జన్ ఆశ్రోశ్‌ర్యాలీలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: తప్పుడు హామీలతో దేశ ప్రజలను ప్రధాని మోదీ ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆక్షేపించారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ జన్ ఆక్రోశ్ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘దేశంలో వెళ్లిన ప్రతీ చోటల్లా నేను ప్రజలను అడిగేది ఒక్కటే. మోదీ పాలనలో సంతోషంగా ఉన్నారా? అని.. వారందరి నుంచి ముక్తకంఠంతో వినిపించే సమాధానం ఒక్కటే. లేదు అని.. ప్రజల కళ్లలో మోదీపై ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి’ అని రాహుల్ పేర్కొన్నారు.
చౌకీదార్ మూగబోయారు...
..వెళ్లిన చోటల్లా మోదీ తప్పుడు హామీలు ఇస్తున్నారు. ఆయన మాటల్లో నిజాలు మచ్చుకైనా కనిపించవు. నేరస్థులకు టికెట్లు ఇచ్చిన ఘనత కూడా మోదీదే. జైలుకు వెళ్లిన వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అమిత్ షా కుమారుడి ఆస్తులు కొన్ని నెలలో ఎలా రెట్టింపు అయ్యాయి? ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును నీరవ్ మోదీ దోచుకెళ్లాడు. అయినా చౌకీ దార్(మోదీని ఉద్దేశించి) మాత్రం స్పందించరు. అవినీతిని అంతమొందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. కానీ, రఫెల్ డీల్‌తో లక్షల కోట్ల అవినీతి జరిగింది. స్వయంగా మోదీనే అవినీతిని పెంచి పోషిస్తున్నారు అని రాహుల్ మండిపడ్డారు.
సత్యం ముందు తలవంచాల్సిందే...
ఎన్నికల సమయంలో కుప్పలు తెప్పలుగా హామీలిచ్చారు. ఒక్కటైనా నెరవేర్చారా? నిలదీస్తే ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. మీ మౌనం సమాధానం కాదు. ప్రజల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహమే మీకు బుద్ధిచెప్పబోతోంది. నిరుద్యోగం పెరిగిపోయింది. రైతులను మోసం చేశారు. మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగిపోయాయి. వైషమ్యాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. మహిళలకు రక్షణ కరువైంది. నోట్ల రద్దు.. జీఎస్టీ అంటూ చెత్త నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేశారు. దేశ చరిత్రలో తొలిసారి సుప్రీం కోర్టు జడ్జిలు ఆరోపణలకు దిగారు. న్యాయవ్యవస్థలో సంక్షోభంపైనా మోదీ మౌనంగా ఉండటంలో అర్థమేంటి?. ఓవైపు సరిహద్దులో చైనా మనతో దుందుడుకు చర్యలకు దిగుంటే.. ఓ స్పష్టమైన ఎజెండా లేకుండా ఈయనగారు వెళ్లి చర్చలు జరుపుతున్నారు. మనకు ఎందరు దేవుళ్లున్నా.. సత్యం ముందు తలవంచక తప్పదు. అధికారం కోసం ఏనాడూ కాంగ్రెస్ వెంపర్లాడలేదు. ప్రతీ కార్యకర్త ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఉద్యమించాలి అని రాహుల్ పిలుపునిచ్చారు.
మోదీ సమాజాన్ని చీల్చుతున్నారు
అంతకు ముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోదీవి ప్రజావ్యతిరేక విధానాలు. ఎన్టీఏ పాలనలో అవినీతి వేళ్లు బలంగా నాటుకు పోయాయని ఆమె తెలిపారు. చట్ట సభల్లో ప్రతిపక్షాల గొంతుకలను నొక్కేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ చిన్నాభిన్నయం అయిపోయింది. మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఓట్ల కోసం సమాజాన్ని చీల్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల తరపున పోరాడేందుకు కాంగ్రెస్ అన్నివిధాల యత్నించాలి. బీజేపీ సరైన బుద్ధి చెప్పాలి’ అని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హామీల అమలులో మోదీ సర్కార్ విఫలమైందని, చమురు ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment