ప్రధాని రేసులో నేనూ ఉన్నా.. భారత సంతతి కెనడా ఎంపీ | Indian origin Canadian MP Chandra Arya race on pm post for Canada | Sakshi
Sakshi News home page

ప్రధాని రేసులో నేనూ ఉన్నా.. భారత సంతతి కెనడా ఎంపీ

Published Fri, Jan 10 2025 11:16 AM | Last Updated on Fri, Jan 10 2025 11:56 AM

Indian origin Canadian MP Chandra Arya race on pm post for Canada

ఒట్టావా : కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో (justin trudeau) రాజీనామా చేయడంతో ఆ పదవి చేపట్టనున్న నేత ఎవరనే విషయంలో చర్చ కొనసాగుతోంది. ఈ తరుణంలో తదుపరి కెనడా(canada) ప్రధాని రేసులో తానున్నాంటూ భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య (Chandra Arya) ప్రకటించారు. 

‘భవిష్యత్‌ తరాల కోసం మన దేశాన్ని పునర్నిర్మించడానికి, శ్రేయస్సును కాపాడుకోవడానికి మరింత సమర్థవంతమైన ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి నేను కెనడా తదుపరి ప్రధానమంత్రిగా పోటీ చేస్తున్నాను’ అని ఈ మేరకు ఆయన గురువారం  ట్వీట్‌ చేశారు.

‘చాలా మంది కెనడియన్లు, ముఖ్యంగా యువ తరాలు, ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెరిగిపోతున్న ఖర్చులు, ఆకాశాన్నంటుతున్న నిత్యవసర వస్తువుల ధరల వంటి ఇతరాత్ర కారణాలో పేదలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా వారు ఆర్థికంగా మరింత చితికిపోతున్నారు’ అ ట్వీట్‌లో తెలిపారు.

కెనడా ప్రధాని రేసులో తన విధానాలను వివరిస్తూ..డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ వంటి అంశాల ఆధారంగా కాకుండా మెరిట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా మారడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ప్రస్తావించారు. గతంలో దేశం నైపుణ్యం కలిగిన కార్మికులను అనుమతించిందని అన్నారు. కానీ నేడు చాలా మంది తాత్కాలిక నివాసితులుగా ఉన్నారు’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

కాగా,కెనడా ఎంపీ చంద్ర ఆర్య కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని సిరా తాలూకాలోని ద్వార్లు గ్రామానికి చెందినవారు. 2006లో కెనడాకు వలస వెళ్ళారు. పలు మార్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

జస్టిన్‌ ట్రూడో రాజీనామా
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో(53) ప్రధాని పదవికి, అధికార లిబరల్‌ పార్టీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసినట్లు ఇటీవలే ప్రకటించారు. కొత్త నేతను ఎన్నుకునేదాకా పదవిలో కొనసాగుతానన్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి రాజీనామా, తొమ్మిదేళ్ల పాలన అనంతరం నాయకత్వ మార్పిడి కోరుతూ అధికార పార్టీలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు.

‘పార్టీ నేత, ప్రధాని పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్త ఎంపిక ప్రక్రియలో తదుపరి నేత ఎన్నికయ్యే వరకు ప్రధానిగా కొనసాగుతాను’ అని ట్రూడో మీడియా సమావేశంలో ప్రకటించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలున్నాయని బహిరంగంగానే అంగీకరించారు. ‘‘రానున్న ఎన్నికల్లో ప్రజలు నిజమైన నేతను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అంతర్గతంగా పోరాడాల్సిన పరిస్థితులుండగా వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నేను ఉత్తమ ఎంపిక కాలేననే విషయం స్పష్టమైంది. అందుకే బరి నుంచి తప్పు కోవాలనుకుంటున్నా’ అని చెప్పారు.

‘నేను పోరాటయోధుడిని. కెనడా కోసం పోరాడేందుకు నా శరీరంలో అణువణువూ సిద్ధమే. కానీ ఎంతగా కృషి చేస్తున్నా కొంతకాలంగా పార్లమెంట్‌ సజావుగా సాగడం లేదు. అందుకే పార్లమెంట్‌ సమావేశాలను కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరముందని గవర్నర్‌ జనరల్‌కు తెలిపా. అందుకామె అంగీకరిస్తూ సమావేశాలను జనవరి 27 నుంచి మార్చి 24కు వాయిదా వేశారు’ అని వివరించారు. ఆలోగా కొత్త నేతను ఎంపిక చేసుకునేందుకు అధికార పారీ్టకి వీలు చిక్కుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ప్రజాదరణలో అధికార లిబరల్‌ పార్టీ కంటే కన్జర్వేటివ్‌ పార్టీ ఎంతో మెరుగ్గా ఉంది.

ఈ దశలో ట్రూడో రాజీనామా ప్రకటనతో అధికార పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నేత కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. జనవరి 27వ తేదీన పార్లమెంట్‌ సమావేశాలు మొదలైతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మూడు ప్రతిపక్ష పారీ్టలు ప్రకటించడం గమనార్హం. దీనిని తప్పించుకునేందుకే ట్రూడో పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేయించినట్లు చెబుతున్నారు. పదేళ్ల కన్జర్వేటివ్‌ పార్టీ పాలనకు ముగింపు పలుకుతూ లిబరల్‌ పార్టీ నేతగా ఉన్న ట్రూడో 2015లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 

👉ఇదీ చదవండి : ‘డబ్బుతో కెనడాను అమెరికాలో కలిపేసుకుంటా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement