సామాన్యుడినే.. కనుక నేనూ తప్పులు చేశా
వాటి వెనక ఎప్పుడూ చెడు ఉద్దేశం లేదు
తొలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మోదీ
పలు అంశాలపై మనసు విప్పిన ప్రధాని
ప్రజాసేవ కోసమే రాజకీయాలని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ‘‘తప్పులు చేయడం మానవ సహజం. తెలిసీ తెలియక అందరూ తప్పులు చేస్తారు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘నేను దేవుడిని కాదు. సామాన్య మానవుడినే. కాబట్టి నేను కూడా తప్పులు చేశా’’ అని అంగీకరించారు. అయితే తాను చేసిన తప్పుల్లో చెడు ఉద్దేశం ఏనాడూ లేదని స్పష్టం చేశారు. మనుషులు చేసే తప్పుల వెనుక ప్రమాదకరమైన ఉద్దేశాలు ఉంటాయని అనుకోవడం లేదన్నారు.
‘జెరోదా’ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు మోదీ ఆదివారం తొలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రెండు గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో పలు అంశాలపై విస్తారంగా ముచ్చటించారు. తన రాజకీయ ప్రస్థానంతో సహా పలు అంశాలపై మనసు విప్పారు. తన జీవితంలోని అనేక దృక్కోణాలను ప్రస్తావించారు. తప్పులు చేస్తానని తాను తొలిసారి సీఎం అయినప్పుడే ప్రజలకు చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఆ తప్పుల్లో చెడు ఉద్దేశం మాత్రం ఉండదని వివరించానన్నారు. పాడ్‌కాస్ట్‌లో మోదీ ఏం చెప్పారంటే...
గోద్రాలో భావోద్వేగాలు అదుపు చేసుకున్నా
‘‘గుజరాత్ సీఎం అయిన తొలినాళ్లలో ఓ సభలో మాట్లాడుతూ మూడు విషయాలు ప్రజలతో పంచుకున్నా. ‘‘నా కృషిలో ఏ లోపమూ లేకుండా జాగ్రత్త పడతా. నాకోసం ఏదీ చేసుకోను. మనిషిని కాబట్టి తప్పులు చేస్తా, కానీ వాటిలో చెడుద్దేశం ఉండబోదు’’ అని వివరించా. ఆ మూడూ నాకు జీవన మంత్రాలు! 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైలు దహనం గురించి తెలియగానే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా.
చూస్తే హెలికాప్టర్ అందుబాటులో లేదు. చివరకు బహుశా ఓఎన్‌జీసీకి చెందిన సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ సమకూర్చినా, అది వీఐపీలకు ఉద్దేశించింది కాదంటూ భద్రతా సిబ్బంది అభ్యంతరపెట్టారు. ‘నేను వీఐపీని కాను, మామూలు పౌరుడినే’నని బదులిచ్చి అందులోనే గోద్రా చేరుకున్నా. అందుకోసం ఎంతో వాదించాల్సి వచ్చింది. చివరికి, ఏం జరిగినా నాదే బాధ్యత అని రాసివ్వడానికి కూడా సిద్ధపడ్డా. అంతే తప్ప రిస్క్ చేయడానికి వెనకాడలేదు.
తీరా వెళ్లాక గోద్రాలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. నేనూ మనిషినే. నాకూ భావోద్వేగాలుంటాయి. కానీ సీఎంను గనుక వాటికి దూరంగా ఉండాలని నాకు తెలుసు. అందుకే భావోద్వేగాలను అదుపు చేసుకున్నా. అందుకోసం మానసికంగా చేయగలిగిందంతా చేశా. ఆ ఫలితాల రోజు నాలో ఆదుర్దా కలగలేదని చెప్పలేను. కానీ దాన్ని అధిగమించాలని గట్టిగా అనుకున్నా. అందుకే మధ్యాహ్నం దాకా ఫలితాల గురించి నాకు చెప్పొద్దని సిబ్బందికి సూచించా. ఆ రోజు టీవీ కూడా చూడలేదు. మధ్యాహ్నానికల్లా నా ఇంటిముందు ఆనందోత్సాహాలు మిన్నంటాయి. చూస్తే మాకు మూడింట రెండొంతుల మెజారిటీ దక్కింది.
మిత్రులు నన్ను సీఎంగానే చూసేవారు
నా చిన్నప్పుడు అప్పుడప్పుడు మా కుటుంబ సభ్యుల బట్టలు ఉతికేందుకు ఇష్టపడేవాడిని. అలాగైతే చెరువు దగ్గరికి వెళ్లనిస్తారు కదా! సీఎం అయ్యాక కూడా చిన్నప్పటి మిత్రులను అధికారిక నివాసానికి ఆహా్వనిస్తూ ఉండేవాడిని. కానీ వారు నన్ను సీఎంగానే చూసేవారు. దాంతో నన్ను ‘నీవు’ అని పిలిచేవారే కరువయ్యారు.
రాజకీయాల్లో సొంత లాభం కూడదు
వ్యాపారానికి, రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది. వ్యాపారంలో వ్యక్తిగత, ఆర్థిక అభివృద్ధే ముఖ్యం. రాజకీయాల్లో మాత్రం సమాజ సంక్షేమానికే ప్రాధాన్యమివ్వాలి. అందుకు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. సొంత లాభం మానుకోవాలి. వ్యాపారంలో ఎలా పైకి ఎదగాలన్నదే కీలకం. రాజకీయాల్లో త్యాగాలెలా చేయాలన్నది కీలకం. వ్యాపారంలో కంపెనీని నంబర్‌వన్‌గా ఎలా మార్చాలో ఆలోచించాలి. రాజకీయాల్లో మాత్రం దేశమే తొలి ప్రాధాన్యం కావాలి. దేశాన్ని నంబర్‌వన్‌గా మార్చే ఆలోచన చేయాలి. రాజకీయాలంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కాదు. అది ప్రజాసేవకు సంబంధించిన అంశం. వ్యక్తిగత ఆశల కంటే ప్రజాసేవే పరమావధి కావాలి. అంతేతప్ప రాజకీయాలంటే ‘లేనా, పానా, బనానా (దండుకోవడం)’ కాదు. అలాంటివారు దీర్ఘకాలం కొనసాగలేరు.
కంఫర్ట్ జోన్‌లో ఉండలేను
నేనెప్పుడూ కంఫర్ట్ జోన్‌లో జీవించలేదు. అలా ఉండిపోయేవారు విజయాలు సాధించలేరు. కంఫర్ట్ జోన్ బయట ఉన్నా గనుక ఏం చేయాలో నాకు తెలిసింది. సురక్షిత స్థానంలో ఉండిపోవడానికి నేను సరిపోనేమో! రిస్క్ తీసుకొనే మనస్తత్వమే మనల్ని ముందుకు నడుపుతుంది. అయితే రిస్క్ తీసుకొనే సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వాడుకోలేదు. చిన్నచిన్న విషయాలే నాకు సంతృప్తినిచ్చాయి. పాత ఆలోచనలు వదిలేయడానికి నేనెప్పుడూ సిద్ధమే.
నాది సాధారణ నేపథ్యం
నేను అతి సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చా. నేను ప్రాథమిక పాఠశాల టీచర్‌నయినా నా తల్లి ఆనందంతో అందరికీ స్వీట్లు పంచేదేమో! అలాంటి నేపథ్యం నాది. చిన్నప్పుడు స్కూల్‌లో సాధారణ విద్యార్థినే. కేవలం పాసయ్యేందుకు చదివేవాడిని. ఇతర కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడిని. సైనిక్ స్కూల్‌లో చేరేందుకు దరఖాస్తు చేయడానికి నా తండ్రి అంగీకరించలేదు. డబ్బు లేకపోవడమే అందుకు కారణం. అయినా నేనెప్పుడూ అసంతృప్తి చెందలేదు. జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులే నాకు యూనివర్సిటీ. అవే నాకెన్నో పాఠాలు నేర్పాయి. పుట్టుక, చావు గురించి నేనేనాడూ ఆలోచించలేదు. సీఎం అయినప్పుడు నేనెలా అయ్యానని ఆశ్చర్యపోయా’’.
గాంధీ ఎన్నడూ టోపీ ధరించకున్నా..
‘‘మహాత్మా గాంధీ తన జీవితంలో ఎన్నడూ టోపీ ధరించలేదు. కానీ గాంధీ టోపీని ప్రపంచమంతా నేటికీ గుర్తుంచుకుందంటే ఆయన నాయకత్వ పటిమే కారణం. గాంధీ గొప్ప వక్త కాకపోయినా ప్రజలతో మమేకమయ్యే విషయంలో ఆయనకు ఆయనే సాటి! తన వ్యక్తిత్వం, పనితీరుతో దేశమంతటినీ ఒక్కటి చేసి చూపాడు! రాజకీయాల్లో ప్రవేశించడం సులువే. కానీ రాణించడమే కష్టం. అందుకు తిరుగులేని అంకితభావం, ప్రజలతో మమేకమవడం, వారి మంచి చెడుల్లో అండగా నిలవడం, చక్కని భావ వ్యక్తీకరణ వంటి లక్షణాలు చాలా అవసరం. అందుకే వ్యక్తిగత ఆకాంక్షలు లేని, నిస్వార్థంగా దేశ సేవ చేయాలన్న భావన నరనరానా నింపుకున్న కనీసం లక్షమంది యువకులు కావాలిప్పుడు’’.
‘మెలోడీ’ మీమ్స్‌పై..
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో తన పేరును కలిపి మెలోడీ అంటూ సాగిన మీమ్స్ వెల్లువను ప్రస్తావించగా మోదీ సరదాగా స్పందించారు. ‘‘అలాంటివి నడుస్తూనే ఉంటాయి (వోతో చల్తా హీ రహేగా)’’ అన్నారు. అలాంటి వాటిపై సమ యం వృథా చేసుకోనన్నారు. ‘‘నేను భోజనప్రియుణ్ని కాదు. పర్యటనలప్పుడు అందుబాటులో ఉన్నది తింటా. రెస్టారెంట్‌కు తీసుకెళ్లి మెనూ చేతికిస్తే ఏం కావాలో ఆర్డర్ కూడా ఇవ్వలేను. అలాంటప్పుడు దివంగత అరణ్ జైట్లీ నన్ను ఆదుకునేవారు’’ అని చెప్పుకొచ్చారు.
జిన్‌పింగ్‌తో ప్రత్యేక బంధం
చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో తన తొలి సంభాషణను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘2014లో నేను ప్రధాని అయ్యాక ఎందరో దేశాధినేతలు అభినందనలు తెలియజేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా మాట్లాడారు. ఇండియాలో పర్యటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘తప్పకుండా రండి, మీకు స్వాగతం’ అని చెప్పాను. ‘‘గుజరాత్‌లో మీ సొంతూరు వాద్‌నగర్‌ను సందర్శించాలని ఉంది. ఎందుకంటే మనిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉంది. అలనాటి ప్రఖ్యాత చైనా తత్వవేత్త, పర్యాటకుడు హుయాన్‌త్సాంగ్ వాద్‌నగర్‌లో చాలాకాలం నివసించారు. చైనాకు తిరిగొచ్చాక నా స్వగ్రామంలో నివసించారు’ అని జిన్‌పింగ్ చెప్పుకొచ్చారు’’ అంటూ మోదీ గుర్తు చేసుకున్నారు.
An enjoyable conversation with @nikhilkamathcio, covering various subjects. Do watch... https://t.co/5Q2RltbnRW
— Narendra Modi (@narendramodi) January 10, 2025
ప్రధాని రేసులో నేనూ ఉన్నా.. భారత సంతతి కెనడా ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment