ఇజ్రాయెల్ గడ్డపై ప్రణబ్
రెండు దశాబ్దాల క్రితం చాలా తక్కువ స్థాయిలో మొదలై ఇన్నాళ్లుగా అదే తరహాలో కొనసాగుతున్న భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇజ్రాయెల్ పార్లమెంటు కెన్‌సెట్‌నుద్దేశించి మంగళవారం ప్రసంగించారు. మన దేశాధినేత ఒకరు ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్‌లో పర్యటించడానికి ముందు ఆయన జోర్డాన్, పాలస్తీనాలను కూడా సందర్శించారు. ఈ రెండు దేశాలకూ ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు లేవు. నిత్యమూ భగ్గుమని మండే పశ్చిమాసియా ప్రాంతంలో పరస్పరం కత్తులు దూసుకుంటున్న దేశాల్లో పర్యటించడం దౌత్యపరమైన సాహసమనే చెప్పాలి. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటించాలని తొలుత నిర్ణయించారు. అది నవంబర్, డిసెంబర్‌లలో ఉండొచ్చునని కూడా అనుకున్నారు. చివరకు ఈ నిర్ణయం మారి ప్రధానికి బదులు రాష్ట్రపతి వెళ్లారు. ఆ పర్యటనను కూడా కేవలం ఇజ్రాయెల్‌కు పరిమితం చేయకుండా... జోర్డాన్, పాలస్తీనాలను అందులో చేర్చారు.
ఈ పరిణామాలన్నీ అక్కడి పరిస్థితులు ఎంత సున్నితమైనవో, మనం ఎంత జాగ్రత్తగా అడుగేయాలో తెలియజెబుతాయి. దశాబ్దాలుగా అలీన విధానాన్ని అనుసరించడంవల్ల కావొచ్చు...అరబ్ దేశాలతో ఉన్న సాన్నిహిత్యంవల్ల కావొచ్చు ఇజ్రాయెల్‌తో మన దేశానికి మొదట్లో దౌత్య సంబంధాలు లేవు. అసలు పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్‌ను ఏర్పరుస్తూ 1947లో చేసిన తీర్మానాన్ని, ఆ దేశానికి సభ్యత్వం ఇస్తూ 1949లో తీసుకున్న నిర్ణయాన్ని మన దేశం ఐక్యరాజ్యసమితిలో వ్యతిరేకించింది. అయితే 1969లో ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) ఏర్పాటైనప్పుడు జనాభాలో 12 శాతం ముస్లింలున్న మమ్మల్ని కూడా అందులో చేర్చుకోవాలని మన దేశం కోరడం, అందుకు పాకిస్థాన్ అడ్డుపడటం వంటి పరిణామాల్లో అరబ్ దేశాలు భారత్ పక్షాన నిలవకపోవడంతో ఈ పరిస్థితి మారడం మొదలైంది.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడల్లా గట్టిగా ఖండించడం... అంతర్జాతీయ వేదికల్లో ఇజ్రాయెల్‌ను అభిశంసించే తీర్మానాలను బలపర్చడం లాంటివి మన దేశం చేస్తూనే ఉన్నా ఇజ్రాయెల్‌తో అనధికారిక సంబంధాలు చిగురించాయి. దేశంలోని ముస్లింల మనోభావాలకు అనుగుణంగా మాత్రమే భారత్ తమను వ్యతిరేకిస్తున్నదని ఇజ్రాయెల్ కూడా అర్ధం చేసుకుందని దౌత్య నిపుణులు చెబుతారు. అయితే, ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు స్వీకరించాక ఈ సంబంధాలూ కొత్త పుంతలు తొక్కాయి. ఇరు దేశాలూ దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలని 1992లో నిర్ణయించాయి. గల్ఫ్ యుద్ధం తీసుకొచ్చిన వైషమ్యాలతోపాటు ఇజ్రాయెల్- పాలస్తీనా విమోచన సంస్థ(పీఎల్‌ఓ) మధ్య ఓస్లోలో కుదిరిన శాంతి ఒప్పందంపై ఆగ్రహావేశాలు పెల్లుబికి అందులో తలమునకలై ఉన్న అరబ్-ముస్లిం ప్రపంచం ఈ తాజా పరిణామంపై పెద్దగా దృష్టి సారించలేదు.
ఎన్‌డీఏ తొలి దశ పాలనలో 2000 సంవత్సరంలో అప్పటి విదేశాంగ మంత్రి జశ్వంత్‌సింగ్ ఇజ్రాయెల్ వెళ్లారు. ఆ దేశానికి మన విదేశాంగ మంత్రి వెళ్లడం అదే ప్రథమం. అనంతరం 2003లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని యేరియల్ షెరాన్ మన దేశాన్ని సందర్శించారు. ఆ తర్వాతనుంచి మన కేంద్ర మంత్రులు అక్కడికెళ్లడం, వారు ఇక్కడికి రావడం కొనసాగుతోంది. వీటన్నిటి పర్యవసానంగా రెండు దేశాలమధ్యా ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు విస్తరించాయి. అయినా మన రాష్ట్రపతిగానీ, ప్రధానిగానీ ఇంతవరకూ ఆ దేశాన్ని సందర్శించలేదు. సంఘ్ పరివార్ సంస్థలు మొదటినుంచీ ఇజ్రాయెల్‌తో మన దేశానికి సత్సంబంధాలుండాలని కోరుతున్నాయి. కేవలం దేశంలోని ముస్లింలను బుజ్జగించే ఉద్దేశంతోనే యూపీఏ సర్కారు ఇజ్రాయెల్‌తో సాన్నిహిత్యానికి చొరవ తీసుకోవడంలేదని... హమాస్ తదితర పాలస్తీనా సంస్థలు ఇజ్రాయెల్‌లో హింసాకాండకు పాల్పడుతున్నా పట్టించుకోవడంలేదని బీజేపీ విమర్శించేది.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ 2006లో ఆ దేశం వెళ్లారు. కనుక ఎన్‌డీఏ సర్కారు ఏర్పడ్డాక మన దేశాధినేత ఆ దేశం పర్యటించడంలో వింతేమీ లేదు. కాకపోతే అందుకు దాదాపు ఏడాదిన్నర సమయం ఎందుకు పట్టిందన్నదే ప్రశ్న. దశాబ్దాలుగా మన దేశంతో చెలిమి చేస్తున్న సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలతో ఈ కారణంగా పొరపొచ్చాలు రావచ్చునేమోనన్న సందేహమే ఇందుకు కారణం. అందువల్లే ప్రణబ్ ఇజ్రాయెల్ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఆ దేశాలను సందర్శించారు. అంతేకాదు... ప్రణబ్ ఇజ్రాయెల్‌తోపాటు జోర్డాన్, పాలస్థీనా వెళ్లేలా పర్యటన కార్యక్రమాన్ని రూపొందించారు.
అయితే ఎన్‌డీఏ సర్కారు తన ఇజ్రాయెల్ అనుకూల విధానాలను ఏమీ దాచుకోలేదు. 2014లో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ఏడు వారాలపాటు సాగించిన సైనిక చర్యలో ఎన్నో అమానుషాలు చోటు చేసుకున్నాయని ఇండిపెండెంట్ కమిషన్ ఇచ్చిన నివేదికపై మొన్న జూలైలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (హెచ్‌ఆర్‌సీ)లో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మన దేశం ఓటింగ్‌కు గైర్హాజరైంది. ఒక్క అమెరికా మినహా ప్రపంచ దేశాలన్నీ ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయని గుర్తుంచుకుంటే మన దేశం ఇజ్రాయెల్‌కు ఏ స్థాయిలో మద్దతుగా నిలిచిందో అర్థమవుతుంది. ఇంధన రంగంలోనూ, వ్యూహాత్మక అంశాల్లోనూ మన అవసరాలకు అనుగుణంగా పశ్చిమాసియాతో ఉన్న సంబంధాలను సమీక్షించుకోవాలన్న ఉద్దేశం మన దేశానికి ఉంది. పాలస్తీనా విషయంలో మునుపటి వైఖరికే కట్టుబడి ఉన్నామని అంటున్నా ఆచరణలో ఇలాంటి అవసరాలే కీలక పాత్ర పోషిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. అలీన విధానం, జాతుల పోరాటాలకు సంఘీభావం, దురాక్రమణల్ని వ్యతిరేకించడంవంటి భావనలు ‘పాతబడిన’ ప్రస్తుత దశలో కొత్త రకం సంబంధాలు ఏర్పడటంలో వింతేమీ లేదు. ప్రణబ్ పర్యటనను ఆ కోణంనుంచే చూడాలి.