కేంద్రానికి ఎదురుదెబ్బ
ఢిల్లీ కేబినెట్ మంత్రిమండలి సలహా మేరకే ఎల్జీ విధులు నిర్వర్తించాలి: హైకోర్టు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కీ, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్‌కు మధ్య జరుగుతున్న ఘర్షణ మరో మలుపు తిరిగింది.. ఎల్‌జీకి ఉన్న అధికారాలను నిర్వచిస్తూ, కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాజకీయ వ్యవస్థలపైన ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ కేసులు పెట్టడానికి వీల్లేదంటూ కేంద్ర హోం శాఖ మే 21న జారీ చేసిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. కేంద్రం పరిధిలో ఉండే ఢిల్లీ పోలీసుకు చెందిన అధికారులను అరెస్టు చేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక విభాగాని(ఏసీబీ)కి ఉందని సోమవారం స్పష్టం చేసింది. ఓ అవినీతి కేసులో ఏసీబీ అరెస్టు చేసిన హెడ్ కానిస్టేబుల్ అనిల్ కుమార్.., తనను అరెస్టు చేసి విచారించే అధికార పరిధి ఢిల్లీ ఏసీబీకి లేదంటూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
ఢిల్లీ పోలీసుల విధులు జాతీయ రాజధాని ప్రాంతం-ఢిల్లీ (జీఎన్‌సీటీడీ)ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి కాబట్టి.. ఆ పరిధిలో జరిగే నేరానికి సంబంధించి ఫిర్యాదు వచ్చినప్పుడు జీఎన్‌సీటీడీ పరిధిలోని ఏసీబీకి విచారణ జరిపే అధికారం ఉంటుందని పేర్కొంది. ‘ఎల్‌జీ తనంత తానుగా వ్యవహరించేందుకు వీల్లేదు. ఢిల్లీ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న మంత్రి మండలి సలహాకు ఆయన బద్ధుడై ఉండాలి. కేంద్రం ఎల్‌జీ పక్షాన కార్యనిర్వాహక ఆదేశాలివ్వటం అనుమానాస్పదంగా ఉంది. ప్రజల తీర్పును ఎల్‌జీ శిరసావహించాల్సిందే. ఇందులో రాజ్యాంగ ప్రత్యామ్నాయం ఏదీ లేదు’ అని స్పష్టం చేసింది.
కేంద్రానికి ఇబ్బందికరం: కేజ్రీవాల్
కోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిణామమని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేంద్రంతో తలెత్తిన వివాదంపై సలహా కోసం కేజ్రీవాల్ పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి ఫోన్‌చేసి విజ్ఞప్తి చేశారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం అతిగా జోక్యం చేసుకోవటాన్ని మమత ట్విటర్‌లో విమర్శించారు.