తొమ్మిదో విడత పోలింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన తొమ్మిదో విడత పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. దేశంలో తొలిసారి అత్యధిక విడతల్లో జరుగుతున్న ఎన్నికల క్రతువు నేటితో ముగియనుంది. మూడు రాష్ట్రాల్లోని 41 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. 35 రోజులపాటు జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు ఈ సాయంత్రం తెరపడనుంది.
ఆఖరి విడతలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఏకైక లోక్‌సభ స్థానం వారణాసి. ఇక్కడ నుంచి హేమాహేమీలు పోటీలో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీపార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి అజయ్‌రాయ్ బరిలో ఉన్నారు. వారణాసి లోక్‌సభ పరిధిలో మొత్తం 15లక్షల 32వేల 438 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లో 18 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 17 సీట్లు, బీహార్‌లో 6 సీట్లలో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 606 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు 9 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. చివరి దశ బరిలో నిలిచిన ప్రముఖుల్లో నరేంద్ర మోడీ, కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, కేంద్ర మంత్రి ఆర్‌పీఎన్ సింగ్, కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన జగదాంబికాపాల్, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ కుమార్, బెంగాల్ నుంచి తృణమూల్ నేతలు దినేశ్ త్రివేదీ, సౌగతా రాయ్, బీహార్ నుంచి దర్శక నిర్మాత ప్రకాశ్ ఝా ఉన్నారు. ఆఖరు విడత ఎన్నికలకు ఆరొందల కంపెనీల బలగాలను మోహరించారు.