ప్రధాని మోదీ ర్యాలీకి పోటెత్తిన జనం
వారణాశి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం వీరు నలుగురూ వారణాశిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. వీరితో పాటు కొందరు కేంద్ర మంత్రులు కూడా వారణాశి బాటపట్టారు. దీంతో వారణాశిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. నగరం పోలీసు వలయంగా మారిపోయింది.
ఈ రోజు ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాశిలో రోడ్డు షో నిర్వహించారు. మోదీ రోడ్డు షోకు జనం పోటెత్తారు. స్థానిక ప్రజలు మోదీ, మోదీ అని గట్టిగా నినాదాలు చేస్తూ ఆయన్ను ఉత్సాహ పరిచారు. దాదాపు 10 కిలో మీటర్ల మేర రోడ్డు షోలో పాల్గొన్న మోదీ కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు.
వారణాశి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు చివరి, ఏడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే రోజు రాహుల్, అఖిలేష్ కలసి వారణాశిలో రోడ్డు షోలో పాల్గొంటుండగా.. నగర శివారులో జరిగే ర్యాలీలో మాయావతి పాల్గొంటారు.