషపూరితం కాని రంగులతో విగ్రహాలను తయారు చేయాలని ఆయన తయారీదారులకు కూడా విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం సమయంలో పూలు, పూలదండలను ఘాట్‌ల వద్ద నిర్దేశించిన ప్రదేశాల వద్ద పారవేయాలని నిర్వాహకులను కోరారు. నిమజ్జనానికి నిర్దేశించిన ఘాట్‌ల వద్ద సైన్ బోర్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ బోర్డులపై ఆ ప్రదేశంలో నదిలోని నీటిమట్టం వివరాలు ఉంటాయని పేర్కొన్నారు.
‘‘గొప్ప ఉత్సాహంతో నిజమైన స్ఫూర్తితో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుందాం. అదే సమయంలో నగరాన్ని ముఖ్యంగా యమునా నదిని పరిశుభ్రంగా ఉంచుదామని ప్రతిజ్ఞ చేద్దాం’’ అని లెఫ్టినెంట్ గవర్నర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలు ముగిసిన కొద్ది వారాల్లోనే నగరంలో దుర్గా పూజ ప్రారంభమవుతుంది. ఆ విగ్రహాలను కూడా ఉత్సవాల అనంతరం నీటిలోనే నిమజ్జనం చేస్తారు.
‘యమున’ను కలుషితం చేయొద్దు
Published Sat, Aug 23 2014 10:14 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement