బదులు తీర్చుకుంటున్న రాహుల్...
వారణాసి : అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వారణాసి రాజకీయ నేతలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నిన్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసిలో ప్రచారం నిర్వహించగా, శనివారం ఉదయం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్ షో ప్రారంభించారు. ఈ ర్యాలీలో రాహుల్తో పాటు గులాం నబీ ఆజాద్ ముకుల్ వాస్నిక్ పాల్గొన్నారు. ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి.
ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో అంతిమ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ గెలుపుపై వందశాతం నమ్మకం ఉందని ఆజాద్ తెలిపారు. కాగా అమేథీలో మోదీ రోడ్‌షోకు జవాబుగా వారణాసిలో రాహుల్ రోడ్‌షో నిర్వహించినట్లు కనిపిస్తోంది.
మరోవైపు వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నాయకులు, వ్యక్తులు ఎవరైనా శనివారం సాయంత్రం 5 గంటల లోపు వెళ్లిపోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఓటు హక్కు లేని ఇతర ప్రాంత పౌరులు వారణాసిలో ఉండటానికి వీల్లేదని ఇసి హుకుం జారీచేసింది. ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు, బిజెపి నాయకులు అమిత్‌షా, అరుణ్‌జైట్లీ తదితరులను ఈసీ పైవిధంగా ఆదేశించింది. ఈ నెల 12న వారణాసిలో ఎన్నికలు జరగనున్నాయి. శనివారంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో నిబంధనల ప్రకారం అధికారులు ఈ ఆదేశాలు జారీచేశారు.