ప్రియనేతకు తుదివీడ్కోలు  | Former President Pranab Mukherjee Funeral Over With Military Honours | Sakshi
Sakshi News home page

ప్రియనేతకు తుదివీడ్కోలు 

Published Wed, Sep 2 2020 3:24 AM | Last Updated on Wed, Sep 2 2020 5:01 AM

Former President Pranab Mukherjee Funeral Over With Military Honours - Sakshi

లోధి శ్మశానవాటికలో ప్రణబ్‌ముఖర్జీకి అంజలి ఘటిస్తున్న కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ

న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచరుల అశ్రునయనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, త్రివిధ దళాధిపతులు, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్‌ నేతలు ఆయనకు భారమైన హృదయంతో తుది వీడ్కోలు పలికారు. లోధి రోడ్‌లోని విద్యుత్‌ దహన వాటికలో మంగళవారం మధ్యాహ్నం పూర్తి అధికార లాంఛనాల మధ్య ప్రణబ్‌ ముఖర్జీకి ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, ఇతరులు పీపీఈ కిట్స్‌ ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతికి ఆర్మీ దళం గన్‌ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించింది. 

అంతకుముందు ప్రణబ్‌ మృతదేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో త్రివర్ణ పతాకం కప్పి దహనవాటికకు తీసుకువచ్చారు. పలు అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆర్మీ   రీసెర్చ్‌ అండ్‌ రిఫరెన్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్‌ సోమవారం సాయంత్రం గుండెపోటుతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న అదే ఆసుపత్రిలో ప్రణబ్‌కు వైద్యులు క్లిష్టమైన శస్త్ర చికిత్స సైతం నిర్వహించారు. అదే సమయంలో ఆయనకు కరోనా కూడా సోకింది. భారత రత్న పురస్కార గ్రహీత అయిన ప్రణబ్‌ మృతికి సంతాప సూచకంగా కేంద్రం సోమవారం నుంచి 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

ప్రముఖుల నివాళి 
ప్రణబ్‌ నివాసంలో ఆయన భౌతిక కాయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, త్రివిధ దళాధిపతులు జనరల్‌ ఎంఎం నరవణె(ఆర్మీ), అడ్మిరల్‌ కరమ్‌వీర్‌ సింగ్‌ (నేవీ), ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బధౌరియా (ఎయిర్‌ఫోర్స్‌), సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు, పార్టీలకతీతంగా సీనియర్‌ నేతలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. మాస్క్, భౌతికదూరం తదితర కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ మాజీ ప్రధాని, చిరకాల సహచరుడు మన్మోహన్‌ సింగ్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. తదితరులు ప్రణబ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రణబ్‌ నివాసంలోని ఒక గదిలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచగా, ప్రముఖుల సందర్శనార్థం మరో గదిలో ఏర్పాటు చేసిన ప్రణబ్‌ చిత్రపటానికి నాయకులు పుష్పాంజలి సమర్పించారు. ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికేందుకు అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజలు రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్‌ నివాసానికి తరలివచ్చారు. వారంతా క్రమశిక్షణతో  అభిమాన నేతకు అశ్రు నివాళి అర్పించారు. కొందరు అభిమానులు, సెక్యూరిటీ సిబ్బంది మొత్తం ముఖాన్ని కప్పి ఉంచే ఫేస్‌ షీల్డ్‌ను సైతం ధరించారు. కోవిడ్‌ ముప్పు నేపథ్యంలో అంతిమయాత్రకు అధికారికంగా ఉపయోగించే వాహనంలో కాకుండా, మరో వాహనంలో ప్రణబ్‌ భౌతిక కాయాన్ని లోధి రోడ్‌లోని శ్మశాన వాటికకు తరలించారు. పీపీఈ కిట్స్‌ ధరించిన సిబ్బంది మృతదేహాన్ని వాహనంలోకి చేర్చారు.
ప్రణబ్‌ చిత్రపటం వద్ద పుష్పాలతో నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

స్వగృహంలో మ్యూజియం 
పశ్చిమబెంగాల్‌లోని జంగీపూర్‌లో ఉన్న తమ స్వగృహంలో ఒక అంతస్తును తమ తండ్రి జ్ఞాపికలతో ఒక మ్యూజియంగా రూపొందిస్తామని, ఒక గ్రం«థాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రణబ్‌ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ వెల్లడించారు. తన తండ్రి స్మృత్యర్థం ప్రభుత్వం ఒక పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేయాలని అభిజిత్‌ కోరారు. తన తండ్రి కోసం ఆగస్టు 4న జంగీపూర్‌లోని తమ వ్యవసాయ క్షేత్రం నుంచి ఒక పనస పండును తీసుకువచ్చానని గుర్తు చేసుకున్నారు. ‘అవి ఇక్కడ కూడా లభిస్తాయి. కానీ మా సొంత క్షేత్రం నుంచి ఆయన కోసం తీసుకురావాలనిపించింది.

ఆయన ఆ పండును సంతోషంగా స్వీకరించారు. అప్పుడు అదృష్టవశాత్తూ ఆయన షుగర్‌ లెవల్స్‌ కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. ఆయన కోరికను తీర్చినందుకు చాలా సంతోషించాను’అని గద్గద స్వరంతో పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో కావచ్చు, జీవితంలో కావచ్చు.. ఎప్పుడు కూడా కక్షపూరితంగా ఉండవద్దు’అని తన తండ్రి పలుమార్లు తనతో చెప్పారన్నారు. ప్రణబ్‌కు శాయశక్తులా చికిత్స అందించిన వైద్యులకు  అభిజిత్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ లోకంలో ఆయన పోషించాల్సిన పాత్ర ముగిసిందనుకుంటా. ఒక సాధారణ వ్యక్తి కోరుకునే అన్నింటినీ ఆయన పొందారు’అని వ్యాఖ్యానించారు. 

చైనా, యూఎస్‌ల్లో.. 
పశ్చిమబెంగాల్‌లోని ప్రణబ్‌ స్వగ్రామం మిరాటీలో గ్రామస్తులు ప్రియతమ నేతకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ‘దాదాపు ప్రతీ దుర్గాపూజ ఉత్సవానికి కచ్చితంగా స్వగ్రామానికి వచ్చేలా ప్రణబ్‌ ప్రయత్నించేవారు. ఆయన లేకుండా దుర్గాపూజ ఉత్సవం ఎప్పటిలా ఎన్నటికీ జరగబోదు’అని గ్రామంలోని ఆలయ పూజారి బందోపాధ్యాయ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనా విదేశాంగ కార్యాలయం  ప్రణబ్‌ చిత్రపటానికి నివాళులర్పించింది. అమెరికా, భారత్‌ కలిసి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ప్రణబ్‌ విశేష కృషి చేశారని అమెరికా డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ తెలిపారు.  

గొప్ప నేతను దేశం కోల్పోయింది 
ప్రణబ్‌ ముఖర్జీ మృతికి మంగళవారం కేంద్ర కేబినెట్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఒక గొప్ప నాయకుడిని, అద్భుతమైన పార్లమెంటేరియన్‌ను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించింది. ‘పాలనలో అనితరసాధ్యమైన అనుభవం ఉన్న నేత. దేశ విదేశాంగ, రక్షణ, వాణిజ్య, ఆర్థిక మంత్రిగా గొప్ప సేవలందించారు’అని కేబినెట్‌ ఒక తీర్మానంలో ప్రశంసించింది. జాతిజీవనంపై తనదైన ముద్రను వదిలివెళ్లారని, ఆయన మృతితో శిఖరాయమాన దార్శనిక నేతను దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దేశాభివృద్ధికి ప్రణబ్‌ అందించిన సేవలను భారతీయులు తరతరాలు గుర్తుంచుకుంటారని ప్రధానమంత్రి మోదీ ట్వీట్‌ చేశారు. 
ఢిల్లీలోని ప్రణబ్‌ నివాసం వద్ద సెల్యూట్‌ చేస్తున్న సైనిక జవాన్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement