కాశీలో పానశాల కళకళ | election season in varanasi | Sakshi
Sakshi News home page

కాశీలో పానశాల కళకళ

Published Fri, Apr 18 2014 1:31 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

election season in varanasi

ప్రపంచంలో ప్రాచీన నగరమైన వారణాసిలోని ప్రాచీన పానశాల ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో ‘తీర్థం’కరులతో సందడిగా కనిపిస్తోంది. ఇదివరకు రద్దీగా ఉండే గొడోవ్లియా మార్కెట్ ప్రాంతంలో కాశీ విశ్వనాథుని ఆలయానికి సమీపంలో ఉండే ఈ పానశాల, పదేళ్ల కిందట ప్రస్తుతం ఉన్న సిగ్రా ప్రాంతానికి మారింది.

ఇదే ప్రాంతంలో ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సందర్భంగా తమ కార్యాలయాలు తెరవడంతో ఈ బార్‌కు రాజకీయ కస్టమర్ల తాకిడి పెరిగింది. ‘యెల్షికో’ బార్ అండ్ రెస్టారెంట్ వారణాసిలో అతి పురాతనమైన బార్. కిక్కిరిసిన మార్కెట్ ప్రాంతం నుంచి నగరంలోని ఎగువ ప్రాంతానికి తరలించడమే ఇప్పుడు దీనికి కలిసొచ్చింది.
 
దీనికి కూతవేటు దూరంలోనే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఎన్నికల కార్యాలయంతో పాటు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ తదితర ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల కార్యాలయాలు వెలిశాయి. సాయంత్రం నుంచి రాత్రి 11.30 గంటలకు మూసివేసేంత వరకు వివిధ పార్టీల కార్యకర్తల తాకిడి కొనసాగుతుండటంతో ఈ బార్ వ్యాపారం మూడు పెగ్గులు ఆరు సీసాలుగా కళకళలాడుతోంది.

వారణాసి కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా పలు బార్లు రాజకీయ కస్టమర్లతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఎన్నికల సీజన్‌లో కార్యకర్తల ‘తీర్థం’ ఖర్చు భరించేది రాజకీయ పార్టీలేననేది బహిరంగ రహస్యమే అయినా, బిల్లులను రాజకీయ పార్టీల పేరుతో కాకుండా, తాగే వ్యక్తుల పేరిటే ఇస్తామని పేరు వెల్లడించని బార్ మేనేజర్ ఒకరు చెప్పారు.  
 
పంచ్ ..చంద్ర‘బాగ్’
మనం రెండు బాగ్‌లను ఎప్పుడూ మరిచిపోలేం....
- ఒకటి జనరల్ డయ్యర్ చేసిన జలియన్‌వాలాబాగ్..
- రెండోది చంద్రబాబు చేసిన బషీర్‌బాగ్...
ఒకటి తెల్లవాడు చేశాడు...ఇంకోటి తెలుగువాడు చేశాడు..
 
 B.C. = C.B.
 సామాజిక తెలంగాణ కోసం చంద్రబాబు బీసీను సీఎం చేస్తారట...!!
 ఇంతకూ ఎవరా.....B.C ..??
 B = బాబు
 C = చంద్ర
 మొత్తంగా చంద్రబాబు...
 నిజంగా బాబు ‘విజన్’ఉన్న నేతే కదూ....!!
 - ప్రవీణ్‌కుమార్ కాసం
 
డప్పులపై దోస్తీ.. పోరులో కుస్తీ

వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజక వర్గ టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్ అభ్యర్థి  సుధాకర్‌రావు గత ఎన్నికల సమయం లో  మంచి మిత్రులు. అప్పట్లో టీడీపీ ఎన్నికల ప్రచారం సమయంలో డప్పులపై ముద్రించిన ఫొటోల్లో సుధాకర్‌రావుది కూడా ఉంది. ప్రస్తుతం అవే డప్పులపై దరువేస్తూ సుధాకర్‌రావును ఓడించాలని టీడీపీ ప్రచారం చేస్తుండడంతో ప్రజలు.. ఇదెక్కడి వింతని ఆశ్చర్యపోతున్నారు.
 - న్యూస్‌లైన్, కొడకండ్ల
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement