Lieutenant Governor Najib Jung
-
కేంద్రానికి ఎదురుదెబ్బ
ఢిల్లీ కేబినెట్ మంత్రిమండలి సలహా మేరకే ఎల్జీ విధులు నిర్వర్తించాలి: హైకోర్టు న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కీ, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్కు మధ్య జరుగుతున్న ఘర్షణ మరో మలుపు తిరిగింది.. ఎల్జీకి ఉన్న అధికారాలను నిర్వచిస్తూ, కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాజకీయ వ్యవస్థలపైన ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ కేసులు పెట్టడానికి వీల్లేదంటూ కేంద్ర హోం శాఖ మే 21న జారీ చేసిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. కేంద్రం పరిధిలో ఉండే ఢిల్లీ పోలీసుకు చెందిన అధికారులను అరెస్టు చేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక విభాగాని(ఏసీబీ)కి ఉందని సోమవారం స్పష్టం చేసింది. ఓ అవినీతి కేసులో ఏసీబీ అరెస్టు చేసిన హెడ్ కానిస్టేబుల్ అనిల్ కుమార్.., తనను అరెస్టు చేసి విచారించే అధికార పరిధి ఢిల్లీ ఏసీబీకి లేదంటూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఢిల్లీ పోలీసుల విధులు జాతీయ రాజధాని ప్రాంతం-ఢిల్లీ (జీఎన్సీటీడీ)ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి కాబట్టి.. ఆ పరిధిలో జరిగే నేరానికి సంబంధించి ఫిర్యాదు వచ్చినప్పుడు జీఎన్సీటీడీ పరిధిలోని ఏసీబీకి విచారణ జరిపే అధికారం ఉంటుందని పేర్కొంది. ‘ఎల్జీ తనంత తానుగా వ్యవహరించేందుకు వీల్లేదు. ఢిల్లీ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న మంత్రి మండలి సలహాకు ఆయన బద్ధుడై ఉండాలి. కేంద్రం ఎల్జీ పక్షాన కార్యనిర్వాహక ఆదేశాలివ్వటం అనుమానాస్పదంగా ఉంది. ప్రజల తీర్పును ఎల్జీ శిరసావహించాల్సిందే. ఇందులో రాజ్యాంగ ప్రత్యామ్నాయం ఏదీ లేదు’ అని స్పష్టం చేసింది. కేంద్రానికి ఇబ్బందికరం: కేజ్రీవాల్ కోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిణామమని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేంద్రంతో తలెత్తిన వివాదంపై సలహా కోసం కేజ్రీవాల్ పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి ఫోన్‌చేసి విజ్ఞప్తి చేశారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం అతిగా జోక్యం చేసుకోవటాన్ని మమత ట్విటర్లో విమర్శించారు. -
ఢిల్లీ డ్రామా!
గవర్నర్ల వ్యవస్థ మళ్లీ రచ్చకెక్కింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కూ, అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కూ మధ్య కొద్దికాలంగా రాజుకుంటూ వస్తున్న వివాదం పతాకస్థాయికి చేరింది. అది వారిద్దరికీ పరిమితమైతే వేరే విధంగా ఉండేది. కానీ, ఢిల్లీ ప్రభుత్వ అధికారవర్గం మొత్తాన్ని అది తాకింది. తాము ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేయలేమంటూ కొందరు అధికారులు కేంద్రానికి విన్నవించుకునే స్థితికి దిగజారింది. అటు కేజ్రీవాల్...ఇటు నజీబ్ జంగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తమ తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె.కె. శర్మ పదిరోజుల సెలవుపై అమెరికా వెళ్లడంతో ఆయన స్థానంలో నియమించాల్సిన అధికారి విషయంలో కేజ్రీవాల్, జంగ్లమధ్య విభేదాలు తలెత్తాయి. అలా నియమించే అధికారి కేవలం పదిరోజులపాటు మాత్రమే ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని గుర్తుంచుకుంటే ఇది ఎంత అనవసరమైన వివాదమో అర్థమవుతుంది. ఆయన స్థానంలో పరిమళరాయ్ను నియమించాలని కేజ్రీవాల్ పట్టుబట్టగా...నజీబ్ జంగ్ మాత్రం శకుంతలా గామ్లిన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడం, ఆమె బాధ్యతలు చేపట్టడం పూర్తయింది. ఆ పదవిని తీసుకోవద్దంటూ కేజ్రీవాల్ చేసిన సూచనను ఆమె బేఖాతరు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి కీలక పదవిలో ఎవరుండాలనే అంశంలో సీఎంను సంప్రదించాలన్న కనీస మర్యాదను కూడా లెఫ్టినెంట్ గవర్నర్ పాటించలేదన్నది కేజ్రీవాల్ అభియోగం. అంతేకాదు...శకుంత ల గతంలో కొన్ని కార్పొరేట్ విద్యుత్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించడానికి ప్రయత్నించారని ఆయన బాహాటం గానే చెప్పారు. అంతేకాదు...శకుంతల నియామక ఉత్తర్వులను విడుదల చేసిన ముఖ్య కార్యదర్శి మజుందార్ కార్యాలయానికి తాళాలు వేయించి, ఆయన స్థానంలో రాజేంద్ర కుమార్ అనే మరో అధికారిని నియమించారు. అది చెల్లదని లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులిచ్చారు. పైకి ఇదంతా అధికారుల నియామకాలకు సంబంధించి తలెత్తిన వివాదంగా కనిపిస్తున్నా దీని వెనక రాజకీయ ఆధిపత్య ధోరణులున్నాయన్నది కాదనలేని సత్యం. మన దేశంలో గవర్నర్ల వ్యవస్థ నెలకొల్పిన ఉద్దేశంపైనా, దాన్ని కొనసాగించడంలోని ఆంతర్యం విషయంలోనూ చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. క్రియాశీల రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధంలేని విశిష్ట వ్యక్తులు గవర్నర్లుగా ఉంటే బాగుంటుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఆచరణలో అది ఎప్పుడూ సరిగా అమలైన దాఖలాలు లేవు. రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన ప్రభుత్వాలున్నప్పుడు వాటిని అస్థిరపరచడం కోసం లేదా అప్రదిష్టపాలు చేయడం కోసం కేంద్రంలో అధికారం వెలగ బెట్టే ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయని ఇప్పటికెన్నోసార్లు రుజువైంది. కనుకనే సుప్రీంకోర్టు సైతం గవర్నర్ల నియామకంలో రాజకీయ నీడ ఉండొద్దని హితవు చెప్పింది. రాజ్యాంగరీత్యా గవర్నర్ పదవి చాలా ఉన్నతమైనది. ఆ పదవి చేపట్టేవారికుండాల్సిన అర్హతలేమిటో రాజ్యాంగంలోని 157, 158 అధికరణలు వివరిస్తాయి. అయితే గవర్నర్లుగా ఉంటున్నవారి చరిత్ర తిరగేస్తే ఆ అధికరణలు ఎలా దుర్వినియోగమవుతున్నాయో అర్ధమవుతుంది. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నా పదవులు దక్కక అసంతృప్తితో రగిలిపోతున్నవారికీ, వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన వారికీ, ఉన్నతాధికారులుగా ఉన్న సమయంలో తమ మాట మన్నించి నడుచుకున్న వారికీ గవర్నర్ పదవులను పంచిపెట్టడం సంప్రదాయంగా మారింది. ఇప్పుడు ఢిల్లీలో సాగుతున్న డ్రామాపై రాజకీయ నాయకులు సరేగానీ...న్యాయ నిపుణులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రాల్లో గవర్నర్లకూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోని లెఫ్టినెంట్ గవర్నర్లకూ మౌలికంగా తేడా ఉంటుందన్నది అందులో ముఖ్యమైనది. రాష్ట్రాల్లో గవర్నర్లు మంత్రిమండలి నిర్ణయాలను శిరసావహించాల్సి ఉన్నా... లెఫ్టినెంట్ గవర్నర్‌కు అలా నడుచుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. నవాబ్‌జంగ్ సైతం ఆ అభిప్రాయంతోనే తన ఇష్టానుసారం నియామకాలు చేస్తున్నారు. ఇది తప్పని, లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని రాజీవ్ ధావన్, గోపాల సుబ్రహ్మణ్యం వంటి వారి వాదన. ఈ వాదప్రతివాదాల సంగతెలా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాల మాటే చెల్లడం ధర్మం. ఒకవేళ రాజ్యాంగం గానీ, చట్టాలుగానీ అందుకు విరుద్ధంగా ఉంటే వాటిని సవరించుకోవాలి తప్ప ఆ నిబంధనలను సాకుగా చూపి ఎన్నికైన ప్రభుత్వాల అభీష్టాన్ని కాలరాయాలనుకోవడం అధర్మం అనిపించుకుంటుంది. ఢిల్లీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని నిరూపించడం రాజకీయంగా బీజేపీకి అవసరం కావొచ్చు గానీ అందువల్ల మొత్తంగా మంటగలిసేది దేశ ప్రతిష్టే. దేశ రాజధాని నగరం కావడంవల్ల అక్కడ జరిగే ఇలాంటి తగవులు మన పార్లమెంటరీ వ్యవస్థ పనితీరుపై చిన్నచూపు ఏర్పరుస్తాయి. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని కేజ్రీవాల్ ఎప్పటినుంచో డిమాండు చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే దాన్ని సాధించుకోవడానికి పోరాడితే ఆయనకు అందరి మద్దతూ లభిస్తుంది. అంతేతప్ప చిన్న చిన్న అంశాలపై పంతానికి పోవడం... మధ్యలో కొందరు అధికారులపై ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడం... తన మాట వినని అధికారి కార్యాలయానికి తాళాలు వేయించడం హుందా అయిన పనులు అనిపించుకోవు. తానూ కొంతకాలంక్రితం వరకూ అధికారిగా పనిచేసినందువల్ల వారి మనోభావాలెలా ఉంటాయో కేజ్రీవాల్‌కు అర్థమై ఉండాలి. ఈ పంచాయతీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది గనుక ఇలాంటి సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతులపై ఒక అవగాహన ఏర్పడుతుందని, ఇప్పుడు తలెత్తిన వివాదానికి సామరస్యపూర్వకమైన పరిష్కారం లభిస్తుందని ఆశించాలి. -
బేరాలు లేకుండా ప్రభుత్వమా?
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎరవేయడం తప్పదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేనందున, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు బేరం పెట్టకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయజాలదని కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు రాజ్యాంగ సూత్రాలు విస్మరించకుండా చూసే బాధ్యత లెఫ్టినెంట్ గవర్నర్దేనని ఆయన అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు తాను బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలతో సంప్రదింపులు జరుపుతానని నజీబ్ జంగ్ పేర్కొన్న నేపథ్యంలో రాజీవ్ శుక్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలుండగా, వారి మిత్రపక్షమైన అకాలీదళ్‌కు ఒకే శాసనసభ్యుడున్నారు. మొత్తంగా 67 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీకి మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. -
కమాల్ సర్కార్..
►బీజేపీని ఆహ్వానించాలని రాష్ట్రపతికి ఎల్జీ నివేదిక? ►ఎన్నికలు ఉండబోవని పరోక్షంగా వెల్లడించిన హోంశాఖ మంత్రి ►ప్రభుత్వ ఏర్పాటు సంకేతాలు పంపుతున్న ఢిల్లీ బీజేపీ ►రాజ్‌నాథ్-గడ్కరీ సమావేశం ►ఎల్జీ తీరును ఎండగట్టిన కాంగ్రెస్, ఆప్ పార్టీలు ►బేరసారాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపణ సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందా? నగరంలో చోటుచేసుకుంటు న్న పరిణామాలు, నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఇదే అభిప్రాయం కలుగుతోంది. అసెం బ్లీలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతికి నివేదిక సమర్పించారనే వార్తల నేపథ్యంలో నగరంలో బీజేపీ సర్కారు ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిం దిగా ఎల్జీ ఆహ్వానించే అవకాశముందని చెబుతున్నారు. ఎల్జీ నుంచి ఆహ్వానం అందగానే అసెం బ్లీలో బీజేపీ బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుం ది. ఇదే విషయమై రాష్ట్రపతికి నజీబ్ జంగ్ నివేదిక పంపారని, ఆ నివేదికను రాష్ట్రపతి, హోంశాఖకు పంపారని చెబుతున్నారు. హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రభుత్వ ఏర్పాటు విషయమై బీజేపీ ఆలోచిస్తోందని చెప్పారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమనే సంకేతాలను ఆయన పరోక్షంగా వెల్లడించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై వినిపిస్తున్న ఊహాగానాలు నిజమైతే.. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ బీజేపీని నగరంలో ప్రభు త్వ ఏర్పాటు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానించవచ్చు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని అహ్వానించి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవలసిందిగా కోరవచ్చు. ఇదిలా ఉండగా ఈ విషయమై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ నితిన్ గడ్కరీని కలిశారు. ఆ తరువాత గడ్కరీ, హోంమంత్రి సమావేశమయ్యారు. మండిపడుతున్న ఆప్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సుముఖంగా లేమని బీజేపీ ఓవైపు చెబుతున్నా ఆ పార్టీని ఎలా ఆహ్వానిస్తారని ఆప్ ప్రశ్నించింది. మెజార్టీ ఉన్న పార్టీలనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేసింది. ఏ పార్టీకి సరిపడా మెజార్టీ లేనప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటూ రాజ్యంగమే చెబుతోందని, ఈ విషయమై ప్రణబ్ ముఖర్జీని మరోసారి కలుస్తామని, ఎమ్మెల్యేల బేరసారాలకు ఢిల్లీ అసెంబ్లీని వేదికగా మార్చవద్దని కోరతామని మెజార్టీని నిరూపించుకోవాల్సిందిగా ముందు పార్టీలను ఆహ్వానించి, ఆ తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించాలని తాము డిమాండ్ చేస్తున్న విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని ఆప్ ఢిల్లీ కన్వీనర్ అశుతోష్ తెలిపారు. బీజేపీలో భిన్నస్వరాలు.. ప్రత్యర్థి పార్టీలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై బీజేపీలో కూడా బిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కానీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పాటు కోసం పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ఉన్న అవకాశాన్ని వదులుకొని ఎన్నికల కోసం ప్రయత్నించడం మూర్ఖత్వమే అవుతుందని, ఎన్నికల తర్వాత ఫలితాలు కచ్చితంగా బీజేపీకే అనుకూలంగా ఉంటాయని చెప్పడం కష్టమనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏలా ఏర్పాటు చేస్తారు? బీజేపీకి కూడా సరిపడినంతగా సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ ఏం చే స్తుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు అసెంబ్లీలో బీజేపీ సం ఖ్యాబలం 32. లోక్‌సభ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీ చేసి, గెలవడంతో వారు పార్లమెంట్‌కు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం బీజేపీ బలం 29కి చేరింది. అయితే పార్లమెంట్‌కు ప్రాతి నిథ్యం వహిస్తున్న ఎంపీలు కూడా బల నిరూపణ సమయంలో ఓటింగ్‌లో పాల్గొంటారని బీజేపీ చెబుతోంది. వారు ఇంకా అసెంబ్లీ సభ్యత్వానికి రాజీ నామా చేయనందున ఓటింగ్‌లో పాల్గొనే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు ఆప్ బహిష్కృత నేత బిన్నీ కూడా బీజేపీకి మద్దతు పలుకుతానని శుక్రవారం మరోమారు ప్రకటించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు బీజేపీ చేరువవుతుందని చెబుతున్నారు. నివేదికలో ఏముంది? విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం... రాజధానిలో రాజకీయ పరిస్థితిని వివరిస్తూ నజీబ్‌జంగ్ రాష్ట్రపతికి వివరంగా నివేదిక పంపారు. ఢిల్లీ లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటుచేయవలసిన ఆవశ్యకతను ఆయన తన నివేదికలో నొక్కిచెప్పారు. నగరంలో ఎన్నికలు జరిపించే ప్రతిపాదనను పరిశీలించడానికి ముందు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవకాశాలను అన్వేషించాలని, బీజేపీ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీ కాబట్టి దానిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని ఆయన సిఫారసు చేశారు. ఆప్ ఇప్పుడేం చేస్తుంది? అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేసిన తరువాత ఢిల్లీలో పిబ్రవరి 17 నుంచి రాష్ట్రపతిపాలన కొనసాగుతోంది. సెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతిపాలన విధించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు తలుపులు తెరిచే ఉన్నాయి. అయితే ఇం తవరకు ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. ఢిల్లీలో సెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ దాఖ లు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సెప్టెంబర్ 9న నగరంలో ప్రభుత్వం ఏర్పాటుపై తన వైఖరిని కేంద్రం న్యాయస్థానం ఎదుట స్పష్టం చేయాల్సి ఉంది. ఒకవేళ న్యాయస్థానం ఎదుట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేం దుకే తాము సుముఖంగా ఉన్నట్లు కేంద్రం చెబితే ఆప్ అందుకు వ్యతిరేకంగా ఉద్యమించే అవకాశముందని చెబుతున్నారు.ఆప్ నేత మనీష్ సిసోడియా ఇప్పటికే ఈ దిశగా సంకేతాలు పంపారు. ఎల్జీ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ డిసెంబర్ 12న 32 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నిరాకరించిన పార్టీ ఇప్పుడు 29 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఎల్జీ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిం చాలనుకోవడం రాజ్యాంగాన్ని ఎగతాళి చేయడమేనని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాలను గెలిచిన బీజేపీ ఇప్పుడు ఎన్నికలకు భయపడుతోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి బీజేపీ పార్టీ మార్పిడిలను ప్రోత్సహించినట్లయిలే అది దురదృష్టకరమని ఆయన చెప్పారు. పార్టీకి ప్రజాదరణ తగ్గిన విషయాన్ని బీజేపీ గుర్తించిందని, అందుకే ఎన్నికలకు భయపడుతోందని మరోనేత అశుతోష్ ఎద్దేవా చేశారు. డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాడానికి లిఖిత పూర్వకంగా నిరాకరణ తెలిపిన పార్టీని లెప్టినెంట్ గవర్నర్ ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని ఆశుతోష్ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే గుండు కొట్టించుకుంటానని మరో నేత సోమ్‌నాథ్ భారతి అన్నారు. ఇవీ పరిణామాలు... ►లోక్‌సభ ఎన్నికల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ సంఖ్యా బలం మరింత తగ్గింది. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్లమెంట్‌కు పోటీ చేసి, గెలిచారు. దీంతో బీజేపీ బలం 32 నుంచి 29 కి చేరింది. ►ఎంపీలుగా గెలిచిన ముగ్గురు బీజేపీ సభ్యులు అసెంబ్లీ సభ్యత్వానికి ఇంకా రాజీనామా చేయకపోవడంతో బలనిరూపణ సమయంలో ఈ ముగ్గురు కూడా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశముంటుంది. ►1998లో వాజ్‌పేయి సర్కారును గద్దె దింపడం కోసం ఒరిస్సా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగ్ లోక్‌సభలో ఓటేసినట్లుగా ముగ్గురు బీజేపీ ఎంపీ లు అసెంబ్లీలో ఓటేసే అవకాశముంది. ►ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కృతుడైన వినోద్‌కుమార్ బిన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. ఈ విషయాన్ని శుక్రవారం కూడా ఆయన పునరుద్ఘాటించారు. ►సెప్టెంబర్ 9న నగరంలో ప్రభుత్వం ఏర్పాటుపై కేంద్రం తన వైఖరిని న్యాయస్థానం ఎదుట స్పష్టం చేయాల్సి ఉంది. -
జంగ్ వార్నింగ్!
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్.. ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థలో పారదర్శకత లోపించిందని, బాధ్యతారాహిత్యం పెరిగిందని, సంస్థ పని సామర్థ్యం తగ్గిందని, అవినీతి, పనుల్లో జాప్యం వంటివి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ పనితీరును మెరుగు పర్చుకునేందుకు, పాదర్శక విధానాలను అమలు చేసేందుకు అవసరమైన పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు రెండువారాల గడువునిస్తున్నట్లు హెచ్చరించారు. ఇటీవలి కాలంలో డీడీఏ పనితీరుపై, సంస్థలో జరుగుతున్న అవినీతిపై మీడియాలో రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో జంగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డీడీఏ సీనియర్ అధికారులతోపాటు ముఖ్యమైన అధికారులు పాల్గొన్న ఈ సమీక్ష సమావేశంలో జంగ్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో కథనాలు వస్తున్నా కూడా అధికారులు తమ పనితీరును మార్చుకోవడం లేదని, ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారెందుకని ప్రశ్నించారు. సంస్థ పనితీరు మెరుగుపడాలంటే పునర్నిర్మాణ ప్రణాళిక అవసరమని తాను భావిస్తున్నానని, రెండువారాల్లో ఈ ప్రణాళికను సిద్ధం చేయాలని డీడీఏ పరిపాలనా విభాగం అధికారిని ఆదేశించారు. రెండు వారాల్లో నివేదిక తన టేబుల్‌పై లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంస్థ చేస్తున్న ప్రతి పనిని, అందిస్తున్న సేవల వివరాలను కంప్యూటరీకరించాలని ఆదేశించారు. డీడీఏ పని సామర్థ్యాన్ని కూడా పెంచాలని, చేపట్టే ప్రతి పనికి సంస్థలోని ఎవరో ఒక అధికారి బాధ్యత వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి గందరగోళం లేకుండా ఉండాలని, ప్రతి పని పూర్తి పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. పై అధికారుల పర్యవేక్షన నిరంతరం కొనసాగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రణాళిక సిద్ధం... డీడీఏ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశామని, తుది మెరుగులు దిద్ది రెండు వారాల్లో సమర్పిస్తామని జంగ్కు డీడీఏ అధికారులు హామీ ఇచ్చారు. డీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల వివరాలను కూడా జంగ్కు వివరించారు. భూసేకరణ విభాగం ఇప్పటికే అవసరమైన భూమిని సేకరించిందని, దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లను నిర్మించి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. డీడీఏ పనితీరు మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఇచ్చిన సూచనల మేరకే పునర్నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేశామని, ఏప్రిల్ నాటికి ప్రణాళికలు పూర్తిగా అమలయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కౌన్సిల్ ఇచ్చిన సూచనల ప్రకారం... సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనుల్లో కొన్నింటిని ఔట్ సోర్సింగ్ చేయాలి. ఈ విషయమై ఔట్ సోర్సింగ్ సంస్థల కోసం అన్వేషిస్తున్నామన్నారు. పంటలను ఎక్కడైనా అమ్ముకోండి: జంగ్ న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తులను రైతులు మండీలోనే కాకుండా బయట ఎక్కడైనా అమ్ముకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రకటించారు. ఆజాద్‌పూర్, కిషోర్‌పూర్, షహదరా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలోని వ్యవసాయ ఉత్పత్తుల జాబితా నుంచి కూరగాలు, పండ్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో రైతులు తాము పండించిన పండ్లను, కూరగాయలను ఇకపై తప్పనిసరిగా ఏపీఎంసీలోనే అమ్ముకోవాలనే నిబంధన ఏమీ లేదన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఓ నోటీసు కూడా విడుదల చేసింది. ఢిల్లీ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్(క్రమబద్ధీకరణ) చట్టం, 1998 ప్రకారం.. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్ యార్డుల్లోనే అమ్ముకోవాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నోటీసులో పేర్కొంది. 6 గోడల మీద పోస్టర్లు అతికించినవారిపై కఠిన చర్యలు తీసుకోండి న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం పేరుతో పోస్టర్లను అతికిస్తూ గోడలను పాడు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం పోలీసులను కోరింది. పోస్టర్లను అతికించుకునేందుకు, బ్యానర్లు కట్టుకునేందుకు విశ్వవిద్యాలయం పరిసరాల్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించామని, అయినా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై, బస్సులు, రైళ్లల్లో కూడా పోస్టర్లు అతికిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఇటువంటివారిపై చర్యలు తీసుకోవాలని డీయూ కోరింది. ఢిల్లీ ప్రజా ఆస్తుల రక్షణ చట్టం ప్రకారం పోస్టర్లు అతికించేవారిపై కేసు నమోదు చేయాలని, దర్యాప్తు జరిపి, నేరం రుజువైతే కఠినంగా శిక్షించాలని డీయూ అధ్యాపకుడు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల(డూసూ) కమిషనర్ డీఎస్ రావత్ పోలీసులను కోరారు. పోలీసులు చర్యలు తీసుకోకుండా చూస్తూ ఊరుకుంటే ప్రజా ఆస్తుల రక్షణ చట్టం నిరుపయోగంగా మారుతుందన్నారు. చట్టం సరిగ్గా అమలు కావాలంటే కఠిన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని కోరారు. డూసూ ఎన్నికలు ఈ నెల 12న జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ, బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీతోపాటు పలు పలు పార్టీల విద్యార్థి విభాగాలు పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రింటింగ్ పోస్టర్లను ప్రచారం కోసం వినియోగించరాదనే నిబంధన ఉన్నప్పటికీ పోటీదారులు యథేచ్ఛగా పోస్టర్లను అతికిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఈ విషయమై ఢిల్లీ పోలీసులతో పలుమార్లు సమావేశమయ్యామని, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని రావత్ తెలిపారు. ఎన్నికల బరిలో కొత్త విద్యార్థి విభాగం ఈసారి జరగనున్న డూసూ ఎన్నికల్లో కొత్త విద్యార్థి విభాగం పోటీ చేయనుంది. ఇప్పటిదాకా ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ, బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం బీజేపీ మధ్య జరుగుతుండగా సీపీఐ, సీపీఎంకు చెందిన విద్యార్థి విభాగాలు ఎస్ఎఫ్ఐ వంటివి కూడా పోటీ చేస్తున్నాయి. కాగా ఈ ఏడాది ‘చాణక్య పరిషద్’ పేరుతో ఏర్పాటైన కొత్త విద్యార్థి విభాగం కూడా ఎన్నికల్లో పోటీ చేయనుంది. ‘ఇప్పటిదాకా ఎన్ఎస్యూఐ, ఏబీవీపీల మధ్యే పోటీ జరిగింది. ఈ రెండు విభాగాలు కూడా కండబలం, ధనబలాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించాయి. ఈ సంస్కృతికి చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నాం. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా కొత్త విద్యార్థి విభాగాన్ని తీసుకురావాలనుకున్నాం. కొత్తగా వ చ్చే విద్యార్థి విభాగం విద్యార్థుల్లో సాధికారత పెంచేదిగా ఉండాలని నిర్ణయించాం. ఈ అవసరాన్ని గుర్తించిన ఎంతోమంది మాతో కలిసి వచ్చారు. అలా ఏర్పాటైందే చాణక్య పరిషద్’ అని అధ్యక్షుడు మంతోశ్ శర్మ తెలిపారు. తాము పోటీ చేయనుండడంతో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల స్వరూపం మారిపోవడం ఖాయమన్నారు. -
‘యమున’ను కలుషితం చేయొద్దు
న్యూఢిల్లీ: పవిత్ర గంగానదితో పాటు దాని ఉపనది యమునను కూడా శుభ్రపరిచే దిశగా నరేంద్రమోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, రానున్న పండుగలు ఆయా నదుల్లో కాలుష్యాన్ని మరింత పెంచవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న వినాయక చతుర్ధి ఉత్సవాల సందర్భంగా నగరంలోని నీటి కొలనులను పరిశుభ్రంగా ఉంచాలని నగరవాసులకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ విజ్ఞప్తి చేశారు. నిర్దేశించిన ఘాట్ల వద్ద మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఆయన సూచించారు. ప్రతి ఏడాది ఉత్సవాల అనంతరం వందలాది వినాయక విగ్రహాలను క్షీణించిన యమునా జలాల్లో నిమజ్జనం చేస్తుంటారు. ఇక ఈ విగ్రహాలలో అనేకం విషపూరితమైన ప్లాస్టర్, పెయింట్‌తో తయారైనవి ఉంటాయి. వీటికితోడు ఘాట్ల వద్ద పూలదండలు, ఇతర అలంకరణ సామగ్రిని వదిలివేయడంతో ఆ చుట్టుపక్కల భారీస్థాయిలో చెత్తా చెదారం పోగవుతుంది. నిమజ్జనం సందర్భంగా ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఇటీవలి కాలంలో ప్రతి ఏడాది నిత్యకృత్యమైంది. గత ఏడాది నిమజ్జనం సందర్భంగా యమునా నదిలో మునిగి ఎనిమిది మంది మృతి చెందారు. ‘‘ఇటువంటి ప్రమాదాలను నివరించేందుకు దయచేసి పగటిపూటనే విగ్రహాలను నిమజ్జనం చేయండి. నిర్దేశించిన ఘాట్ల వద్దనే విగ్రహాలను నిమజ్జనం చేయండి’’ అని నజీబ్ జంగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణానికి హాని కలగని రంగులు, మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగించాలని ఆయన కోరారు. పర్యావరణానికి సన్నిహితమైన సామగ్రి, విషపూరితం కాని రంగులతో విగ్రహాలను తయారు చేయాలని ఆయన తయారీదారులకు కూడా విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం సమయంలో పూలు, పూలదండలను ఘాట్ల వద్ద నిర్దేశించిన ప్రదేశాల వద్ద పారవేయాలని నిర్వాహకులను కోరారు. నిమజ్జనానికి నిర్దేశించిన ఘాట్ల వద్ద సైన్ బోర్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ బోర్డులపై ఆ ప్రదేశంలో నదిలోని నీటిమట్టం వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. ‘‘గొప్ప ఉత్సాహంతో నిజమైన స్ఫూర్తితో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుందాం. అదే సమయంలో నగరాన్ని ముఖ్యంగా యమునా నదిని పరిశుభ్రంగా ఉంచుదామని ప్రతిజ్ఞ చేద్దాం’’ అని లెఫ్టినెంట్ గవర్నర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలు ముగిసిన కొద్ది వారాల్లోనే నగరంలో దుర్గా పూజ ప్రారంభమవుతుంది. ఆ విగ్రహాలను కూడా ఉత్సవాల అనంతరం నీటిలోనే నిమజ్జనం చేస్తారు. -
ఐజీఐలో ఆరోగ్య పరీక్షలు జరపాలి: బీజేపీ
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ విమానాశ్రయం (ఐజీఐ)లో దిగే ఆరోగ్య పరీక్షలు జరిగేవిధంగా చూడాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ... లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు. ఆఫ్రికాలో ఈ వ్యాధి విజృంభించిన నేపథ్యంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరృకు ఆయన ఎల్జీకి ఓ లేఖ రాశారు. వర్షాకాలం అయినందువల్ల నగరవాసులకు అంటువ్యాధులు సోకకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ ఆయా కార్పొరేషన్లను ఆదేశించాలని కూడా సదరు లేఖలో కోరారు. అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ చేయాలన్నారు. లేకపోతే నగరవాసులు అంటువ్యాధులబారినపడే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇదిలాఉంచితే ఎబోలా వ్యాధిబారినపడి నగరానికి వచ్చిన ముగ్గురు నైజీరియన్లకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ రూం (ఎన్సీడీసీ)లో పరీక్షలు చేశారు. అనంతరం రాంమనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎన్సీడీసీ పేర్కొంది. ఇదిలాఉండగా నైజీరియా వెళ్లి తిరిగి వచ్చిన 32 ఏళ్ల చత్తీస్‌గఢ్ వాసికి కూడా పరీక్షలు చేశామని సదరు ప్రకనటలో ఎన్సీడీసీ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,127 మంది ఈ వ్యాధిబారినపడగా అందులో 1,145 మంది చ నిపోయారు. -
అందరూ అవయవ దానం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ‘జష్నే ఆజాదీ’ వేడుకల్లో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీ ప్రభుత్వ అధికారులు, వైద్యులు, సామాన్యులతో అవయవదాన ప్రతిజ్ఞ చేయించారు. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ, సంక్షేమ విభాగం సచివాల యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. దీంతోపాటు రాజ్‌నివాస్‌లో కూడా ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీ సచివాలయంలో ముఖ్య కార్యదర్శి ఎస్.కె. శ్రీవాస్తవ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన రక్తదానం, హెల్త్ చెకప్, కంటి పరీక్షల శిబిరాలను ఎల్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ అవయవ దానం చేయాల ని విజ్ఞప్తి చేశారు. అవయవదానాన్ని ప్రోత్సహిం చడం కోసం అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి త్వ శాఖను ఈ సందర్భంగా కోరారు. కాగా 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నగరవాసులకు అభినందనలు తెలియజేశారు. మనకు స్వాతంత్య్రం అం దించడం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారందరికీ నివాళులర్పిద్దామన్నారు. అందరూ గర్వించేవిధంగా నగరాన్ని తీర్చిదిద్దడానికి, పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకరించాలని ఆయన ఢిల్లీవాసులను తన సందేశంలో కోరారు. సమాజంలోని అన్ని వర్గాల మధ్య సయో ద్య, సహనం, పరస్పర గౌరవాలను పెంపొందించడానికి సహకరించాలని కోరారు. అందరూ మంచి పౌరులుగా మెలగాలని ఆయన నగరవాసులకు పిలుపునిచ్చారు.