గవర్నర్ల వ్యవస్థ మళ్లీ రచ్చకెక్కింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కూ, అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కూ మధ్య కొద్దికాలంగా రాజుకుంటూ వస్తున్న వివాదం పతాకస్థాయికి చేరింది. అది వారిద్దరికీ పరిమితమైతే వేరే విధంగా ఉండేది. కానీ, ఢిల్లీ ప్రభుత్వ అధికారవర్గం మొత్తాన్ని అది తాకింది. తాము ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేయలేమంటూ కొందరు అధికారులు కేంద్రానికి విన్నవించుకునే స్థితికి దిగజారింది. అటు కేజ్రీవాల్...ఇటు నజీబ్ జంగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తమ తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె.కె. శర్మ పదిరోజుల సెలవుపై అమెరికా వెళ్లడంతో ఆయన స్థానంలో నియమించాల్సిన అధికారి విషయంలో కేజ్రీవాల్, జంగ్‌లమధ్య విభేదాలు తలెత్తాయి. అలా నియమించే అధికారి కేవలం పదిరోజులపాటు మాత్రమే ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని గుర్తుంచుకుంటే ఇది ఎంత అనవసరమైన వివాదమో అర్థమవుతుంది. ఆయన స్థానంలో పరిమళరాయ్‌ను నియమించాలని కేజ్రీవాల్ పట్టుబట్టగా...నజీబ్ జంగ్ మాత్రం శకుంతలా గామ్లిన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడం, ఆమె బాధ్యతలు చేపట్టడం పూర్తయింది. ఆ పదవిని తీసుకోవద్దంటూ కేజ్రీవాల్ చేసిన సూచనను ఆమె బేఖాతరు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి కీలక పదవిలో ఎవరుండాలనే అంశంలో సీఎంను సంప్రదించాలన్న కనీస మర్యాదను కూడా లెఫ్టినెంట్ గవర్నర్ పాటించలేదన్నది కేజ్రీవాల్ అభియోగం. అంతేకాదు...శకుంత ల గతంలో కొన్ని కార్పొరేట్ విద్యుత్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించడానికి ప్రయత్నించారని ఆయన బాహాటం గానే చెప్పారు. అంతేకాదు...శకుంతల నియామక ఉత్తర్వులను విడుదల చేసిన ముఖ్య కార్యదర్శి మజుందార్ కార్యాలయానికి తాళాలు వేయించి, ఆయన స్థానంలో రాజేంద్ర కుమార్ అనే మరో అధికారిని నియమించారు. అది చెల్లదని లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులిచ్చారు.
పైకి ఇదంతా అధికారుల నియామకాలకు సంబంధించి తలెత్తిన వివాదంగా కనిపిస్తున్నా దీని వెనక రాజకీయ ఆధిపత్య ధోరణులున్నాయన్నది కాదనలేని సత్యం. మన దేశంలో గవర్నర్ల వ్యవస్థ నెలకొల్పిన ఉద్దేశంపైనా, దాన్ని కొనసాగించడంలోని ఆంతర్యం విషయంలోనూ చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. క్రియాశీల రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధంలేని విశిష్ట వ్యక్తులు గవర్నర్లుగా ఉంటే బాగుంటుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఆచరణలో అది ఎప్పుడూ సరిగా అమలైన దాఖలాలు లేవు. రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన ప్రభుత్వాలున్నప్పుడు వాటిని అస్థిరపరచడం కోసం లేదా అప్రదిష్టపాలు చేయడం కోసం కేంద్రంలో అధికారం వెలగ బెట్టే ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయని ఇప్పటికెన్నోసార్లు రుజువైంది. కనుకనే సుప్రీంకోర్టు సైతం గవర్నర్ల నియామకంలో రాజకీయ నీడ ఉండొద్దని హితవు చెప్పింది. రాజ్యాంగరీత్యా గవర్నర్ పదవి చాలా ఉన్నతమైనది. ఆ పదవి చేపట్టేవారికుండాల్సిన అర్హతలేమిటో రాజ్యాంగంలోని 157, 158 అధికరణలు వివరిస్తాయి. అయితే గవర్నర్లుగా ఉంటున్నవారి చరిత్ర తిరగేస్తే ఆ అధికరణలు ఎలా దుర్వినియోగమవుతున్నాయో అర్ధమవుతుంది. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నా పదవులు దక్కక అసంతృప్తితో రగిలిపోతున్నవారికీ, వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన వారికీ, ఉన్నతాధికారులుగా ఉన్న సమయంలో తమ మాట మన్నించి నడుచుకున్న వారికీ గవర్నర్ పదవులను పంచిపెట్టడం సంప్రదాయంగా మారింది.
ఇప్పుడు ఢిల్లీలో సాగుతున్న డ్రామాపై రాజకీయ నాయకులు సరేగానీ...న్యాయ నిపుణులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రాల్లో గవర్నర్లకూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోని లెఫ్టినెంట్ గవర్నర్లకూ మౌలికంగా తేడా ఉంటుందన్నది అందులో ముఖ్యమైనది. రాష్ట్రాల్లో గవర్నర్లు మంత్రిమండలి నిర్ణయాలను శిరసావహించాల్సి ఉన్నా... లెఫ్టినెంట్ గవర్నర్‌కు అలా నడుచుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. నవాబ్‌జంగ్ సైతం ఆ అభిప్రాయంతోనే తన ఇష్టానుసారం నియామకాలు చేస్తున్నారు. ఇది తప్పని, లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని రాజీవ్ ధావన్, గోపాల సుబ్రహ్మణ్యం వంటి వారి వాదన. ఈ వాదప్రతివాదాల సంగతెలా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాల మాటే చెల్లడం ధర్మం. ఒకవేళ రాజ్యాంగం గానీ, చట్టాలుగానీ అందుకు విరుద్ధంగా ఉంటే వాటిని సవరించుకోవాలి తప్ప ఆ నిబంధనలను సాకుగా చూపి ఎన్నికైన ప్రభుత్వాల అభీష్టాన్ని కాలరాయాలనుకోవడం అధర్మం అనిపించుకుంటుంది.
ఢిల్లీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని నిరూపించడం రాజకీయంగా బీజేపీకి అవసరం కావొచ్చు గానీ అందువల్ల మొత్తంగా మంటగలిసేది దేశ ప్రతిష్టే. దేశ రాజధాని నగరం కావడంవల్ల అక్కడ జరిగే ఇలాంటి తగవులు మన పార్లమెంటరీ వ్యవస్థ పనితీరుపై చిన్నచూపు ఏర్పరుస్తాయి. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని కేజ్రీవాల్ ఎప్పటినుంచో డిమాండు చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే దాన్ని సాధించుకోవడానికి పోరాడితే ఆయనకు అందరి మద్దతూ లభిస్తుంది. అంతేతప్ప చిన్న చిన్న అంశాలపై పంతానికి పోవడం... మధ్యలో కొందరు అధికారులపై ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడం... తన మాట వినని అధికారి కార్యాలయానికి తాళాలు వేయించడం హుందా అయిన పనులు అనిపించుకోవు. తానూ కొంతకాలంక్రితం వరకూ అధికారిగా పనిచేసినందువల్ల వారి మనోభావాలెలా ఉంటాయో కేజ్రీవాల్‌కు అర్థమై ఉండాలి. ఈ పంచాయతీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది గనుక ఇలాంటి సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతులపై ఒక అవగాహన ఏర్పడుతుందని, ఇప్పుడు తలెత్తిన వివాదానికి సామరస్యపూర్వకమైన పరిష్కారం లభిస్తుందని ఆశించాలి.
ఢిల్లీ డ్రామా!
Published Wed, May 20 2015 1:56 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement