సంపాదకీయం: చేతిలో ఎంత అధికారమున్నా, శాసించగలిగే స్థితి ఉన్నా ఒక్కోసారి అన్నీ అనుకున్నట్టు జరగవు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఈ సంగతి చాలా ఆలస్యంగా అర్ధమై ఉండాలి. దేశంలో ‘అవినీతిని తుదముట్టించడం కోసమని’ ఆయన జారీచేయమని కోరిన ఆర్డినెన్స్‌ల జోలికి యూపీఏ ప్రభుత్వం పోలేకపోయింది. తనకు ఓట్లు రాల్చగల ఇతర ఆర్డినెన్స్‌ల్ని తీసుకొచ్చినా రాహుల్ ముచ్చటను మాత్రం తీర్చలేకపోయింది. లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడేలోగానే అవినీతికి వ్యతిరేకంగా అరడజను ఆర్డినెన్స్‌ల్ని జారీచేయించాలని... అందుకోసం ఒత్తిడి తెచ్చిన వ్యక్తిగా జనంలో తన పేరు మారుమోగిపోవాలని రాహుల్ ఎంతగానో తహతహలాడారు. ఒకటి రెండు సభల్లో ఆయన ఈ ఆర్డినెన్స్‌ల భోగట్టా చెప్పారు కూడా. అవినీతిని అంతమొందించడానికి అవసరమైన బిల్లుల్ని తెచ్చేందుకు పార్లమెంటులో కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేసినా విపక్షాలు సహకరించలేదని, అయితే ఈ విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్న తాము ఆర్డినెన్స్‌లు తీసుకురాబోతున్నామని వివరించారు. అదే జరిగి, ఆ ఆర్డినెన్స్‌లు జారీ అయితే ఆయన దేశమంతా సభలు చేసి స్వోత్కర్షలతో చెలరేగేవారు. తీరా చివర్లో కథ అడ్డం తిరిగింది. ఆ ఆర్డినెన్స్‌ల జారీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ససేమిరా అన్నారు. లోతైన చర్చలు జరిగి, రూపొందాల్సిన చట్టాలను ఇలా అడ్డదారిలో తీసుకొస్తే ఎలా అని ప్రశ్నించారు.
రాహుల్ కోరుకున్న ఆర్డినెన్స్‌లు కీలకమైనవే. అవినీతి వ్యతిరేక లోక్‌పాల్ వ్యవస్థను బలపరిచేవే. అవినీతి నిరోధక చట్టానికి సవరణలు, నిర్దేశిత కాలంలో పౌరులకు సేవలు అందజేయడం తప్పనిసరిగా మార్చడం, అవినీతి గుట్టును రట్టు చేసేవారికి రక్షణ కల్పించడం, న్యాయవ్యవస్థ జవాబుదారీతనంవంటి అంశాలకు సంబంధించిన ఆర్డినెన్స్‌లివి. కానీ, ఇలాంటి బిల్లుల్ని ఈ పదేళ్లలో...కనీసం రెండో దశ పాలనాకాలంలో అయినా యూపీఏ సర్కారు ఎందుకు తీసుకురాలేకపోయింది? అందుకు ఎవరు అడ్డుపడ్డారు? వీటికి రాహుల్ వద్ద జవాబులేదు. ఎందుకంటే, స్వయంగా ప్రభుత్వమే తన వైఖరితో పార్లమెంటు సమావేశాలు సరిగా సాగకుండా చేసింది. ఒకసారి కాదు...సమావేశాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ పట్టువిడుపుల ధోరణి లేకుండా ప్రవర్తించింది. అందువల్లే ఈ అయిదేళ్లకాలంలో ఆమోదించిన బిల్లులు గత సభలతో పోలిస్తే ఎంతో తక్కువగా ఉన్నాయి. ఆమోదించిన బిల్లులపై సైతం సమగ్రమైన చర్చ జరిగిందే లేదు. ఈ చివరి సమావేశాలు తెలంగాణ సమస్యపై చాలారోజులు వాయిదాలతో గడిచిపోయి ఉండొచ్చుగానీ అంతకుముందైనా అవి సక్రమంగా సాగింది లేదు. 2011లో శీతాకాల సమావేశాలు చాపచుట్టేశాయి. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జేపీసీ నియమించాలని విపక్షాలు చేసిన డిమాండును తిరస్కరించడమే అందుకు కారణం. తీరా బడ్జెట్ సమావేశాల సమయానికి ప్రభుత్వం దిగొచ్చి జేపీసీ ఏర్పాటుచేసింది. ఇలా విపక్షాల డిమాండ్లలోని సహేతుకతను గమనించకుండా, మొండివైఖరి అవలంబించడంవల్లనే ప్రతి సమావేశమూ ప్రతిష్టంభనలతో గడిచింది.
చట్టసభల పరమోద్దేశాన్ని నీరుగార్చినవారు ఇప్పుడిలా ఆర్డినెన్స్‌ల రూటు ఎంచుకోవడం దిగ్భ్రాంతికరం. రాజ్యాంగానికి అపచారం చేయడం. రాజ్యాంగంలోని 123వ అధికరణం రాష్ట్రపతికి, 213వ అధికరణం గవర్నర్‌లకు ఆర్డినెన్స్‌లు జారీచేసే అధికారం ఇస్తున్నా... అరుదైన సందర్భాల్లో మాత్రమే వాటిని వినియోగించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. చట్టసభ సమావేశంలో లేనప్పుడు తక్షణావస రాల కోసం ఆర్డినెన్స్ జారీ చేయొచ్చునని ఈ అధికరణాలు చెబుతు న్నాయి. కానీ, చట్టసభల్ని సజావుగా నడపలేని సర్కారు చేతకానితనం ఆర్డినెన్స్‌ల జారీకి ప్రాతిపదిక కావడం విడ్డూరం. ఎడాపెడా ఆర్డినెన్స్‌లు జారీచేసే ఇలాంటి అలవాటును ప్రభుత్వాలు ఎంత తొందరగా వదు ల్చుకుంటే అంత మంచిదని సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో హెచ్చరిం చింది. అసాధారణ పరిస్థితులున్నాయని విశ్వసించినప్పుడు మాత్రమే ఈ ప్రత్యేకాధికారాన్ని వినియోగించాలని రాష్ట్రపతికి సూచించింది.
ఇప్పుడు ప్రణబ్ తిరస్కరించిన ఆర్డినెన్స్ ప్రతిపాదనలు మాత్రమే కాదు...ఆయన సంతకం చేసిన ఆర్డినెన్స్‌లు కూడా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా లేవు. ఆయన వ్యతిరేకించిన రాహుల్ మార్కు ఆర్డినెన్స్‌ల సంగతలా ఉంచి...జాట్ కులస్తులకు రిజర్వేషన్లు, సీమాంధ్రకు అయిదేళ్లపాటు ప్రత్యేక ప్రతిపత్తి, ఎస్సీ ఎస్టీల చట్టానికి సవరణలు, ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆస్తుల బదలాయింపువంటివి పార్లమెంటు చర్చించి ఆమోదించవలసినవి. ఇందులో సీమాంధ్ర ప్రత్యేక ప్రతిపత్తి అంశం విభజన బిల్లు రూపకల్పన దశలోనే చేరివుండాల్సింది. అసలు చర్చకు అవకాశంలేని తీవ్ర గందర గోళ దృశ్యాలమధ్యే బిల్లు ఆమోదం కోసం వెంపర్లాడిన ప్రభుత్వానికి ఇలాంటి సమస్యలుంటాయని ముందు తెలియదా? సభ ఆమోదించిన బిల్లులకు సైతం అనుబంధంగా ఆర్డినెన్స్‌లు జారీచేయాల్సిరావడం సర్కారు చేతగానితనం కాదా? జాట్ కులస్తులకు విద్యా, ఉద్యోగా వకాశాల్లో కోటా ఇవ్వడమూ అంతే. తొమ్మిది రాష్ట్రాల్లో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న జాట్‌లు సామాజికంగాగానీ, విద్యాపరంగాగానీ వెనకబడి లేరని జాతీయ బీసీ కమిషన్ ఇటీవలే స్పష్టంచేసింది. పైగా ఇలా అందరినీ బీసీల్లో చేరుస్తూ పోతే తమ అవకాశాలు దెబ్బతింటాయని ఆ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోలోతైన చర్చ జరిగి నిర్ణయానికి రావడమే సబబు. కొత్తగా ఏర్పడే లోక్‌సభకు దీన్ని వదిలేయక ఆర్డినెన్స్‌ను నెత్తినెత్తుకోవడం జాట్‌ల ఓట్లపై ఉన్న ప్రేమేనని వేరే చెప్పనవసరంలేదు. మరికొన్ని రోజుల్లో వైదొలగే ప్రభుత్వం ఇలాంటి చర్యకు పాల్పడకుండా ప్రణబ్ అడ్డుకుని ఉంటే బాగుండేది.
ఆర్డినెన్స్‌ల రాజ్యం!
Published Wed, Mar 5 2014 1:12 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement