మీవాడే స్కామ్ బాబు | Chandrababu naidu play role of scamandhra in his tdp rule | Sakshi
Sakshi News home page

మీవాడే స్కామ్ బాబు

Published Fri, May 2 2014 2:19 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM

మీవాడే స్కామ్ బాబు - Sakshi

మీవాడే స్కామ్ బాబు

* మోడీ.. స్కామాంధ్ర బాబు పాలన పుణ్యమే
* మీ బీజేపీ అచ్చేసిన పుస్తకాలే చెప్పిన వాస్తవమిది
 
మిస్టర్ మోడీ!  తమరు నోరెత్తితే చాలు... స్కామాంధ్ర, కుంభకోణాలు అంటూ రామోజీ-చంద్రబాబు ద్వయం పలికించినట్టల్లా పలుకుతు న్నారు. వాళ్లందించిన పాచి స్క్రిప్టునే ప్రతి వేదికపైనా యథాతథంగా వల్లె వేస్తున్నారు. అచ్చం మాట్లాడే చిలుకను తలపిస్తున్నారు. ఇది చూసి బహుశా పచ్చ కూటమి చంకలు గుద్దుకుంటోందేమో గానీ... సాక్షాత్తూ స్కాముల చక్రవర్తిగా చెప్పదగ్గ చంద్రబాబునే పక్కన కూచోబెట్టుకుని మీరు విసురుతున్న ఈ కామెడీ డైలాగులు విని తెలుగు ప్రజానీకం మాత్రం మనసారా నవ్వుకుంటోంది. కనీసం దళితులని కూడా చూడకుండా స్త్రీలను కించపరుస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించి, చివరికి అందరితోనూ ఛీకొట్టించుకున్న రామ్‌దేవ్ బాబా వంటి ఘనుడు ఒకవైపు.
 
 స్వయానా నయ వంచక అవినీతి సమ్రాట్టయిన నారా బాబు మరోవైపు. వీరిద్దరినీ చెరో చంకలో ఉంచుకుని ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతూ మధ్యలో మీరు! బాబూ మోడీ! మీ చంకనెక్కి ఎంచక్కా పళ్లికిలిస్తున్న చంద్రబాబు నిజానికి సకల స్కాములకూ సంగమ స్థానం వంటివాడని, సాక్షాత్తూ స్కామ్‌దేవ్ బాబాయేనని తెలుసుకోండి! ఒక ఏలేరు. ఒక ఎమ్మార్. ఒక జీఎమ్మార్. ఒక హెరిటేజ్. ఒక రహేజా... ఏమని చెప్పేది! ఎన్నని ఏకరువు పెట్టేది!! చెప్పుకుంటూ పోతే మీ చంకలోని చంద్రబాబు పాల్పడ్డ భూ అక్రమాలకు, కాసుల కక్కుర్తితో ఆయన తెరతీసిన కుంభకోణాలకూ అంతన్నదే ఉండదు. ఆ అవినీతి అనకొండ తాలూకు అక్రమాల చరిత్రకు అద్దం పట్టే చిరు ప్రయత్నమిది. మోడీ! చిత్తగించండి. ఆనక మీ మతి పూర్తిగా పోకపోతే మమ్మల్ని అడగండి...

ఇదీ చంద్రబాబు చరితం
ఎన్టీఆర్ ట్రస్టు భవన్... మహా మాయ

ఐఎంజీ... బినామీల బాగోతం:  తన బినామీలైన బిల్లీ బ్రదర్స్‌తో ఐఎంజీ భారత పేరుతో ఓ కంపెనీ పెట్టించి, రాజధానిలో అత్యంత విలువైన 850 ఎకరాలను కారుచౌకగా ఆగమేఘాల మీద కేటాయించడమే గాక, భవిష్యత్ హక్కులను కూడా దానికే రాసిచ్చిన పచ్చి అవినీతిపరుడు బాబు. కనీసం కార్యాలయం కూడా లేని, కేవలం రూ.5 లక్షల మూలధనం మాత్రమే ఉన్న ఆ కంపెనీ ఏకంగా రూ.750 కోట్లు వెచ్చించి ప్రాజెక్టును చేపడుతుందని, రాష్ట్ర క్రీడా రంగ చరిత్రనే మార్చేస్తుందని నమ్మబలికారు. ఎకరా కోట్లు పలుకుతుంటే, కేవలం రూ.50 వేల చొప్పున కట్టబెట్టారు.
 
 అది కూడా ఆపద్ధర్మ సీఎం హోదాలో! భూమితో ఆగకుండా ప్రభుత్వ ఖర్చుతో రాజధానిలో అప్పటికే నిర్మించిన 8 స్టేడియాలను కూడా 45 ఏళ్ల పాటు ఐఎంజీకి ఉదారంగా లీజుకిచ్చారు! లీజు గడువు ముగిశాక ఐఎంజీ తనకు నచ్చిన రేటు చెల్లించి ఆ స్టేడియాలన్నింటినీ సొంతం చేసుకోవచ్చంటూ ఎక్కడ లేని దాతృత్వమూ ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా అందుబాటులో ఉన్న అన్ని రాయితీలనూ దానికి అనుగ్రహించారు. అం తేనా... పాపం ఐఎంజీకి కార్యాలయం కూడా లేదేంటా అని తెగ బాధపడిపోయారు. బంజారాహిల్స్‌లో, ఎకరా రూ.25 కోట్లు పలుకుతున్న చోట ఐదెకరాలను ఎకరాకు రూ.50 వేల చొప్పున ‘కార్యాలయం కట్టుకోండి’ అంటూ కట్టబెట్టారు.
 
 ఎమ్మార్... ఎంత ఘోరం!
 శ్రీమంతులకు విలాసవంతమైన విల్లాలు, వారు ఆటాడుకుని సేదదీరేందుకు గోల్ఫ్ కోర్స్, ఫైవ్ స్టార్ హోటళ్లు తదితరాల నిర్మాణానికంటూ అతి విలువైన 535 ఎకరాలను షరా మామూలుగా కారుచౌకగా ఎమ్మార్ కంపెనీకి కట్టబెట్టారు నారా బాబు. ఇందుకోసం ఎల్ అండ్ టీ, ఐఓఐ వంటి అస్మదీయ సంస్థలను రంగం నుంచి తప్పించి మరీ ఎమ్మార్ బిడ్‌కు ఆమోదముద్ర వేశారు. తన మాట విని తప్పుకున్నందుకు ఎల్ అండ్ టీకి హైటెక్ సిటీ నిర్మాణ ప్రాజెక్టును, ఐఓఐకి హైటెక్ సిటీ రెండో దశను, ఏపీ జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్ పేరుతో బంజారాహిల్స్‌లో అతి విలువైన రెండున్నర ఎకరాలను కట్టబెట్టారు బాబు. ముఖ్యమంత్రిగా తన చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డంగా దుర్వినియోగపరుస్తూ ఎమ్మార్‌కు బాబు సర్వం దోచిపెట్టిన తీరు ఇంత స్పష్టంగా కన్పిస్తున్నా సరే, రామోజీకి మాత్రం ఆయనను పల్లె త్తు మాట అనాలని కూడా అన్పించదు. పైగా, తన తాబేదారు బాబు పాపాన్ని వైఎస్‌కు, ఆయన వారసునికి రుద్దేందుకు పిచ్చి ప్రయత్నం చేసి పరవశించిపోయే పైశాచికత్వం రాజగురువుది!
 
 గ్యాసుకు క్యాషు!
 కేజీ బేసిన్ గ్యాస్. ఈ మాట వినగానే టక్కున గుర్తొచ్చేది రిలయన్స్-రామోజీ-చంద్రబాబోజీ! కేజీ బేసిన్‌లోని ఒక్క డీ6 బ్లాక్ నుంచి వెలికితీసే గ్యాస్ ద్వారానే వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో రిలయన్స్‌కు హీనపక్షం రూ.1.5 లక్షల కోట్లు దఖలు పడబోతున్నట్టు అంచనా. అంతటి లాభదాయకమైన ఆ గ్యాస్ వెలికితీత ప్రక్రియలో ప్రభుత్వాన్ని భాగస్వామిని చేయాలని ఉన్నతాధికారులు మొదలు విపక్షాల దాకా ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా రిలయన్స్ ముందు మోకరిల్లారు బాబు. ఆ ప్రాజెక్టు దానికే దక్కేలా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను నడి సముద్రం లో ముంచేశారు. అనంతర కాలంలో పుట్టెడు కష్టాల్లో మునిగిపోయిన చంద్రబాబు రాజగురువు రామోజీని గట్టెక్కించేందుకు ఆయన సంస్థల్లోకి ఏకంగా రూ.2,600 కోట్లను రిలయన్స్ దొడ్డిదారి పెట్టుబడుల రూపంలో మళ్లింపజేసింది. అంటే గ్యాసుకు క్యాషు క్విడ్ ప్రొ కొ అన్నమాట!
 
 ఎల్ అండ్ టీకి ఎంత లబ్ధో!
 బాబు పాలనలో గరిష్టంగా లబ్ధి పొందిన సంస్థ ఏదైనా ఉందంటే... అది ఎల్ అండ్ టీ. సీఎం అయిన నాలుగు రోజులకే హైదరాబాద్‌లో దానికి ఏకంగా 148 ఎకరాలు కట్టబెట్టారు బాబు. ఏడాదిలోపే మరో 17 ఎకరాలు రాసిచ్చారు. అంతటితో ఆగలేదు. హైటెక్ సిటీ నిర్మాణ కాంట్రాక్టును చదరపు అడుగుకు ఏకంగా రూ.2,700 చొప్పున చెల్లించారు. మాదాపూర్‌లో మరో 78 ఎకరాలను నామమాత్రపు ధరకు కట్టబెట్టారు. సచివాలయంలో డి-బ్లాకు నిర్మాణం, విశాఖ హైటెక్ సిటీ... ఇలా ఎల్ అండ్ టీకి బాబు కట్టబెట్టిన ప్రాజెక్టులెన్నో!
 
 చంద్రబాబు మార్కు మాయాజాలానికి పరాకాష్టగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. తాను, తన భార్య మాత్రమే జీవితకాలపు ట్రస్టీలైన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు పేరుతో బంజారాహిల్స్‌లో అత్యంత విలువైన 3,981 గజాల స్థలాన్ని దిగమింగారు. ఆ స్థలం కోసం ట్రస్టీగా తానే దరఖాస్తు పెట్టుకుని, సీఎంగా దాన్ని తానే పరిశీలించి, తానే అనుమతి జారీ చేసుకున్న అసాధ్యుడు బాబు. అలా దఖలుపడ్డ స్థలంలో బాబు తాబేదారు సంస్థ ఎల్ అండ్ టీ ఓ చక్కటి భవనాన్ని నిర్మించి ఇచ్చింది.
 
 దానికి హైటెక్ సిటీ నిర్మాణ ప్రాజెక్టును కట్టబెట్టినందుకు ప్రతిఫలంగానే ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ను ఉచితంగా కట్టిచ్చిందని చెబుతుంటారు. ఆనక ఆ భవనాన్ని తానే అధ్యక్షునిగా ఉన్న టీడీపీకి అద్దెకిచ్చిన ఘనుడు చంద్రబాబు. అంటే పార్టీ అధ్యక్షుని హోదాలో ఆ భవనాన్ని నిత్యం అనుభవిస్తున్నదీ బాబే. మరోవైపు ట్రస్టీ హోదాలో పార్టీ నుంచి అద్దెను దిగమింగుతున్నదీ ఆయనే. దటీజ్ చంద్రబాబు! ఇక్కడితో అయిపోలేదు. టీడీపీ నేతలు తదితరులు బాబుకు ముడుపులను కూడా ఎన్టీఆర్ ట్రస్టుకు విరాళాల రూపంలోనే సమర్పించుకుంటుంటారు. ఈ ట్రస్టు బాబుకు మల్టీ పర్పస్ వెహికిల్ అన్నమాట!
 
 ‘సత్యం’తో క్విడ్ ప్రొ కొ
 సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజుతో చంద్రబాబు సాన్నిహిత్యం అంతా ఇంతా కాదు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్‌కు వస్తే రతన్ టాటా వంటి దిగ్గజాలను కూడా కాదని రాజుకు ఆయన పక్కన కుర్చీ వేశారు బాబు!  హైదరాబాద్ మాదాపూర్‌లో 19.2 ఎకరాలు, విశాఖలో 6.5 ఎకరాలను సత్యంకు ధారాదత్తం చేశారు. వీటికి ప్రతిగానే, చదువులో అంతంతమాత్రమైన బాబు కుమారుడు లోకేశ్‌కు స్టాన్‌ఫర్డ్, కార్నెగీ మెలన్ వంటి అమెరికా వర్సిటీల్లో భారీ డొనేషన్లు కట్టి మరీ రామలింగరాజు సీట్లు సాధించి పెట్టారని చెబుతారు.
 
కంపెనీల బినామీకరణ
 నిజాం షుగర్స్ మొదలుకుని రిపబ్లిక్ ఫోర్జ్ దాకా లెక్కలేనన్ని ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల సాకుతో అత్యంత చవకగా అస్మదీయులకు, బినామీలకు కట్టబెట్టిన చరిత్ర బాబుది. అసలు బాబు దృష్టిలో ప్రైవేటీకరణ అంటే... బినామీకరణే! తన బినామీలకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టడమే. ఆ విధంగా రిపబ్లిక్ ఫోర్జ్‌ను టీడీపీ నేత దేవేందర్‌గౌడ్ సోదరునికి; నెల్లూరు నూనె మిల్లును తన బినామీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కంపెనీకి; పాలేరు షుగర్స్‌ను నామా నాగేశ్వరరావుకు; గురజాల, ఇంకొల్లు స్పిన్నింగ్ మిల్లులను తన సన్నిహితునికి చెందిన నూజివీడు సీడ్స్‌కు... ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో, ఎన్నెన్నో!
 
 ఏలేరు... రైతుల పరిహారం దిగమింగారు
 విశాఖ జిల్లాలో ఏలేరు కాల్వ కోసం సేకరించిన సాగు భూమికి రైతుల ముసుగులో కోట్ల రూపాయల్లో పరిహారాన్ని తన బినామీల ద్వారా దిగమింగారు బాబు. తన బండారం బయటపడ్డా, దీనిపై న్యాయ విచారణను నానా సాకులతో అడ్డుకుంటూ వస్తున్న ఘనుడాయన. ఈ కుంభకోణానికి సూత్రధారి, ప్రధాన పాత్రధారి చంద్రబాబేనని పేర్కొంటూ బీజేపీ పుస్తకమే ప్రచురించింది.
 
 పిచ్చి పీపీఏలు
 ‘అసలు కరెంటు ఉత్పత్తే చేయకపోయినా సరే, మీకు చార్జీలన్నీ చెల్లించేస్తాం’ అంటూ పలు ప్రైవేట్ కంపెనీలతో బాబు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఫలితం. .? గౌతమి, వేమగిరి, కోనసీమ, జీవీకే ప్లాంట్లకు కోట్లలో చెల్లింపులు, ఖజానాపై వేలాది కోట్ల భారం.
 
 భువనేశ్వరి...
 భలే ‘సెటిల్మెంటు’
 భువనేశ్వరి కార్బైడ్స్ పేరుతో 1984లో బాబు రెండు కంపెనీలు పెట్టారు. రేణిగుంటలోని వాటి తాలూకు ఐదెకరాలను తనఖా పెట్టి రూ.40 లక్షల రుణం తీసుకున్నారు. తర్వాత వాయిదాలు ఎగ్గొట్టారు. తర్వాత ఆ భూముల విలువ అమాంతం పెరగడంతో వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ.11 లక్షలు కట్టి రుణమంతటినీ మాఫీ చేసుకుని తన భూముల్ని వెనక్కు తీసుకున్నారు. అది కూడా తీరిగ్గా 17 ఏళ్లకు, అంటే 2001లో. తాను సీఎంగిరీ వెలగబెడుతున్న రోజుల్లో! 40 లక్షల రుణానికి 17 ఏళ్ల తర్వాత నాలుగో వంతు మొత్తం చెల్లించి సరిపెట్టారన్నమాట! ఒకవైపు వేలాది కోట్లు కొల్లగొడుతూ కూడా... ఇలాంటి చిలక్కొట్టుడు యవ్వారాలనూ వదల్లేదన్నమాట.
 
 మద్యంలోనూ ముడుపులు
 అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మద్య నిషేధం పేరుతో పన్నుల్ని పెంచి ప్రజలపై భారం మోపిన బాబు, ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తేశారు. మద్యం కొనుగోళ్లలో నానా అక్రమాలకు పాల్పడి కనీసం రూ.600 కోట్లు అస్మదీయులకు దోచిపెట్టారు. ఆ అక్రమాలేవీ వెలుగులోకి రాకూడదనే ఉద్దేశంతో, 2004లో సంబంధిత ఫైలును అధికారికంగానే తగలబెట్టించిన గుండెలు తీసిన బంటు ఆయన!
 
 పా‘పాల’ భైరవుడు
 తన సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌కు ముఖ్యమంత్రి హోదాలో అడ్డగోలుగా రాయితీలివ్వడం ద్వారా కోట్లలో బొక్కేశారు బాబు. 1992లో ప్రారంభమైన ఈ కంపెనీ దశ, 1995లో ఆయన సీఎంగా ప్రమాణం చేసిన కొద్ది రోజులకే తిరిగిపోయింది. అమ్మకపు పన్ను వాయిదా రూపంలో రూ.15 కోట్లను జేబులో వేసుకున్నారు బాబు. దానిపై వడ్డీ రూపంలో గత 15 ఏళ్లుగా హీనపక్షం రూ.100 కోట్లకు పైగా దిగమింగారు. ఆ రూ.15 కోట్ల అసలును తీరిగ్గా ఇప్పటి నుంచి కొన్నేళ్ల పాటు వాయిదాల రూపంలో తిరిగి చెల్లిస్తారన్నమాట. ఆలోపు బాబు జేబులోకి వడ్డీ రూపంలో చేరే మొత్తాన్ని మాత్రమే లెక్కించినా ఎంతలేదన్నా రూ.200 కోట్లు అప్పనంగా లాభం! ఇంతేనా...? తన హెరిటేజ్ కోసం... బ్రహ్మాండంగా నడుస్తున్న చిత్తూరు డెయిరీ గొంతు నులిమిన కసాయి చంద్రబాబు!
 
 అవినీతి జయ‘భేరి’
 జయభేరితో చంద్రబాబుది అవినాభావ బంధం. హైటెక్ సిటీ రాకముందే, ఆ విషయం బయటికి పొక్కక ముందే అస్మదీయుడు మురళీమోహన్‌తో ఆ చుట్టుపక్కల భారీగా భూములు కొనిపించారు బాబు. తర్వాత తీరిగ్గా హైటెక్ సిటీని ప్రకటించారు. ఆ భూములకు అమాంతంగా రెక్కలొచ్చాయి.
 
 హవాలా బాబు
 ...అని యూరో లాటరీ కేసు నిందితుడైన కోలా కృష్ణమోహన్ స్వయంగా మీడియాకే వెల్లడించారు. టికెటిస్తానని మభ్యపెట్టి తననుంచి చంద్రబాబు రూ.5.1 కోట్లు దండుకున్నారని, ఆయన కోరిక మేరకు తానే స్వయంగా సింగపూర్‌లోని ఆయన ఖాతాకు బదిలీ చేశానని బ్యాకు పేరు, ఖాతా సంఖ్య తదితర వివరాలతో పాటుగా బయట పెట్టారు.
 
 ఇవి మాత్రమే కాదు... కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు... ఇలా ఎన్నో, ఎన్నెన్నో! రెండెకరాలతో మొదలయ్యానని చెప్పుకునే బాబు నేడు ఎన్ని వేల (లక్షల) కోట్లకు పడగలెత్తారో చెప్పడం కష్టం. తొమ్మిదేళ్ల పాలనా కాలం మొత్తంమీద ఏకంగా 26 వేల ఎకరాల పైచిలుకు భూమిని అస్మదీయులకు, బినామీలకు అడ్డంగా దోచిపెట్టారు బాబు. వీటి విలువ ఎలా చూసి నా కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. అంటే ఖజానాకు ఏ మేరకు నష్టం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
 
 జీఎమ్మార్‌కు జీ హుజూర్
 శంషాబాద్‌లో కనీసం రూ.79,860 కోట్ల విలువ చేసే 5,500 ఎకరాలను విమానాశ్రయ నిర్మాణం సాకుతో జీఎమ్మార్ సంస్థకు ధారాదత్తం చేసేశారు బాబు. దేశంలో ఏ విమానాశ్రయానికీ 3,000 ఎకరాలకు మించి భూముల్లేవు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 2,600 ఎకరాలు చాలని ప్రభుత్వ కమిటీలే చెప్పినా బాబు బేఖాతరు చేశారు. అనుమతులతో పాటు జీఎమ్మార్‌కు వీలైనన్ని రాయితీలు ఇప్పించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు వద్ద తనకున్న పలుకుబడినంతా ఉపయోగించారు. ఈ ఉదంతంలో భారీగా దండుకున్నారంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రకటన కూడా వెలువడకముందే ఆ పరిసరాల్లో రాజగురువు రామోజీతో, అస్మదీయులతో, బినామీలతో  భూములను కారుచౌకగా కొనిపించారు.  
 
 లోకేశ్‌కు నాయనమ్మ ‘చదివింపులు’
 పసుపు కుంకుమల కింద వచ్చిన రెండెకరాలు తప్ప తనకు మరే ఆస్తిపాస్తులూ లేవని చెప్పిన చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మ, 2000లో ఏకంగా రూ.40 లక్షలు పెట్టి హైదరాబాద్‌లోని మదీనగూడలో ఐదెకరాలు కొనుగోలు చేశారు. ఏడాది తిరక్కుండానే వాటిని మనవడు లోకేశ్‌కు బహుమతిగా ఇచ్చేశారు.
 
దేశంలోనే సంపన్న నేత

రాజకీయాల్లోకి వచ్చేనాటికి తన ఆస్తి కేవలం రెండెకరాలేనని చంద్రబాబు పదేపదే గర్వంగా చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి సంపద ఇప్పుడు ఎన్ని వేల కోట్లో తేల్చిచెప్పడం బహుశా ఎవరికీ సాధ్యం కాదు. తొమ్మిదేళ్ల క్రితమే బాబు ఆస్తిని హీనపక్షం రూ.2,000 కోట్లుగా తెహల్కా అంచనా వేసింది. అప్పట్లో దేశంలోని నేతలందరిలోనూ ఆయనే అత్యంత ధనికుడని కూడా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement